Isaiah - యెషయా 5 | View All

1. నా ప్రియునిగూర్చి పాడెదను వినుడి అతని ద్రాక్షతోటనుబట్టి నాకిష్టుడైనవానిగూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమిగల కొండమీద నా ప్రియుని కొకద్రాక్షతోట యుండెను
మత్తయి 21:33, మార్కు 12:1, లూకా 20:9

ఈ వచనాల్లో ఇస్రాయేల్ జాతి మొత్తం గురించీ, ప్రత్యేకించి యూదా గోత్రం గురించీ ఒక ఉదాహరణ ఉంది. ఇక్కడ దేవుని ప్రజలకు ద్రాక్ష తోట అని పేరు కనిపిస్తున్నది. కీర్తనల గ్రంథము 80:8-19; యెషయా 3:14; యెషయా 27:2; యిర్మియా 2:21; యిర్మియా 12:10; యెహెఙ్కేలు 17:6-8; యెహెఙ్కేలు 19:10-14; హోషేయ 10:1; హోషేయ 14:7; మీకా 7:1; మత్తయి 20:1-16; మత్తయి 21:33-44; యోహాను 15:1-5 పోల్చి చూడండి. ప్రవక్త దేవుణ్ణి గురించీ ఆయన ప్రజల గురించీ పలుకుతున్నాడు. ఇక్కడ పాడడం. అంటే కేవలం కావ్యరూపంగా పలకడం అని అర్థం “సారవంతమైన భూమి ఉన్న కొండ” అంటే ఇస్రాయేల్ దేశం.

2. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించెను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను.ద్రాక్షపండ్లు ఫలింపవలెనని యెదురు చూచుచుండెను గాని అది కారుద్రాక్షలు కాచెను

తన ద్రాక్ష తోటను శ్రేష్ఠమైనదిగా సారవంతమైనదిగా కట్టుదిట్టంగా ఉండేందుకు చేయవలసినదంతా దేవుడు చేశాడు. అయితే తన కష్టానికి ఫలితం కారు ద్రాక్షలు మాత్రమే. వ 3 లో యెషయా నోట దేవుడే పలుకసాగుతున్నాడు. ఇంత జాగ్రత్త తీసుకుని సాగు చేస్తే చెడు ద్రాక్షలే కాయడానికి కారణమేమిటి? ఇది ద్రాక్ష తోట యజమాని తప్పా లేక ద్రాక్ష తోటగా ఉన్న ప్రజల తప్పా? దీనికి జవాబు అతి స్పష్టం. అందుకనే ద్రాక్ష తోట ప్రజలనే దేవుడు దీనికి జవాబు చెప్పమని అడుగుతున్నాడు.

3. కావున యెరూషలేము నివాసులారా, యూదావార లారా, నా ద్రాక్షతోట విషయము నాకు న్యాయము తీర్చ వలెనని మిమ్ము వేడుకొనుచున్నాను.

4. నేను నా ద్రాక్షతోటకు చేసినదానికంటె మరేమి దానికి చేయగలను? అది ద్రాక్షపండ్లు కాయునని నేను కనిపెట్టినపుడు అది కారుద్రాక్షలు కాయుటకు కారణమేమి?

5. ఆలోచించుడి, నేను నా ద్రాక్షతోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను నేను అది మేసివేయబడునట్లు దాని కంచెను కొట్టి వేసెదను. అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడుచేసెదను

దేవుడు తన ద్రాక్షతోటను దాని మానాన దాన్ని వదిలేసి వెళ్ళిపోతాననడం లేదు. దాని నాశనానికి పూనుకుని పని చేస్తానంటున్నాడు. ఎందుకంటే ఈ ద్రాక్షతోట శిక్షకు పాత్రమైన ఒక జాతి. దాన్ని సరిదిద్దవలసిన అవసరం ఉంది. తన ఉద్దేశాలను సాధించడానికి దేవుడు శత్రు సైన్యాల దాడిని ఉపయోగించుకొన్నాడు.

6. అది శుద్ధిచేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చపొదలును బలురక్కసి చెట్లును బలిసి యుండును దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ నిచ్చెదను.

7. ఇశ్రాయేలు వంశము సైన్యములకధిపతియగు యెహోవా ద్రాక్షతోట యూదా మనుష్యులు ఆయన కిష్టమైన వనము. ఆయన న్యాయము కావలెనని చూడగా బలా త్కారము కనబడెను నీతి కావలెనని చూడగా రోదనము వినబడెను.

ఈ ఉదాహరణను వివరించి చెప్పడం ద్వారా దీని విషయమై సందేహానికి తావు లేకుండా చేస్తున్నాడు ప్రవక్త. 2,4 వచనాల్లో కారు ద్రాక్షలు అనే దానికి అర్థాన్ని ఇక్కడి నుండి 25 వచనం వరకు వివరిస్తున్నాడు. దేవుడు ఆశించిన మంచి ద్రాక్షలు ఏమిటో 7వ వచనంలోని ఒక మాట తెలియజేస్తున్నది – న్యాయం. కారు ద్రాక్షలంటే అనేక అర్థాలున్నాయి. ఈ వచనంలో ఈ రెండు కనిపిస్తున్నాయి – రక్తపాతం, రోదనానికి కారణమైన దౌర్జన్యం.

8. స్థలము మిగులకుండ మీరు మాత్రమే దేశములో నివసించునట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చు కొను మీకు శ్రమ.

దేవుడు 9 సందర్భాల్లో వారి పాపాల విషయంలో వారికి బాధలు ప్రాప్తిస్తాయని ప్రకటిస్తున్నాడు (వ 8,11,18,20,21,22). అంటే దేవుడు వారిని నేరస్థులుగా ప్రకటించి శిక్షిస్తాడని అర్థం. ఇక్కడి పాపం ఆస్తికోసం అత్యాశ. ఇది సర్వ సాధారణమైనది. ఇది దేవుడు అసహ్యించుకొని నిషేధించిన పాపం. అయినా ఇది సాధారణమైనదే. నిర్గమకాండము 20:17; లూకా 12:15; 1 తిమోతికి 6:6-10. తీవ్రమైన శిక్షకు గురి అయిన (ఆస్తికోసం) పేరాశ 1 రాజులు 21:1-19 లో చూడండి. ఈ దురాశాపరులను వారి పొలాలు వట్టిపోయేలా చేయడం ద్వారాను, వారి భవంతులనుండి వారిని తరిమివేయడం ద్వారానూ దేవుడు శిక్షించాడు.

9. నేను చెవులార వినునట్లు సైన్యములకధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెల విచ్చెను. నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైన యిండ్లు అనేకములు నివాసులులేక పాడైపోవును.
యాకోబు 5:4

10. పది ఎకరముల ద్రాక్షతోట ఒక కుంచెడు రస మిచ్చును తూమెడుగింజల పంట ఒక పడి యగును.

11. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాల రాత్రివరకు పానముచేయువారికి శ్రమ.

ఈ వచనాల్లో ఉన్న పాపం త్రాగుబోతుతనం, అల్లరి చిల్లరి కేళీ విలాసాలు. వీటిలో తల మునకలయ్యేవారికి యెహోవా చర్యల పట్ల పట్టింపు లేదు. “ఆయన చేతులు చేసినవాటిని” వారు లెక్క చెయ్యలేదు (వ 12). తమ సుఖ భోగాలు, ఆశల గురించే వారి ధ్యాసంతా. వారికి కలిగే శిక్ష ఏమంటే బందీలుగా దేశాంతరం వెళ్ళడం. అక్కడ మద్యపానం, పంచ భక్ష పరమాన్నాలకు బదులు ఆకలి దప్పులవల్ల అలమటించి చనిపోవడం ఉంటుంది (వ 13,14). ఈ అధ్యాయంలో ప్రతి నేరానికి శిక్ష ఎంత తగినదో గమనించండి.

12. వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురుగాని యెహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు.

13. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు వారిలో ఘనులైనవారు నిరాహారులుగా నున్నారు సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు.

14. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరి మితముగా తన నోరు తెరచుచున్నది వారిలో ఘనులును సామాన్యులును ఘోషచేయువారును హర్షించువారును పడిపోవుదురు.

15. అల్పులు అణగద్రొక్క బడుదురు ఘనులు తగ్గింపబడుదురు గర్విష్ఠుల చూపు తగ్గును

యెషయా 2:11-18. మనిషికుండే గర్వం విషయం దేవుడు మళ్ళీ తన అసహ్యాన్ని తెలియజేస్తున్నాడు.

16. సైన్యములకధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును పరిశుద్ధుడైన దేవుడు నీతినిబట్టి తన్ను పరిశుద్ధ పరచుకొనును.

తాను పాపులను న్యాయంగా శిక్షించడం ద్వారానూ, వారి నాశనానికి దారి తీసే నీతిన్యాయాలను ప్రదర్శించడం ద్వారానూ దేవునికి మహిమ కలుగుతున్నదన్న సత్యం గమనించండి.

17. అది మేతబీడుగా నుండును గొఱ్ఱపిల్లలు అచ్చట మేయును గర్వించినవారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవింతురు.

దేశం పాడుబడిపోయి శత్రువుల బారిన పడే సంగతిని ఇది సూచిస్తున్నది.

18. భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాగుకొను వారికి శ్రమ. బండిమోకులచేత పాపమును లాగుకొనువారికి శ్రమ వారు ఇట్లనుకొనుచున్నారు

మానవ పాపం మోసాలకు సంబంధించినది – ఇతరులను మోసగించడం, తరచుగా తమ్మును తామే మోసగించుకోవడం, దేవుణ్ణీ మోసగించాలని చూడడం. తాళ్ళ మోకులు కాయ కష్టాన్ని సూచిస్తున్నాయి. వీరు తమ పాపాలు చేసేందుకు చెమటోడ్చి పని చేశారు.

19. ఆయనను త్వరపడనిమ్ము మేము ఆయన కార్యమును చూచునట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని ఆలోచన మాకు తెలియబడునట్లు అది మా యెదుట కనబడనిమ్ము

ఈ పాపాత్ములు వ్యంగ్యంగా ఈ మాటలు అన్నారు. పంపుతానని దేవుడు హెచ్చరిస్తున్న తీర్పు తమమీదికి వస్తుందన్న విషయం వీరు నమ్మలేదు. చాలా మంది అంతే గదా.

20. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొను వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకొనువారికి శ్రమ.

వీరు ఎంత చెయ్యి దాటిపోయారో దీనివల్ల అర్థమౌతున్నది. భ్రష్టత్వం, హృదయ కాఠిన్యం మూలంగా వారు మంచికీ, చెడుకూ తేడా గ్రహించాలన్న కోరికనూ, బహుశా వివేచనా శక్తిని కూడా కోల్పోయారు. రోమీయులకు 1:21; ఎఫెసీయులకు 4:18-19; హెబ్రీయులకు 5:14 పోల్చి చూడండి.

21. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ యెన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచు కొనువారికి శ్రమ.
రోమీయులకు 12:16

సామెతలు 3:7; యెషయా 47:10; 1 కోరింథీయులకు 1:18-21; 1 కోరింథీయులకు 3:18-20. తాను జ్ఞానవంతుణ్ణని విర్రవీగడమంటే దేవుని జ్ఞానంనుండి తనను తాను దూరం చేసుకోవడం, అహంకారమనే పాపంలో పడడం.

22. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతినొందిన వారికిని మద్యము కలుపుటలో తెగువగలవారికిని శ్రమ.

11,12 వచనాల్లో ప్రవక్త ఈ పాపాన్ని ఖండించాడు. ఇక్కడ నాయకుల్లో న్యాయాధిపతుల్లో ఈ పాపాన్ని నిరసిస్తున్నాడు. హీబ్రూ భాషలో ఈ రెండు వచనాలకూ స్పష్టమైన లంకె ఉంది. న్యాయాధిపతులు అంటే త్రాగి తందనాలాడ్డంలో సమర్థులే, వీరులే గానీ కార్య నిర్వాహణలో భ్రష్టులే. న్యాయంగా తీర్పు చెప్పడానికి అసమర్థులే. లంచం గురించి నిర్గమకాండము 23:8; 1 సమూయేలు 8:3; కీర్తనల గ్రంథము 26:10; సామెతలు 17:23; ఆమోసు 5:12 చూడండి.

23. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు.

24. సైన్యములకధిపతియగు యెహోవాయొక్క ధర్మ శాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని వాక్కును తృణీక రించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయు నట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్లి పోవును వారి పువ్వు ధూళివలె పైకి ఎగిరిపోవును.

ఇంతకు ముందు వచనాల్లో వర్ణించిన ఏ రకమైన పాపులు కూడా శిక్షను తప్పించుకోలేరు. వారి దుష్ట ప్రవర్తనకు మూల కారణం తమ జీవితాలను ఏలనీయకుండా దేవుని వాక్కును త్రోసి పుచ్చడమేనని గమనించండి.

25. దానినిబట్టి యెహోవా కోపము ఆయన ప్రజలమీద మండుచున్నది. ఆయన వారిమీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణకుచున్నవి. వీధులమధ్యను వారి కళేబరములు పెంటవలె పడి యున్నవి. ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది.

“చాపుతూ”– యెషయా 9:12, యెషయా 9:17, యెషయా 9:21; యెషయా 10:4. న్యాయవిధి పూర్తిగా నెరవేరేవరకూ ఆయన శిక్షిస్తూనే ఉన్నాడు.

26. ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజము నెత్తును భూమ్యంతమునుండి వారిని రప్పించుటకు ఈల గొట్టును అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు.

శత్రు సైన్యాలు వచ్చి దాడి చేస్తాయని ఈ వచనాలు చెప్తున్నాయి. వారి శిక్షకోసం తన స్వంత ప్రజల మీదనే వచ్చిపడాలని దేవుడు శత్రువులను పిలుస్తున్నాడు. క్రీ.పూ. 722 లో, 701 లో ఇస్రాయేల్ యూదాల పై అష్షూరువాళ్ళు దాడి చేశారు. క్రీ.పూ. 605 మొదలు యూదాపై ఒకటికంటే ఎక్కువసార్లు బబులోను వాళ్ళు దండెత్తారు. 2 రాజులు 17:1-20; 2 రాజులు 24:1-20; యిర్మీయా 52వ అధ్యాయం.

27. వారిలో అలసినవాడైనను తొట్రిల్లువాడైనను లేడు. వారిలో ఎవడును నిద్రపోడు కునుకడు వారి నడికట్టు విడిపోదు వారి పాదరక్షలవారు తెగిపోదు.

28. వారి బాణములు వాడిగలవి వారి విండ్లన్నియు ఎక్కు పెట్టబడియున్నవి వారి గుఱ్ఱముల డెక్కలు చెకుముకిరాళ్లతో సమాన ములు వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగును

29. ఆడుసింహము గర్జించినట్లు వారు గర్జించుదురు కొదమసింహము గర్జించినట్లు గర్జనచేయుచు వేటను పట్టుకొని అడ్డమేమియు లేకుండ దానిని ఎత్తుకొని పోవుదురు విడిపింపగలవాడెవడును ఉండడు.

30. వారు ఆ దినమున సముద్రఘోషవలె జనముమీద గర్జనచేయుదురు ఒకడు భూమివైపు చూడగా అంధకారమును బాధయు కనబడును అంతట ఆ దేశముమీది వెలుగు మేఘములచేత చీకటియగును.Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |