ఈ వంశవృక్షాలు ఆదికాండం గ్రంథంలో ఉన్నవాటిపై ఆధారపడినవి – ఆదికాండము 5:1-32; ఆదికాండము 10:1-32; ఆదికాండము 11:1-32; ఆదికాండము 11:10-32; ఆదికాండము 25:1-26; ఆదికాండము 36:1-43. కయీను, హేబెల్లు ఇక్కడ లేరు. రచయిత షేతు సంతానాన్నే తీసుకున్నాడు. ఎందుకంటే ఇస్రాయేల్ జాతి ఆ వంశంలో నుంచే వచ్చింది.
బైబిల్లో నమోదు అయిన బహు విస్తృతమైన వంశవృక్షాలు 1–9 అధ్యాయాల్లో ఉన్నాయి. బైబిల్లోని వ్యక్తులు చరిత్రనుంచి విడదీయరాని భాగాలనీ, ఏదో పుక్కిటి పురాణాలు, ఇతిహాసాలకు గానీ కవుల కల్పనలకు గానీ చెందినవారు కారనీ ఇవి తెలియజేస్తున్నాయి. బబులోను చెరనుంచి తిరిగి వచ్చిన ప్రజలకు (1 దినవృత్తాంతములు 9:1-2) వారి పూర్వ చరిత్రతో ఉన్న బంధాన్ని కన్పరచాయి ఈ వంశవృక్షాలు. ఒక్క సారి చూడగానే భూమిమీద ఉన్న మొదటి మనిషినుంచి చెరవరకు తమ చరిత్ర సారాంశాన్ని వారు గ్రహించగలిగారు. దేవుని ఉద్దేశాలు తమ పట్ల కొనసాగుతున్నాయనీ, తాము ఆయన ఎన్నుకొన్న ప్రజలమనీ తెలుసుకోగలిగారు.