Matthew - మత్తయి సువార్త 10 | View All

1. ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి అధికార మిచ్చెను.

“శిష్యులను”– ఈ మాట విద్యను అభ్యసించేవారు, లేదా ఒక గురువు దగ్గర ఉపదేశం పొంది, ఆయన ఉపదేశాలను అనుసరించేందుకు సమకట్టేవారు అని అర్థాన్నిచ్చే గ్రీకు పదానికి అనువాదం (మత్తయి 10:24; యోహాను 8:31). క్రీస్తులోని సామాన్య విశ్వాసులను ఉద్దేశించి “అపొస్తలుల కార్యములు” గ్రంథంలో “శిష్యులు” అనే పదాన్ని సాధారణంగా ఉపయోగించడం కనిపిస్తున్నది (అపో. కార్యములు 6:1; అపో. కార్యములు 9:1; అపో. కార్యములు 11:26; మొ।।). ఆ గ్రంథంలో ఈ పదం 26 సార్లు కనిపిస్తున్నది. (“క్రైస్తవులు” అనే పదం రెండు సార్లు, “విశ్వాసులు” అనే పదం 11 సార్లు మాత్రమే కనిపిస్తాయి). క్రీస్తు దగ్గర నేర్చుకోకుండా ఎవరూ విశ్వాసిగా గానీ నిజమైన క్రైస్తవుడుగా గానీ ఉండలేరు. ఈ విధంగా విశ్వాసులందరూ శిష్యులే.

2. ఆ పండ్రెండుమంది అపొస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ; జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను;

మొదటి సారిగా యేసుప్రభువు పన్నెండుమంది ప్రథమ రాయబారుల జాబితా కనిపిస్తున్నది. వీరు రాయబారులుగా కాకముందు శిష్యులుగా (నేర్చుకునేవారుగా) ఉన్నారనే విషయాన్ని గమనించండి. వీరు తమ అధికారాన్ని క్రీస్తు సమక్షంలో ఆయననుండే నేరుగా పొందారన్న విషయం కూడా గమనించండి. తాను అంతవరకు చేస్తున్నదాన్నే వారూ చేసేందుకు ఆయన వారికి అధికారమిచ్చాడు. క్రొత్త ఒడంబడిక సంఘానికి నాయకులుగా ఉండేందుకు ఆయన వారిని సిద్ధపరుస్తున్నాడు. బైబిల్లో వాడబడినట్టు రాయబారులు (అపొస్తలులు) అనే మాటకు ప్రతినిధులు, వార్తాహరులు, లేక పంపబడినవారు అని అర్థం. ఈ భూమిపై తన ప్రతినిధులుగా ఉండేందుకు క్రీస్తు తన రాయబారులను ఎన్నుకున్నాడు.

3. ఫిలిప్పు, బర్తొలొమయి; తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరుగల లెబ్బయి;
మీకా 7:6

“బర్తొలోమయి”– ఇతడు, నతనియేలు బహుశా ఒక్కరే కావచ్చు (యోహాను 1:45-51). “మత్తయి”– తనను తాను ఎవరో ప్రత్యేకమైన గొప్ప వ్యక్తిగా చెప్పుకోలేదు. అందరి ద్వేషానికీ గురి అయిన తన పాత ఉద్యోగం “సుంకంవాడు” అనే పేరుతోనే పరిచయం చేసుకున్నాడు. మనుషులిచ్చే గౌరవం కోసం ఈ రాయబారులు చూడలేదు. నేటి క్రైస్తవ నాయకులు అనేకమందిలాగా “డాక్టర్”ను తమ పేరుకు ముందు తగిలించుకోవాలనీ, తమ డిగ్రీలనూ, సాధించిన విజయాలనూ గొప్పగా ప్రదర్శించుకోవాలనీ చూడలేదు (మత్తయి 23:6-7 పోల్చి చూడండి). “తద్దయి”– అతనికి లెబ్బయి, యూదా అనే పేర్లు కూడా ఉన్నాయి (లూకా 6:16; అపో. కార్యములు 1:13).

4. కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.

“కనానీయుడైన సీమోను”– బహుశా ఇతడు క్రీస్తు శిష్యుడు కాకమునుపు “తీవ్రవాదులు” అనే పేరు గల రాజకీయ పక్షంలో సభ్యుడు అయివుండవచ్చు. యూదులపై రోమ్ పరిపాలనను వీరు ఎదిరించారు. “ఇస్కరియోతు యూదా”– ఇతణ్ణి వేరే చోట్ల “దొంగ” అనీ “పిశాచం” అనీ అనడం కనిపిస్తుంది (యోహాను 6:70-71; యోహాను 12:6). అతడి హృదయం క్రీస్తుతో ఎన్నడూ ఏకీభవించలేదు, క్రీస్తు పక్షం వహించలేదు. అయినప్పటికీ యేసుప్రభువు దయ్యాలను వెళ్ళగొట్టేందుకు, రోగుల్ని బాగు చేసేందుకూ అతనికి అధికారం ఇచ్చాడు. మత్తయి 7:22-23 పోల్చి చూడండి.

5. యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారినిచూచి వారికాజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింపకుడిగాని

“ఇతర జనాలు” అంటే యూదులు కానివారు. సమరయ ప్రజలంటే సంకర జాతివారు. వీరి పుట్టుపూర్వోత్తరాలు 2 రాజులు 17వ అధ్యాయంలో చూడవచ్చు. వీరు ఉత్తరాన గలలీకి, దక్షిణాన యూదయకు మధ్య ఉన్న సమరయ ప్రదేశంలో నివసించారు. చాలావరకు యూదులు సమరయవారిని అసహ్యించుకునేవారు. వారితో ఎలాంటి పొత్తూ పెట్టుకునేవారు కాదు (యోహాను 4:9). అయితే వారికి బోధించవద్దని యేసు తన శిష్యులతో చెప్పిన కారణం ఇది కాదు. వారికి శుభవార్త ప్రకటించే సమయం ఇంకా రాలేదు (ఆ సమయం తరువాత వచ్చింది – యోహాను 4:1-42; అపో. కార్యములు 8:5-25). అబ్రాహాము కాలంనుంచి యూదులు దేవుని ప్రజలే (ఆది 12 అధ్యాయం). దేవుడు వారితో ప్రత్యేకమైన ఒడంబడికలు చేశాడు. అందువల్ల దేవుని రాజ్య శుభవార్త వారికి ప్రథమంగా బోధించడం తగిన విషయమే.

6. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెల యొద్దకే వెళ్లుడి.
యిర్మియా 50:6

7. వెళ్లుచు పరలోకరాజ్యము సమీపించి యున్నదని ప్రకటించుడి.

8. రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి.

దేవుని రాజ్యం సమీపంగా ఉందనడానికి ఈ అద్భుతాలు రుజువు. యేసు వారికి ఉచితంగా ఇచ్చిన అధికారం, ప్రభావం మూలంగా వారు ధనం సంపాదించుకోకూడదు. ఇతరుల మేలు కోసం వాటిని ఉచితంగానే వినియోగించాలి. అపో. కార్యములు 20:33-35; 1 కోరింథీయులకు 10:33; 2 కోరింథీయులకు 12:14-15 పోల్చి చూడండి. డంబం లేని సామాన్యమైన జీవిత విధానం, స్వార్థ త్యాగం క్రీస్తు శిష్యుల లక్షణాలై ఉండాలి. మత్తయి 3:4 నోట్ చూడండి.

9. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికఱ్ఱనైనను సిద్ధపరచుకొనకుడి;

వారు ఉచితంగా తమకున్నది ఇవ్వాలి. ఇతరులు ఉచితంగా వారికిచ్చినదాన్ని పుచ్చుకోవాలి. దయకు ప్రతిఫలంగా దయ కలుగుతుంది. తమ ద్వారా దేవుని దీవెనలు పొందిన వ్యక్తుల మూలంగా దేవుని పనివారి పోషణ జరగాలి (1 కోరింథీయులకు 9:7-14; 1 తిమోతికి 5:17-18). వారి చొక్కా చినిగిపోయినా, చెప్పులు అరిగిపోయినా దేవుడే తమకు వేరేవాటిని ఇస్తాడని ఆయనలోనే నమ్మకం పెట్టుకోవాలి.

10. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా?
సంఖ్యాకాండము 18:31

11. మరియు మీరు ఏపట్టణములో నైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి.

తాము ఎక్కడ బస చేసేది వారు జాగ్రత్తగా చూచుకోవాలి. రమ్మన్న చోట్లెల్లా ఆతిథ్యం స్వీకరించకూడదు. యోగ్యులైన వారికోసం చూడాలి గానీ ధనికుల కోసం కాదు. పూటకూళ్ళ ఇళ్ళు, హోటళ్ళలో ఉండేందుకు వారి దగ్గర డబ్బు ఉంచుకోకూడదు. లూకా 22:36 కూడా చూడండి.

12. ఆ యింటిలో ప్రవేశించుచు, ఇంటివారికి శుభమని చెప్పుడి.

యూదుల్లో “మీకు శాంతి కలుగుతుంది గాక!” అని పలకరించడం వాడుక. వారినీ, వారి సందేశాన్నీ చేర్చుకున్న ఏ ఇంట్లో అయినా శాంతి అనే ఫలితం కలుగుతుంది. వారి సందేశాన్ని త్రోసిపుచ్చినవారికి శాంతి కలగడం అసాధ్యం. అలా కలుగుతుందన్నట్టు రాయబారులు నటించకూడదు.

13. ఆ యిల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దానిమీదికి వచ్చును; అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును.

14. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన యెడల మీరు ఆ యింటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి.

క్రీస్తు సందేశాన్ని త్రోసిపుచ్చినవారితో క్రీస్తు రాయబారులకు ఎలాంటి సహవాసమూ, పొత్తూ లేవని ఇది సూచించేది. అలా త్రోసిపుచ్చేవారు పూర్తిగా ఒంటరిగా దేవుని తోడు లేకుండా మిగిలిపోతారని ఇది హెచ్చరికగా ఉంది.

15. విమర్శదినమందు ఆ పట్టణపు గతికంటె సొదొమ గొమొఱ్ఱా ప్రదేశముల గతి ఓర్వతగినదై యుండునని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.
ఆదికాండము 18:20-192

“తీర్పు జరిగే రోజున”– మత్తయి 11:22, మత్తయి 11:24; మత్తయి 12:36; అపో. కార్యములు 17:31; రోమీయులకు 2:2, రోమీయులకు 2:16; రోమీయులకు 14:10; 2 పేతురు 2:9; ప్రకటన గ్రంథం 14:7; ప్రకటన గ్రంథం 20:11-15. “సొదొమ, గొమొర్రా”– ఆదికాండము 19:23-29; 2 పేతురు 2:6; యూదా 1:7. క్రీస్తును నిరాకరించే స్థలాలకు కలిగే శిక్ష సొదొమ శిక్ష కన్న ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారికున్న అవకాశాలు సొదొమ కన్న ఎక్కువే, వారి మధ్య ప్రకటించబడిన సత్యం సొదొమకు తెలిసిన సత్యం కన్న గొప్పదే, ఆ సత్యం గురించిన సాక్ష్యం, రుజువులు కూడా గొప్పవే. ఎక్కువ అవకాశాలూ, ఆధిక్యతలూ త్రోసిపుచ్చితే వచ్చే శిక్ష కూడా ఎక్కువే. మత్తయి 11:20-24; హెబ్రీయులకు 2:1-4.

16. ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.

“తోడేళ్ళు”– మత్తయి 7:15; లూకా 10:3; యోహాను 10:2; అపో. కార్యములు 20:29. శిష్యులు వివేచనా జ్ఞానం కలిగి కనపరచాలి. మత్తయి 7:6, మత్తయి 7:20 పోల్చి చూడండి. వారి శత్రువులు న్యాయంగా వారిని తప్పు పట్టేందుకూ, ప్రతీకారం చేసేందుకూ ఆస్కారం ఇచ్చేవిధంగా వారెన్నడూ ప్రవర్తించకూడదు. 1 పేతురు 3:13-17; 1 పేతురు 4:12-16. వ 17 నుంచి అధ్యాయం చివరివరకు గలలీలో వారు చేసే కొద్దిపాటి పరిచర్యను మించి రాబోయే రోజుల్లో కొనసాగే పరిచర్య వైపుకు యేసు దృష్టి సారిస్తున్నట్టు ఉన్నాడు. ఆ సమయానికి వారిని పట్టుకోవడం, రాజుల ఎదుటకు విచారణకు తేవడం వంటిది లేదు (వ 18,19). అంతేగాక 21-23 వచనాల్లో ఉన్న మాటలు గలలీలోని స్వల్ప కాలిక పరిచర్యకు సరిపోవడం లేదు. అయితే ఈ విషయాలన్నీ క్రీస్తు రాయబారుల తదుపరి పరిచర్య కాలంలో జరిగాయి. ఇది అపొ కా గ్రంథంలో స్పష్టంగా ఉంది. వ 23 ఈ యుగాంతాన్ని దృష్టిలో ఉంచుకుని పలికిన సంగతి కావచ్చు. ఈ మాటలు క్రీస్తు రెండో రాకడను సూచించినట్టుంది.

17. మనుష్యు లనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడా లతో కొట్టింతురు,

క్రీస్తు సందేశానికి ఎప్పుడూ ఎదిరింపు ఉంటుందనీ, నిజ దేవుణ్ణి ద్వేషించేవారు క్రీస్తు శిష్యుల్ని కూడా ద్వేషిస్తారనీ వారు గ్రహించాలి.

18. వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నానిమిత్తము మీరు అధిపతులయొద్దకును రాజులయొద్దకును తేబడుదురు.

19. వారు మిమ్మును అప్పగించునప్పుడు,ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింప కుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకను గ్రహింపబడును.

ఇది ఈ ప్రత్యేక సందర్భాలకే వర్తిస్తుంది. వారు తమ మామూలు పరిచర్య సమయంలో చెప్పవలసినదాన్ని గురించి ఆలోచించకూడదనీ, సిద్ధపడకూడదనీ అర్థం కానే కాదు.

20. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు.

అపో. కార్యములు 4:8, అపో. కార్యములు 4:13 చూడండి. దేవుని ఆత్మ గనుక వారి ద్వారా మాట్లాడితే పేదలు, విద్య లేనివారే గొప్పవారినీ, జ్ఞానవంతులనూ నివ్వెరపోయేలా చేయగలరు.

21. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమునకు అప్పగించెదరు; పిల్లలు తలిదండ్రులమీద లేచి వారిని చంపించెదరు.
మీకా 7:6

మానవ స్వభావం ఎలాంటిదో చూడండి. కొన్ని సార్లు సత్యాన్ని ప్రకటిస్తే అది తీవ్ర ద్వేషాన్నీ, హింసనూ రేపుతుంది, మనుషులు రక్తసంబంధులని కూడా చూడరు. మత సంబంధంగా సహించలేని గుణం, దురభిమానం, మూఢమైన పట్టుదల కారణంగా బహు సహజమైన ప్రేమ బంధాలు కూడా తెగిపోతాయి – వ 36; యోహాను 15:18-21. దేవుని సేవకులు ఎంతో వ్యతిరేకతను భరించాలి. అలా భరించారు కాబట్టి వారికి విముక్తి లభిస్తుంది అనడం సరి కాదు. వారి నమ్మకం యథార్థమైనది అనడానికి వారు అంతంవరకు సహించడమే రుజువు. ఇలాంటి యథార్థ విశ్వాసం మూలంగా వారికి విముక్తి దొరుకుతుంది (మత్తయి 24:13; హెబ్రీయులకు 10:39; 1 పేతురు 1:5).

22. మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు రక్షంపబడును.

23. వారు ఈ పట్టణములో మిమ్మును హింసించునప్పుడు మరియొక పట్టణమునకు పారిపోవుడి; మనుష్యకుమారుడు వచ్చువరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసియుండరని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.

శిష్యులు తమ సందేశాన్ని ఇతరులపై బలవంతంగా రుద్దకూడదు. ఎక్కడైనా తమను నిరాకరిస్తే, తమను స్వీకరించే చోట్లకు వెళ్ళిపోవాలి.

24. శిష్యుడు బోధకునికంటె అధికుడు కాడు; దాసుడు యజమానునికంటె అధికుడు కాడు.

పరిసయ్యులు సైతానును బయల్‌జెబూల్ అన్నారు. ఈ పేరు ఫిలిష్తియవాళ్ళ ఒక దేవుడి పేరు (2 రాజులు 1:2). యేసు తన ప్రభావాన్ని బయల్‌జెబూల్ (సైతాను) నుంచి పొందాడని పరిసయ్యులు అన్నారు – మత్తయి 12:14; లూకా 11:15; యోహాను 8:48. ఆయన్ను దయ్యం పట్టినవాడుగా చెప్పి హతమార్చిన లోకం తమపట్ల ఇంతకంటే మంచిగా ప్రవర్తిస్తుందని యేసు శిష్యులు ఎలా అనుకోగలరు? మనం కూడా ఆయన పక్షంగా అపకీర్తి, దూషణ, హింసను సహించేందుకు, వాటితో తృప్తి చెందేందుకు సిద్ధపడి ఉందాం. యేసు ఇక్కడ తనను తాను ఇంటి యజమానిగా, శిష్యులను ఇంటివారిగా చెప్పుకుంటున్న సంగతిని గమనించండి. ఎఫెసీయులకు 2:19; హెబ్రీయులకు 3:1-6 పోల్చి చూడండి.

25. శిష్యుడు తన బోధకునివలెను దాసుడు తన యజమానునివలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయెల్జెబూలని వారు పేరుపెట్టి యుండినయెడల ఆయన యింటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా.

26. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచ బడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు.

తమ గురువు ఆకాశానికీ భూమికీ ప్రభువనీ, చివర్లో అన్ని సంగతులకూ చెందిన సత్యాన్ని వెలుగులోకి తెస్తాడనీ ఎరిగి ఆయన శిష్యులు నిర్భయంగా ఉండాలి. కీర్తనల గ్రంథము 37:6 పోల్చి చూడండి. లూకా 12:2-3 చూడండి.

27. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రక టించుడి.

28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.

హెబ్రీయులకు 13:6. క్రీస్తులో నమ్మకం ఉంచినవారు భయపడదగినది దేవునికి మాత్రమే. దేవునిలో వారికి శాశ్వత జీవం ఉంది. మనుషులు వారికి చెయ్యగలిగేదేదీ శాశ్వత ఫలితాలను కలిగించేది కాదు. దేవుని భయం గురించి నోట్స్ ఆదికాండము 20:11; కీర్తనల గ్రంథము 34:11-14; కీర్తనల గ్రంథము 111:10; సామెతలు 1:7.

29. రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు.

తన సృష్టిలో ప్రతి అల్పమైన విషయాన్ని కూడా దేవుడు పరిశీలించి చూస్తున్నాడు. కాబట్టి శిష్యులు తమ అవసరాలన్నిటి సంగతీ ఆయన చూచుకుంటాడని ఆయనపై నమ్మకం ఉంచాలి. క్రీస్తులో విశ్వాసులు ఆందోళన, భయం లేని జీవితాలు గడపాలి (మత్తయి 6:25-34; మత్తయి 8:26; యోహాను 14:1; ఫిలిప్పీయులకు 4:6-7; 1 పేతురు 5:7).

30. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి
1 సమూయేలు 14:45

31. గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.

32. మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును.

క్రీస్తులో నమ్మకం ఉంచేవారు బహిరంగంగా ఆయనకోసం నిలబడాలి. ఆయన్ను తమ ప్రభువుగా, రక్షకుడుగా ఒప్పుకోవాలి (రోమీయులకు 10:9-10 పోల్చి చూడండి). అలా చెయ్యకపోవడం ఆయన్ను నిరాకరించి వదులుకున్నట్టే లెక్క. వారు ఆయనను గురించి ఎప్పుడూ మౌనంగా ఉన్నారంటే వారి నమ్మకం నిజమైనది కాదన్నమాట. రహస్య విశ్వాసులుగా ఉండాలని కోరుతూ తమ నమ్మకాన్ని గురించి ఎప్పుడూ పైకి చెప్పనివారు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. వారి విశ్వాసం వాస్తవమైనదని రుజువేమిటి? మౌనంగా ఉండిపోయి చివర్లో దేవుని ఎదుట నిలబడవలసి వచ్చినప్పుడు యేసు మనమెవరో ఎరగననడం కంటే హింసలకూ మరణానికీ గురి అవుతూ ఉన్నా సరే బహిరంగంగా ఆయన్ను ఒప్పుకోవడం ఎంతో మంచిది.

33. మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోక మందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును.

34. నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు.

తనను స్వీకరించి నమ్మినవారికి శాంతి సమకూర్చేందుకూ, వారికీ దేవునికీ మధ్య సమాధానం కలిగించేందుకూ యేసు వచ్చాడు. అయితే లోకంలో ఉన్నవారందరికీ శాంతి ఇచ్చేందుకు ఆయన రాలేదు. ఎందుకంటే ఆయన్ను నిరాకరించినవారికి శాంతి ఉండే అవకాశం లేదు (యెషయా 48:22). అలాంటి వారికీ, ఆయన్ను స్వీకరించినవారికీ మధ్య పోరాటం ఉంటుంది.

35. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని.
మీకా 7:6

వ 21 చూడండి. సత్యాన్ని నమ్మేవారినీ, నమ్మనివారినీ సత్యం వేరు చేస్తుంది. వారు ఒకే కుటుంబానికి చెందినవారైతే కావచ్చు. అది ఎంత మాత్రం లెక్కలోకి రాదు.

36. ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు.

37. తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కు వగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు;
ద్వితీయోపదేశకాండము 33:9

లూకా 14:26 పోల్చి చూడండి. అక్కడ ఈ విషయాన్నే మరింత నొక్కి చెప్పడం జరిగింది. ఒకవేళ యేసు గనుక దేవుడు కాకపోతే ఇలా మాట్లాడ్డానికి ఆయనకు హక్కు ఉండేది కాదు. మనం మన హృదయాల్లో ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలని క్రీస్తు ఉద్దేశం. అవసరమైతే బంధువులకు బదులుగా ఆయన్ను కోరుకునేందుకు సంసిద్ధులమై ఉండాలి (మత్తయి 8:21-22). కుటుంబ బంధాలకంటే సత్యం మరింత ప్రాముఖ్యమైనది. కుటుంబానికి, స్వార్థానికి, పాపానికి, ధనానికి లేక మరి దేనికైనా ప్రథమ స్థానం ఇచ్చేవారు క్రీస్తును నిజంగా అనుసరించలేరు (లూకా 14:33). క్రీస్తు దేవత్వం గురించి ఫిలిప్పీయులకు 2:6 నోట్స్ చూడండి.

38. తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు.

మత్తయి 16:24; లూకా 9:23. సిలువ అంటే మరణానికి చిహ్నం. రోమ్‌వారు మరణశిక్ష అమలు జరిపే విధానం అది. సిలువ ఎత్తుకోవడం అంటే అలంకారిక బాషలో స్వార్థం, దాని ఆశలు, ఉద్దేశాలు, ఏర్పాట్లు ఇవన్నీ నాశనమయ్యే స్థితికి ఇష్టపూర్వకంగా సాగివెళ్ళడం (2 కోరింథీయులకు 4:10-12 పోల్చి చూడండి). అంటే బాధలు, కించపరిచే విషయాలు, విషమ పరీక్షలు అనుభవించేందుకు మనసు కలిగి ఉండడం. యేసును అనుసరించకుండా సిలువ నెత్తుకుని వెళ్ళడం కష్టతరమైన, దుఃఖకరమైన విషయం. దాన్ని ఎత్తుకుని ఆయనవెంట వెళ్ళడం విడుదల, ఆనందం. ఆశలనూ లోకాన్నీ త్యాగం చేసుకోవడం, సన్యాస జీవనం, తపస్సు ఇలాంటివన్నీ మనం ఆయన్ను అనుసరించకపోతే వ్యర్థం.

39. తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.

అంటే స్వార్థం కోసం, ఈ లోకంలో తమ స్థానంకోసం బ్రతికేవారు శాశ్వత జీవాన్ని కోల్పోతారనీ, క్రీస్తును కోరుకొని స్వార్థాన్ని చంపుకున్నవారు దేవునితో శాశ్వతంగా జీవిస్తారనీ అర్థం. నమ్మకం ఎంత శక్తివంతమైనదో చూడండి. మనకు, మన సాటి మనుషులకు, ఈ లోకానికి బదులుగా మనం క్రీస్తునే కోరుకునేలా చేయగలదు నమ్మకం. మార్కు 11:24; హెబ్రీయులకు 10:39; హెబ్రీయులకు 11:1, హెబ్రీయులకు 11:4, హెబ్రీయులకు 11:6; మొ।। కూడా చూడండి.

40. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును.

క్రీస్తును స్వీకరించినవారు ఆయన్ను పంపిన తండ్రి అయిన దేవుణ్ణి స్వీకరించినట్టే. ఎందుకంటే క్రీస్తు తండ్రితో ఏకంగా ఉన్నాడు (యోహాను 10:30). క్రీస్తు శిష్యులను స్వీకరించినవారు క్రీస్తును స్వీకరించినట్టే. ఎందుకంటే శిష్యులు క్రీస్తుకు ప్రతినిధులు. ఆయన వారితో ఏకంగా ఉన్నాడు (అపో. కార్యములు 9:1-5). ఆయన శిష్యులు “చిన్నవారు”– వ 42; మత్తయి 18:2-3; యోహాను 13:33; 1 యోహాను 2:1. లోకం వారిని చిన్నచూపు చూస్తుంది. వారికి అనేక సార్లు ధనం, విద్య, పదవి, లోకసంబంధమైన సామర్థ్యాలు కొదువగా ఉంటాయి (1 కోరింథీయులకు 1:26-29). అయితే వారిపట్ల దయ చూపడం అంటే క్రీస్తుపట్ల దయ చూపడమే. వారిపట్ల ఎంత స్వల్పంగా దయ చూపించినా దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మత్తయి 5:12 కూడా చూడండి. మనం దీన్ని నిజంగా నమ్మితే క్రీస్తు శిష్యులకు సహాయం చేసేందుకు వెనుకంజ వేయము.

41. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును.
1 రాజులు 17:9-24, 2 రాజులు 4:8-37

42. మరియు శిష్యుడని యెవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టు కొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |