Haggai - హగ్గయి 2 | View All

1. ఏడవ నెల యిరువది యొకటవ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చిన దేమనగా

దీనికి చాలా సంవత్సరాల క్రితం బబులోను సైన్యం సొలొమోను దేవాలయాన్ని ధ్వంసం చేసినప్పుడు చూచిన కొందరు ఇంకా ఉన్నారు (ఎజ్రా 3:12). ఆ ఆలయం దేదీప్యమానంగా ఉండేది (1 రాజులు 6:1-7; 1 రాజులు 7:13-51). దానితో పోల్చుకుంటే ఇప్పుడు వారు కడుతున్న ఆలయం చిన్నది, అందమైన అలంకారాలు లేనిది. కానీ జెకర్యా 4:10 చూడండి.

2. నీవు యూదాదేశపు అధికారియగు షయల్తీ యేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోను ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోను శేషించిన జనులతోను ఇట్లనుము

3. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచినవారు మీలో ఉన్నారు గదా; అట్టివారికి ఇది ఎట్టిదిగా కనబడు చున్నది? దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచు చున్నది గదా.

4. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చున దేమనగా జెరుబ్బాబెలూ, ధైర్యము తెచ్చుకొమ్ము; ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువా, ధైర్యము తెచ్చుకొమ్ము; దేశములోనున్న సమస్తజనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి; నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే సైన్యములకు అధి పతియగు యెహోవా వాక్కు.

5. మీరు ఐగుప్తుదేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసికొనుడి; నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి.

ఆయన చేసిన ఒడంబడిక ఏమిటంటే వారు ఆయన ప్రజలు, ఆయన వారి మధ్య నివాసం చేస్తాడు – నిర్గమకాండము 29:44-46. “నా ఆత్మ”– నిర్గమకాండము 31:3; సంఖ్యాకాండము 11:16-17, సంఖ్యాకాండము 11:25; కీర్తనల గ్రంథము 51:11; కీర్తనల గ్రంథము 106:33; యెషయా 63:11-14. “భయపడకండి”– దేవుడు మనతో ఉంటే భయపడ వలసినదేమీ లేదు. ఆయన మనతో లేకపోతే చాలా వాటికి భయపడేందుకు తగిన కారణం ఉంది.

6. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇక కొంతకాలము ఇంకొకమారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును.
మత్తయి 24:29, లూకా 21:26, హెబ్రీయులకు 12:26-27

“ఆకాశాలను, భూమిని”– హెబ్రీయులకు 12:26 లో ఈ మాటల నెరవేర్పు భవిష్యత్తులో ఉందని రాసి ఉంది. క్రీస్తు రెండో రాక సమయంలో ఆకాశాలు, భూమి, లోక రాజ్యాలన్నీ విపరీతంగా కంపిస్తాయి.

7. నేను అన్యజనులనందరిని కద లింపగా అన్యజనులందరి యొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
యోహాను 1:14

“అన్ని దేశాల”– భూమిపై ఉన్న రాజ్యాలన్నిటిలో దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకోగలడు, నెరవేర్చుకుంటాడు. వాటన్నిటినీ తన మహిమ కోసమూ, తన ప్రజల మేలు కోసమూ ఉపయోగించుకోగలడు, ఉపయోగించుకుంటాడు. దానియేలు 4:34-35 పోల్చి చూడండి. “కోరేది”– ఇది అభిషిక్తుణ్ణి అంటే యేసుక్రీస్తును గురించి అన్నమాట అని కొందరు పండితుల అభిప్రాయం. కావచ్చు గానీ బల్లగుద్ది ఇదమిద్ధంగా చెప్పలేము. నిజానికి అన్ని దేశాల్లో కొందరు మాత్రమే ఆయన్ను కోరుతారు గాని అన్ని దేశాలూ కాదు. “కోరేది” అని తర్జుమా చేసిన హీబ్రూ పదానికి మనుషులు గొప్పగా ఎంచే వస్తువులనే అర్థం కూడా ఉంది. ఇక్కడ దీనికి బహుశా ఇదే అర్థం కావచ్చు. తరువాతి వచనంలో దేవుడు వెండి బంగారాలను గురించి మాట్లాడాడు గదా. యెషయా 60:5 పోల్చిచూడండి. “వైభవ మయం”– నిర్గమకాండము 40:34-35; 1 రాజులు 8:10-11. ఒక కట్టడంలో దేవుని వైభవం నిండివుంటే దానికి మరి ఏ ఇతర సౌందర్యాలూ అవసరం ఉండదు. ఆ వైభవమే గనుక లేకపోతే ఎన్ని అలంకారాలైనా అర్థం లేనివి.

8. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

కీర్తనల గ్రంథము 50:10-12. దేవుడు తన ప్రజలకు నియమించిన పనిని వారు చేయగలిగేటందుకు వారికి అవసరమైనవన్నీ ఆయనే ఇస్తాడు – 1 కోరింథీయులకు 9:8.

9. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరముయొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెల విచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించెదను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

యూదా ప్రజలు ఓడిపోయి చెరలోకి వెళ్ళిన సమయానికి సొలొమోను ఆలయం శోభ అంతం అవుతూ ఉంది. అది విగ్రహ పూజకు నిలయం అయింది కాబట్టి దేవుడు దాన్ని విడిచిపెట్టాడు – యెహె 8–11 అధ్యాయాలు. ఇప్పుడైతే ప్రజలు విగ్రహాలనూ అబద్ధ దేవుళ్ళనూ విసర్జించారు గనుక దేవుడు ఈ కొత్త ఆలయాన్ని తన మహిమా ప్రకాశంతో నింపుతాడు. పాత దానికి ఉన్నంత సౌందర్యం ఇందులో కనిపించకపోయినప్పటికీ ఇందులో మరింత దేవుని మహిమా ప్రకాశం ఉంటుంది. “ఈ స్థలంలో”– అంటే జెరుసలంలో. “శాంతి”– యెషయా 60:17; లూకా 1:79; లూకా 2:14; యోహాను 14:27; కొలొస్సయులకు 1:20.

10. మరియదర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము తొమ్మిదవనెల యిరువది నాల్గవ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చిన దేమనగా

క్రితం సందేశం వచ్చాక రెండు నెలలు గడిచిపోయాయి (వ 1). ఇప్పటి కొత్త సందేశం ఇది – దేవుని పని విషయంలో ప్రజల్లో విధేయత, ఆలోచన లేకపోవడం, నిర్లక్ష్యం మూలంగా వారు అశుద్ధులయ్యారు. పవిత్ర దేశంలో, పవిత్ర నగరంలో ఉండి, దేవుని పవిత్రాలయాన్ని కట్టే ఏర్పాట్లు చేస్తూ ఉండడంవల్ల వారు పవిత్రులైపోలేదు. పవిత్రత మనుషులకు అలా రాదు. పవిత్రత హృదయానికి, గుణశీలాలకు, ప్రవర్తనకు సంబంధించినది. దేవునికి విధేయత చూపినందువల్ల కలిగే ఫలితం ఇది (రోమీయులకు 6:22 పోల్చి చూడండి). నిజమైన పవిత్రత లేనివారు ముట్టుకున్నదల్లా అశుద్ధం అవుతుంది.

11. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు యాజకులయొద్ద ధర్మశాస్త్ర విచారణచేయుము.

12. ఒకడు ప్రతిష్టితమైన మాంసమును తన వస్త్రపుచెంగున కట్టుకొని, తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏవిధమగు భోజనపదార్థమునైనను ముట్టినయెడల, ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా? యని యాజకులనడుగగా వారు కాదనిరి

ప్రతిష్ఠ చేసిన మాంసం అంటే దేవునికి అర్పణకు తెచ్చిన మాంసం.

13. శవమును ముట్టుటవలన ఒకడు అంటుపడి అట్టివాటిలో దేనినైనను ముట్టినయెడల తాను ముట్టినది అపవిత్రమగునాయని హగ్గయి మరల నడుగగా యాజకులు అది అపవిత్రమగు ననిరి.

14. అప్పుడు హగ్గయి వారి కీలాగు ప్రత్యుత్తరమిచ్చెను ఈ ప్రజలును ఈ జనులును నా దృష్టికి ఆలాగుననేయున్నారు; వారు చేయు క్రియ లన్నియు వారచ్చట అర్పించునవియన్నియు నా దృష్టికి అపవిత్రములు; ఇదే యెహోవా వాక్కు.

15. ఈ రాతి మీద రాయియుంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించినదానిని ఆలోచనచేసికొనుడి.

16. నాటనుండి యొకడు ఇరువది కుప్పల కంకులు వేయగా పది కుప్పలంత ధాన్యమే తేలు చున్నది; తీసికొనవలెనని ఏబది కొలల తొట్టియొద్దకు ఒకడు రాగా ఇరువదికొలలు మాత్రమేదొరకును.

17. తెగులుతోను కాటుకతోను వడగండ్లతోను మీ కష్టార్జితమంతటిని నేను నాశనము చేసియున్నాను; అయినను మీలో ఒకడును తిరిగి నాయొద్దకు రాలేదు; ఇదే యెహోవా వాక్కు.

“నావైపుకు తిరగలేదు”– యెషయా 9:13; యిర్మియా 3:10; ఆమోసు 4:6-9.

18. మీరు ఆలోచించుకొనుడి. ఇంతకుముందుగా తొమ్మిదవ నెల యిరువది నాలుగవ దినమునుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటనుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి.

19. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్షచెట్లయినను అంజూరపుచెట్లయినను దానిమ్మచెట్లయి నను ఒలీవచెట్లయినను ఫలించకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను.

“ఆశీస్సులు ప్రసాదిస్తాను”– మలాకీ 3:10; కీర్తనల గ్రంథము 128:1-2; యోవేలు 2:13-14 పోల్చి చూడండి. ప్రజలు ప్రవక్త మాటల్లో నమ్మకం ఉంచి దేవుని పట్ల విధేయత, గౌరవం కనపరచడం ఆరంభించినందుచేత వారి పరిస్థితులు హఠాత్తుగా అద్భుతంగా మారిపోతాయని దేవుడు మాట ఇస్తున్నాడు. వారిని శిక్షించడానికి బదులు వారిని దీవిస్తాడు. వెంటనే అలా చేయడం మొదలుపెడతాడు. ఇలాంటి మార్పు జరిగిన తేదిని, అందుకు కారణాన్ని బాగా గమనించండి అంటున్నాడు. తద్వారా వారిపట్ల ఆయన విధానాలను వారు నేర్చుకోవాలని ఆయన ఉద్దేశం.

20. మరియు ఆ నెల యిరువది నాలుగవ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరల ప్రత్యక్షమై సెల విచ్చినదేమనగా

దేవుడు ఆ ప్రజలకు సందేశాన్ని పంపిన దినాన్నే ప్రజల నాయకుడికి వ్యక్తిగతంగా సందేశం పంపాడు.

21. యూదాదేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను.
మత్తయి 24:29, లూకా 21:26

“కదలిస్తాను”– జెఫన్యా 2:6.

22. రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును; అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును; రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును; గుఱ్ఱములును రౌతులును ఒకరి ఖడ్గముచేత ఒకరు కూలుదురు.

దూరాన గానీ దగ్గర గానీ శత్రువులకు జెరుబ్బాబెల్ భయపడనవసరం లేదు. పరలోక సేనల అధిపతి, ప్రపంచ సైన్యాలన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకొనేవాడు పరిస్థితులన్నిటినీ తన అదుపులో ఉంచుకున్నాడు. నిర్గమకాండము 15:1, నిర్గమకాండము 15:4, నిర్గమకాండము 15:19-20; యెహోషువ 21:43-44; న్యాయాధిపతులు 7:22; యెహెఙ్కేలు 38:21; దానియేలు 2:34-35, దానియేలు 2:44-45; దానియేలు 4:35 పోల్చి చూడండి.

23. నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడవునైన జెరుబ్బాబెలూ, నేను నిన్ను ఏర్పరచుకొనియున్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసికొని ముద్ర యుంగరముగా చేతును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

“ముద్ర ఉంగరం”– ఎస్తేరు 3:10; ఎస్తేరు 8:8. ఆ రోజుల్లో ఇది అధికార సూచనగా ఉపయోగపడేది. దేవుని నిర్ణయాలను జెరుబ్బాబెల్ అమలుపరుస్తాడన్నమాట.Shortcut Links
హగ్గయి - Haggai : 1 | 2 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |