Acts - అపొ. కార్యములు 17 | View All

1. వారు అంఫిపొలి, అపొల్లోనియ పట్టణములమీదుగా వెళ్లి థెస్సలొనీకకు వచ్చిరి. అక్కడయూదుల సమాజ మందిరమొకటి యుండెను

“తెస్సలొనీక”– ఫిలిప్పీకి పశ్చిమాన దాదాపు 150 కిలోమీటర్ల దూరాన ఒక ముఖ్యమైన పట్టణం. “సమాజ కేంద్రం”– మత్తయి 24:23 నోట్.

2. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లిక్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట ఆవశ్యకమనియు,

3. నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, వారితో మూడువిశ్రాంతి దినములు తర్కించుచుండెను.

4. వారిలో కొందరును, భక్తిపరులగు గ్రీసుదేశస్థులలో చాలమందియు, ఘనతగల స్త్రీలలో అనేకులును ఒప్పుకొని పౌలుతోను సీలతోను కలిసికొనిరి.

5. అయితే యూదులు మత్సరపడి, పనిపాటులు లేక తిరుగుకొందరు దుష్టులను వెంటబెట్టు కొని గుంపుకూర్చి పట్టణమెల్ల అల్లరిచేయుచు, యాసోను ఇంటిమీదపడి వారిని జనుల సభయెదుటికి తీసికొని వచ్చుటకు యత్నముచేసిరి.

6. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయి భూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికి కూడ వచ్చి యున్నారు; యాసోను వీరిని చేర్చుకొనియున్నాడు.

అపో. కార్యములు 16:20-21; యోహాను 19:12-16. సత్యాన్ని ప్రకటించేవారిని ప్రజలు తరచుగా గందరగోళం, అల్లరులు, ఇక్కట్లు పట్టించేవారినిగా ఎంచుతారు. నిజానికి అలాంటివారు సమాధానం చేకూర్చేవారు. వారు దేవునికీ మనుషులకూ మధ్య సమాధానం ప్రకటించి కలిగిస్తారు (మత్తయి 5:9; మత్తయి 10:34-36; 2 కోరింథీయులకు 5:18-20). తనకు అన్నిటికంటే అవసరమైనదానిని లోకం వద్దంటుంది, దానిని ఇవ్వజూచేవారిని ద్వేషిస్తుంది.

7. వీరందరు యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి, కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనువారు అని కేకలువేసిరి.

8. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరచిరి.

9. వారు యాసోనునొద్దను మిగిలినవారియొద్దను జామీను తీసికొని వారిని విడుదల చేసిరి.

10. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి.

“బెరియ”– తెస్సలొనీకకు పశ్చిమాన దాదాపు 100 కిలోమీటర్ల దూరాన ఉన్న పట్టణం.

11. వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.

12. అందుచేత వారిలో అనేకులును, ఘనతగల గ్రీసుదేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలమందియు విశ్వసించిరి.

13. అయితే బెరయలోకూడ పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని థెస్సలొనీకలో ఉండు యూదులు తెలిసికొని అక్కడికిని వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి.

అపో. కార్యములు 14:19; మత్తయి 23:13. అసూయ, పక్షపాతం, దురభిమానం కారణంగా మనుషులు ఎంత చెడ్డ పనులు చేస్తారు,

14. వెంటనే సహోదరులు పౌలును సముద్రమువరకు వెళ్లుమని పంపిరి; అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి.

పౌలు ఆ గుంపుకు నాయకుడు, వారిలో ముఖ్య ప్రసంగికుడు గనుక ఎక్కువ అపాయంలో ఉన్నాడు. అతడు ఆ స్థలాన్ని విడిచివెళ్ళినది భయం వల్ల కాదు గాని అది జ్ఞానయుక్తమని తెలుసుకోవడం వల్లనే.

15. పౌలును సాగనంప వెళ్లినవారు అతనిని ఏథెన్సు పట్టణము వరకు తోడుకొని వచ్చి, సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతనియొద్దకు రావలెనని ఆజ్ఞపొంది బయలుదేరి పోయిరి.

“ఏథెన్సు”– తెస్సలోనికకు దక్షిణాన దాదాపు 300 కిలోమీటర్ల దూరాన ఉన్న నగరం. అది లోకంలోని అతి ప్రఖ్యాతిగల నగరాలలో ఒకటి. ప్రజాప్రభుత్వం అనే రాజకీయ వ్యవస్థ మొట్టమొదట ఏర్పడింది దానిలోనే. అది లలిత కళకూ, ప్రౌఢమైన భాషకూ, సాహిత్యానికీ, విజ్ఞాన, తత్వశాస్త్రాలకూ నివాసం. అది సొక్రటీసు, ప్లేటోల సొంత నగరం. అరిస్టాటిల్, ఎపికూరుస్, జీనో అక్కడ నివాసమేర్పరచుకొన్నారు. పౌలు రోజుల్లో రోమ్ దానిని ఏలుతూ ఉంది. దాని మహత్తు, వైభవాలు గతంలోనే అంతరించాయి. అయినా అది ఇంకా కళలకూ విద్యావ్యాసంగానికీ కేంద్రం.

16. పౌలు ఏథెన్సులో వారికొరకు కనిపెట్టుకొని యుండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను.

ప్రసిద్ధిగాంచిన ఏథెన్సులో పౌలు చూచినది ఒక పాపిష్ఠి జనం, తమను తాము అబద్ధ మతానికి అప్పగించుకొన్న ప్రజ. అతనికి పరితాపం, కంగారు, దుఃఖం, కోపం అధికంగా కలిగించినది అక్కడి విగ్రహాలు. ఎందుకంటే విగ్రహపూజ గురించి దేవుడు వెల్లడి చేసినది అతనికి తెలుసు. అతడు క్రీస్తునూ, దేవుని మహిమనూ, విగ్రహాలవల్ల బంధించబడిన ఆ ప్రజలనూ ప్రేమించాడు (నిర్గమకాండము 20:1-6; కీర్తనల గ్రంథము 115:2-8; యెషయా 40:18-26; యెషయా 44:6-11; 2 కోరింథీయులకు 5:13-14). మనుషులు కల్పించిన, ప్రకాశవంతంగా వైభవంగా అందంగా కనిపించే ఆ రూపాల వెనుక ఉన్న వాస్తవాన్ని పౌలు రోమీయులకు 1:18-25 లో బయట పెట్టాడు. ఏథెన్సులో అంత విద్య, బుద్ధి కుశలతతోబాటు అంత ఆధ్యాత్మిక అంధత్వం కలిసి ఉండడం చూచి అతడు చాలా కంగారు పడ్డాడు.

17. కాబట్టి సమాజమందిరములలో యూదులతోను, భక్తిపరులైన వారితోను ప్రతిదినమున సంతవీధిలో తన్ను కలిసికొను వారితోను తర్కించుచు వచ్చెను.

అతడు చూచినది అవకాశం కలిగినప్పుడెల్లా సత్యాన్ని ప్రకటించేలా బలవత్తరమైన కారణం అయింది. అపో. కార్యములు 4:20; యిర్మియా 20:9 పోల్చి చూడండి.

18. ఎపికూరీయులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసునుగూర్చియు పునురుత్థానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి.

ఎపికూరుస్ అనే తత్వ శాస్త్రజ్ఞుడు క్రీ.శ ముందు 341–270లో జీవించేవాడు. అతడు జీవితంలో ఉండవలసిన ముఖ్యమైన గమ్యం సుఖం లేక సంతోషం అని నొక్కి చెప్పేవాడు. అన్నిటికంటే ఉత్తమ సుఖం లేక సంతోషం శరీర సంబంధమైనది కాదు గాని మానసికమైనదే అని అతని ఉద్దేశం. అంటే బాధలు, మనోవేదనలు, నెమ్మది చెరిచే ఆశలు, మరణం గురించిన చింతలూ, భయాలూ లేని ప్రశాంతమైన జీవితమన్న మాట. అనేకమంది దేవతలూ దేవుళ్ళూ ఉన్నారు గాని మనుషుల జీవితాలంటే వారికి ఏమీ శ్రద్ధ లేదని అతడు నమ్మాడు. పౌలు రోజుల్లో ఎపికూరియన్ తత్వశాస్త్రాన్ని అనుసరించినవారు ఎపికూరుస్ బోధనను కొంతమట్టుకు తారుమారు చేసి శరీర సంబంధమైన సుఖభోగాల వెంట వెళ్ళేవారు, కామాన్ని స్తుతించేవారు. స్తోయిక్ తత్వశాస్త్రాన్ని స్థాపించినది జీనో (క్రీ.పూ. 340–265). మనుషులు ప్రకృతికి అనుగుణంగా బ్రతకాలనీ ప్రకృతిలో అన్నిటికంటే ఉత్తమమైనది బుద్ధి లేక ఏర్పాటు లేక క్రమం అనీ అతడు నేర్పేవాడు. విశ్వమే దైవమని నేర్పేవాడు. దైవం ప్రపంచానికి ప్రాణమని ఊహించేవాడు. మనిషి ఆలోచించగల సామర్థ్యాన్ని హేతుబుద్ధినీ నొక్కి చెపుతూ మనిషి తనకు తాను చాలినవాడని నేర్పేవాడు. ఈ ఇద్దరు తత్వజ్ఞుల అనుచరులు కొందరు పౌలును గర్వంతో, అపనమ్మకంతో, ఉపేక్షతో చూశారు. అతణ్ణి “వదరుబోతు” అన్నారు. తత్వశాస్త్రానికీ లేక వేదాంతానికీ, పౌలు బోధించినదానికీ ఎంత వ్యత్యాసం ఉందో వారికి తెలియదు. తత్వశాస్త్రం, వేదాంతం మనుషుల కల్పన. క్రీస్తు శుభవార్త దేవుడు ఇచ్చిన సత్యం. తత్వశాస్త్రం వాస్తవికత గురించి మనుషుల ఊహ. క్రీస్తు శుభవార్త వాస్తవికత గురించి దేవుడు వెల్లడించినది, దాని వెలుగులో మనుషులు చేయవలసినది. “పునర్జీవితాన్ని”– చనిపోయినవారు సజీవంగా లేస్తారనీ క్రీస్తు అంతకుముందు అలా లేచాడనీ పౌలు ప్రకటించాడు.

19. అంతట వారు అతని వెంటబెట్టుకొని అరేయొపగు అను సభ యొద్దకు తీసికొనిపోయినీవు చేయుచున్న యీ నూతన బోధ యెట్టిదో మేము తెలిసికొనవచ్చునా?

అరేయొపగస్ సభ ఏథెన్సులోని అన్ని సభలలోకీ ఉన్నతమైనది. మత విషయాలన్నిటిలో దానికి అధికారం ఉంది. ఆ నగరంలో పౌలు మాట్లాడకూడదని చెప్పడానికీ లేక అతనికి స్వేచ్ఛ ఇవ్వడానికీ ఆ సభకు అధికారం ఉంది.

20. కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలిసికొన గోరుచున్నామని చెప్పిరి.

21. ఏథెన్సువారందరును అక్కడ నివసించు పరదేశులును ఏదోయొక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపు చుండువారు.

వారిలో అధిక సంఖ్యాకులు వినగోరినది సత్యం కాదు గాని ఏవైనా కొత్త సంగతులు.

22. పౌలు అరేయొపగు మధ్య నిలిచిచెప్పిన దేమనగా ఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తిగలవారై యున్నట్టు నాకు కనబడు చున్నది.

వారి మతం అబద్ధమైనది అయినా వారి గురించిన ఈ మాట మాత్రం నిజం.

23. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీదతెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను.

రోమ్ సామ్రాజ్యంలో ఇతర స్థలాల్లో కూడా ప్రజలు ఇలాంటి దైవపీఠాలను నిలిపారు. తమకు మేలు గానీ కీడు గానీ ఒకవేళ చేయగల ఏ దేవుణ్ణీ ఏ దేవతనూ అలక్ష్యం చేయకూడదని వారి ఉద్దేశం. పౌలు “విపరీతమైన చిల్లర దేవుళ్ళను” ప్రకటిస్తున్నాడని తత్వజ్ఞులు అన్నారు (వ 18). పౌలు అంటున్నాడు “అలా కాదు. ఈ నగరంలో ఎవరి పీఠం ఉందో ఆ దేవుణ్ణి ప్రచారం చేస్తున్నాను”.

24. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.
1 రాజులు 8:27, 2 దినవృత్తాంతములు 6:18, కీర్తనల గ్రంథము 146:6, యెషయా 42:5

నిజ దేవుడు విశ్వాన్ని కలగజేసినవాడు గాని విశ్వం కాదు, విశ్వంలో కలిసిపోయిన దైవం కాదు, ప్రపంచానికి ప్రాణం కాదు అని పౌలు చెపుతున్నాడు. బైబిలులో నిజ దేవుడు తనను తాను వెల్లడి చేసుకొన్నాడనే సత్యంపై ఆధారపడి ఇలా చెపుతున్నాడు పౌలు (ఆదికాండము 1:1; నిర్గమకాండము 20:11; కీర్తనల గ్రంథము 8:3; కీర్తనల గ్రంథము 19:1; యెషయా 40:28; యెషయా 42:5; యెషయా 45:12, యెషయా 45:18). మనుషులు కట్టిన ఆలయాలలో నిజ దేవుడు నివాసముండడు (1 రాజులు 8:27; యెషయా 66:1-2).

25. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింప బడువాడు కాడు.
కీర్తనల గ్రంథము 50:12, యెషయా 42:5

నిజ దేవునికీ మనుషుల సంరక్షణలో ఉండవలసిన విగ్రహాలకూ గల వ్యత్యాసాన్ని తేటగా తెలియజేస్తున్నాడు. దేవునికి అక్కరలంటూ లేవు (కీర్తనల గ్రంథము 50:9-15). ఆయనే మనుషులకు ఉన్నవాటన్నిటినీ ఇస్తున్నాడు (అపో. కార్యములు 14:15-17; 1 తిమోతికి 6:17).

26. మరియు యావద్భూమిమీద కాపుర ముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందు రేమో యని,
ద్వితీయోపదేశకాండము 32:8

“ఒకే రక్తసంబంధం”– ఆదాము (ఆదికాండము 1:26-28). ఇంతకుముందే జాతులు ఎప్పుడు ఉన్నత స్థితికి రావాలో ఎప్పుడు దిగజారిపోవాలో, జనాలు నివసించవలసిన భూభాగాల సరిహద్దులనూ దేవుడు నిర్ణయించాడు. తనను కనుగొనే అవకాశాలు వాటికి ఎప్పుడు వస్తాయో అది కూడా ఆయన నిర్ణయించాడు.

27. తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.
యెషయా 55:6, యిర్మియా 23:23

లోక జాతులన్నిటి పట్ల దేవుని వ్యవహారాల్లో ఈ మంచి ఉద్దేశం ఉంది. మనుషులు చీకటిలో ఉండి దేవుని కోసం తడవులాడవలసి ఉన్నా దేవుణ్ణి వెదకుదామని ఇష్టమున్నవారికి ఆయన చాలినంత వెలుగు ఇచ్చాడు (యోహాను 1:9; రోమీయులకు 1:19-20; కీర్తనల గ్రంథము 19:1-4).

28. మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించు చున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలెమన మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు.

ఇక్కడ పౌలు గతంలో జీవించిన ఇద్దరు కవుల మాటలు ఎత్తి చెప్పాడు. పౌలు మాటలు విన్నవారికి ఈ కవుల రచనలు తెలిసివుండాలి. వారు రాసినదానంతటితో పౌలు ఏమాత్రం సమ్మతించి ఉండడు గాని అతని ప్రసంగం వింటున్నవారు ఇంకా కుతూహలంతో వినేలా ఆ కవుల రచనలలో నుంచి కొంత సత్యం తీసి చెప్పాడు. సత్యం ఎక్కడ కనిపించినా అది సత్యమే. దేవుడు ఏ వ్యక్తికీ దూరంగా లేడు. ఆయన మనల్నందరినీ ఆవరించి ఉన్నాడు. ఆయనను తెలుసుకొందామని తీర్థ యాత్రలు చేయనవసరం లేదు. విశ్వానికి సృష్టికర్తను తలపోస్తూ ఆయనను హృదయ పూర్వకంగా యథార్థంగా వెదికితే ఆయన దొరుకుతాడు. యిర్మియా 29:13-14.

29. కాబట్టి మనము దేవుని సంతానమైయుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి యున్నదని తలంపకూడదు.
ఆదికాండము 1:27, యెషయా 40:18-20, యెషయా 44:10-17

30. ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.

పౌలు విగ్రహాలను పూజించే కాలాలను “జ్ఞానం లేని” కాలాలన్నాడని గమనించండి. రోమీయులకు 1:21-23; యెషయా 44:9, యెషయా 44:18, యెషయా 44:20 చూడండి. ఏథెన్సులో కొన్ని దేవాలయాలు వాస్తుశాస్త్ర సంబంధంగా చాలా ఘనమైనవి, వైభవం గలవి. కొన్ని విగ్రహాల రూపాలు శిల్పశాస్త్ర సంబంధంగా అందమైనవి, గొప్పగా ఎంచబడినవి. కానీ పౌలుకూ ప్రభువుకూ అదంతా ఏథెన్సువారి అజ్ఞానాన్ని సూచించే రుజువు. వారి తత్వశాస్త్రమంతా ఎవరినీ నిజ దేవుణ్ణి గురించిన జ్ఞానంలోకి నడిపించలేక పోయింది గనుక అది జ్ఞానంగా కనిపించిన అజ్ఞానమే (1 కోరింథీయులకు 1:19-25 చూడండి). పౌలు ప్రసంగం వింటున్నవారికి ఇలాంటి మాటలు సంతోషాన్ని కలిగించి ఉండేవి కావు గాని మొదటినుంచి పౌలు పెట్టుకొన్న గమ్యం ఇప్పుడు చేరాడు – ఏథెన్సువారు పశ్చాత్తాపపడాలని అతని ఉద్దేశం. పశ్చాత్తాపం గురించి మత్తయి 3:2, మత్తయి 3:8; లూకా 13:1-5 నోట్స్ చూడండి. అందరూ పశ్చాత్తాపపడాలి – తత్వజ్ఞానులంతా, వేదాంతం ఎరిగిన వారంతా, మతస్థులంతా, విగ్రహపూజ చేసేవారంతా, విద్యా వంతులంతా, శాస్త్రజ్ఞులంతా, అధికారులంతా, సామాన్యులంతా, అంతటా ఉన్నవారంతా పశ్చాత్తాపపడాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే మనుషులంతా పాపులు (రోమీయులకు 3:23), అందరికీ పాపవిముక్తి అవసరం, ఆయన అందరికీ పాపవిముక్తి ప్రసాదించాలని కోరుతున్నాడు (యోహాను 3:16; 1 తిమోతికి 2:4-5; 2 పేతురు 3:9). పశ్చాత్తాపం లేకపోతే పాపవిముక్తి పొందడం అసాధ్యం.

31. ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.
కీర్తనల గ్రంథము 9:8, కీర్తనల గ్రంథము 72:2-4, కీర్తనల గ్రంథము 96:13, కీర్తనల గ్రంథము 98:9, యెషయా 2:4

32. మృతుల పునరుత్థానమునుగూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యముచేసిరి; మరికొందరుదీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి.

వేళాకోళం చేసినవారు తమ అజ్ఞానాన్నీ సత్యం పట్ల తమ నిర్లక్ష్యాన్నీ ప్రదర్శించారు అంతే.

33. ఆలాగుండగా పౌలు వారి మధ్యనుండి వెళ్లిపోయెను.

34. అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయొపగీతుడైన దియొనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితోకూడ మరికొందరునుండిరి.

కొన్ని స్థలాల్లో శుభవార్త అధికంగా ఫలించింది. ఏథెన్సులో కొద్దిగా మాత్రమే ఫలించింది. ఎందుకు? సత్యం ఏమిటో విచారించి తెలుసుకోవాలనే మనసు అక్కడివారిలో ఎక్కువమందికి లేదు. చాలామంది తమ బుద్ధి విషయంలో గర్వించేవారు. అయినా నగరంలో అత్యున్నత సభ సభ్యుల్లో ఒకణ్ణి పౌలు క్రీస్తుకోసం సంపాదించగలిగాడు.Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |