Matthew - మత్తయి సువార్త 3 | View All

1. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి

మత్తయి క్రీస్తు జీవితంలో దాదాపు ముప్పయి ఏళ్ళు ముందుకు వెళ్ళి తన పరిచర్యను ఆరంభించబోయే సమయం గురించి రాస్తున్నాడు. బాప్తిసం ఇచ్చే యోహాను గురించి ఇతర రిఫరెన్సులు మత్తయి 11:2-14; మత్తయి 14:1-12; మార్కు 1:2-8; మార్కు 6:14-29; లూకా 1:5-25, లూకా 1:57-80; లూకా 3:15-18; లూకా 7:18-23; యోహాను 1:6-8, యోహాను 1:15-35; యోహాను 3:22-36; యోహాను 5:33-35. యూదయ అరణ్యం అంటే జెరుసలం, బేత్‌లెహేంకు తూర్పుగా ఉన్న ఎడారి ప్రాంతం. అది యొర్దాను నది, మృత సముద్రం వరకు విస్తరించింది.

2. పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను.

పశ్చాత్తాపం, పశ్చాత్తాపపడండి అనేవి బైబిల్లోని అతి ప్రాముఖ్యమైన మాటలు. ఈ రెండు పద రూపాలు బైబిల్లో డెబ్భైకంటే ఎక్కువ సార్లు కనిపిస్తున్నాయి. పశ్చాత్తాపం అంటే మనసు, హృదయం పూర్తిగా మారడం, దానివల్ల ప్రవర్తనలో మార్పు కలగడం. యోహాను, యేసుప్రభువు, ఆయన శిష్యులు ఈ పదాన్ని వాడిన అర్థం ఇది – చెడు తలంపుల నుండీ, చెడు క్రియలనుండీ దేవునివైపుకు తిరిగి ఆయన వాక్కునూ, ఆయన సంకల్పాన్నీ తమ జీవన సూత్రంగా స్వీకరించడం. బైబిలు వర్ణించే నిజమైన పశ్చాత్తాపం ఒక వ్యక్తిలో తాను చేసిన పాపాలకు విచారాన్ని కలిగిస్తుంది, పాపంనుంచి విడుదల కావాలన్న కోరికను పుట్టిస్తుంది. క్రీస్తును నిరాకరిస్తున్న వారి విషయంలోనైతే వారి పాపాల నుంచి ఆయనవైపుకు తిరిగి ఆయన్ను ప్రభువుగా, రక్షకుడుగా, విముక్తిదాతగా స్వీకరించడమే పశ్చాత్తాపం. పశ్చాత్తాపానికీ పాపవిముక్తి, రక్షణలను స్వీకరించే నమ్మకానికీ మధ్య సంబంధం ఉంది. పశ్చాత్తాపం లేని వ్యక్తికి నిజమైన నమ్మకం ఉండదు, అందువల్ల ఆ వ్యక్తికి పాపవిముక్తి, రక్షణ లేదు. లూకా 13:3; లూకా 24:47; అపో. కార్యములు 17:30-31 చూడండి. తన పాపాలన్నిటి నుంచీ మళ్ళుకొనేందుకు సమ్మతించని వ్యక్తికి తన పాపాలనుంచి విముక్తి, రక్షణ ఉండదు. ఇస్రాయేల్‌ప్రజలు పాపంలో, అపనమ్మకంలో మునిగి అభిషిక్తుణ్ణి, అంటే యేసుక్రీస్తును స్వీకరించేందుకు సిద్ధంగా లేరు కాబట్టి యోహాను వారికి పశ్చాత్తాపాన్ని బోధిస్తున్నాడు. యెషయా 1:4 మొదలైన చోట్ల వర్ణించినట్టుగా ఉంది వారి స్థితి. పశ్చాత్తాపం గురించి ఇతర నోట్స్ కోసం వ 8; లూకా 13:2-3; అపో. కార్యములు 2:38; అపో. కార్యములు 17:30 చూడండి. “పరలోక రాజ్యం”– మత్తయి 4:17 చూడండి. “దగ్గరగా”– ఎందుకంటే పరలోకం నుంచి వచ్చిన రాజు (యేసుప్రభువు) కనిపించి తన పరిచర్యను ఆరంభించనున్నాడు. పాత ఒడంబడిక రోజుల్లో కంటే కొత్తగా, ఘనంగా దేవుని రాజ్య ప్రత్యక్షం గురించి యోహాను చెప్తున్నాడు.

3. ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవాడితడే.
యెషయా 40:3

ఈ మాటలు యెషయా 40:3 లో ఉన్నాయి. ఆ వచనం క్రీస్తు రాకడ కోసం యోహాను సిద్ధపాటు పరిచర్య గురించినది. “ప్రభువు”– యెషయా గ్రంథంలో ఉన్న హీబ్రూ పదం యెహోవా. ఇది పాత ఒడంబడికలో వాడిన దేవుని పేరు. నిర్గమకాండము 3:14-15; లూకా 2:11 నోట్స్ చూడండి.

4. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము.
2 రాజులు 1:8

అధిక ధర లేని మామూలు దుస్తులు, సాధారణమైన భోజనం, నిరాడంబరమైన సామాన్య జీవిత విధానం, ఇవే దేవుని నిజ ప్రవక్తల్లో సాధారణంగా కనిపించే లక్షణాలు. నేటి మత నాయకులనేకమందిలో కనిపిస్తున్న వస్తువాహనాలపట్ల మక్కువ, ఆడంబరాల పట్ల ప్రీతి, ధనాపేక్ష, ఇలాంటివి ఆ ప్రవక్తలలో కనిపించలేదు.

5. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చి,

6. తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.

బాప్తిసం అనే పదం “బాప్తిజో” అనే గ్రీకు పదంనుంచి వచ్చింది. విశేష జనాదరణ పొందిన గ్రీకు – ఇంగ్లీషు నిఘంటువు ఈ పదానికి (తెలుగులోకి అనువదిస్తే) “ముంచడం...నిమజ్జనం. మునిగేలా చేయడం, నీళ్ళలో తడవడం, నిమగ్నంగా చేయడం” అని అర్థాలిస్తున్నది (ఈ నిఘంటువు ఆర్ణ్‌డ్ట్, గింగ్రిచ్ అనే పండితులు రాసినది. మిగతా నిఘంటువులు దీనితో దాదాపుగా ఏకీభవిస్తున్నాయి). యోహాను ఇచ్చిన బాప్తిసం పశ్చాత్తాపానికీ పాప క్షమాపణకూ సూచనగా ఉంది. అయితే అది వాటిని ఒక మనిషిలో కలిగించలేదు. మార్కు 1:4 మొదలైనవి కూడా చూడండి. బాప్తిసం గానీ మరే నీటి సంస్కారం గానీ ఏ స్థలంలోనైనా పాపాన్ని తీసివేయదు, మనుషుల హృదయాలను మార్చదు. దేవుడు మాత్రమే అలా చేయగలడు. తన కుమారుణ్ణి నమ్మడం మూలంగా ఒక వ్యక్తి స్వీకరించినప్పుడు ఆయన ఆ వ్యక్తిలో అలా చేస్తాడు (యోహాను 1:12-13; యోహాను 3:3-8; యోహాను 5:24; అపో. కార్యములు 13:38-39).

7. అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి.

“పరిసయ్యులూ”– యూదుల్లో మతనిష్ఠ, సనాతన భావాలూ గల ఒక మతశాఖ. వీరు క్రిందటి తరాలనుంచి సంక్రమించిన మత సాంప్రదాయాలనూ, మోషే ధర్మశాస్త్రాన్నీ నొక్కినొక్కి చెప్తూ పొల్లుపోకుండా పాటించాలనేవారు. వీరిలో చాలామంది తామే న్యాయవంతులమని అనుకొనేవారు. ఇతరులకంటే తాము పవిత్రులమని ఎవరితో కలవకుండా వేరుగా ఉండేవారు (పరిసయ్యుడు అనే పదం వేరుగా, ప్రత్యేకంగా ఉండడం అని అర్థాన్నిచ్చే హీబ్రూ పదం “పరాష్” నుంచి వచ్చింది). వారి మాటలకూ, చేతలకూ పొంతన ఉండేది కాదు. వారి కపట భక్తిని యేసుప్రభువు తీవ్రంగా ఖండించాడు (23వ అధ్యాయం). క్రొత్త ఒడంబడిక గ్రంథంలో వీరు సాధారణంగా యేసుప్రభువుకు వ్యతిరేకంగా ప్రవర్తించడం కనిపిస్తుంది. “సద్దూకయ్యులూ”– యూదుల్లో మరో శక్తివంతమైన మతశాఖ. వారి మత సిద్ధాంతాలు దేవుడు వెల్లడించిన సత్యాలపై ఆధారపడినవి కావు. అసలు వారు పాత ఒడంబడిక స్పష్టంగా చెప్పిన కొన్ని సత్యాల్ని వ్యతిరేకిస్తూ ఉండేవారు (అపో. కార్యములు 23:8 చూడండి). వారు ఈ రోజుల్లో ఉన్న అనేకమంది క్రైస్తవుల లాంటివారన్నమాట. వీరిలో ఎక్కువమంది యాజుల శాఖకు చెంది, యేసుప్రభువు కాలంలో ఆలయంలో ఆరాధనాధికారాలను నిర్వహిస్తూ ఉండేవారు. కానీ వారి మనస్సుల్లో మాత్రం దేవుని సంగతులకంటే ఇహలోక విషయాలకే ఎక్కువ స్థానం ఉండేది. సద్దూకయ్యులు అనే పేరు పుట్టుపూర్వోత్తరాలు తెలియవు. “ఓ సర్ప వంశమా”– ఈ వ్యక్తుల గుణాన్ని గురించిన గొప్ప గ్రహింపును దేవుడు యోహానుకు ఇచ్చాడు. వారు ఇస్రాయేల్‌కు మత నాయకులు అయితే యోహాను దృష్టిలో (దేవుని దృష్టిలో కూడా) విష సర్పాలు, జాతి జీవనంలోకి విషాన్ని ఎక్కించేవారు. మత్తయి 12:34; మత్తయి 23:33; కీర్తనల గ్రంథము 58:4; కీర్తనల గ్రంథము 140:3; రోమీయులకు 3:13 పోల్చిచూడండి. కొన్ని సార్లు అతి నీచులైన వ్యక్తులే మత నాయకత్వంలో అత్యున్నత స్థానాలకు ఎదుగుతారని బైబిలు తెలియజేస్తున్నది. యిర్మియా 6:13; యిర్మియా 23:11; యెహెఙ్కేలు 34:1-6 చూడండి. “ఆగ్రహం”– తమ పాపాలనుంచి విడుదల, రక్షణ పొందనివారు తమ పాపాల కోసం దేవుని కోపాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. యోహాను 3:36; రోమీయులకు 1:18 చూడండి. దేవుని కోపం గురించి నోట్స్ సంఖ్యాకాండము 25:3; ద్వితీయోపదేశకాండము 4:25; కీర్తనల గ్రంథము 90:7-11; మొ।।.

8. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచ వద్దు;

“ఫలాలు”– అపో. కార్యములు 26:20 కూడా చూడండి. పశ్చాత్తాపానికి తగిన ఫలాలు అంటే చెడుపనులు చేయడం మానుకోవడం, మంచి చేయడం నేర్చుకోవడం, ఎవరికైనా కీడు చేస్తే అందుకు పరిహారం చెల్లించడం, దొంగిలించినదాన్ని తిరిగి ఇచ్చివేయడం మొదలైనవి. టూకీగా చెప్పాలంటే ఇది నూతన జీవిత విధానానికీ, పాత జీవితానికి వ్యతిరేకమైన జీవితానికీ దారి తీస్తుంది (2 దినవృత్తాంతములు 33:1-20; కీర్తనల గ్రంథము 51:1-19; యెషయా 1:16-20; యెహెఙ్కేలు 18:30-32; లూకా 3:10-14; లూకా 19:7-9; అపో. కార్యములు 2:36-37; అపో. కార్యములు 9:1-2, అపో. కార్యములు 9:19-22; మొ।। చూడండి).

9. దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.

యోహాను 8:39-40 చూడండి. అబ్రాహాము చరిత్ర ఆది 12-25 అధ్యాయాల్లో రాసి ఉంది. యోహాను ఇక్కడ ఎత్తి చూపుతున్న పొరపాటు మతాన్ని అనుసరించే వ్యక్తులలోనూ సర్వ సామాన్యంగా కనిపించేది. అంటే తాము ఒక మత శాఖకు, గుంపుకు చెందినవారం, లేక ఎవరన్నా ప్రసిద్ధుడైన మతనాయకుడి వంశానికి చెందినవారం కాబట్టి దేవుడు తమను అంగీకరిస్తాడనీ, తన ప్రజగా ఎంచుతాడనీ అనుకోవడం. అబ్రాహాము దేవుని మనిషి. అలాగని అతని సంతానమంతా దేవుని మనుషులెలా అవుతారు? ఒక వ్యక్తి తల్లిదండ్రులు, తాతలు నిజ క్రైస్తవులైనంత మాత్రాన అతడు కూడా నిజ క్రైస్తవుడైపోడు. దేవుని దృష్టిలో ఒక వ్యక్తి నమ్మకం, చర్యలు, లక్షణాలు ప్రాముఖ్యం, గాని అతని పూర్వీకులు ఎలాంటివారనేది కాదు.

10. ఇప్పుడే గొడ్డలి చెట్లవేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలిం పని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును.

దేవుడు ఆ జాతికి తీర్పు తీర్చనున్నాడని యోహాను ఉద్దేశం. అభిషిక్తుడు త్వరలో కనిపించబోతున్నాడు. ఇస్రాయేల్ అనే అరణ్యంలో ప్రజలు చెట్లలాంటివారు. మత్తయి 7:17-20; లూకా 13:6-9; యోహాను 15:5-6; కీర్తనల గ్రంథము 1:3; కీర్తనల గ్రంథము 37:35; కీర్తనల గ్రంథము 52:8; కీర్తనల గ్రంథము 92:12; ప్రసంగి 11:3 పోల్చి చూడండి. “అగ్ని”– మత్తయి 5:22; మత్తయి 7:19; మత్తయి 13:42; మత్తయి 18:8-9; ప్రకటన గ్రంథం 20:15; ప్రకటన గ్రంథం 21:8 చూడండి.

11. మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను2 అగ్ని తోను మీకు బాప్తిస్మమిచ్చును.

యోహాను అభిషిక్తుడైన యేసుప్రభువును గురించి మాట్లాడుతున్నాడు. ఆయన కంటే తానెంత తక్కువవాడో గుర్తించాడు. దేవుని నిజ సేవకులు తాము దేవుళ్ళలాగా ప్రవర్తించరు, తాము దేవుణ్ణని చెప్పుకోరు, గానీ దేవుని ఎదుట దుమ్ము ధూళిలాగా తమను తాము వినయ భావంతో తగ్గించుకుంటారు. ఒక వ్యక్తి దేవునికి ఎంత దగ్గరైతే తన యోగ్యతను గురించి అంత తక్కువగా ఎంచుకుంటాడు (1 తిమోతికి 1:15; యోబు 42:6; యెషయా 64:6; యిర్మియా 3:25). యోహాను కంటే గొప్పవాడైన మనిషి ఎవరూ లేరు (మత్తయి 11:11). అయితే క్రీస్తు చెప్పులు మోయడానికి కూడా తాను తగనని యోహాను ఉద్దేశం. తాను చేయగలిగినదల్లా నీళ్ళలో బాప్తిసం ఇవ్వగలగడమే. క్రీస్తు అయితే దేవుని జీవమిచ్చే ఆత్మ పూర్ణతలోకి మనుషుల్ని తేగలడని అతనికి తెలుసు. యేసు ఇవ్వబోయే ఆత్మ బాప్తిసం లేకుండా నీటి బాప్తిసం ఎందుకూ కొరగానిది. మనుషులకు ఆధ్యాత్మిక జీవాన్నిచ్చేది దేవుని ఆత్మే (యోహాను 3:5-8; యోహాను 6:63; యోహాను 7:37-39). ఆత్మ బాప్తిసం గురించి నోట్ అపో. కార్యములు 1:5. దేవుని వాక్కును ప్రకటించేవారందరికీ ఆదర్శం యోహానే. డంబం, బడాయి, విలువైన వస్తువులు ఇలాంటివేవీ లేకుండా జీవించాడు, మత రాజకీయాల్లో తల దూర్చలేదు, పేరుప్రతిష్ఠల కోసం, సంపదల కోసం ప్రాకులాడలేదు. వినయం, సాధుస్వభావం గలవాడే గానీ సింహంలాగా ధైర్యశాలి. ప్రసంగీకులంతా నొక్కి చెప్పవలసిన కొన్ని అమోఘ సత్యాలను నొక్కి చెప్పాడు – అంటే పాపానికి వ్యతిరేకంగా దేవుని కోపం, పశ్చాత్తాపపడి జీవిత విధానాన్ని మార్చుకోవలసిన అవసరం, వంశ చరిత్రను బట్టి గాక వ్యక్తిగతంగా దేవునితో సంబంధం, దుర్మార్గులపైకి రాబోయే దేవుని తీర్పులు, దేవుని నిజ ప్రజకు కలుగబోయే దీవెనలు (వ 12), అందరికంటే పైగా యేసుప్రభువు ఆధిక్యత, పశ్చాత్తాపపడి క్రీస్తు శుభవార్తపై నమ్మకం పెట్టేవారికి దేవుని ఆత్మ అనుగ్రహించబడడం, మొదలైన విషయాలు.

12. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.

“అగ్ని”– మలాకీ 3:2-4 లో చెప్పినట్టుగా దేవుడు తన ప్రజలను శుద్ధి చేయడం గురించిన మాట కావచ్చు. అక్కడ “నిప్పు” అంటే వారి ఎముకల్లోకి చొరబడి సత్యం గురించి సాక్ష్యమివ్వడానికి చాలిన బలప్రభావాలను ఇచ్చే దేవుని శక్తిని సూచిస్తున్నది (యిర్మియా 20:9 పోల్చి చూడండి). ఇక్కడ “అగ్ని” పాపానికి వ్యతిరేకంగా మండే దేవుని తీర్పుకు సూచన కావచ్చు (వ 7. ద్వితీయోపదేశకాండము 32:32; యెషయా 30:30; 2 థెస్సలొనీకయులకు 1:7-8 పోల్చి చూడండి). గోధుమలకు (దేవుని నిజ ప్రజలు) పవిత్రాత్మలో బాప్తిసం ఇవ్వడం, పొట్టుకు (దేవుని నిజ ప్రజలు కానివారికి – కీర్తనల గ్రంథము 1:4) మంటల్లో బాప్తిసం ఇవ్వడం జరుగుతుంది.

13. ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను.

యేసు ఇప్పుడు 30 సంవత్సరాల ప్రాయం వాడు (లూకా 3:23). యోహాను బాప్తిసం పశ్చాత్తాపం, పాపాలు ఒప్పుకోవడం, పాప క్షమాపణలను సూచించే బాప్తిసం (వ 6,11; మార్కు 1:4). యేసుప్రభువు పాపం లేని దైవకుమారుడు (లూకా 1:35; యోహాను 8:46; 2 కోరింథీయులకు 5:21; హెబ్రీయులకు 4:15; హెబ్రీయులకు 7:26; 1 పేతురు 2:22). ఆయనకు పశ్చాత్తాపం, పాపాలు ఒప్పుకోవడం, క్షమాపణ ఇవేవీ అవసరం లేదు. అలాగైతే యోహానుద్వారా బాప్తిసం పొందాలని ఎందుకు వచ్చాడు? దీనికి యేసు ఇచ్చిన ఏకైక కారణం 15వ వచనంలో ఉంది – “ధర్మం యావత్తూ నెరవేర్చడం”– తనను అనుసరించేవారు పాటించవలసిన ధర్మాన్ని ఆయన పాటించి చూపాడు. దీనికి మరో ఉదాహరణ – ఆయన పస్కా పండుగ ఆచరించి పస్కా విందు భుజించాడు. అందులోని అంశాలు తాను వారికోసం చెయ్యబోయేవాటికి సూచనలుగా ఉన్నాయే గాని తనకోసం అవసరమైనవి కావు (లూకా 22:14-15). తాను బాప్తిసం తీసుకోవడం దేవుని సంకల్పానికి వినయంతో లోబడిన చర్య. దాన్ని తీసుకోవడంలో (అసలు తన జీవిత కాలమంతా) యేసుప్రభువు తన శిష్యులందరికీ ఆదర్శంగా నిలిచాడు (మత్తయి 11:29; మత్తయి 16:24; యోహాను 13:15; ఫిలిప్పీయులకు 2:5; 1 పేతురు 2:21 పోల్చి చూడండి). ఆయనలో పాపం లేకపోయినా పాపాత్ముల స్థానం ఆయన తీసుకున్నాడు. ఆయన మన ప్రతినిధి, మన స్థానంలో నిలిచినవాడు. మనం వెళ్ళవలసిన దిశను, చెయ్యవలసినదాన్ని చూపించాడు. మనం బ్రతకవలసిన విధానాన్ని తనలో కనపరిచాడు. చివరికి మన స్థానంలో మన పాపాలన్నిటినీ తన పై వేసుకొని బాధల్లోకీ, మరణంలోకీ బాప్తిసం పొందాడు (లూకా 12:50). అలా మనందరికీ దాపురించవలసిన మరణం ఆయనకు దాపురించింది. అంటే బాప్తిసం తీసుకోవడంతో సహా ఆయన చేసినవన్నీ దేవుని నీతిన్యాయాలను నెరవేర్చడం, ప్రత్యక్ష పరచడం, ఘనపరచడం కోసమే. మనుషులను న్యాయవంతులుగా చేసేందుకు ఆయన అనుభవించబోయే మరణం, సమాధి, తిరిగి సజీవంగా లేవడం అనే వాటికి బాప్తిసం ఒక సూచన.

14. అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చు చున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని

15. యేసుఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెర వేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను.

16. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.

బైబిల్లో వెల్లడి అయిన దేవుడు, ఏకైక నిజ దేవుడు, త్రిత్వం. అంటే ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. ఈ వచనాల్లో ఈ ముగ్గురు వ్యక్తుల గురించీ ఉంది. కుమారుడైన యేసు నీటినుంచి బయటికి వస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ ఆయనపైకి దిగుతున్నాడు. తండ్రి అయిన దేవుడు పరలోకంనుండి మాట్లాడుతున్నాడు. కుమారుడు తండ్రి కాదు లేక పవిత్రాత్మ కాదు. పవిత్రాత్మ కుమారుడు కాదు లేక తండ్రి కాదు. ఈ ముగ్గురూ ఎవరికి వారు ప్రత్యేకం. కానీ ఒకే దేవుడుగా పరిపూర్ణ ఐక్యతలో ఉన్నారు. అందువల్ల ముగ్గురు దేవుళ్ళు కాదు గాని ఒక్కడే దేవుడు ఉన్నాడు. మత్తయి 28:19; యోహాను 14:26; యోహాను 15:26; యోహాను 16:15; 1 కోరింథీయులకు 12:3-6; 2 కోరింథీయులకు 13:14; ఎఫెసీయులకు 4:4-6; ప్రకటన గ్రంథం 1:4-5. పాత ఒడంబడికలో త్రిత్వాన్ని సూచించే ఈ రిఫరెన్సులు చూడండి – ఆదికాండము 1:26; ఆదికాండము 16:7; తండ్రి – కీర్తనల గ్రంథము 89:26; కుమారుడు – కీర్తనల గ్రంథము 2:12; పవిత్రాత్మ – ఆదికాండము 1:2. అయితే దేవుడొక్కడేనని పాత ఒడంబడిక స్పష్టంగా తెలియజేస్తున్నది (ద్వితీయోపదేశకాండము 6:4; యెషయా 44:6; యెషయా 45:18). “దేవుని ఆత్మ”– దేవుని ఆత్మ అంటే కేవలం ఒక ప్రభావం లేక దేవునినుండి వెలువడే అవ్యక్త శక్తి కాదు. ఆయన ఒక దైవిక వ్యక్తి. యోహాను 14:16-17, యోహాను 14:26 నోట్స్ చూడండి. ఆ సమయంలో పావురం నిర్దోషత్వానికీ హాని చేయని సాధుస్వభావానికీ చిహ్నం (మత్తయి 10:16). తరువాతి కాలంలో దీన్ని శాంతి చిహ్నంగా కొందరు ఎంచుతున్నారు. యేసును మరియ దేవుని ఆత్మమూలంగానే గర్భం ధరించింది (మత్తయి 1:18). ఆయన బాప్తిసం సమయంలో ఆయన ఆరంభించబోయే పరిచర్య విషయంలో ఆత్మద్వారా అభిషేకం పొందాడు. ఆయన జీవితం, పరిచర్యలో తన సొంత దైవిక బలప్రభావాలను, ఆధిక్యతలను పక్కన ఉంచి (ఫిలిప్పీయులకు 2:6-7), ప్రతి విషయంలోను తండ్రి మీదనే ఆధారపడ్డాడు. ఆయన సాధించిన ప్రతి పనికీ ఇలా దేవుని ఆత్మవల్ల జరిగిన అభిషేకమే ఆయనకు సమర్థతను కలుగజేసింది. మత్తయి 12:28; లూకా 4:18-19; యోహాను 4:24; యోహాను 5:19, యోహాను 5:30; యోహాను 6:38; అపో. కార్యములు 10:28; ఫిలిప్పీయులకు 2:7-8; యెషయా 11:1-5 చూడండి. శక్తినిచ్చే దేవుని ఆత్మ తోడు లేకుండా మనం జీవించవలసిన రీతిలో జీవించగలమనీ, దేవుణ్ణి సేవించవలసిన రీతిలో సేవించగలమనీ అనుకోరాదు.

17. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనానందించు చున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
ఆదికాండము 22:2, కీర్తనల గ్రంథము 2:7, యెషయా 42:1

ఇక్కడ దేవుడు యేసును తన కుమారుడు అంటున్నాడు. యెషయా 9:6; లూకా 1:32, లూకా 1:35; యోహాను 1:1, యోహాను 1:14, యోహాను 1:18; యోహాను 5:18-23 చూడండి. అంటే యేసుకు మరెవరికీ ఉండలేని విధంగా దేవుని స్వభావం ఉన్నదని అర్థం. ఆయన దేవుని ఒక్కగానొక్క కుమారుడు (యోహాను 3:16). ఆయనంటే పరమ తండ్రికి ఎంతో ఆనందం ఎందుకంటే ఆయనలో ఏవిధమైన పాపమూ లేదు, అన్నిటిలో తండ్రికి లోబడుతూ ఉన్నాడు, తండ్రికి ఆనందం కలిగించడమే తన జీవిత పరమావధిగా ప్రధానమైన ఆశయంగా ఆయన పెట్టుకున్నాడు. యోహాను 4:34; యోహాను 5:30; యోహాను 6:38; యోహాను 8:29; 2 కోరింథీయులకు 5:21; హెబ్రీయులకు 7:26; 1 పేతురు 2:22 చూడండి.Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |