Leviticus - లేవీయకాండము 26 | View All

1. మీరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.

1. “మీకోసం మీరు విగ్రహాల్ని చేసుకోవద్దు. విగ్రహాల్ని, జ్ఞాపక చిహ్నాల్ని నిలబెట్టవద్దు. మీరు మొక్కేందుకు మీ దేశంలో రాతి విగ్రహాలను నిలబెట్టవద్దు. ఎందుచేతనంటే, నేను మీ దేవుణ్ణి, యెహోవాను.

2. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధమందిరమును సన్మానింప వలెను, నేను యెహోవాను.

2. “నా ప్రత్యేక విశ్రాంతి రోజుల్ని జ్ఞాపకం ఉంచు కొని, నా పవిత్ర స్థలాన్ని గౌరవించండి. నేను యోహోవాను.

3. మీరు నా కట్టడలనుబట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినయెడల

3. “నా ఆజ్ఞలు, నియమాలు జ్ఞాపకం ఉంచుకోండి. వాటికి విధేయులు అవ్వండి.

4. మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటల నిచ్చును, మీ పొలములచెట్లు ఫలించును,

4. వాటిని మీరు జరిగిస్తే, నేను మీకు సకాలంలో వర్షాలు కురిపిస్తాను. భూమి పంటను యిస్తుంది, పొలంలో చెట్లు వాటి ఫలాలను ఇస్తాయి.

5. మీ ద్రాక్ష పండ్ల కాలమువరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు.

5. ద్రాక్షాపండ్ల కోతకాలం వచ్చేంతవరకు మీరు గానుగ పట్టడం కొనసాగుతుంది’ వరు మళ్ళ మొక్కలు నాటడం మొదలు పెట్టేంతవరకు మీరు ద్రాక్షాపండ్లు కూర్చుకోవటం కొనసాగుతుంది. అప్పుడు మీరు తినేందుకు సమృద్ధిగా ఉంటుంది. మరియు మీరు మీ దేశంలో క్షేమంగా ఉంటారు.

6. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసె దను. మీరు పండుకొనునప్పుడు ఎవడును మిమ్మును భయ పెట్టడు, ఆ దేశములో దుష్టమృగములు లేకుండ చేసెదను, మీ దేశములోనికి ఖడ్గమురాదు;

6. నేను మీ దేశానికి శాంతిని ప్రసాదిస్తున్నాను. మీరు ప్రశాంతంగా పండుకొంటారు. ఎవరూ మిమ్మల్ని భయపెట్టేందుకు రారు. హానికరమైన జంతువులను నేను మీ దేశానికి దూరంగా ఉంచుతాను. మరియు సైన్యాలు మీ దేశం గుండా వెళ్లజాలవు.

7. మీరు మీ శత్రు వులను తరిమెదరు; వారు మీ యెదుట ఖడ్గముచేత పడె దరు.

7. “మీరు మీ శత్రువులను తరిమి, వారిని ఓడిస్తారు. మీరు మీ ఖడ్గంతో వారిని చంపుతారు.

8. మీలో అయిదుగురు నూరుమందిని తరుముదురు; నూరుమంది పదివేలమందిని తరుముదురు, మీ శత్రువులు మీయెదుట ఖడ్గముచేత కూలుదురు.

8. మీలో అయిదుగురు 100 మందిని తరుముతారు, మీలో 100 మంది 10,000 మందిని తరుముతారు. మీరు మీ శత్రువులను ఓడించి, మీ ఖడ్గంతో వారిని చంపేస్తారు.

9. ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్త రింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను.

9. “అప్పుడు నేను మీ వైపు తిరుగుతాను. మీకు అధికంగా సంతానం కలుగనిస్తాను. మీతో నా ఒడంబడికను నేను నిలబెడతాను.

10. మీరు చాలాకాలము నిలువైయున్న పాతగిలిన ధాన్య మును తినెదరు; క్రొత్తది వచ్చినను పాతది మిగిలి యుండును.

10. ఒక సంవత్సరం కంటె ఎక్కువ కాలానికి సరిపోయేంత పంట మీకు ఉంటుంది. మీరు కొత్త పంట కోసుకొంటారు. అయితే కొత్త పంట నిల్వ చేయటానికి స్థలం కావాలి గనుక పాత పంటను పారవేయాల్సి ఉంటుంది.

11. నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీ యందు నా మనస్సు అసహ్యపడదు.
2 కోరింథీయులకు 6:16, ప్రకటన గ్రంథం 21:3

11. నేను నా పవిత్ర గుడారాన్ని కూడ మీ మధ్య ఉంచుతాను. మీనుండి నేను తిరిగిపోను.

12. నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనైయుందును; మీరు నాకు ప్రజలై యుందురు.
2 కోరింథీయులకు 6:16, ప్రకటన గ్రంథం 21:3

12. నేను మీతో నడుస్తాను, మీ దేవునిగా ఉంటాను. మీరు నా ప్రజలుగా ఉంటారు.

13. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండ వారి దేశములోనుండి మిమ్మును రప్పించితిని; నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసితిని.

13. నేను యోహోవాను, మీ దేవుణ్ణి. మీరు ఆ ఈజిప్టులో బానిసలుగా ఉన్నారుగాని నేను మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాను. బానిసలుగా భారమైన బరువులు మోసి మీరు చాలా వంగిపోయారు. అయితే మీ భుజాలమీద కాడిని నేను విరుగగొట్టేసాను. నేను మిమ్మల్ని మరల తల ఎత్తుకొని తిరిగేటట్టు చేస్తాను!

14. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక

14. “అయితే మీరు నాకు విధేయులు కాకుండా, నా ఆజ్ఞలన్నింటినీ పాటించకుండా ఉంటే, అప్పుడు మీకు ఈ కీడులన్నీ జరుగుతాయి.

15. నా కట్టడలను నిరాకరించినయెడలను, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనినయెడలను,

15. నా ఆజ్ఞలు, నియమాలు పాటించడానికి మీరు నిరాకరిస్తే, మీరు నా ఒడంబడికను ఉల్లంఘించినట్టే .

16. నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటిపంటను తినెదరు;

16. మీరు గనుక అలా చేస్తే అప్పుడు భయంకరమైన సంగతుల్ని మీకు సంభవింపజేస్తాను. నేను మీకు రోగం, జ్వరం వచ్చేటట్టు చేస్తాను. అవి మీ కళ్లను పాడుచేసి, మీ ప్రాణాల్ని తీస్తాయి. మీరు విత్తనాలు జల్లినప్పుడు ఫలితం ఉండదు. మీ శత్రువులు మీ పంటను తినివేస్తారు.

17. నేను మీకు పగవాడనవుదును; మీ శత్రువుల యెదుట మీరు చంపబడెదరు; మీ విరోధులు మిమ్మును ఏలెదరు; మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయెదరు.

17. నేను మీకు విరోధంగా ఉంటాను గనుక మీ శత్రువులు మిమ్మల్ని ఓడిస్తారు. ఆ శత్రువులు మిమ్మల్ని ద్వేషించి, మీ మీద అధికారం చేస్తారు. ఎవరూ మిమ్మల్ని తరమకుండానే మీరు పారిపోతారు.

18. ఇవన్నియు సంభవించినను మీరింక నా మాటలు విననియెడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించెదను.

18. “ఇవన్నీ జరిగినా మీరు నాకు విధేయులు కాకపోతే, మీ పాపాలకోసం నేను మిమ్మల్ని ఏడంతలుగా శిక్షిస్తాను.

19. మీ బల గర్వమును భంగపరచి, ఆకాశము ఇనుమువలెను భూమి ఇత్తడివలెను ఉండచేసెదను.

19. మీకు అతిశయ కారణమైన మీ గొప్ప పట్టణాలను నేను కూలగొట్టేస్తాను. ఆకాశంవర్షాన్ని ఇవ్వదు, భూమి పంటనివ్వదు.

20. మీ బలము ఉడిగిపోవును; మీ భూమి ఫలింపకుండును; మీ దేశవృక్షములు ఫల మియ్యకుండును.

20. మీరు కష్టపడి పనిచేస్తారు, కాని దానివల్ల ప్రయోజనం ఉండదు. మీ భూమి పంటలేమీ ఇవ్వదు, మీ చెట్లు వాటి ఫలాలను ఇవ్వవు.

21. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన యెడల నేను మీ పాపములనుబట్టి మరి ఏడంతలుగా మిమ్మును బాధించెదను.
ప్రకటన గ్రంథం 15:1-6-8, ప్రకటన గ్రంథం 21:9

21. “మీరు ఇంకా నాకు వ్యతిరేకంగా తిరిగి, నాకు విధేయులయ్యేందుకు తిరస్కరిస్తే, అప్పుడు ఇంకా ఏడు రెట్లు కఠినంగా నేను మిమ్మల్ని కొడతాను. మీరు ఎక్కువ పాపం చేసినకొద్దీ, మరింత ఎక్కువగా శిక్షించబడతారు.

22. మీ మధ్యకు అడవిమృగములను రప్పించెదను; అవి మిమ్మును సంతాన రహితులగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును.

22. నేను మీ మీదికి అడవి మృగాలను పంపిస్తాను. అవి మీ పిల్లలను మీ దగ్గరనుండి లాక్కొనిపోతాయి. అవి మీ పశువుల్ని నాశనం చేస్తాయి. అవి మీ సంఖ్యను క్షీణింప చేస్తాయి. రహదారులు ఖాళీగా ఉంటాయి గనుక ప్రయాణం చేయటానికి ప్రజలు భయపడతారు.

23. శిక్షలమూలముగా మీరు నాయెదుట గుణపడక నాకు విరోధముగా నడిచినయెడల

23. “అన్ని జరిగినా మీరు పాఠం నేర్చుకోకపోతే, ఇంకా అప్పటికీ నాకు మీరు విరుద్ధంగా తిరిగితే,

24. నేనుకూడ మీకు విరోధ ముగా నడిచెదను; మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మును దండించెదను.

24. అప్పుడు నేను కూడా మీకు విరుద్ధంగా తిరుగుతాను. నేను, అవును నేనే, మీ పాపాలకోసం ఏడుసార్లు మిమ్మల్ని శిక్షిస్తాను.

25. మీమీదికి ఖడ్గమును రప్పించె దను; అది నా నిబంధనవిషయమై ప్రతి దండన చేయును; మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను; మీరు శత్రువులచేతికి అప్పగింప బడెదరు.

25. మీరు నా ఒడంబడికను ఉల్లంఘించారు కనుక నేను మిమ్మల్ని శిక్షిస్తాను. సైన్యాలను నేను మీమీదికి రప్పిస్తాను. భద్రతకోసం మీరు మీ పట్టణాల్లోకి పారిపోతారు. కాని నేను మీ మధ్య వ్యాధుల్ని వ్యాపింప జేస్తాను. అప్పుడు మీ శత్రువు మిమ్మల్ని ఓడించేస్తాడు.

26. నేను మీ ఆహారమును, అనగా మీ ప్రాణా ధారమును తీసివేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనికెచొప్పునమీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు, మీరు తినెదరు గాని తృప్తి పొందరు.

26. ఆ పట్టణంలో మిగిలిపోయిన ధాన్యంలో కొంత భాగం నేను మీకు ఇస్తాను. కానీ తినేందుకు బహుకొంచెం మాత్రమే ఆహారం ఉంటుంది. వారి భోజనాన్ని అంతా ఒక్క పాత్రలో పదిమంది ఆడవాళ్లు వండగలుగుతారు. ఆ భోజనం ముద్దలు ఒక్కొక్కదాన్ని వారు లెక్కబెట్టగలుగుతారు. మీరు తింటారు గాని మీ ఆకలి తీరదు.

27. నేను ఈలాగు చేసినతరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచినయెడల

27. “మీరు ఇంకా నా మాట వినకపోతే, ఇంకా నాకు విరోధంగా ఉంటే

28. నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి యేడంతలుగా మిమ్మును దండించెదను.

28. అప్పుడు నేను నిజంగా నా కోపం చూపిస్తాను. నేను, అవును నేనే, మీ పాపాలకోసం ఏడుసార్లు మిమ్మల్ని శిక్షిస్తాను.

29. మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు.

29. మీ కుమారులు, కుమార్తెల శరీరాల్ని మీరు తింటారు.

30. నేను మీ యున్నతస్థలములను పాడు చేసెదను; మీ విగ్రహములను పడగొట్టెదను; మీ బొమ్మల పీనుగులమీద మీ పీనుగులను పడవేయించెదను.

30. మీ ఉన్నత స్థలాలను నేను నాశనం చేస్తాను. మీ ధూప వేధికలను నేను పడగొట్టేస్తాను. మీ శవాలను మీ విగ్రహాల శవాల మీద నేను పడవేస్తాను. మీరు నాకు చాలా అసహ్యంగా ఉంటారు.

31. నా మనస్సు మీయందు అసహ్యపడును, నేను మీ పట్టణ ములను పాడు చేసెదను; మీ పరిశుద్ధస్థలములను పాడు చేసెదను; మీ సువాసనగల వాటి సువాసనను ఆఘ్రాణింపను.

31. మీ పట్టణాలను నేను నాశనం చేస్తాను. మీ పరిశుద్ధ స్థలాన్ని నేను శూన్యం చేస్తాను. మీ అర్పణల సువాసన నేను ఆఘ్రాణించను.

32. నేనే మీ దేశమును పాడుచేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు.

32. మీ పట్టణాల్లో నివసించేందుకు వచ్చే మీ శత్రువులు చూచి అదిరి పోయేంతగా మీ దేశాన్ని నేను ఖాళీ చేస్తాను.

33. జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీవెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టములు పాడుపడును.

33. ఇంకా నేను మిమ్మల్ని రాజ్యాల్లో చెదరగొట్టేస్తాను. నేను నా ఖడ్గం దూసి, మిమ్మల్ని నాశనం చేస్తాను. మీ దేశం శూన్యంగాను, మీ పట్టణాలు చెత్తగాను ఉంటాయి.

34. మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడైయున్న దినము లన్నియు అది తన విశ్రాంతికాలములను అనుభవించును.

34. “మిమ్మల్ని మీ శత్రువులు తమ దేశానికి తీసుకొని పోతారు. మీ దేశం ఖాళీ అయిపోతుంది. అందుచేత మీ భూమికి చివరికి విశ్రాంతి లభిస్తుంది. భూమి దాని విశ్రాంతిని అనుభవిస్తుంది.

35. అది పాడైయుండు దినములన్నియు అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతికాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును.

35. ఏడేండ్లకు ఒకసారి ఒక సంవత్సరం పాటు భూమికి విశ్రాంతి ఉండాలని ఆజ్ఞ ప్రబోధిస్తుంది. మీరు దానిలో నివసించినప్పుడు దానికి మీరు ఇవ్వని విశ్రాంతిని, భూమి ఖాళీగా ఉన్న ఆ సమయంలో అది పొందుతుంది.

36. మీలో మిగిలినవారు తమ శత్రు వుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను; కొట్టుకొని పోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుటనుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయెదరు; తరుమువాడు లేకయే పడెదరు.

36. శేషించిన ప్రజలు వారి శత్రు దేశంలో ధైర్యం కోల్పోతారు. ప్రతిదానికీ వారు భయపడిపోతారు. గాలికి కొట్టుకొని పోయే ఆకులా వారు అటుఇటు పరుగులెత్తుతారు. ఎవరో వారిని కత్తితో తరుముతున్నట్టు వారు పరుగులెడతారు. వారిని ఎవరూ తరమక ముందే వారు పడిపోతారు.

37. తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకనిమీద నొకడు పడెదరు; మీ శత్రు వులయెదుట మీరు నిలువలేక పోయెదరు.

37. ఎవరో వారిని కత్తితో తరుముతున్నట్టుగా వారు పరుగులెడతారు. వారిని ఎవరూ తరమకుండానే వారు ఒకరిమీద ఒకరు కూలిపోతారు. “మీరు మీ శత్రువులను ఎదిరించి నిలిచే అంతటి బలం మీకు ఉండదు.

38. మీరు జనముగానుండక నశించెదరు. మీ శత్రువుల దేశము మిమ్మును తినివేయును.

38. ఇతర దేశాల్లో తప్పిపోతారు. మీ శత్రుదేశాల్లోనికి మీరు అదృశ్యమవుతారు.

39. మీలో మిగిలినవారు మీ శత్రు వుల దేశములలో తమ దోషములనుబట్టి క్షీణించిపోయెదరు. మరియు వారు తమమీదికి వచ్చిన తమ తండ్రుల దోషములనుబట్టి క్షీణించిపోయెదరు.

39. కనుక మిగిలిన వాళ్లు వారి పాపంవలన వారి శత్రుదేశంలో క్షీణించిపోయెదరు. వారు కూడా వారి పూర్వీకులవలెనే, వారి పాపంవలన క్షీణించిపోయెదరు.”

40. వారు నాకు విరో ధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని, తాము నాకు విరోధముగా నడిచితిమనియు

40. “అయితే ఒకవేళ ప్రజలు వారి పాపాలు ఒప్పుకొంటారేమో. వారు, వారి పూర్వీకుల పాపాలు ఒప్పు కొంటారేమో. ఒకవేళ వారు నాకు విరోధంగా తిరిగినట్టు ఒప్పుకోవచ్చు. ఒకవేళ వారు నాకు విరోధంగా పాపం చేసినట్టు ఒప్పుకోవచ్చు.

41. నేను తమకు విరోధముగా నడి చితిననియు, తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పిం చితిననియు, ఒప్పు కొనినయెడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతి దండనను అనుభవించితిమని ఒప్పుకొనినయెడల,
అపో. కార్యములు 7:51

41. ఒకవేళ నేను వారికి విరోధంగా తిరిగి వారి శత్రుదేశంలోనికి నేనే వాళ్ళను తీసుకొని పోయినట్టు వారు ఒప్పుకోవచ్చు. ఆ ప్రజలు నన్ను ఎరుగని వాళ్లలా ప్రవర్తించారు. వాళ్లు తగ్గించు కొని, వారి పాపపు శిక్షను స్వీకరిస్తే

42. నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును; నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును; ఆ దేశమునుకూడ జ్ఞాపకము చేసికొందును.
లూకా 1:72-73

42. అప్పుడు యాకోబుతో నా ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఇస్సాకుతో నా ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. అబ్రాహాముతో నా ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఈ దేశాన్ని నేను జ్ఞాపకం చేసుకొంటాను.

43. వారిచేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతిదినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహ్యించు కొనిరి. ఆ హేతువుచేతనే వారు తమ దోషశిక్ష న్యాయమని ఒప్పుకొందురు.

43. “ఈ దేశం ఖాళీ అవుతుంది. భూమి దాని విశ్రాంతి సమయాన్ని అనుభవిస్తుంది. అప్పుడు మిలిగిన వాళ్లు వారి పాపపు శిక్షను అంగీకరిస్తారు. వారు నా ఆజ్ఞలను ద్వేషించి, నా నియమాలను విధేయులయ్యేందుకు నిరాకరించినందువల్లే వారు శిక్ష పొందినట్టు వారు గ్రహిస్తారు.

44. అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను; నా నిబంధనను భంగపరచి వారిని కేవలము నశింపజేయునట్లు వారి యందు అసహ్యపడను. ఏలయనగా నేను వారి దేవుడనైన యెహోవాను.

44. వాస్తవంగా వారు పాపం చేసారు. అయితే సహాయంకోసం వారు నా దగ్గరకు వస్తే, నేను వారినుండి తిరిగిపోను. వారు వారి శత్రువుల దేశంలో ఉన్నప్పుటికీ నేను వారి మొర అలకిస్తాను. నేను వారిని పూర్తిగా నాశనం చెయ్యను. వారితో నా ఒడంబడికను తెగతెంపులు చేయను. నేను యెహోవాను, వారి దేవుణ్ణి.

45. నేను వారికి దేవుడనైయుండునట్లు వారి పూర్వికులను జనములయెదుట ఐగుప్తులోనుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వికులనుబట్టి జ్ఞాపకము చేసికొందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను.

45. వారి పూర్వీకులతో నాకుగల ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నేను వారికి దేవునిగా ఉండేందుకు నేను వారి పూర్వీకుల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించాను. ఇతర రాజ్యాలు వాటన్నింటినీ చూసాయి. నేను యెహోవాను!”

46. యెహోవా మోషేద్వారా సీనాయికొండమీద తన కును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలును తీర్పులును ఆజ్ఞలును ఇవే.

46. అవి యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చిన చట్టాలు, నియమాలు, ప్రబోధాలు. యెహోవాకు, ఇశ్రాయేలు ప్రజలకు మధ్య ఆ ఆజ్ఞలే ఒక ఒడంబడిక. సీనాయి పర్వతం దగ్గర ఆ ఆజ్ఞలను యెహోవా ఇచ్చాడు. ఆయన వాటిని మోషేకు ఇవ్వగా, మోషే వాటిని ప్రజలకు యిచ్చాడు.Shortcut Links
లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |