Corinthians I - 1 కొరింథీయులకు 12 | View All

1. మరియు సహోదరులారా, ఆత్మసంబంధమైన వరము లనుగూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు.

రాబోయే మూడు అధ్యాయాలు “ఆధ్యాత్మిక సామర్థ్యాలు”, ఉచిత కృపావరాలు అనే విషయం గురించి తెలియజేస్తున్నాయి. ఇవి విశ్వాసులు సహజంగా చెయ్యలేనివాటిని చేయడానికి సామర్థ్యాన్ని కలిగిస్తాయి. ఈ సామర్థ్యాలు ఉండడం దానంతట అదే విశ్వాసులను ఆధ్యాత్మిక వ్యక్తులుగా చెయ్యదని అర్థం చేసుకోవాలి. కొరింతులో విశ్వాసులకు ఇవి ఉన్నాయి గాని వారు శరీర సంబంధులు, లోకానికి చెందిన మనుషుల్లాగా ప్రవర్తించారు (1 కోరింథీయులకు 3:1-4). శరీర స్వభావాన్ని అనుసరించేవారు లోక సంబంధంగా జీవిస్తూ ఏదో ఒక ఆధ్యాత్మిక సామర్థ్యం తనకు ఉందని గొప్పలు చెప్పుకోవడం ఎంత వ్యర్థమైన విషయం! 12–14 అధ్యాయాల్లో ఈ ఉచిత కృపావరాల గురించి పౌలు ఈ క్రింది విషయాలు నేర్పాడు. వాటిని ఇచ్చేది దేవుని ఆత్మే (1 కోరింథీయులకు 12:4, 1 కోరింథీయులకు 12:7, 1 కోరింథీయులకు 12:11). యేసుక్రీస్తు ప్రభుత్వం కిందనే అవి ఇవ్వబడతాయి; ఆ విధంగానే వాటిని ఉపయోగించాలి (1 కోరింథీయులకు 12:3, 1 కోరింథీయులకు 12:5). ప్రతి విశ్వాసికీ ఏదో ఒక సామర్థ్యం ఉంటుంది. (1 కోరింథీయులకు 12:7, 1 కోరింథీయులకు 12:11). ఏదైనా ఒక సామర్థ్యం విశ్వాసులందరిలోనూ ఉండదు (1 కోరింథీయులకు 12:29-30). సామర్థ్యాలన్నీ అందరి మేలుకోసమే గానీ వ్యక్తిగతమైన లాభం కోసం కాదు (1 కోరింథీయులకు 12:7; 1 కోరింథీయులకు 14:3-12, 1 కోరింథీయులకు 14:19; 1 కోరింథీయులకు 10:33 1 కోరింథీయులకు 11:1). విశ్వాసుల్లో ఏకీభావాన్ని పెంపొందించడానికే గానీ వారిని చీల్చడానికి కాదు దేవుడీ సామర్థ్యాలను ఇచ్చేది (1 కోరింథీయులకు 12:25). విశ్వాసుల్లో పని చేసే దేవుని ప్రేమ ఈ సామర్థ్యాల్లో ఏ ఒక్క దానికన్నా, అన్నిటికన్నా గొప్పది (1 కోరింథీయులకు 13:1-13). విశ్వాసులు ఆధ్యాత్మిక సామర్థ్యాలను ఆశించాలి (1 కోరింథీయులకు 12:31; 1 కోరింథీయులకు 14:1). దేవుని మూలంగా పలకడం అన్నిటికన్నా గొప్ప సామర్థ్యం (1 కోరింథీయులకు 14:1). ఎవరికైనా ఉన్న ఒక సామర్థ్యాన్ని బట్టి తాను ఇతరులకన్నా గొప్పవాణ్ణని అతడు అనుకోకూడదు (1 కోరింథీయులకు 4:7; 1 కోరింథీయులకు 13:4; 1 కోరింథీయులకు 12:21, 1 కోరింథీయులకు 12:25). ఈ సామర్థ్యాలను ఉపయోగించడంలో విశ్వాసులు మర్యాదను, క్రమాన్ని పాటించాలి (1 కోరింథీయులకు 14:40). ప్రతి విశ్వాసీ ఈ సత్యాలను హృదయంలో నాటుకోనిస్తే ఆధ్యాత్మిక సామర్థ్యాల గురించి సంఘాలను పట్టి పీడిస్తున్న తగవులకు, చీలికలకు తావుండేది కాదు.

2. మీరు అన్యజనులై యున్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును.
హబక్కూకు 2:18-19

వారు క్రైస్తవులు కాకమునుపు గుడ్డిగా, ఆలోచనలేని విధంగా విగ్రహాల వెంటపడి పోయారు. తాము ఏమి చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో వారికే తెలియదు. వారు ఎదిరించని కొన్ని శక్తులు, ప్రభావాలు వారిపై పని చేస్తున్నాయి. “మూగ విగ్రహాల దగ్గరకు”– కీర్తనల గ్రంథము 115:4-7; హబక్కూకు 2:18-19.

3. ఇందుచేత దేవుని ఆత్మవలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరి శుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను.

“శాపగ్రస్థుడు”– యూదులు కొందరు ఇలా అన్నారు. యేసు దేవదూషకుడనీ ఆయనకు సిలువే తగిన శిక్ష అనీ అన్నారు. అలాంటివారిలో దేవుని ఆత్మ ఉండదని అంటున్నాడు పౌలు. యేసే ప్రభువు అనడం ఆయన యెహోవాదేవుని అవతారం అనడమే. లూకా 2:11; ఫిలిప్పీయులకు 2:10-11 చూడండి. దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో పని చేయకపోతే నిజ విశ్వాసంతో ఎవరూ ఇలా అనలేరు. అలా కాకుండా ఇతరులు అర్థం లేకుండా ఆ మాటలు పలకవచ్చు.

4. కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే.

దేవుని పనిలో విశ్వాసులకు ఉన్నదీ, చేయగలిగేది అంతటికీ మూలాధారాన్ని పౌలు ఇక్కడ నొక్కి చెప్తున్నాడు (ఎఫెసీయులకు 4:3-7 పోల్చి చూడండి). త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్నారు (త్రిత్వం గురించి మత్తయి 3:16-17 నోట్స్ చూడండి).

5. మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే.

6. నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే.

7. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడు చున్నది.

అద్భుతాలు చేయడం, దైవసంబంధంగా వేరే భాషల్లో మాట్లాడ్డం వంటివి మాత్రమే కాక ఏ ఆధ్యాత్మిక సామర్థ్యమైనా సరే ఒక వ్యక్తిలో ఉంటే దేవుని ఆత్మ ఆ వ్యక్తిలో పని చేస్తున్నాడనేందుకు అది రుజువు. విశ్వాసులందరి శ్రేయస్సే పౌలు అస్తమానం చెప్తున్న విషయం (1 కోరింథీయులకు 10:24, 1 కోరింథీయులకు 10:33; 1 కోరింథీయులకు 14:5, 1 కోరింథీయులకు 14:26; 2 కోరింథీయులకు 8:13-14; రోమీయులకు 14:19). “ప్రభావ ప్రత్యక్షత” అంటే విశ్వాసుల శరీరంలో ఉండే పవిత్రాత్మ (1 కోరింథీయులకు 6:19). ఆధ్యాత్మిక సమర్థతల ద్వారా తన సన్నిధిని వెల్లడి చేస్తాడని అర్థం.

8. ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును,

ఆధ్యాత్మిక సామర్థ్యాలన్నీ ఈ జాబితాలో లేవు వ 28; రోమీయులకు 12:6-8 లో పౌలు మరి కొన్నింటిని చెప్పాడు. గ్రీకులో జ్ఞానవాక్కు అనే అర్థాన్నిచ్చే పదం “లొగొస్”. ఇక్కడ ఇతరులతో మాట్లాడి మన సందేశం తెలియజెప్పగల ప్రత్యేక సామర్థ్యం అని ఈ మాటకు అర్థం. జ్ఞానం, తెలివి అనే మాటలను పౌలు వేరే చోట్ల ఉపయోగించిన తీరును బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. జ్ఞానమంటే మానవ జ్ఞానం కాదు – క్రీస్తు, ఆయన సిలువే ఈ జ్ఞానం (1 కోరింథీయులకు 1:17-24). శుభవార్తను, దానికి సంబంధించిన లోతైన సత్యాలను దేవుడు వెల్లడి చేసినదే ఈ జ్ఞానం (1 కోరింథీయులకు 2:6). దేవుని ఆత్మ కొందరికి ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఇతరులకు విప్పి చెప్పగల ప్రత్యేక సామర్థ్యాన్ని ఇస్తాడు (క్రీస్తు రాయబారులకు ఇది సంపూర్ణంగా ఉంది). “తెలివి” కూడా ఇలాంటిదే కానీ సరిగ్గా ఇదే కాదు. ప్రజలకు, పరిస్థితులను అర్థం చేసుకుని, సమయోచితమైన మాటలతో ఇతరులు క్రీస్తును గురించీ ఆయన సత్యం గురించీ మరెక్కువగా గ్రహించగలిగేలా చేసే సామర్థ్యం కూడా ఇందులో ఉండవచ్చు. అలాంటి సామర్థ్యం తప్పకుండా ఉంది గాని “తెలివైన మాట” అంటే ఇదో కాదో ఖచ్చితంగా చెప్పలేము.

9. మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరము లను

ఏ విశ్వాసి లోనైనా ఉండే నమ్మకం దేవుడు ఉచితంగా ఇచ్చినదే (ఎఫెసీయులకు 2:8-9; ఫిలిప్పీయులకు 1:29). కానీ పవిత్రాత్మ కొందరు విశ్వాసులకు ప్రత్యేకమైన లేక ఎక్కువ నమ్మకాన్ని ఇస్తాడు (రోమీయులకు 12:13 పోల్చి చూడండి). అందువల్ల అది లేని వారికి సాధ్యంకాని పద్ధతుల్లో దేవుణ్ణి సేవించడానికి అలాంటి వారికి సామర్థ్యం కలుగుతుంది. “రోగులను బాగు చేసే కృపావరాలు” అంటే దేవుని ప్రభావం ద్వారా వ్యాధులు పూర్తిగా నయం చేసే సామర్థ్యాలు. ఇక్కడ బహువచనాన్ని గమనించండి. ఒకే సామర్థ్యం కలిగి రకరకాల వ్యాధులను బాగు చేయడం సాధ్యం కాకపోవచ్చునేమో.

10. మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి.

