మొత్తం లోకం ఇప్పటికీ దేవుని ఎదుట దోషిగా తీర్చబడి శిక్షావిధికి గురై ఉంది (రోమీయులకు 1:18-20; రోమీయులకు 3:9, రోమీయులకు 3:19). క్రీస్తును నమ్మనివారు తమ ప్రవర్తన చెడ్డదని చెప్పే తీర్పు కోసం దేవుని మహా తీర్పుదినం వరకు ఎదురు చూడనవసరం లేదు. ఈ రెండు వచనాల్లో ఈ తీర్పు రాసి ఉన్నది. వారు ఎలాంటివారో, తీర్పుకూ శిక్షకూ ఎంత అర్హులో తమ క్రియల ద్వారానే బయట పెడుతున్నారు. క్రీస్తు అనే వ్యక్తి రూపంలో వెలుగు ఈ లోకంలోకి వచ్చింది. యోహాను 1:4-9; యోహాను 8:12 పోల్చి చూడండి. దేవుణ్ణి గురించి మనుషుల గురించి పాపవిముక్తి గురించి అద్భుతమైన సత్యాలను ఆయన లోకంలోకి తెచ్చాడు. కానీ మొత్తం మీద మనుషులు ఆయన్ను గానీ ఆయన తెచ్చిన సత్యాన్ని గానీ ఇష్టపడలేదు. వారికి వేరొకటి ప్రీతిపాత్రంగా ఉంది – చీకటి. చీకటి దాపరికానికీ కపటానికీ అజ్ఞానానికీ అసత్యానికీ దుర్మార్గతకూ సూచన. అలాంటి చీకటిని అంటే ఇష్టమున్నవారికి వెలుగు అంటే ఇష్ట ముండదు. వారు నరకానికి పాత్రులైన పాపులనీ, క్రీస్తు మాత్రమే వారిని దాని నుంచి తప్పించగలడనీ వారి స్థితిని ఉన్నదున్నట్టుగా ఆ వెలుగు బయటపెడుతుంది. అంతేగాక వారు చేయడానికి ఇష్టపడే చెడు కార్యాల్లో మునిగి తేలుతూ ఉండకుండా వెలుగు అడ్డుపడుతుంది. అందువల్ల వెలుగంటే వారికి ద్వేషం. అంటే వారు క్రీస్తునూ, ఆయన సత్యాన్నీ ద్వేషిస్తున్నారు (ఇది అతిశయోక్తి, అతివాదం కాదు. యేసు అనేకసార్లు చెప్పిన గంబీర సత్యమిది – యోహాను 7:7; యోహాను 15:18, యోహాను 15:23-25). దీన్ని బట్టి మనం గ్రహించవలసినది ఏమంటే, మనుషుల అపనమ్మకానికి కారణం అందుకు సరైన హేతువులు వారికి ఉండడం కాదు. లేక, వారి బుద్ధి ఎంతో ఎక్కువ గనుక నమ్మలేకపోతున్నారనీ కాదు. వారిలోని పాపం, చీకటి కారణంగానే వారు నమ్మరు. ఈ పొరపాటుకు మూలం వారి ఆలోచనల్లో లేదు గాని వారి ఆశల్లో, అంతరంగంలోనే. క్రీస్తులో నమ్మకం అనేది చీకటికి బదులు మంచితనాన్ని, పవిత్రతను, సత్యాన్ని నీతిని ఎన్నుకోవడమే. చాలామంది ఇలా ఎన్నుకునేందుకు ఇష్టపడరు. పవిత్రత కంటే పాపాన్నీ, క్రీస్తుకంటే స్వార్థాన్నీ వారు కోరుకుంటారు.