యేసు పాపులను దేవుని దగ్గరికి తెస్తున్నప్పుడు (వ 2) సణుగుతూ విమర్శించిన ఇస్రాయేల్ మత నాయకులకు పెద్దకొడుకు సూచనగా ఉన్నాడు. ఈ అధ్యాయంలోని ఉదాహరణలన్నీ యేసు చెప్పినది వీరికే (వ 3,8,11). ఇలాంటి వ్యక్తులు ఈ లోకంలో ఇప్పటికీ ఉన్నారు. వ 28-30లో ఇలాంటివారి పాపాలు కొన్నింటిని చూడవచ్చు. దేవుని దృష్టిలో ఈ పాపాలు చిన్నకొడుకు చేసిన పాపాలంత చెడ్డవే (అంతకన్నా కూడా చెడ్డవే) – కరుణ చూపడం జరిగినందుకు కోపం, స్వాభిమానం, వేరొకడికి దీవెనలు కలిగాయని అసూయ, రక్తబంధువుపై ద్వేషం (చిన్నకొడుకును ఇతడు కనీసం “తమ్ముడు” అనడం లేదు – వ 30). గనుక అతడు విందులోకి వెళ్ళడానికి నిరాకరిస్తున్నాడు. లూకా 14:18; మత్తయి 23:13 పోల్చి చూడండి.