Matthew - మత్తయి సువార్త 6 | View All

1. మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి; లేనియెడల పరలోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు.

దేవుని ప్రజలు చేసే న్యాయ క్రియలనూ లేక ధర్మకార్యాలనూ మనుషులు చూడవచ్చు. వారలా చూస్తే మంచిదే (మత్తయి 5:16). అయితే కేవలం ఇతరులు చూచి తమను పొగడాలని దేవుని ప్రజలు అలాంటి పనులు చేయకూడదు. దేవుడు చూచి మెచ్చుకుంటే చాలు. దేవుని రాజ్యంలో కపటం ఏమాత్రం ఉండకూడదు. మనుషుల ఎదుట గొప్పగా ప్రదర్శించు కోవడానికీ, పేరు సంపాదించుకోవడానికీ, పొగడ్తలు అందుకోవడానికీ మత కార్య క్రమాలను ఏమాత్రం ఉపయోగించుకోకూడదు. “ప్రతిఫలం”– మత్తయి 5:12 దగ్గర రిఫరెన్సులు చూడండి.

2. కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరముల లోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింప వద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

“ఉపకారక్రియలు చేసేటప్పుడు”– సామెతలు 22:9; అపో. కార్యములు 20:35; గలతియులకు 2:10; యాకోబు 2:15-16; 1 యోహాను 3:17-18. దానం చేయడం గురించి నోట్స్, రిఫరెన్సులు 2 కోరింథీయులకు 9:15 చూడండి. క్రీస్తు శిష్యులు తాము చేసే దానాలను నలుగురికీ తెలిసేలా చెయ్యకూడదు. ఒక చేతిలో దానం చేసేందుకు ఒక రూపాయి, మరో చేతిలో ఊదేందుకు బూర ఉంచుకోవడం వారికి తగదు. ఇది కపట భక్తుల విధానం. వ 5,16; మత్తయి 23:5. కపట భక్తులైతే మేలు చేయడం తన బాధ్యత, విశేష అవకాశం అని చేయకుండా వేరే కారణాల వల్ల చేస్తారు. ఇతరులకు వారి ధర్మ కార్యాలు కనిపించకుండా తెలియకుండా ఉండే పక్షంలో వారు అసలు చేయనే చేయరు. అలాంటివారు దేవునికి ఘనత తేవాలని చూడరు కాబట్టి దేవుడు వారిని ఘనపరచడు. యోహాను 5:44; యోహాను 12:26; 1 కోరింథీయులకు 4:5; 2 కోరింథీయులకు 10:18; గలతియులకు 1:10; 1 థెస్సలొనీకయులకు 2:4.

3. నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను.

అంటే అసలు ఎవరికీ చెప్పవద్దనీ, నీవు అందుకు గర్వపడి నిన్ను నీవు పొగడుకోకుండేలా నీకు సహా చెప్పవద్దనీ అర్థం. తాము చేసిన మంచి పనులను మనుషులు రాసి పెట్టుకోనక్కర్లేదు. ఆ పని దేవుడే చేస్తాడు. తన ఆధ్యాత్మిక రాజ్యంలో ఉన్నవారు స్వార్థాన్ని విడిచి, తమను తాము పరిత్యజించుకొని సాటి మనుషుల నిందలను, మెప్పులను లెక్కచెయ్యక, కేవలం దేవుని కోసమే బ్రతకాలని మరో సారి గట్టిగా హెచ్చరిస్తున్నాడు యేసుప్రభువు. కరుణ చూపే క్రియలు పొగడ్తల కోసం చేసేవి కారాదు.

4. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును

5. మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

ప్రార్థన కేవలం దేవునికి మాత్రమే వినిపించేదిగా ఉండాలి. ఆయన వింటే చాలు. కపట భక్తులకు దేవుణ్ణి గురించి లెక్కలేదు. మనుషుల ఎదుట గొప్పగా కనిపించాలనే వాళ్ళు కోరేది. వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుంటారు గానీ నిజంగా వారు ఆరాధించుకునేది తమనే. సభల్లో బహిరంగ ప్రార్థనలు మంచివే. అయితే దాన్లో ప్రమాదాలు ఉన్నాయి. వింటున్నవారిని మెప్పించడానికి ప్రయత్నించకుండా కేవలం దేవునితో మాత్రమే మాట్లాడ్డం అప్పుడప్పుడు కష్టతరం కావచ్చు. రహస్య ప్రార్థన గురించి యేసు అంతగా నొక్కి చెప్పడానికి ఇదొక కారణం కావచ్చు. రహస్య ప్రార్థన అయితే ఇతరులను మెప్పించాలన్న ప్రేరణ లేకుండా, వాస్తవమైనదిగా సూటిగా, యథార్థంగా ఉంటుంది.

6. నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును.
2 రాజులు 4:33, యెషయా 26:20

7. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు;

ప్రార్థన యాంత్రికంగా గానీ అజ్ఞానంగా గానీ చెయ్యకూడదు. ఒక పేరును పదే పదే వల్లించడం (1 రాజులు 18:26; అపో. కార్యములు 19:34), కొన్ని మాటలను మంత్రాల్లాగా వాటినే పలుకుతూ ఉండడం, లేక దేవుణ్ణి వినమని మాటలను పోగు చేయడం ఇలాంటివి దేవుని ముందు ఏమాత్రం పనికి రావు. మనకేది అవసరమో తెలుసుకోవడానికీ, దాన్ని మనకు దయ చేయడానికీ దేవునికి మన వాగుడుతో పనిలేదు. ఆయన్ను మనం మేల్కొల్పడం, ఆయన పరధ్యానంలో ఉన్నట్టు ఆయన్ను మన మాటల వైపు మళ్ళించుకోవడం ఇలాంటివి అవసరం లేదు (కీర్తనల గ్రంథము 34:15; కీర్తనల గ్రంథము 121:2-5; 2 దినవృత్తాంతములు 16:9). ఆయన చెవిటివాడేమో అన్నట్టు మనం కేకలు పెట్టనక్కర్లేదు, బిగ్గరగా మాట్లాడనవసరం లేదు. మనకేది మంచిదో ఆయనకు సూచనలు ఇవ్వనక్కర్లేదు. క్రీస్తు శిష్యులకు ఉన్న దేవుడు ఎన్ని ఎక్కువ మాటలు ఉపయోగిస్తే జవాబిచ్చేందుకు అంత సిద్ధపడే రకం కాదు.

8. మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును

కొందరు అంటారు “మనం దేవుణ్ణి అడక్కముందే మన అవసరాలు ఆయనకు తెలుసు గదా. అలాగైతే ఇక అడగడం దేనికి?” దీనికి జవాబు తేలికే. ఆయన అడగాలన్నాడు గనుక మనం అడగాలి (వ 9; మత్తయి 7:7; లూకా 18:1; యోహాను 16:24). దేవుని ప్రజలు ఆయనతో సహవాసం చేసేందుకూ, ఆయనలో ఆనందించేందుకూ, తమ అవసరాలను తీర్చుకునేందుకూ అనుసరించవలసిన విధానాల్లో ఇదొకటి. వారికి అనేక ఆధ్యాత్మిక పాఠాలు నేర్పేందుకు దేవుడు ఉపయోగించే మార్గాల్లో ఒకటి. అంతేగాక ప్రతి విషయంలోనూ తాము దేవునిపై ఆధారపడి ఉన్నామని, ఆ విషయాన్ని ఒప్పుకుంటూ ఉండాలనీ ఇది వారికి అస్తమానమూ గుర్తు చేస్తూ ఉంటుంది.

9. కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక,
యెహెఙ్కేలు 36:23

క్రీస్తు శిష్యులు ఎక్కువగా ఆశించవలసిన విషయాలు ఈ క్రింది ప్రార్థనలో ఉన్నాయి. ఎంత గొప్ప సత్యాలు ఎన్ని ముఖ్య విన్నపాలు సామాన్యమైన భాషలో, కొద్ది మాటల్లో పెట్టవచ్చునో గమనించండి. దేవుని ప్రజలు ప్రార్థన చేసే విషయాలన్నీ ఇక్కడ లేవు గానీ అన్ని వేళలా వారి మనస్సులో ఉండవలసినవి మాత్రం ఈ ప్రార్థనలో ఉన్నాయి. వారు ఎలా ప్రార్థించాలి, దేనికోసం ప్రార్థించాలి అన్న విషయాలను తెలిపే నమూనా, లేక ఉదాహరణ, లేక మాదిరి ప్రార్థన ఇది. ఇక్కడ చెప్పినవి గాక అనేక విషయాలు మనం ప్రార్థనలో అడగవచ్చు. అయితే ఈ ప్రార్థనలోని విషయాలను అడగవలసిన అవసరం ఇక లేదనీ మన ఆధ్యాత్మిక స్థితి దీన్ని మించిపోయిందనీ మాత్రం ఎన్నడూ భావించకూడదు. “తండ్రీ”– మత్తయి 5:16 నోట్. దేవుని ప్రజల ప్రార్థనలకు తామే గాక దేవుడే కేంద్రంగా ఉండాలి. అవి స్వార్థపూరితంగా ఉండకూడదు. మనం ప్రార్థించేటప్పుడు మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నామో ఆయన ఎలాంటివాడో ఆలోచిస్తూ ప్రార్థించాలి. “పరలోకంలో” అనే మాట మహనీయత, ఘనత, గొప్పతనం, సర్వాతీత స్థితులను సూచిస్తున్నది. “పేరు” అంటే దేవుని స్వభావం, గుణాలు అన్నమాట. ఆయన ఎవరో, ఏమై ఉన్నాడో దాన్ని తెలియజేస్తుంది. భూమిపై దేవునికి పేరుప్రతిష్ఠలు కలగాలన్నది యేసు శిష్యుల్లో ప్రతి వ్యక్తికీ మొదటి ఆశయమై ఉండాలి. ప్రార్థనలో మాత్రమే గాక జీవితంలో కూడా వ్యక్తిగత విన్నపాలకంటే ఈ ఉద్దేశమే ముందుండాలి. వారి ప్రార్థనలు, అభిలాషలు, చర్యలు, మాటలు అన్నీ ఇదే లక్ష్య సాధన కోసమే ఉండాలి. ఇందులో యేసు తానే ఆదర్శం (మత్తయి 5:16; యోహాను 8:29; యోహాను 17:4; 1 కోరింథీయులకు 10:31). దేవుని ప్రతిష్ఠ విషయం మనకు లెక్క లేదనేమో బహుశా మన ప్రార్థనల్లో అనేకాలకు జవాబు రాదు. “పవిత్రమై ఉంటుంది” అంటే ఇక్కడ పవిత్రంగా ఎంచబడాలని అర్థం. ఏకైక పరిపూర్ణ పవిత్రుడు దేవుడే. ప్రార్థన చేసేవారికి దీని విషయం శ్రద్ధ ఉండాలి. ఒకవేళ దేవుడు తన పేరును లోకంలో పవిత్రం చెయ్యాలనీ, ఏకైక నిజ దేవుని పవిత్ర స్వభావాన్ని మనుషులు గుర్తించగలిగే పరిస్థితిని ఆయన మనుషుల్లో కలిగించాలనీ ఈ ప్రార్థన ఉద్దేశమై ఉండవచ్చు. యెహెఙ్కేలు 36:23 పోల్చిచూడండి. దేవుని పవిత్రత గురించి నోట్ లేవీయకాండము 20:7; యెషయా 6:3; ప్రకటన గ్రంథం 15:4.

10. నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక,

“వస్తుంది”– ఇది కూడా వ్యక్తిగత అవసరాల గురించి గాక దేవుని విషయానికి సంబంధించిన మాట. అయితే దేవుని రాజ్యం ఇంతకు ముందే వచ్చి ఉంటే (మత్తయి 4:17), ఆయన శిష్యులు ఇప్పటికే అందులో ఉంటే దేవుని రాజ్యం రావాలని ప్రార్థన చెయ్యడం ఎందుకు? ఇప్పుడు ఆ రాజ్యం దాగి ఉన్న ఆధ్యాత్మిక రీతిలో, తన ప్రజల హృదయాల్లో మాత్రం వచ్చింది. ఇది ఆయన రాజ్యం లోకంలో వ్యాపించాలని, మరింత మంది దేవుని పరిపాలనకు తమ హృదయాల్లో లోబడాలనీ చేసిన ప్రార్థన కావచ్చు. లేక దేవుని రాజ్యం బహిరంగంగా లోకంలో ప్రత్యక్షం కావాలని చేసిన ప్రార్థన కావచ్చు (మత్తయి 16:27-28; మత్తయి 25:31; లూకా 21:31; లూకా 22:18, లూకా 22:29-30; అపో. కార్యములు 1:6; ప్రకటన గ్రంథం 11:15; ప్రకటన గ్రంథం 20:4-6). ఇదే దీని అర్థం అయితే ఇది యేసుప్రభువు రెండో రాకడ విషయం చేసే ప్రార్థన (ప్రకటన గ్రంథం 22:20). “నీ సంకల్పం...గాక”– పరలోకంలో దేవుని సంకల్పం పరిపూర్ణంగా, శీఘ్రంగా, హృదయ పూర్వకంగా, ఆనంద దాయకంగా, నమ్మకంగా, అస్తమానమూ నెరవేరుతూ ఉందని చెప్పడం నిజం కాదా? భూమి అంతటిపైనా, వ్యక్తులుగా మనలోనూ, మన కుటుంబాల్లోనూ, మన సంఘాల్లోనూ ఇలా నెరవేరుతూ ఉండాలని మనం ఆశించాలి. ఇంతకుముందు ఉన్న ప్రార్థన నెరవేరితేనే ఈ ప్రార్థన పూర్తిగా నెరవేరుతుంది. ఇప్పుడు లోకమంతటా దేవుని సంకల్పమేమిటో మనుషులకు తెలియదు. ఒకవేళ తెలిసినా అధిక సంఖ్యాకులు దాన్ని అడ్డుకుని, అవిధేయత చూపి తిరస్కరిస్తున్నారు. వ్యక్తిగతంగా ఈ ప్రార్థన చేసే మనం మన జీవితాల్లో దేవుని సంకల్పం తెలుసుకుని, ఆ ప్రకారం చెయ్యడమే మన విధిగా పెట్టుకోవాలి – కొలొస్సయులకు 1:9; కొలొస్సయులకు 4:12; హెబ్రీయులకు 13:20-21; 1 యోహాను 2:17; 1 యోహాను 5:14; ప్రకటన గ్రంథం 2:26.

11. మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.

దేవునికి చెందిన ఈ గొప్ప విషయాల గురించి ముందు ప్రార్థించిన తరువాత ఆయన శిష్యులు తమకు సంబంధించిన విషయాల గురించి ప్రార్థించవచ్చు. “ఆహారం” అంటే జీవితానికి కావలిసిన కనీస అవసరతలను సూచిస్తుంది. సంపదల కోసం గానీ అనేక దినాలకు చాలినన్ని అవసరతలను ముందుగానే ఇమ్మని గానీ ప్రార్థించాలని యేసు చెప్పలేదు (నిర్గమకాండము 16:19-20 పోలిచూడండి). తమ అనుదిన జీవితం దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఉందని గుర్తించి, తమ అవసరాలను తీర్చేందుకు నమ్మకంతో ఆయనవైపే చూడాలని యేసు శిష్యులు తెలుసుకోవాలి (వ 25-33). అలాగని శిష్యులు పని చేయడం మానేసి అన్నం కోసం దేవుణ్ణి అడుక్కోవాలని అర్థం కాదు. 2 థెస్సలొనీకయులకు 3:10; 1 తిమోతికి 5:8 చూడండి. వారు పని చెయ్యాలి గానీ వారి అవసరతలు తీరుతున్నది తమ పనివల్ల కాక దేవుని కృపవల్లే అని గుర్తించాలి.

12. మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.

లూకా 11:4 పోల్చి చూడండి. దేవునికి మనం రుణపడినది అంటే మన పాపాలన్నమాట. మనం ఆయనకు లోపం లేని ప్రేమను, లోపం లేని విధేయతను చెల్లించవలసి ఉంది. అలా చెల్లించకపోతున్నాం. పాపాలను ఒప్పుకోవడం అనేది లేకుండా యేసు మనకు నేర్పిన ప్రార్థన సంపూర్ణమైనది కాదు. ఆయన శిష్యులు చేయవలసిన ప్రార్థనకు ఇది నమూనా లేక మాదిరి అని గుర్తుంచుకోండి. దేవునికి ఇక ఏ రుణమూ చెల్లించనవసరం లేని స్థితికి, క్షమించమని అడగకుండా ఉండగలిగే స్థితికి తన శిష్యులు ఎవరైనా చేరుకుంటారని ఆయన ఆలోచించడం అసంభవం. మత్తయి 7:11; రోమీయులకు 7:18; గలతియులకు 5:16-17; యాకోబు 3:2; 1 యోహాను 1:8; 1 రాజులు 8:46 పోల్చి చూడండి. క్షమాపణ గురించి వ 14,15; మత్తయి 9:5-7; మత్తయి 12:31; మత్తయి 18:23-35, వాటి నోట్స్ కూడా చూడండి. మనల్ని బాధించిన వారిని మనం క్షమిస్తేనే మన క్షమాపణకోసం దేవుణ్ణి ప్రార్థించే హక్కు ఉంటుందని గమనించండి.

13. మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్మును తప్పించుము.

పాపం చెయ్యమని దేవుడు మనుషుల్ని ప్రేరేపించడు. అలా దుష్‌ప్రేరణ కలిగించేది సైతాను, మన స్వంత హృదయాలే (మత్తయి 4:1-3; 1 థెస్సలొనీకయులకు 3:5; యాకోబు 1:13-14). అయితే అలాంటి విషమ పరీక్షలు, దుష్‌ప్రేరేపణలు కలిగే సమయంలో మనల్ని క్షేమంగా ఉంచేందుకు మనం ఆధారపడవలసినది కేవలం దేవుని మీదే అని అర్థం చేసుకోవాలి (1 కోరింథీయులకు 10:13). కీర్తనల గ్రంథము 141:4 లో దావీదు ప్రార్థన చూడండి. ఇలాంటి ప్రార్థనలకు జవాబివ్వడం దేవునికి ఎంతో ఇష్టం కాదా. దేవుడు మనుషుల్ని పరీక్షిస్తాడు (ఆదికాండము 22:1; కీర్తనల గ్రంథము 66:10-12, వాటి నోట్స్ చూడండి). అయితే అది వేరే విషయం. మనం ఈ ప్రార్థన చేయడంలో ఆయనకు ఎప్పుడూ ఉన్న సంకల్పం ప్రకారమే చెయ్యమని ఆయన్ను అడుగుతున్నామన్నమాట. అయితే దుష్‌ప్రేరణలోకి వెళ్ళాలని రహస్యమైన కోరిక, ఆ ప్రేరణకు లొంగి పాపం చెయ్యాలని మనం ఆశిస్తూ ఉంటే ఈ ప్రార్థనకు జవాబివ్వడానికి దేవుడు బాధ్యుడు కాదు. సరైన మనస్సుతో మనం ఈ ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి దుష్‌ప్రేరేపణలకు గురి కావాలన్న కోరికను ఎదిరిస్తున్నాం, దేవుడు మనల్ని నడిపించే దారిలో పాపం చెయ్యాలన్న ప్రేరణ నుంచి ఆయన మనల్ని కాపాడాలని ప్రార్థిస్తున్నాం. భ్రష్ట స్వభావం ఉన్న బలహీనులైన మనలను దుష్‌ప్రేరణలకు గురి అయ్యేందుకు సైతాను చేతులకు అప్పగించవద్దని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. “దుర్మార్గత”– గ్రీకు భాషలో ఎలాంటి దుర్మార్గత, లేక దుర్మార్గతకు కర్త అయిన సైతాను అని ఈ పదానికి అర్థం. ఇంతకుముందు ప్రార్థనకు “రక్షించు” అంటున్న ఈ ప్రార్థన ఒకే నాణానికి రెండో వైపు వంటిది. క్రీస్తుకు చెందిన నమ్మకంగల ప్రార్థనాపరులైన శిష్యుల విషయంలో దేవుడు దీన్ని తప్పక చేస్తాడు. దేవుని సంకల్పం కానిదాని కోసం ప్రార్థించాలని యేసు మనకు నేర్పడు గదా. ఈ ప్రార్థనలో మనల్ని దుర్మార్గతనుంచి రక్షించగలిగేది దేవుడొక్కడే అని మనం ఒప్పుకోవాలని యేసు ఉద్దేశం. మన స్వంత శక్తి, జ్ఞానంవల్ల మనల్ని మనం రక్షించుకోలేము. యేసు యొక్క శిష్యులకు దేవునికి మధ్య ఉండవలసిన సంబంధాన్ని ఈ ప్రార్థనలో చూస్తున్నాం. అన్నిట్లో శిష్యులు ప్రాముఖ్యత ఇవ్వవలసినది దేవునికే, తమకు కాదు. బలప్రభావాలంతా, సామర్థ్యమంతా దేవునిదే, వారిది కాదు. ఘనపరచవలసినది ఆయననే, తమను కాదు. వారు చేయగలిగేది “ప్రసాదించు”, “క్షమించు”, “రక్షించు” అని అడగడం మాత్రమే. ప్రేమమూర్తి అయిన దేవునిపై మనం పూర్తిగా ఆధారపడి ఉన్నామని యేసు తేటతెల్లం చేస్తున్నాడు. ప్రార్థన గురించి ఇతర నోట్స్ మత్తయి 7:7-12; మార్కు 11:24; లూకా 11:1-3; లూకా 18:1-8; రోమీయులకు 8:26-27; ఎఫెసీయులకు 1:17; ఫిలిప్పీయులకు 4:6-7; కొలొస్సయులకు 1:9; 1 థెస్సలొనీకయులకు 5:18; హెబ్రీయులకు 11:6; యాకోబు 1:5-8; యాకోబు 5:16-18; 1 యోహాను 5:14-15; ఆదికాండము 18:32 చూడండి.

14. మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును

మత్తయి 18:21-25 పోల్చిచూడండి. దీని అర్థం ఇతరుల్ని క్షమించడం ద్వారా మనుషులు దేవుని క్షమాపణను సంపాదించుకోగలరని కాదు. దేవుని క్షమాపణ తన కృప చొప్పున ఆయన ఉచితంగా ఇచ్చినదే (మత్తయి 9:5-7 మొ।। చోట్ల నోట్స్ చూడండి). అయితే ఈ క్షమాపణ ఎవరు అందుకోగలరు? పశ్చాత్తాపపడినవారే (మత్తయి 3:2; మత్తయి 4:17; లూకా 24:47). మత్తయి 5:3-12 వర్ణించిన మనుషులను తయారు చేసే పవిత్రాత్మ ఎవరిలో పని చేస్తూ ఉన్నాడో వారే. పవిత్రాత్మ వారిలో పని చేస్తున్నాడనేందుకు వారు సిద్ధపడకపోతే అసలు వారు క్షమాపణ పొందలేదనీ, వారు దేవుని కృపను ఎరగరనీ బయట పెట్టుకుంటున్నారన్న మాట. వారు పవిత్రాత్మకు లోబడడం ద్వారా పశ్చాత్తాపపడి ఇతరులను క్షమించేవారుగా మారకపోతే వారికి క్షమాపణ పొందలేదనీ, వారు దేవుని కృపను ఎరగరనీ బయట పెట్టుకుంటున్నారన్న మాట. వారు పవిత్రాత్మకు లోబడడం ద్వారా పశ్చాత్తాపపడి ఇతరులను క్షమించేవారుగా మారకపోతే వారికి క్షమాపణ ఎన్నడూ ఉండదు. దేవుని రాజ్యంలో ఉన్నవారికి ఇతరుల్ని క్షమించడానికి నిరాకరించడం అనేది చాలా శోచనీయమైన విషయం. ఇలాంటి దోషం ఉన్నవారు ఇతరుల్ని క్షమించడం నేర్చుకునేంతవరకు దేవుని శిక్ష కింద ఉంటారు. వారి విషయం ఆయన ముఖం చిట్లించుకుంటూనే ఉంటాడు.

15. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.

16. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయు చున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖము లను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
యెషయా 58:5

తన ఆధ్యాత్మిక జీవనం కోసం, శరీరాన్ని అదుపులో ఉంచుకునేందుకు, దేవుణ్ణి వెతికేందుకు, స్వచ్ఛందంగా ఉపవాసం ఉండడం అని దీని అర్థం. కీర్తనల గ్రంథము 35:13; యెషయా 58:6-7; యోవేలు 1:14; యోవేలు 2:12 పోల్చిచూడండి. ఆధ్యాత్మిక జీవనానికి సహాయకరమైన సాధనాన్ని సరిగ్గా వాడకపోతే సహాయం చెయ్యడానికి అసలు ఆధ్యాత్మిక జీవనమే లేదని అది బయటపెట్టవచ్చు. మనుషుల మెప్పుకోసం ఉపవాసం ఉండడం విపరీతం, ఘోరం. “మీరు ఉపవాసం ఉన్నప్పుడు” అని యేసు అంటున్నాడు. ఉపవాసం మంచిదనీ, తగిన పని అనీ ఆయన భావించాడు. ఒకప్పుడు ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు (మత్తయి 4:1), తరువాత ఆయన శిష్యులు కూడా ఉపవాసం ఉంటారని చెప్పాడు (మత్తయి 9:14-15).

17. ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము.

ఏ రకం ఉపవాసానికైనా దేవుడు ఫలితం ఇవ్వడు గానీ సరైన ఉద్దేశంతో చేసినదానికే ఇస్తాడు. నిజమైన ఉపవాసం శిష్యునికి దేవునితో ఉన్న రహస్య సంబంధాలతో ముడిపడి ఉంటుంది. ఏం జరుగుతున్నదీ ఇతరులకు కనీసం ఊహించడానికైనా సాధ్యం కాకుండా ఉండాలి.

18. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.

19. భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.

“సంపద”– మనుషులు అపేక్షించి విలువైనదిగా ఎంచేదేదైనా, ధనం, సంపద లేక అలాంటివేవైనా అని యేసు భావం. ఇలాంటి వాటిపట్ల మనుషులకు ఉండవలసిన మనసు బైబిల్లో మరి కొన్ని చోట్ల కనిపిస్తున్నది. ఉదాహరణకు లూకా 12:16-21; 1 తిమోతికి 6:6-10, 1 తిమోతికి 6:17-19. “చిమ్మెటలు”, “తుప్పు”, “దొంగలు” ఇవన్నీ కూడా ఇహలోక సంపదలంతా గతించిపోయేవే అనేదాని గురించి తెలియజేసే మాటలు. మనకున్నవన్నీ ఈ రోజు ఉంటాయి, రేపు లేకుండా పోవచ్చు. అవి లేకుండా పోకపోయినా, మనం పోవచ్చు. అయితే ఎప్పుడూ నిలిచివుండే ధనం పరలోకంలో మనం కూడబెట్టుకునేదే. ఇక్కడ సంపదలు కూడబెట్టుకోకూడదని ప్రభువు తన శిష్యులను గట్టిగా ఆదేశిస్తున్న సంగతి గమనించండి. అందువల్ల అలా కూడబెట్టుకోవడం ఆయన ఆజ్ఞకు అవిధేయత చూపడమే (అంటే పాపం చేయడమే). అది తెలివితక్కువతనం కూడా అవుతుంది.

20. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పై నను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.

“పరలోకంలో...సంపద”– అంటే తన సేవకులకు దేవుడిచ్చే ప్రతిఫలం, బహుమతులు (మత్తయి 5:12). దేవునికి సేవ చెయ్యడం ద్వారా, మనుషులపట్ల దయ, కరుణ చూపడం ద్వారా మనం వీటిని కూడబెట్టుకోవచ్చు (మత్తయి 19:21; కీర్తనల గ్రంథము 112:9; సామెతలు 19:17; 1 కోరింథీయులకు 9:25; 2 కోరింథీయులకు 9:15; 2 తిమోతికి 4:8; హెబ్రీయులకు 6:10; 1 పేతురు 5:4). శాశ్వతమైన ఫలితాలను ఇచ్చే పనులను ఈ భూమిపై మనం చెయ్యగలం. ఈ క్షణికమైన బ్రతుకు కోసం గాక అనంత కాలం కోసం ఇక్కడ జీవించవచ్చు.

21. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.

ఈ లోకాన్ని, దాని సిరిసంపదలను ప్రేమించకుండా పరలోకంమీదే మన హృదయాలను నిలుపుకోవాలని యేసుప్రభువు కోరుతున్నాడు. కొలొస్సయులకు 3:1-2; 1 యోహాను 2:15-17 పోల్చిచూడండి. రెండు రకాలైన సంపదలున్నాయి – ఈ లోకంలోని నశించిపోయేవి, లేదా పరలోకంలోని శాశ్వతమైనవి. బుద్ధి ఉన్న మనిషి దేనికోసం శ్రమిస్తాడు?

22. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును.

ఇది శరీర సంబంధం, ఆత్మ సంబంధం అయిన విషయాలు రెంటిలోనూ వాస్తవమే. అయితే యేసుప్రభువు ఇక్కడ ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతున్నాడు. అంశం ఇంతకు ముందుదే – సంపదలు, ఒకదానిపై కన్ను వేయడం అంటే దాన్ని కోరడం అని అర్థం. మంచి ఆత్మ నేత్రాలు సంగతులను ఉన్నవి ఉన్నట్టుగా చూస్తాయి. దేవునికి మహిమ రావాలని, వెలుగు రాజ్యం సంగతులనూ, దేవుణ్ణి సేవించేవారికి ఆయన ఇచ్చే ప్రతిఫలాన్నీ కోరుతాయి. మంచివి కాని ఆత్మ నేత్రాలు సంగతులను ఉన్నవి ఉన్నట్టుగా చూడవు. ఈ కాలంతోపాటే సమసిపోయే వస్తువులనూ, పాపానికీ, స్వార్థానికీ చీకటికీ సంబంధించిన సంగతులనూ ఆశిస్తాయి. క్రీస్తు మహిమను, పాపవిముక్తిలోని విలువను అవి చూడవు (2 కోరింథీయులకు 4:4). మన హృదయ నేత్రాలు ఏ దిశగా చూస్తాయో ఆ దిశ, మనం దేవుని వెలుగుతో నిండి ఉంటామా లేక పాపాంధకారంతో నిండి ఉంటామా అనేదాన్ని నిర్ణయిస్తుంది. కనుదృష్టి రెండు విధాలు – ఈ లోక విషయాలపై చూపు, రెండోది పరలోక విషయాలపై చూపు. 2 కోరింథీయులకు 4:18; హెబ్రీయులకు 11:26-27 పోల్చి చూడండి. మన చూపును ఎక్కడ ఉంచుకుంటామో దాని విషయంలో దేవుడు మనల్ని బాధ్యులుగా ఎంచుతాడు (లూకా 11:35).

23. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియై యుండిన యెడల ఆ చీకటి యెంతో గొప్పది.

24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును; లేదా యొకని పక్ష ముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.

వ 19-23 లోని అంశమే ఇది కూడా. “సిరి” అంటే మొత్తంమీద ఈ లోక విషయాలను సూచిస్తూ వాడిన మాట. ఈ లోకం సిరిసంపదలు దయ లేని యజమానిగా, మనుషుల చేత ఊడిగం చేయించుకునే నియంతగా ఉండగలవు. మనుషుల్ని అబద్ధాలు ఆడేందుకు, మోసం, దొంగతనం చేసేందుకూ, తమ ఆత్మలను నరక బాధలకు గురి చేసుకునేందుకూ బలవంతం చేస్తాయి. ఇద్దరు యజమానులు మాత్రం ఉన్నారు – ఒకటి దేవుడు, రెండోది ఈ లోకం సిరిసంపదల సహాయంతో మనుషుల్ని బానిసలుగా చేసుకునే సైతాను. మత్తయి 4:8-9 లో క్రీస్తును నాశనం చేసేందుకు సైతాను చేసిన ప్రయత్నం చూడండి. తాను క్రైస్తవుణ్ణనుకునే వాడైనా, మరే వ్యక్తి అయినా ధనాన్ని గానీ ఏవిధమైన లోక సంబంధమైన సిరిసంపదలను గానీ సేవిస్తూ, దేవుణ్ణి సేవిస్తున్నానని చెప్తే అతడు మోసపోయినవాడు. లేదా, అబద్ధికుడు. దేవుణ్ణి సేవించడం అనేది మిగతా వాటన్నిటినీ సేవించడానికి పూర్తిగా, శాశ్వతంగా వ్యతిరేకమైనది (మత్తయి 4:10).

25. అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి;

ఈ వచనాలు కూడా వ 19లో మొదలు పెట్టిన అంశానికీ సంబంధించినవే. దేవుడంటే నమ్మకం లేనివారు ఈ భూమిపై ధనం పోగు చేసుకోవడానికి ఒక కారణం ఏమిటంటే వారికి భద్రత కావాలి, దేవుడు వారిని కాపాడతాడన్న నమ్మకం వారికి లేదు. యేసు శిష్యులు అలా ఉండకూడదు. వారి జీవితం ఆందోళన లేనిదై ఉండాలి (ఫిలిప్పీయులకు 4:6-7). తమ కుటుంబ పోషణకు వారు ఆలోచించి, పని చేసి తమ చేతనైనదంతా చెయ్యవలసిందే (ఆదికాండము 3:19; 2 థెస్సలొనీకయులకు 3:10; 1 తిమోతికి 5:8). అయితే దేవునిలో వారి నమ్మకం ఎంత దృఢంగా ఉండాలంటే ఆహారం, మంచి నీరు, బట్టలు మొదలైన జీవిత కనీస అవసరాల గురించి కూడా వారికి ఆందోళన ఉండకూడదు. అలా ఆందోళన గనుక ఉంటే వారి నమ్మకం స్వల్పమన్నమాట (వ 30). విశ్వాసులు అవిశ్వాసుల్లాగా, తమ అవసరాలు తీర్చే పరమ తండ్రి లేడన్నట్టుగా ప్రవర్తించకూడదు (వ 32). శిష్యులు తమ వంతును నిర్వర్తిస్తే దేవుడు తన వంతు నిర్వర్తిస్తాడు.

26. ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?

ప్రకృతి మనకు ఆధ్యాత్మిక పాఠాలను నేర్పగలదు. ఉదాహరణకు కీర్తనల గ్రంథము 19:1-4; సామెతలు 6:6; సామెతలు 30:24-28 చూడండి. పక్షుల పట్ల దయ చూపే దేవుడు తన సంతానాన్ని విస్మరించడు. అయితే పక్షులు సైతం కొమ్మమీద కూర్చుని దేవుడు వాటి నోళ్ళలో ఆహారం పడేస్తాడని ఎదురు చూడవు. అవి గూళ్ళు కట్టుకుని దేవుడిచ్చే ఆహారాన్ని సమకూర్చుకుంటాయి.

27. మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?

28. వస్త్రములను గూర్చి మీరు చింతింప నేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలో చించుడి. అవి కష్టపడవు, ఒడకవు

29. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు.
1 రాజులు 10:1, 2 దినవృత్తాంతములు 9:1

ఇస్రాయేల్ రాజులందరిలోకీ భాగ్యవంతుడు సొలొమోను. అందరికంటే ఎక్కువగా సుఖభోగాల్లో, ఘనతలో తేలియాడాడు (1 రాజులు 10:23; ప్రసంగి 2:7-9).

30. నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంక రించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయ ముగా వస్త్రములు ధరింపజేయును గదా.

“అల్ప విశ్వాసం”– మత్తయి 8:26; మత్తయి 14:31; మత్తయి 16:8; లూకా 17:5-6 కూడా చూడండి. అల్ప విశ్వాసం అంటే విశ్వాసం బొత్తిగా లేకపోవడం కాదు. కొందరికి పాపక్షమాపణ, శాశ్వత జీవం పొందగలిగే నమ్మకం ఉంటుంది గానీ తమ ఆందోళనలను, భయాలను జయించే నమ్మకం ఉండదు.

31. కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.

32. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.

తన ప్రజలు ఇతరులందరికీ భిన్నంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. వారు నమ్మకం గల, ఆనందం గల ప్రత్యేక ప్రజగా, ఆధ్యాత్మిక విషయాలను అనుసరిస్తూ ఉండేవారుగా ఉండాలని కోరుతున్నాడు.

33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.
కీర్తనల గ్రంథము 37:4

క్రీస్తు శిష్యులు ధనాన్ని, శరీర అవసరాలను, ఈ భూమిపై ఉన్న దేనినీ గాక దేవుణ్ణే తమ యజమానిగా ఎన్నుకున్నవారు. వారు ఆయన పైనా, ఆయన మహిమ పైనా తమ దృష్టి నిలుపుకోవాలి (వ 22-24). వారు సరైనవాటికే ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుని రాజ్యం, ఆయన నీతిన్యాయాల గురించే వారు ముఖ్యంగా పాటుపడుతూ ఉండాలి. తమ అవసరాల కంటే పైవాటిని గురించే ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. దేవుని రాజ్యం కోసం వెతకడం అంటే క్రీస్తు శిష్యులు అందులో ప్రవేశించాలని చూడడం కాదు. ఎందుకంటే వారు ఇప్పటికే అందులో ప్రవేశించారు. దేవుని రాజ్యానికి మేలు, మహిమ కలిగేలా చూడడం, దాని ప్రభావాన్నీ, తమలోను, ఇతరుల్లోను దేవుని పరిపాలననూ మరింతగా కోరి వెతకడం అని దీని అర్థం. రోమీయులకు 2:7 పోల్చి చూడండి. దేవుని నీతిన్యాయాల కోసం వెతకడం అంటే ఏమిటి? నిర్దోషులుగా తీర్చబడేందుకు ఆశించడం కాదు, ఎందుకంటే విశ్వాసులు ఇంతకు ముందే నిర్దోషులుగా తీర్చబడ్డారు (రోమీయులకు 5:1). దీని అర్థం దేవుడు న్యాయవంతుడై ఉన్నట్టుగానే వ్యక్తిగత జీవితంలో న్యాయంగా ప్రవర్తించడానికి చూడడం. ఆయన మాత్రమే మనలో కలిగించగలిగే సరైన జీవిత విధానం కలిగి ఉండాలని చూడడం (మత్తయి 5:6 నోట్ చూడండి). అన్నిటిలోనూ దేవునికే ప్రథమ స్థానం ఇచ్చినవారు, దేవుడే తమ గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడనీ తమ అవసరాలన్నీ తీరుస్తున్నాడనీ తెలుసుకుంటారు (ఫిలిప్పీయులకు 4:19).

34. రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.
నిర్గమకాండము 16:4

ఫిలిప్పీయులకు 4:6; 1 పేతురు 5:7; కీర్తనల గ్రంథము 23:1 పోల్చి చూడండి. విశ్వాసులు ఆందోళన చెందకూడదని చెప్పడానికి పై వచనాల్లో నాలుగు మంచి కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది యేసుప్రభువు మూడు సార్లు ఆందోళన పడకూడదన్నాడు (వ 25,31,34). రెండోది ఆందోళన వల్ల బొత్తిగా ఎలాంటి ఉపయోగమూ లేదు (వ 27). మూడోది ఆందోళన విశ్వాసులను అవిశ్వాసుల్లాగా ప్రవర్తించేలా చేస్తుంది (వ 32). నాలుగోది విశ్వాసులకు తమను పోషించి అవసరాలను తీర్చే పరమ తండ్రి ఉన్నాడు (వ 30,33). ఐదవ కారణాన్ని ఊహించవచ్చు. ఆందోళన చెందడం దేవుణ్ణి అగౌరవపరుస్తుంది. “నా పరమ తండ్రి నా గురించి శ్రద్ధ తీసుకునే సామర్థ్యం లేనివాడు, లేదా, ఆయనకు అది ఇష్టం లేదు” అని చెప్పడంతో ఇది సమానం. అవసరాలు వస్తాయి, కష్టాలు, బాధలు కలుగుతాయి అనేది దేవుడు కాదనడం లేదు. ఏ రోజుకా రోజు ఆయనలో నమ్మకంతో జీవించాలని మాత్రం చెప్తున్నాడు. యోహాను 14:1; ఫిలిప్పీయులకు 4:6-7 కూడా చూడండి.Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |