యోహాను ఇప్పుడు విశ్వాసులందరితోనూ మాట్లాడు తున్నాడు. చిన్నపిల్లలు, తండ్రులు, యువకులు అందరితో.
“లోకాన్ని”– 1 యోహాను 3:1, 1 యోహాను 3:13; 1 యోహాను 4:5; 1 యోహాను 5:19. ఈ లేఖలో లోకం అనేది మరో మూల పదం. 20 సార్లు కనిపిస్తున్నది. దేవునికి వేరుగా పాపులైన మనుషులు స్థాపించుకున్న వ్యవస్థ అని దీనికి అర్థం – మనిషి భ్రష్ట స్వభావంలోనుంచి వచ్చే సమాజం, లక్ష్యాలు, ఆలోచనా విధానం, మతాలు, పోకడలు మొదలైనవి. లోకం దేవుణ్ణి ఎరగదని దేవుని వాక్కు చెప్పినది (యోహాను 14:17; యోహాను 15:21). విశ్వాసులు ఏమిటో లోకానికి తెలియదు (1 యోహాను 3:1). అది క్రీస్తునూ, విశ్వాసులనూ ద్వేషిస్తుంది (1 యోహాను 3:13; యోహాను 15:18, యోహాను 15:24). అది సైతాను వశంలో ఉంది (1 యోహాను 5:19; ఎఫెసీయులకు 2:1-2). తనకు ప్రత్యేక ప్రజగా ఉండాలని దేవుడు విశ్వాసులను లోకంలోనుంచి ఎన్నుకున్నాడు (యోహాను 15:19; యోహాను 17:6, యోహాను 17:14, యోహాను 17:16). వారు లోకాన్ని ప్రేమించకుండా ఉండాలి అనేందుకు ఇవన్నీ తగిన కారణాలే.
“ఆ వ్యక్తిలో”– ఈ “లోకం” దేవునికి చెందినవాటికీ, ఆయన ఉద్దేశాలకూ ఎంత విరుద్ధమంటే దాన్ని ప్రేమించడం ఏకైక నిజ దేవునిపట్ల ఎంతమాత్రం ప్రేమ లేదన్న సంగతిని సూచిస్తూ ఉంది. అలాగైతే లోకంవెంట పరుగులెత్తుతూ, దాని తీరును అనుసరిస్తూ, లోక సంబంధమైన వాటికోసం అర్రులు చాస్తూ ఉండే క్రైస్తవుల సంగతి ఏమనాలి? వారు దేవుణ్ణి ఎరగరు, ప్రేమించరు.