“అద్భుతాలు చేసే సామర్థ్యం”– అంటే రోగుల్ని బాగుచేయడం గాక వేరే రకమైన అద్భుతాలు చేసే సామర్థ్యమై ఉండాలి. ఎందుకంటే అది “మరొకరికి” ఇవ్వబడింది. ఈ అద్భుతాలంటే ఏమిటో పౌలు వివరించలేదు. అయితే అవి విశ్వాసులందరి శ్రేయస్సు కోసమనీ ఆ సామర్థ్యం పొందిన వ్యక్తి కీర్తి పెరిగేందుకు కాదనీ ఖచ్చితంగా నమ్మవచ్చు (వ 7). దేవుని మూలంగా పలకడమంటే దేవునినుండి ఒక సందేశాన్ని పొంది పవిత్రాత్మ సహాయంతో దాన్ని మనుషులకు అందించడం. ఆ సందేశం భవిష్యత్తుకు సంబంధించినది కావచ్చు, కాకపోవచ్చు. “ఆత్మలను గుర్తించే సామర్థ్యం” అంటే మాట్లాడుతున్న ఒక వ్యక్తి దేవుని సహాయంతో అలా చేస్తున్నాడా లేదా అని గుర్తించగలగడం. దేవుని ప్రేరణ పొందినట్లు కనిపించే ప్రతి మనిషీ నిజంగా అలాంటివాడని అనుకోనవసరం లేదు. అతడు లేక ఆమె దురాత్మ ప్రేరణలో పలుకుతూ ఉండవచ్చు. లేక రేగిన తన ఆత్మ వల్లే పలుకుతూ ఉండవచ్చు. 1 కోరింథీయులకు 14:29; 1 యోహాను 4:1; 1 థెస్సలొనీకయులకు 5:20-21; యిర్మియా 14:14 చూడండి. “భాషలు”– ఇలా అనువదించిన గ్రీకు పదం “గ్లోస్సోయి”. గ్రీకు క్రొత్త ఒడంబడిక గ్రంథంలో ఇది 50 సార్లు కనిపిస్తున్నది (ఇక్కడ 1 కొరింతు 12–14 అధ్యాయాల్లో 21 సార్లు కనిపిస్తున్నది). 18 సార్లు ఇది “నాలుక” అని అర్థాన్ని ఇస్తున్నది. మిగతా చోట్ల ఏదో ఒక భాష అనే అర్థాన్ని ఇస్తున్నది. అపొ కా 2వ అధ్యాయంలో క్రీస్తు రాయబారులు భాషల్లో మాట్లాడిన సందర్భంలో వారు తమకు తెలియని ఇతర మానవ భాషల్లో మాట్లాడారు (వింటున్నవారికి ఎవరి భాష వారికి అర్థమైంది – అపో. కార్యములు 2:4, అపో. కార్యములు 2:6, అపో. కార్యములు 2:8, అపో. కార్యములు 2:11). పౌలు ఈ వచనంలో నానా భాషలు అనే మాటను వేరే అర్థంతో ఉపయోగిస్తున్నాడా? అవునని కొందరు, కాదని మరికొందరు అభిప్రాయపడ్డారు. బైబిలు ఆధారంగా ఎవరూ దీన్ని ఇలా గానీ అలా గానీ పూర్తిగా రుజువు చేయలేదు (14వ అధ్యాయంలో పౌలు రాసినదాన్లో కొన్ని అస్పష్టమైన వాక్యభాగాలు ఉన్నాయి. అయితే మిగతా అన్ని చోట్లా “భాషలు” అనే మాటను ఒక అర్థంతో ఉపయోగించి ఇక్కడ మాత్రమే పౌలు ఒకవేళ వేరే అర్థంలో వాడితే అది విపరీతం కాదా?). నానా భాషలు మాట్లాడే సామర్థ్యం అనడంలో పౌలు భావమేదైనా సరే ఇది విశ్వాసులందరికీ ఉండదని పౌలు ఇక్కడ స్పష్టం చేశాడు. రోగుల్ని బాగు చెయ్యడం, అద్భుతాలు చేయడం, తదితర సామర్థ్యాలు ఎలాగైతే విశ్వాసులందరికీ ఉండవో, అలానే ఇది కూడా ఉండదు. “మరొకరికి” అనే మాట దీన్ని సూచిస్తున్నది. వ 28 కూడా చూడండి. విశ్వాసి దేవుని ఆత్మతో నిండాడని అనుకునేందుకు ఈ సామర్థ్యం రుజువు కాదు. ఏ ఇతర ఆధ్యాత్మిక సామర్థ్యం కన్నా ఈ సామర్థ్యం ఉండడం ఒక క్రైస్తవునిలో ఆత్మ ప్రత్యక్షత ఎక్కువగా ఉందని అనుకునేందుకు సూచన కాదు ఏ మాత్రమూ కాదు. “భాష అర్థం చెప్పే సామర్థ్యం” అంటే ఇతర భాషల్లో చెప్పబడిన దాన్ని అర్థం చేసుకుని వినేవారికి అర్థమయ్యే మాటల్లో చెప్పగలగడానికి దేవుడిచ్చిన సామర్థ్యం.

11. అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.

వ 7. దేవుని ఆత్మకు ప్రతి వ్యక్తీ పూర్తిగా తెలుసు. ప్రతి ఒక్కరికీ ఏ సామర్థ్యం ఇవ్వాలో ఆయనకు తెలుసు. తన జ్ఞానయుక్తమైన ప్రేమపూర్వకమైన సంకల్పం ప్రకారం ఆయన ఈ సామర్థ్యాలను ఇస్తాడు, లేక ఇవ్వడు. మనం కోరిన సామర్థ్యాన్ని ఇవ్వాలని మనం ఆయన్ను బలవంతం చేయలేము. అలా ప్రయత్నించవచ్చు గాని అది సాధ్యం కాదు. ఆయన మనం కోరినది ఇచ్చాడని మనల్ని మనం నమ్మించుకోవచ్చు గానీ నిజంగా ఆ సామర్థ్యం మనకు కలిగిందని ఇది రుజువు కాదు. అన్నిట్లోకీ శ్రేష్ఠమైన సామర్థ్యాలను మనస్ఫూర్తిగా ఆశించాలి. అయితే ఆయన మనకు ఇవ్వాలని నిర్ణయించుకున్నదాన్ని మారుమాట్లాడకుండా తృప్తితో స్వీకరించాలి.

12. ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవ యవములన్నియు అనేకములైయున్నను ఒక్కశరీరమై యున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.

యోహాను 17:21-23; ఎఫెసీయులకు 1:22-23; ఎఫెసీయులకు 4:4; ఎఫెసీయులకు 5:28-30. వారు ఎవరైనా, ఎక్కడ ఉన్నా, ఏ ఆధ్యాత్మిక సామర్థ్యం ఉన్నా లేకపోయినా విశ్వాసులందరితో కలిసి ఏర్పడిన నిజ క్రైస్తవ సంఘం గురించి ఇక్కడ పౌలు రాస్తున్నాడు. వ 13లో “మనం” అంటే క్రీస్తువిశ్వాసులు, దేవుని ఆత్మమూలంగా జన్మించినవారు అని అర్థం (యోహాను 1:12-13; యోహాను 3:3-8).

13. ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతివిు.

“ఒకే ఆత్మలో...బాప్తిసం పొందాం”– పౌలు నీటి బాప్తిసం గురించి మాట్లాడ్డం లేదు. దానికంటే ఈ శ్రేష్ఠమైన బాప్తిసానికి నీటి బాప్తిసం ఒక గుర్తు మాత్రమే. మత్తయి 3:11; అపో. కార్యములు 1:5 చూడండి. ఇక్కడ “లో” అని అనువదించిన గ్రీకు పదాన్ని (“ఎన్”) “తో” లేక “వల్ల” లేక “ద్వారా” అని కూడా తర్జుమా చేయవచ్చు. ఈ ఆత్మ బాప్తిసం లేకుండా మనుషులు తమను తాము క్రైస్తవులమని పిలుచుకోవచ్చు, స్థానిక సంఘాల్లో సభ్యులుగా ఉండవచ్చు గానీ క్రీస్తు శరీరం అనే సంఘంలో వారు లేరు. మనుషులు చేసిన సంస్థ గురించి పౌలు మాట్లాడ్డం లేదు. దేవుని ఆత్మ జీవిస్తూ పని చేస్తూ ఉండే ఒక సజీవమైన శరీరం గురించి మాట్లాడుతున్నాడు. అందులోకి ప్రవేశించగల ఏకైక మార్గం దేవుని ఆత్మ మూలంగానే. విశ్వాసంచేత యేసుప్రభువును స్వీకరించిన ప్రతి ఒక్కరూ “నేను ఆత్మలో (తో, వల్ల, ద్వారా) బాప్తిసం పొందానని” చెప్పవచ్చు, చెప్పాలి. “ఆత్మలో పానం చేయడానికి”– యోహాను 7:37-39; యోహాను 4:10, యోహాను 4:13-14 చూడండి. దేవుని ఆత్మ విశ్వాసులను క్రీస్తు శరీరంలోకి తేవడమే కాదు, ఆయన వారిలోకి వచ్చి నివసిస్తాడు (1 కోరింథీయులకు 6:19). శాశ్వత జీవానికి ఊరుతూ ఉండే జీవ జలంగా ఆయన వారిలో ఉంటాడు.

14. శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.

కొరింతులో ఉన్నవారికి రెండు ఆధ్యాత్మిక పాఠాలు నేర్పేందుకు మానవ దేహం గురించిన ఈ ఉదాహరణను పౌలు ఉపయోగిస్తున్నాడు. ఈ రెండు పాఠాలనూ మనం కూడా నేర్చుకోవడం ఎంతైనా అవసరం. మొదటిది, మానవ శరీరంలో భిన్నమైన వివిధ భాగాలు ఉన్నట్టుగానే క్రీస్తు శరీరమైన సంఘంలో కూడా ఉన్నాయి (వ 14-20). అవయవాలన్నీ ఒకటి కాదు. అలా ఉండాలని దేవుడెప్పుడూ నియమించలేదు. పౌలు ఆధ్యాత్మిక సామర్థ్యాల గురించి మాట్లాడుతున్నాడని గుర్తు చేసుకోండి (వ 1). అందరికీ ఒకటే రకమైన సామర్థ్యం లేక సామర్థ్యాలు లేవని పౌలు చెప్పాడు (వ 7-11). శరీరాన్ని ఉదాహరణగా తీసుకుని ఈ సత్యాన్ని అతడు నొక్కి చెప్తున్నాడు. క్రీస్తు శరీరంలో కొందరు దేవుని మూలంగా పలకలేకపోతే వారు ఆ శరీరంలో భాగాలు కారా? అద్భుతాలు చేయలేకపోతే, నానా భాషల్లో మాట్లాడలేకపోతే వారు శరీరంలో భాగాలు కారా? కారని ఎవరూ అనుకోకూడదని పౌలు చెప్తున్నాడు. రెండోది, మానవ శరీరంలో ఎన్ని భాగాలున్నప్పటికీ శరీరం ఒక్కటే అయినట్టుగానే క్రీస్తు శరీరం కూడా ఒక్కటే. ప్రతి భాగమూ ఇతర భాగాలపై ఆధారపడి ఉంది (వ 21-26).

15. నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంతమాత్రమున శరీరములోనిది కాక పోలేదు.

16. మరియునేను కన్ను కాను గనుక శరీరము లోనిదానను కానని చెవి చెప్పినంత మాత్ర మున శరీరములోనిది కాకపోలేదు.

17. శరీరమంతయు కన్నయితే వినుట ఎక్కడ? అంతయు వినుటయైతే వాసన చూచుట ఎక్కడ?

18. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్తప్రకారము శరీరములో నుంచెను.

మానవ శరీరానికీ, క్రీస్తు శరీరమైన సంఘానికీ కూడా వర్తించే సత్యమిది. ప్రతి విశ్వాసీ దేవుడు అతణ్ణి లేక ఆమెను ఉంచిన చోట తృప్తితో ఉండాలి. అతణ్ణి లేక ఆమెను ఏ భాగంగా ఉండాలని ఆయన కోరాడో ఆ విధంగా ఉండేందుకు ఇష్టపడాలి. అతడు “కన్ను” అయితే కన్నులాగా పని చెయ్యాలి. “కాలు” అయితే కన్నుగా మారిపోవాలని అనుకోకుండా కాలులాగా పని చెయ్యాలి.

19. అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ?

20. అవయవములు అనేకములైనను శరీర మొక్కటే.

21. గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు; తల, పాదములతోమీరు నాకక్కరలేదని చెప్పజాలదు.

వివిధమైన ఆధ్యాత్మిక సామర్థ్యాలున్న విశ్వాసుల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. సంఘంలో సహవాసం నుంచి ఒక విశ్వాసిని దూరం చేసే ప్రయత్నం ఎవరూ చెయ్యకూడదు. ఎవరూ ఇతరులకంటే తనను హెచ్చించుకోకూడదు. ఇతరులు క్రీస్తు శరీరానికి అవసరం లేదన్న దురహంకారం, గర్వం ఎవరిలోనూ ఉండకూడదు.

22. అంతేకాదు, శరీరముయొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే.

23. శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములుకాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును.

24. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు.

“ఏమీ అనైక్యత...ఒకే విధంగా”– విశ్వాసులంతా తమ హృదయాలపై చెక్కుకోవలసిన మాటలు ఇవి (1 కోరింథీయులకు 1:10, 1 కోరింథీయులకు 1:13; యోహాను 13:34; అపో. కార్యములు 4:32; రోమీయులకు 12:10; రోమీయులకు 14:19; రోమీయులకు 15:1-3; ఎఫెసీయులకు 4:2-3). ఇందులో పతనం కావడం వల్ల కలిగే ఫలితాలు విచారకరంగా ఉంటాయి. ఈనాడు నిజంగా అంతటా ఇవి కనిపిస్తున్నాయి.

25. అయితే శరీరములో వివాదములేక, అవయవములు ఒకదాని నొకటి యేకముగా పరామర్శించులాగున, దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి, శరీరమును అమర్చియున్నాడు.

26. కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితోకూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితోకూడ సంతో షించును.

27. అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములై యున్నారు

పౌలు వ 14-26లోని ఉదాహరణను ఇక్కడ ఆధ్యాత్మిక సామర్థ్యాల విషయంలో ఉపయోగిస్తున్నాడు.

28. మరియదేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.

“దేవుడు...నియమించినవారు”– వ 11,18. దేవుడు చేసిన నియామకాల విషయంలో పోట్లాటలకు దిగవలసిన పని సంఘంలో ఎవరికీ లేదు. మరొకరి స్థానాన్ని తీసుకోవడానికి ఎవరూ ప్రయత్నించకూడదు. దేవుడు తనకు ఫలానా ఆధ్యాత్మిక సామర్థ్యం ఇవ్వాలని వాదించకూడదు. ఈ వచనంలో పౌలు “ముఖ్య స్థానంలో”, “తరువాత”, “తరువాత” అనే మాటల్ని ఉపయోగించడంలో వారికున్న ప్రాధాన్యతను బట్టి ఒకరి తరువాత ఒకరిని చెప్తున్నాడని సూచిస్తున్నది. క్రీస్తురాయబారులు తమ ఉపదేశాల్లో ఏ తప్పూ చేయనివారు, దేవుడు శుభవార్తను అప్పగించినవారు, సంఘానికి పునాది వేసినవారు. ప్రవక్తలు దేవప్రేరణ కలిగి సందేశాలను తెలియజెప్పేవారు (వ 10). “ఉపకారులు”– ప్రతి విశ్వాసీ ఇతరులకు ఉపకారం చేసేందుకు ప్రయత్నించాలి. కానీ కొందరికి అలా చేసే ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సామర్థ్యం ఉంటుంది – 1 కోరింథీయులకు 16:15.

29. అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా?

ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు “కారు” అని గమనించి అర్థం చేసుకోండి. దేవుడు తన ఇష్టం వచ్చిన రీతిలో తన ప్రజలకు ఆధ్యాత్మిక సామర్థ్యాలు ఇస్తాడు, ఇవ్వకపోతాడు. ఇస్తే తన ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాడు. ప్రతి విశ్వాసికీ వీటిలో ఏదో ఒక సామర్థ్యం ఉండాలని గానీ దేవుని మరే సామర్థ్యం గానీ వేరే ఆత్మ ప్రత్యక్షత గానీ ఉండాలని ఎవరైనా చెప్పడం పొరపాటే.

30. అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?

31. కృపావరములలో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను.

1 కోరింథీయులకు 14:1. ఒక విశ్వాసి ఆధ్యాత్మిక సామర్థ్యాలను ఎందుకు కోరాలి? తన తృప్తి కోసం కాదు, లేక ఇతరులు తనను స్వీకరించాలని, తనకు పేరు ప్రఖ్యాతులు కలగాలని కాదు. వ 7 నెరవేరాలనే అలా కోరాలి. ప్రతి విశ్వాసీ ఇతరుల క్షేమం గురించే ఆలోచిస్తుండాలి గాని తన క్షేమం గురించి కాదు (1 కోరింథీయులకు 10:24). అన్నిటి కంటే మేలురకమైన ఆధ్యాత్మిక సామర్థ్యాలేవి? ఇతరులకు ఎక్కువ మేలు చేసేందుకు మనకు సహాయపడేవి (1 కోరింథీయులకు 14:3, 1 కోరింథీయులకు 14:5, 1 కోరింథీయులకు 14:12). “దివ్య మార్గం”– మనకుండే ఏ ఆధ్యాత్మిక వరం కన్నా కూడా అత్యంత ప్రాముఖ్యమైన దాని గురించి పౌలు ఇప్పుడు మాట్లాడసాగుతున్నాడు – ప్రేమ, దేవుని ప్రేమవంటి ప్రేమ. అది అన్నిటికన్నా అతి శ్రేష్ఠమైన ఆధ్యాత్మిక కృపావరం. ఇది లేనిది ఏ ఇతర సామర్థ్యం వట్టిది.Shortcut Links
1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |