John - యోహాను సువార్త 1 | View All

1. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
సామెతలు 8:22-25

2. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,
సామెతలు 8:22-25

3. కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.

4. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.

5. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను.

6. దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను.

7. అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగునుగూర్చి సాక్ష్య మిచ్చుటకు సాక్షిగా వచ్చెను.

8. అతడు ఆ వెలుగైయుండ లేదు గాని ఆ వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను.

9. నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.

10. ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు.

11. ఆయన తన స్వకీ యులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.

12. తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.

13. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.

14. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి
కీర్తనల గ్రంథము 45:2, యెషయా 4:2, యెషయా 33:17, యెషయా 60:1-2, హగ్గయి 2:7, జెకర్యా 9:17

15. యోహాను ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచు నా వెనుక వచ్చువాడు నాకంటె ప్రముఖుడు గనుక ఆయన నాకంటె ముందటివాడాయెననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను.

16. ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితివిు.

17. ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.
నిర్గమకాండము 31:18, నిర్గమకాండము 34:28

18. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను.

19. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే.

20. అతడు ఎరుగననక ఒప్పుకొనెను; క్రీస్తును కానని ఒప్పుకొనెను.

21. కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు కాననెను.
ద్వితీయోపదేశకాండము 18:15, ద్వితీయోపదేశకాండము 18:18

22. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగాకానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారునీవెవరవు? మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్నుగూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని నడిగిరి

23. అందు కతడు ప్రవక్తయైన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళముచేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను.
యెషయా 40:3

24. పంపబడినవారు పరిసయ్యులకు చెందిన వారు

25. వారు నీవు క్రీస్తువైనను ఏలీయావైనను ఆ ప్రవక్త వైనను కానియెడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని అడుగగా

26. యోహాను నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు;

27. మీరాయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను.

28. యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యొర్దానునదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను.

29. మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.
ఆదికాండము 22:8, యెషయా 53:6-7

30. నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటి వాడాయెనని నేనెవరినిగూర్చి చెప్పితినో ఆయనే యీయన.

31. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలొ బాప్తిస్మ మిచ్చుచు వచ్చితినని చెప్పెను.

32. మరియయోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను.

33. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలొ బాప్తిస్మ మిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మ మిచ్చువాడని నాతో చెప్పెను.

34. ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చి తిననెను.

35. మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా

36. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొఱ్ఱపిల్ల అని చెప్పెను.
యెషయా 53:7

37. అతడు చెప్పిన మాట ఆ యిద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి.

38. యేసు వెనుకకు తిరిగి, వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదకుచున్నారని వారినడుగగా వారురబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బియను మాటకు బోధకుడని అర్థము.

39. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి, ఆయన కాపురమున్న స్థలము చూచి, ఆ దినము ఆయన యొద్ద బసచేసిరి. అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయెను.

40. యోహాను మాట విని ఆయనను వెంబడించిన యిద్దరిలో ఒకడు సీమోను పేతురుయొక్క సహోదరుడైన అంద్రెయ.

41. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచిమేము మెస్సీయను కనుగొంటి మని అతనితో చెప్పి
దానియేలు 9:25

42. యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సీయ అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతనివైపు చూచినీవు యోహాను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము.

43. మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను.

44. ఫిలిప్పు బేత్సయిదావాడు,అనగా అంద్రెయ పేతురు అనువారి పట్టణపు కాపురస్థుడు.

45. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను.
యెషయా 7:14, యెషయా 9:6, యెహెఙ్కేలు 34:23, ద్వితీయోపదేశకాండము 18:18

46. అందుకు నతనయేలునజ రేతులోనుండి మంచిదేదైన రాగలదా అని అతని నడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను.

47. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని అతనిగూర్చి చెప్పెను.

48. నన్ను నీవు ఏలాగు ఎరుగుదు వని నతనయేలు ఆయనను అడుగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్న ప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను.

49. నతన యేలుబోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను.
కీర్తనల గ్రంథము 2:7, యెషయా 32:1, జెఫన్యా 3:15

50. అందుకు యేసు ఆ అంజూరపు చెట్టుక్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటె గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను.

51. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారునిపైగా ఎక్కుటయును దిగుట యును చూతురని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.
ఆదికాండము 28:12బైబిల్ అధ్యయనం - Study Bible
1:1-18 యోహాను తన ముందు మాటలో యేసును నిత్యమూ నివసిస్తూ ఉండిన, అనాదిగా ఉనికిలో ఉన్న శరీరధారియైన వాక్యంగా చూపించాడు (వ.1,14). అలాగే దేవుడైన తండ్రికి అద్వితీయ కుమారునిగా చూపించాడు (వ. 1,18), దేవుని రక్షణ ప్రణాళికను యేసు ముగింపుకు తీసుకువచ్చాడు.
యేసు రాకముందు ఆ ప్రణాళికలో భాగంగా మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం (వ.17), గుడారంలో తన ప్రజల మధ్య నివసించడం (వ. 14), బాప్తిస్మమిచ్చు యోహానును పంపడం (వ.6-8, 15) లాంటివి జరిగాయి. యేసే వెలుగు. జీవం, సత్యం, విశ్వాసులు దేవుని పిల్లలు, యేసుని
ఈ లోకం తిరస్కరించడం వంటి అనేక అంశాల గురించి ముందు మాటలో పరిచయం చేసి సువార్తలోని తరువాతి భాగంలో వివరంగా నొక్కి చెప్పాడు. 1:1 ఆదియందు వాక్యముండెను అనేది ఆది 1:1 లో “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను" అనే మాటను ప్రతిధ్వనింపజేస్తుంది. యేసు దేవునితో పాటు శాశ్వత కాలం నుండి ఉనికి కలిగి ఉన్నట్లుగా యోహాను చూపించాడు. వాక్యము దేవుడై ఉండెను: యేసు సృష్టి కంటే ముందున్నవాడు మాత్రమే కాదు గాని భూమిని, ఆకాశాన్ని సృష్టించిన దేవుడు కూడా ఆయనే. వాక్యము (గ్రీకు. లోగోస్) అనే పదం "దైవికమైన స్వీయ వ్యక్తీకరణ లేదా మాటలు" అనే భావాన్నిస్తుంది. (కీర్తన 19:1-4). దేవుని వాక్యం ప్రభావవంతమైనది. ఆయన పలుకగా సమస్తమూ ఉనికిలోకి వచ్చింది. (ఆది. 1:3,9; యెషయా 55:11-12).

1:2-3 ఆదినుండి ఉనికిలో ఉన్న ప్రతీదీ దాని ఉనికిని బట్టి యేసుకు రుణపడి ఉన్నాయి. 

1:4-5 జీవము... వెలుగు... చీకటి అనే అంశాల ప్రస్తావన ఆదికాండంలోని అంశాలకు కొనసాగింపుగా ఉంది. (ఆది. 1:3-5,14-18,20-31; 2:7; 3:20). పా.ని.లోని ఆదికాండం తర్వాతి గ్రంథాల్లో కూడా మెస్సీయ గురించిన వాక్యభాగాలు ఉన్నాయి. ఆ వాక్యభాగాల్లో కూడా వెలుగుని సూచనప్రాయంగా చెప్పడాన్ని గమనించవచ్చు. (యెషయా 9:2; 42:6-7; 49:6; 60:1-5; మలాకీ 4:2; లూకా 1:78-79). 

1:6 యేసు దైవమానవుడు అయితే బాప్తిస్మమిచ్చు యోహాను మాత్రం కేవలం మనుష్యుడు మాత్రమే. కానీ యేసు లాగానే అతడు కూడా ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. 

1:7-8 యేసు క్రీస్తు గురించి సాక్షిగా వచ్చిన యోహాను గురించి 5:31-47 నోట్సు చూడండి. 1:9 యోహాను సువార్తలోని తర్వాతి భాగమంతటిలో స్పష్టం చేసిన విధంగా వెలుగు అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ వాస్తవానికి అందరూ ఆ వెలుగును అంగీకరించలేదు. 

1:10-11 ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అనే మాట దేవుని నిబంధనలను ధర్మశాస్త్రాన్ని మెస్సీయ గురించిన వాగ్దానాలను పొందిన యూదులను సూచిస్తుంది (రోమా 9:4). ఆయనే మెస్సీయ అని రుజువు పరిచే ఆధారాలు ఉన్నప్పటికీ (ముఖ్యంగా “సూచక క్రియలు") యూదులు మెస్సీయను తిరస్కరించడమే యోహాను సువార్త మొదటి భాగంలోని ప్రధానమైన విషయం (12:37). 

1:12-13 పా.ని. లోని ఇశ్రాయేలీయులను దేవుని పిల్లలుగా చెప్పడాన్ని ఆధారం చేసుకుని దేవుని పిల్లలు అనే మాటను ఇక్కడ వాడడం జరిగింది (ద్వితీ 14:1; నిర్గమ 4:22). దేవునివలన పుట్టినవారే గాని మానవ సహజంగా పుట్టిన వారు కారు. అనగా శారీరకంగా లేదా ఒక జాతి సంతతిగా పుట్టినవారు కారు అని అర్థం. అంటే నిజమైన దేవుని పిల్లలు మెస్సీయ యందలి విశ్వాసం ద్వారా తిరిగి జన్మిస్తారు (8:41-47; 3:16). దీనిని బట్టి అన్యజనులు కూడా దేవుని పిల్లలు అవ్వడానికి మార్గం ఏర్పడింది (11:51-52; 10:16). 

1:14 వాక్యము అనే పదం 1:1 లోని అంశాన్ని కొనసాగిస్తుంది. శరీరధారియై అంటే వాక్యం దేవునిగా ఉండటం ఆగిపోయిందని కాదు గాని వాక్యం శరీరాన్ని ధరించుకుంది అని అర్థం. మనమధ్య నివసించెను అనేదానికి అక్షరార్ధమైన భావం ఏంటంటే “తన గుడారం వేసుకున్నాడు” (గ్రీకు. సెనోవో). ఇది ప్రత్యక్షపు గుడారంలో ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు నివసించడాన్ని సూచిస్తుంది. (నిర్గమ 25:8-9; 33:7). పూర్వం దేవుడు ప్రత్యక్షపు గుడారంలో, ఆ తరవాత మందిరంలో తన ప్రజలకు ప్రత్యక్ష పరుచుకున్నాడు. ఇప్పుడు శరీరధారియైన వాక్యం అనగా యేసు క్రీస్తు ద్వారా దేవుడు తన ప్రజల మధ్య నివాసం ఉంటున్నాడు (యోహాను 1:17). దేవుని ప్రత్యక్షతల(థియోఫానీస్)లో భాగంగా ప్రత్యక్షపు గుడారంలో లేదా మందిరంలో దేవుడు తన ప్రత్యక్షతనూ మహిమనూ బయలు పరచుకున్న సంగతులను వివరించే పా.ని. వాక్య భాగాలను దేవుని మహిమ అనే మాటలు సూచిస్తున్నాయి (నిర్గమ 33:22; సంఖ్యా 14:10: ద్వితీ 5:22). తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని సూచించడానికి గ్రీకులో మోనోగెనేస్ అనే పదం వాడబడింది. ఏకైక కుమారుడు అని దాని అర్థం (న్యాయాధి 11:34; యిర్మీయా 6:26; ఆమోసు 8:10; జెకర్యా 12:10). ఆది 22:2,12,16 లో (ఇష్మాయేలుకి భిన్నంగా, హెబ్రీ 11:17) ఇస్సాకు అబ్రహాముకి ప్రత్యేకమైన కుమారుడు కాబట్టి “అద్వితీయ” అంటే “ఒక్కడైయున్న" అనే అర్థాన్ని వ్వొచ్చు. పా.ని. లో ఇశ్రాయేలునీ, దావీదు కుమారుడినీ జ్యేష్ఠ కుమారుడని సంబోధించేవారు. (కీర్తన 89:27 చూడండి). యోహాను 3:16, 18 లో దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి మనకి అనుగ్రహించడం అనేది అబ్రాహాము ఇస్సాకును బలివ్వడానికి ఇష్టపడిన దానిని సూచిస్తూ ఉండవచ్చు (ఆది 22). కృపా సత్య సంపూర్ణుడు అనే పదం నిర్గమ 34:6 లో (నిర్గమ 33:18-19 తో పోల్చండి) కృపా (హెబ్రీ. థెసెద్) సత్యములు (హెబ్రీ. ఏమేత) గల దేవుడు అన్న మాటలను గుర్తు చేస్తుంది, ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుని నమ్మకమైన నిబంధనను ఆ మాటలు సూచిస్తున్నాయి. యోహాను ప్రకారం దేవుడు తన నిబంధనా నమ్మకత్వాన్ని ప్రాథమికంగా తన అద్వితీయ కుమారుణ్ణి పంపించడం ద్వారా వ్యక్తపరిచాడు (1:14 నోట్సు చూడండి). 

1:15 యేసు కంటే బాప్తిస్మమిచ్చు యోహాను ఆరునెలలు పెద్దవాడు (లూకా 1:24,26), యేసు కంటే ముందుగానే తన పరిచర్యను ప్రారంభించాడు (లూకా 3:1-20). సాధారణంగా కాలాన్ని ప్రధానమైనదిగా పరిగణించినప్పుడు (అనగా మొదట జన్మించిన) అది ప్రాధాన్యతను సూచిస్తుంది. కానీ యేసు ఆదినుండి ఉన్నవాడు అనే విషయం యోహాను తాత్కాలికంగా తన పుట్టుకను బట్టి ముందుగా ఉన్నవాడు అనేదాన్ని కొట్టి వేస్తుంది. 

1:16 1:14 లో చెప్పిన విషయాన్నే ఈ వచనం కొనసాగిస్తుంది. మనము అనే మాట వ.14 లో కూడా వాడారు. ఈ వచనంలో కూడా ఆ మాట అదే గుంపుని సూచిస్తుంది. వారెవరనగా అపొస్తలులు లేదా మొత్తం విశ్వాసుల గుంపు. 1:17 ధర్మశాస్త్రము... కృపయు సత్యమును అనే వాటి మధ్య వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ధర్మశాస్త్రం చెడ్డదని చూపించడంలేదు గానీ ధర్మశాస్త్రాన్నివ్వడమూ యేసు క్రీస్తు భూమిపైకి రావడమూ రెండూ దేవుడు మానవాళిని చేరుకునే ప్రక్రియలో వేరు వేరు దశలను సూచిస్తున్నాయి. అయితే యేసు దేవుని కృపా సత్యాల చివరి నిశ్చయాత్మక ప్రత్యక్షతను సూచిస్తున్నాడు. ఆయన అబ్రాహాము (8:53), యాకోబు (4:12), మోషే (5:46-47; 9:28) ల కంటే గొప్పవాడు.

1:18 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, మోషే కూడా చూడలేదు (నిర్గమ 33:18-23). దేవుడు ఆత్మస్వరూపి (4:24). మనుషులు పాపాత్ములు, వెలుగుని ఇష్టపడరు. కానీ చీకటినే ఇష్టపడతారు (3:19). అందుకనే మనుషులు దేవుణ్ణి పూర్తిస్థాయిలో చూడలేకపోతున్నారు. అయితే స్వయంగా దేవుడూ (అద్వితీయ దేవుడే) అద్వితీయ కుమారుడు అయిన యేసు క్రీస్తు (1:1) తండ్రియైన దేవుణ్ణి బయలుపరచెను. ఆయన తండ్రిని బయలుపరచిన రీతిగా మోషే గానీ ధర్మశాస్త్రం గానీ బయలుపరచలేదు (1:17). ఇదే విషయాన్ని గురించి యోహాను సువార్త తర్వాతి అధ్యాయాల్లో యేసు ఇలా అన్నాడు - "నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు "(14:9).

1:19-2:11 ఈ పరిచయ భాగం యేసు మొదటి వారం రోజుల్లో చేసిన పరిచర్యను గురించి తెలియజేస్తుంది: 1వ రోజు, యేసు గురించి యోహాను ఇచ్చిన సాక్ష్యం (1:19-28); 2వ రోజు, యోహాను యేసుని కలుసుకోవడం (1:29-34), 3వ రోజు, యోహాను తన ఇద్దరు శిష్యులతో యేసు గురించి సూచనప్రాయంగా పలకడం (1:35-39), 4వ రోజు, అంద్రియ తన సోదరుడైన పేతురుని యేసుకి పరిచయం చేయడం (1:40-42), 5వ రోజు, ఫిలిప్పును, నతనయేలును చేర్చుకోవడం (1:43-51), 7వ రోజు, కానా వద్ద జరిగిన వివాహం (2:1-11). ఈ ఆరంభ దశలో బాప్తిస్మమిచ్చే యోహాను
యేసు దేవుని గొర్రెపిల్ల" (1:29,36) అని చెప్పి ఆయనను ఘనపరచాడు, యేసు తన మొదటి శిష్యులను పోగు చేసుకున్నాడు, తన మొదటి సూచక క్రియ అయిన నీటిని ద్రాక్షారసంగా మార్చడం (2:11) చేశాడు. ఆ 1:19-21 యోహాను తాను క్రీస్తును కానని(1:8,15; 3:28తో పోల్చండి! ఏలీయానూ లేదా ప్రవక్తనూ కానని ఒప్పుకున్నాడు. క్రీస్తు అనే పదం రాబోయే గొప్ప దావీదు కుమారుణ్ణి సూచిస్తుంది. ఆయన గురించి పా.ని. ప్రవచించింది (2 సమూ 7:11-16; హోషేయ 3:5). మరణమే లేకుండా కొనిపోబడిన (2రాజులు 2:11) ఏలీయా సమస్తమును చక్కపెట్టుటకు (మత్తయి 17:11 లూకా 1:17) అంత్య కాలంలో (మలాకీ 4:5) తిరిగి వస్తాడని ఆశించారు. మొరటైన తన జీవనశైలిని బట్టి బాప్తిస్మమిచ్చే యోహాను ఏలీయాను పోలి ఉన్నాడు (మత్తయి 17:11; 2రాజులు 1:8) కానీ తాను ఏలీయాను కానని యోహాను ఒప్పుకున్నాడు. ద్వితీ 18:15,18 లో (అపొ.కా. 3:22; 7:37)
మోషే “ఒక ప్రవక్త" రాబోతున్నాడని ప్రవచించాడు. ఆ ప్రవక్త యేసు కాలంలో వస్తాడని ఊహించారు (యోహాను 6:14; 7:40). యోహాను తాను మోషే ప్రవచించిన ప్రవక్తను కూడా కానని ఒప్పుకున్నాడు (ఆయన ప్రవక్తీ అయినప్పటికీ; 10:40-41; మత్తయి 11:11-14 చూడండి). 

1:22-23 యెషయా మాటల్లో చెప్పాలంటే యోహాను ప్రభువు - త్రోవ సరాళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము (యెషయా 40:3; మత్తయి 3:3; మార్కు 1:3; లూకా 3:4). ఈ దేవుని దూత పశ్చాత్తాపాన్నీ, దేవుని తీర్పును బోధిస్తూ ప్రభువు రాకడకై మార్గాన్ని సిద్ధం చేయాల్సినవాడు. యెషయా 40-55 అధ్యాయాల్లోని యెషయా దర్శనం ఎక్కువగా నిర్గమకాండాన్ని పోలి ఉంది. దేవుని ప్రజల కొత్త నిర్గమాన్ని కూడా అది సూచిస్తుంది. ఆ నిర్గమంలో దేవుని మహిమ బయలు పరచబడుతుంది. ఆయన ప్రజలు విమోచించ బడతారు. ప్రభువు సేవకుడు రావడంతో ఇవన్నీ నెరవేరుతాయి (యెషయా 52:13-53:12 వరకు చూడండి).

1:24-27 ఆ రోజుల్లో ఇతరుల చెప్పుల వారును విప్పుట అనేది ఒక బానిస చేసే పని. 1:32-34 లో మరుసటి రోజుకి కానీ బాప్తిస్మమిచ్చే యోహాను వారి ప్రశ్నలకు పూర్తిగా జవాబు చెప్పలేదు. మెస్సీయ కోసం ప్రజలను సిద్ధం చేయడమే అతడు బాప్తిస్మం ఇవ్వడంలోని ఉద్దేశ్యం. 1:28 యొర్దాను నది దగ్గర యోహాను - బాప్తిస్మమిచ్చుచుండెను. ఈ సంఘటన క్రీ.శ. 29 లేదా తిబెరి కైసరు (క్రీ.శ. 14-37) పరిపాలనలో 15 వ సంవత్సరంలో జరిగినట్లు లూకా 3:1 తెలియజేస్తుంది. యోహాను రమారమి 33 ఏళ్ల ఈడు గలవాడు. యొర్దాను... ఆవలనున్న బేతనియ (10:40), చనిపోయిన లాజరు తిరిగి లేపబడిన (11:1,18) యెరూషలేము వద్దనున్న బేతనియ ఒకటి. కాకపోవచ్చు. ఇది బహుశా ఈశాన్య ప్రాంతమైన బేతానియా కావచ్చు (పా.ని. లో బాషాను అని పిలిచేవారు). 

1:29 మరునాడు గురించి 2:1-2 నోట్సు చూడండి. బాప్తిస్మమిచ్చే యోహాను దేవుని గొర్రెపిల్ల అని యేసుని సూచిస్తూ పలికాడు. ఈ మాటలు యెషయా 53:7 లో వధకు తేబడు గొర్రెపిల్ల అన్న మాటలను ప్రతిధ్వనింప జేస్తున్నాయి. యోహాను యేసు గురించి ఇలా కూడా ప్రకటించాడు - ఆయన తీర్పును తీసుకు రాబోతున్న ప్రకటన గ్రంథపు - యుద్ధవీరుడైన గొర్రెపిల్ల (ప్రక 5:6, 12; మత్తయి 3:7-12; లూకా 3:7-17). లోక పాపములను మోసికొనిపోవు అనేది. పాపానికి, పాపాత్ములకీ వ్యతిరేకంగా రగిలే దేవుని ఉగ్రతను చల్లార్చే విధంగా యేసు తన ప్రాణాన్ని అర్పించి, మనకి బదులుగా చనిపోవడాన్ని సూచిస్తుంది. (1యోహాను 2:2; 4:10). 

1:30 యేసు ఆదినుండి ఉనికిలో ఉన్నవాడేనన్న సత్యాన్ని మరోసారి యోహాను ప్రకటించాడు. 

1:31 32-33 వచనాల్లో దేవుని నుండి వచ్చిన ఒక సూచనను యోహాను చూసినట్లుగా చెప్పడం జరిగింది. అంతవరకూ యేసే మెస్సీయ అని యోహానుకి కూడా తెలిసుండకపోవచ్చు. అందుకే ఆయనను ఎరుగనైతిని అని అతడు చెప్పాడు. 

1:32-34 ఆత్మ యేసు మీదకి దిగిరావడం మాత్రమే కాదు ఆయనమీద నిలిచెను (3:34) - యేసు దైవికంగా అభిషేకించబడ్డాడు అనడానికి ఇది గుర్తుగా ఉంది. పా.ని. లో నిర్దిష్టమైన పనులను జరిగించడానికి పరిశుద్ధాత్మ ప్రజల మీదకి వచ్చి వారిని బలపరిచేవాడు. మెస్సీయ అన్నివేళలా ఆత్మ నింపుదల కలిగి ఉంటాడని యెషయా ప్రవచించాడు. (యెషయా 11:2; 61:1; యోహాను 5:31-47 వరకూ ఉన్న వచనాల నోట్సు చూడండి).

1:35 యేసు బాప్తిస్మానికీ గలిలయ పరిచర్య ఆరంభానికి మధ్యలో జరిగిన సంఘటనలను 1:35-4:42 వరకూ ఉన్న వచనాలలో యోహాను వివరించాడు. మరునాడు అనే మాట వివరణకు 2:1-2 నోట్సు చూడండి. 

1:36-37 యోహాను ఇక్కడ యేసుని గొప్ప బోధకునిగా సిఫారసు చేయడం అనేది అతనిలోని గొప్ప దీనత్వాన్ని వెల్లడి చేస్తుంది. దేవుని గొర్రెపిల్ల అనే మాటను బట్టి శిష్యులకి అసలు ఏం అర్ధం అయిందో తెలియదు కానీ వారు పూర్తిగా అయితే అర్ధం చేసుకోలేదు. 

1:38 రబ్బీ (అనగా బోధకుడు) అనే అరామిక్ పదాన్ని తన పాఠకుల నిమిత్తం యోహాను తర్జుమా చేశాడు. ఈ విధంగా యోహాను తర్జుమా చేసిన అరామిక్ పదాలు ఆరు సార్లు ఈ సువార్తలో కనిపిస్తాయి: మెస్సీయ (క్రీస్తు, వ.41; 4:25), కేఫా (పేతురు, 1:42), సిలోయము (పంపబడిన, 9:7), తోమా (దిదుమ, “కవలలు" 11:6; 20:24; 21:2), కపాలస్థలము (గొలౌతా, 19:17). 

1:39 రోజులో ఏ సమయంలో జరిగిందో తెలియజేయడాన్ని బట్టి ఈ సమాచారం ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా సేకరించిందని తెలుస్తుంది. 

1:40-42 ఇద్దరిలో ఒకడు... అంద్రియ. మరొక శిష్యుడి పేరు తెలుపలేదు. బహుశా అతడు జెబెదయి కుమారుడైన యోహాను అయ్యుండవచ్చు. మెస్సీయ... క్రీస్తు, వ. 38 నోట్సు చూడండి. కేఫా అనేది ఒక అరామిక్ పదం. రాయి అని దాని అర్థం (మత్తయి 16:16-18; యోహాను 1:38 నోట్సు చూడండి). పా.ని. కాలంలో దేవుడు తరచూ వారి ప్రత్యేకమైన పిలుపును సూచించే విధంగా వ్యక్తుల పేర్లను మార్చేవాడు. 

1:43 మరునాడు, 2:1-2 నోట్సు చూడండి. సాధారణంగా శిష్యుడే ఒక రబ్బీని వెంబడించడానికి మొదట పూనుకుంటాడు. అది వారికి అలవాటైన పద్ధతి. ఆ పద్ధతికి భిన్నంగా యేసు తన శిష్యులను తానే పిలుచుకున్నాడు (నన్ను వెంబడించుము, 15:16). 

1:44 చాలా మట్టుకు బేత్సయిదాలోనే అంధ్య, పేతురు పెరిగారు. ఆ తరువాత పశ్చిమాన కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న కపెర్నహూముకి వెళ్లిపోయారు (మార్కు 1:29; మార్కు 1:21). అదే విధంగా యేసు కూడా బేల్లెహేములో పుట్టి నజరేతులో పెరిగాడు (యోహాను 1:45), ఆ తరువాత కపెర్నహూముకి వెళ్ళిపోయాడు. (మత్తయి 4:13).

1:45 "21:2 లో కూడా నతనయేలు గురించి చెప్పడం జరిగింది. బిలో మయి (బర్-తొలొమయి, తొలొమయి కుమారుడు) అనేది నతనయేలు వ్యక్తిగత పేరు కావచ్చు. ఒకే విధంగా ఉండే మొదటి మూడు సువార్తలలోని శిష్యుల జాబితాల్లో నతనయేలుతో పాటు ఫిలిప్పు పేరు కూడా కనిపిస్తుంది (మత్తయి 10:3; మార్కు 3:18; లూకా 6:14). ధర్మశాస్త్రములో మోషే... ఎవరిని గూర్చి వ్రాసిరో అన్న ఫిలిప్పు మాటలు ద్వితీ 18:15,18 లో రాబోయే ప్రవక్త గురించి చేసిన ప్రవచనాలను సూచిస్తున్నాయి (యోహాను 1:19-21 నోట్సు చూడండి). సాధారణంగా మొత్తం పా.ని. ని సూచిస్తూ "మోషేయు ప్రవక్తలు" అన్న పదాలను వాడుతుంటారు (మత్తయి 5:17; 7:12). 

1:46 నతనయేలు గలిలయలోని కానా అనే చిన్న గ్రామానికి చెందినవాడు (21:2; 2:1-11). అంత ప్రాధాన్యత లేని నజరేతు పట్ల చిన్న చూపును కనపరచడం ద్వారా అతడు విరుద్ధ ప్రమాణాలను కలిగి వ్యవహరించినట్లు తెలుస్తుంది. నజరేతు రెండు వేల మంది జనాభాకంటే మించని చిన్న పట్టణం.


1:47 ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపట మును లేదు, యాకోబు/ఇశ్రాయేలు మోసానికి పేరుగాంచాడని గమనించండి. 

1:48 యేసు తానే మెస్సీయనని నిర్ధారిస్తూ తన మానవాతీత జ్ఞానాన్ని కనపరిచాడు (నిన్ను చూచితిని).

1:49 దేవుని కుమారుడు... ఇశ్రాయేలు రాజు, ఇవి రెండూ మెస్సీయకి సంబంధించిన బిరుదులే. “దేవుని కుమారుడు" అనే బిరుదు యేసు ప్రవచించబడిన మెస్సీయ అని సూచిస్తుంది. (2 సమూ 7:14; కీర్తన 2:7), అదేవిధంగా పా.ని.. లో “ఇశ్రాయేలు రాజు" అనే బిరుదును సాధారణంగా మెస్సీయ గురించి వాడేవారు (జెఫన్యా 3:15). ఈ రెండు పదాలు మత్తయి 27:42; మార్కు 15:32 లో కూడా కనిపిస్తాయి. 

1:50 నతనయేలు యేసు ఎవరనేది తెలుసుకున్నప్పటికీ అతడు తెలుసుకోవా ల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. 

1:51 హెబ్రీలో ఆమెన్ ఆమెన్ అనే పదాలను మీతో నిశ్చయముగా చెప్పుచు న్నాను అని తర్జుమా చేశారు. ఈ మాటలు యేసు ప్రకటించినవాటిని గంభీరంగా ధ్రుృవపరుస్తూ, ఆ మాటల అధికారిక స్వభావాన్ని నొక్కి చెబుతున్నాయి. ఈ పదాలు యోహాను సువార్తలో ఇరవై ఐదు సార్లు కనిపిస్తాయి. ఆకాశము తెరువబడుటయు, దేవుని దూతలు... ఎక్కుటయును దిగుటయును అన్న మాటలు ఆది 28:12-15 లోని యాకోబు గాథను గుర్తుచేస్తాయి. పితరుడైన యాకోబుకి వచ్చిన దర్శనం కంటే మనుష్యకుమారుడు. చాలా గొప్పవాడు (యోహాను 4:5-6,11-12). యేసు దేవుడు బయలుపరచబడిన “కొత్త బేతేలు”, “కొత్త ఇశ్రాయేలు". మనుష్యకుమారుడు - అన్న మాట - దాని 7:13-14 లో "మనుష్యకుమారుని పోలిన యొకడు" అని మర్మంగా చెప్పబడిన వ్యక్తిని సూచిస్తుంది. సిలువవేయడం ద్వారా మనుష్యకుమారుడు “ఎత్తబడతాడు” (యోహాను 3:14-15 నోట్సు చూడండి), దైవికమైన ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. (6:27,53), అంత్యకాలపు అధికారంతో వ్యవహరిస్తాడు (5:27; 9:39), ..


Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary |