Hosea - హోషేయ 9 | View All

1. ఇశ్రాయేలూ, అన్యజనులు సంతోషించునట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు; నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి, నీ కళ్లములన్నిటిమీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపుకూలిని ఆశించితివి.

1. ఇశ్రాయేలూ, రాజ్యాలు సంబరం చేసుకున్నట్టు నీవు చేసుకోవద్దు. సంతోషంగా ఉండకు! నీవు ఒక వేశ్యలాగ ప్రవర్తించి, నీ దేవుణ్ణి విడిచిపెట్టేశావు. ప్రతి కళ్లం మీద నీవు నీ లైంగిక పాపం చేశావు.

2. కళ్ళములుగాని గానుగలు గాని వారికి ఆహారము నియ్యవు; క్రొత్త ద్రాక్షారసము లేకపోవును.

2. కానీ ఆ కళ్లములనుండి వచ్చే ధాన్యం, ఇశ్రాయేలీయులకు సరిపడినంత ఆహారం ఇవ్వదు. ఇశ్రాయేలుకు సరిపడినంత ద్రాక్షారసం ఉండదు.

3. ఎఫ్రాయిమీయులు ఐగుప్తు నకు మరలుదురు, అష్షూరు దేశములో వారు అపవిత్ర మైన వాటిని తిందురు, యెహోవా దేశములో వారు నివసింపకూడదు.

3. ఇశ్రాయేలీయులు యెహోవా దేశంలో నివసించరు. ఎఫ్రాయిము తిరిగి ఈజిప్టుకు వెళ్తుంది. వారు తినకూడని ఆహారం వారు అష్షూరులో తింటారు.

4. యెహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారర్పింపరు వారర్పించు బలులయందు ఆయన కిష్టములేదు, వారు ఆహారముగా పుచ్చుకొనునది ప్రలాపము చేయువారి ఆహారమువలెనగును, దాని భుజించు వారందరు అపవిత్రులగుదురు; తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికిరాదు.

4. ఇశ్రాయేలీయులు ద్రాక్షారసపు అర్పణలు యెహోవాకు అర్పించరు. వారు ఆయనకు జంతువుల బలులు అర్పించరు. వారి బలులు శవసంస్కారము వద్ద తినే భోజనము లాంటిది. ఎవరైతే దాన్ని తింటారో వారు అపరిశుద్ధులవుతారు. వారి రొట్టెలు యెహోవా ఆలయంలోనికి వెళ్లవు - అవి సరిగ్గా వారు బతికి ఉండేందుకు మాత్రమే సరిపోతాయి.

5. నియామక దినములలోను యెహోవా పండుగ దినముల లోను మీరేమి చేతురు?

5. వారు (ఇశ్రాయేలీయులు) యెహోవాకు పండుగలు, పవిత్ర దినాలు ఆచరించలేరు.

6. లయము సంభవించినందున జనులు వెళ్లి పోయి యున్నారు; ఐగుప్తుదేశము వారికి కూడు స్థలముగా ఉండును; నొపు పట్టణమువారికి శ్మశాన భూమిగా నుండును; వెండిమయమైన వారి ప్రియవస్తువు లను దురదగొండ్లు ఆవరించును; ముండ్లకంప వారి నివాస స్థలములో పెరుగును.

6. ఇశ్రాయేలీయులకు కలిగినదంతా శత్రువు తీసుకొన్నందువల్ల ఇశ్రాయేలు వదిలిపెట్టబడింది. కాని ఈజిప్టు ఆ ప్రజలను తీసుకొంటుంది. వారిని మెంఫెసు పట్టణం పాతిపెడ్తుంది. వారి వెండి ఐశ్వర్యాల మీద పిచ్చిమొక్కలు మొలుస్తాయి. ఇశ్రాయేలీయులు నివసించినచోట ముళ్లకంపలు పెరుగుతాయి.

7. శిక్షా దినములు వచ్చేయున్నవి; ప్రతికార దినములు వచ్చేయున్నవి; తాము చేసిన విస్తార మైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు, దురాత్మ ననుసరించిన వారు వెఱ్ఱివారనియు ఇశ్రాయేలువారు తెలిసికొందురు.
లూకా 21:22

7. “ఇశ్రాయేలూ, ఈ విషయాలు తెలుసుకో; శిక్షా సమయం వచ్చింది. నీవు చేసిన చెడుకార్యాలకు ప్రతిఫలం నీవు చెల్లించాల్సిన సమయం వచ్చింది” అని ప్రవక్త చెపుతున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు, “ప్రవక్త బుద్ధిలేనివాడు. దేవుని ఆత్మగల ఈ మనిషి వెర్రివాడు” అని అంటున్నారు. “మీ చెడు పాపాల విషయంలో మీరు శిక్షించబడతారు మీద్వేషం మూలంగా మీరు శిక్షించబడుతారు” అని ప్రవక్త చేపుతున్నాడు.

8. ఎఫ్రాయిము నా దేవునియొద్దనుండి వచ్చు దర్శనములను కనిపెట్టును; ప్రవక్తలు తమ చర్యయంతటిలోను వేటకాని వలవంటివారై యున్నారు; వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు.

8. దేవుడు మరియు ప్రవక్త ఎఫ్రాయిముకు కాపలా కాస్తున్న కావలివంటివారు. కానీ మార్గం పొడవునా ఎన్నో ఉచ్చులు ఉన్నాయి. మరియు ప్రజలు ప్రవక్తను అతని దేవుని మందిరంలో కూడ అసహ్యించు కొంటున్నారు.

9. గిబియాలో చెడుకార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గు లైరి; యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసికొను చున్నాడు, వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును.

9. [This verse may not be a part of this translation]

10. అరణ్యములో ద్రాక్షపండ్లు దొరికినట్లు ఇశ్రాయేలువారు నాకు దొరికిరి; చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టుమీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి; తాము మోహించినదానివలెనే వారు హేయులైరి.

10. నా మట్టు కైతే ఇశ్రాయేలు ఎడారిలో ద్రాక్షాపళ్లు చూచినట్టు ఉంది. కాలం మొదట్లో అంజూరపు చెట్లమీద మొదటి పండ్లవంటివారు మీ పూర్వీకులు. అయితే వారు బయల్పెయోరుకు వచ్చారు. వారు మారిపోయారు - వారు ఏదో కుళ్ళిపోయినదానిలా ఉండిరి. వారు తాము ప్రేమించిన దారుణ విషయాల్లాగే (అబద్ధపు దేవుళ్లు) వారూ తయారయ్యారు.

11. ఎఫ్రాయిముయొక్క కీర్తి పక్షివలె ఎగిరి పోవును; జననమైనను, గర్భముతో ఉండుటయైనను, గర్భము ధరించుటయైనను వారికుండదు.

11. ఒక పిట్టలాగ ఎఫ్రాయిము మహిమ ఎగిరి పోతుంది. ఇక గర్భములు దాల్చుట ఉండదు. పుట్టుకలు ఇక ఉండవు. పిల్లలు ఇక ఉండరు.

12. వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరును లేకుండ అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను; నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును.

12. కానీ ఒకవేళ ఇశ్రాయేలీయులు పిల్లలను పెంచినా, అది సహాయ పడదు. పిల్లలను వారి దగ్గర్నుండి నేను తీసివేస్తాను. నేను వారిని విడిచిపెట్టేస్తాను. వారికి కష్టాలు తప్ప మరేవి ఉండవు.

13. లోయలో స్థాపింపబడిన తూరువంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని; అయితే నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును.

13. ఎఫ్రాయిము తన పిల్లలను బోను లోనికి నడిపిస్తూ ఉండటం నేను చూడగలను. ఎఫ్రాయిము తన పిల్లలను హంతకుని దగ్గరకు తీసికొని వస్తాడు.

14. యెహోవా, వారికి ప్రతికారము చేయుము; వారికి నీవేమి ప్రతికారము చేయుదువు? వారి స్త్రీలను గొడ్రాండ్రు గాను ఎండు రొమ్ములు గల వారినిగాను చేయుము.

14. యెహోవా, నీ ఇష్టం వచ్చిన దాన్ని వారికి చేయుము. గర్భస్రావాలు అయ్యే గర్భం వారికి ఇమ్ము, పాలు ఇవ్వలేని స్తనాలు వారికి ఇమ్ము.

15. వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది; అచ్చటనే నేను వారికి విరోధినైతిని, వారి దుష్టక్రియలను బట్టి వారి నికను ప్రేమింపక నా మందిరములోనుండి వారిని వెలివేతును; వారి యధిపతులందరును తిరుగుబాటు చేయువారు.

15. వారి దుర్మార్గం అంతా గిల్గాలులో ఉంది. అక్కడే నేను వారిని అసహ్యించుకోవటం మొదలు బెట్టాను. వారు చేసే దుర్మార్గపు పనుల మూలంగా వారిని నా ఇంటినుండి నేను వెళ్ల గొట్టేస్తాను. ఇంకెంతమాత్రం నేను వారిని ప్రేమించను. వారి నాయకులు తిరుగుబాటు దారులు. వారు నాకు విరోధంగా తిరిగారు.

16. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలోనుండివచ్చు సొత్తును నేను నాశనము చేసెదను.

16. ఎఫ్రాయిము శిక్షించబడుతుంది. వారి వేరుచస్తుంది. వారికి ఇక పిల్లలు ఉండరు. వారు పిల్లల్ని కనవచ్చును. కానీ వారి శరీరాలనుండి పుట్టే ఆ ప్రశస్త శిశువులను నేను చంపేస్తాను.

17. వారు నా దేవుని మాటల నాలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు.

17. ఆ ప్రజలు నా దేవుని మాట వినలేదు. కనుక ఆయన వారిని నిరాకరించాడు. వారు ఇల్లులేని వారుగా, రాజ్యాలలో సంచారం చేస్తారు.Shortcut Links
హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |