Timothy I - 1 తిమోతికి 1 | View All

1. మన రక్షకుడైన దేవునియొక్కయు మన నిరీక్షణయైన క్రీస్తుయేసుయొక్కయు ఆజ్ఞప్రకారము క్రీస్తుయేసు యొక్క అపొస్తలుడైన పౌలు,

“నిజ కుమారుడు”– ఆధ్యాత్మిక కుమారుడు. “తిమోతి”– అపో. కార్యములు 16:1. “రక్షకుడు”– పౌలు ఇక్కడ దేవుడు “మన రక్షకుడు” అంటున్నాడు. తీతుకు 2:13 లోనూ ఇంకా ఇతర చోట్లా యేసుక్రీస్తును “మన రక్షకుడు” అన్నాడు. విశ్వాసులకు ఇద్దరు రక్షకులు లేరు. కాబట్టి క్రీస్తే దేవుడు అని ఖచ్చితంగా అనుకోవచ్చు (ఫిలిప్పీయులకు 2:6; దాని నోట్ చూడండి). “ఆశాభావం”– అంతిమ పాప విముక్తి కోసం విశ్వాసి నిశ్చయతకు ఉన్న ఆధారం క్రీస్తులోనే ఉంది (కొలొస్సయులకు 1:27; రోమీయులకు 5:2). “రాయబారి”– రోమీయులకు 1:1; గలతియులకు 1:1.

2. విశ్వాసమునుబట్టి నా నిజ మైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక.

“మన ప్రభువైన”– లూకా 2:11; ఫిలిప్పీయులకు 2:10-11 నోట్స్ చూడండి. “కరుణ”– సాధారణంగా పౌలు “కృప, శాంతి” (రోమీయులకు 1:2; మొ।।) అని రాసేవాడు. కానీ తిమోతికి రాసిన రెండు లేఖల్లో “కరుణ”ను చేర్చాడు. తిమోతి తన సమయాన్ని అంతా క్రీస్తు సేవలో గడిపేవాడు. మరి ఇలాంటి వారికి ఇతర క్రైస్తవులకంటే ఎక్కువ కరుణ అవసరం కాదా? యాకోబు 3:1 చూడండి.

3. నేను మాసిదోనియకు వెళ్లుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనాకథలును మితము లేని వంశావళులును,

ఈ వచనాన్ని బట్టి చూస్తే ఎఫెసులో ఉన్న సంఘానికి తిమోతి ప్రముఖ నాయకుడు అనిపిస్తుంది. సంఘంలోని సమస్యల గురించి పౌలు తిమోతికి రాస్తున్నాడు. సంఘంలో తప్పుడు బోధలను అరికట్టే అధికారం తిమోతికి ఉంది. “తప్పుడు బోధలు” అంటే క్రీస్తు తన రాయబారులకు వెల్లడి చేసిన సత్యాలకు వ్యతిరేకమైనవి. దేవుడు వారికి ఇచ్చిన అధికారంతో రాయబారులు ఆ సత్యాలను ఉపదేశించారు కాబట్టి ఆ సత్యాలను నమ్మవలసిన బాధ్యత క్రైస్తవులందరికీ ఉంది (1 తిమోతికి 4:6; గలతియులకు 1:6-12; రోమీయులకు 6:17 తో సరిచూడండి). సంఘం కాపరులు, పెద్దలు సంఘాన్ని కనిపెడుతూ, పై విచారణకర్తలుగా ఉండడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు (అపో. కార్యములు 20:28-31). పై విచారణ చేస్తున్న వారి ఆధీనంలో ఉన్న క్రైస్తవులకు దేవుని సత్యాలకు వ్యతిరేకమైన బోధనలను నేర్పడానికి అనుమతి ఇవ్వకూడదు. అలా అనుమతిస్తే వారు విశ్వాసఘాతకులై సంఘానికి తీవ్రమైన కీడును కలిగిస్తున్నారన్నమాట. మొదటి శతాబ్దం క్రైస్తవులలాగా ఈనాటి క్రైస్తవులు కూడా “రాయబారుల ఉపదేశానికి” లోబడి ఉండాలి (అపో. కార్యములు 2:42). పౌలు తిమోతికీ తీతుకూ రాసిన 3 లేఖల్లో సరైన సిద్ధాంతాల గురించీ, ఉపదేశాల గురించీ ఎక్కువగా చెప్పాడు (11వ వచనం; 1 తిమోతికి 4:6, 1 తిమోతికి 4:13, 1 తిమోతికి 4:16; 1 తిమోతికి 5:17; 1 తిమోతికి 6:1, 1 తిమోతికి 6:3; 2 తిమోతికి 3:10, 2 తిమోతికి 3:16; 2 తిమోతికి 4:2-3; తీతుకు 1:9; తీతుకు 2:1, తీతుకు 2:7, తీతుకు 2:10).

4. విశ్వాససంబంధమైన దేవుని యేర్పా టుతో కాక వివాదములతోనే సంబంధము కలిగియున్నవి గనుక, వాటిని లక్ష్యపెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించు టకు నీవు ఎఫెసులో నిలిచియుండవలెనని నిన్ను హెచ్చ రించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను.

“కల్పిత కథలూ...వంశ వృక్షాలు”– బైబిలు కనబడని సంగతులు, వంశ వృక్షాల గురించి చెప్తున్నాడు పౌలు. బహుశా ఇవి యూదులకు చెందినవి. తీతుకు 1:14 పోల్చి చూడండి. ఇలాంటి ఉపదేశాలు భూమిమీద దేవుని పనికి ఏ విధమైన సహాయమూ చేయవు. దేవుని వాక్కైన పవిత్ర గ్రంథాన్ని నమ్మి దాన్ని ప్రకటించేవారి ద్వారానే, దాన్ని ఉపదేశించేవారి ద్వారానే దేవుని పని నెరవేరుతుంది.

5. ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే.

“శుద్ధ హృదయం”– మత్తయి 5:8; 1 పేతురు 1:22. “మంచి అంతర్వాణి”– వ 19; 1 తిమోతికి 3:9; అపో. కార్యములు 23:1; అపో. కార్యములు 24:16. 1 తిమోతికి 4:2 పోల్చి చూడండి. “నిష్కపట విశ్వాసం”– గలతియులకు 5:6; 1 కోరింథీయులకు 2:4-5. ఇది కపట భక్తులు చూపించే విశ్వాసానికి వ్యతిరేకమైనది. “ప్రేమ”– గ్రీకు భాషలో పౌలు ఉపయోగించిన పదం “ఆగాపే”. 1 కోరింథీయులకు 13:1 నోట్ చూడండి. ఇది దేవుడు తన ప్రజల మీద చూపే ప్రేమ, తన బిడ్డలకు ఇచ్చే ప్రేమ. క్రీస్తు విశ్వాసులను ప్రేమించిన విధంగా ప్రతి విశ్వాసీ ఇతరులను ప్రేమించాలి. ఇది కేవలం మానవ సంబంధమైన ప్రేమ కాదు. ఇందులో అపవిత్రతకు గానీ స్వార్థంతో కూడిన ఆశలకు గానీ సంబంధమేమీ లేదు. పౌలు ఈ వచనంలో మొదట చెప్పిన మూడు విషయాలు ప్రేమలో లేకపోతే అది ప్రేమ అనిపించుకోదు. ప్రేమ అనిపించుకోవడానికి దానికి అర్హత కూడా ఉండదు.

6. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, తాము చెప్పువాటినైనను,

ప్రజలు ఎలాంటి క్రైస్తవాన్ని అనుభవించాలని దేవుడు కోరుతాడో దానిని 5వ వచనం స్పష్టపరిచింది. కానీ నేటి బాధకరమైన సంగతేమిటంటే విశ్వాసులమని చెప్పుకునే చాలామంది క్రైస్తవులు కూడా ఇలాంటి ముఖ్యమైన విషయాలు విడిచిపెట్టి “వట్టి ముచ్చటలకు” దిగారు.

7. నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై యుండగోరి విష్‌ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి.

“ధర్మశాస్త్ర ఉపదేశకులు కావాలని”– వారు ప్రజలలో గౌరవం పొందాలనుకుంటారు. మత్తయి 23:5, మత్తయి 23:12; యాకోబు 3:1 పోల్చి చూడండి. ఆధ్యాత్మికంగా వారు అజ్ఞానులు గానీ వారు ప్రజలచేత తెలివిగలవారు అనిపించుకోవాలని కోరుతారు. తమకు చాలా కొద్దిగా తెలిసిన విషయాల గురించి కూడా కొంతమంది ఎంత నిశ్చయతతో ధైర్యంగా చెప్పుకుంటారు!

8. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్తప్రకారము,

ఇక్కడ “ధర్మశాస్త్రం” అంటే మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం (నిర్గమ 20 అధ్యాయం). ఈ ధర్మశాస్త్రం మంచిది గానీ రక్షణ మార్గం కాదు. పవిత్ర జీవితానికి ఇది మార్గం కాదు. దేవుడు దీనిని ప్రజల నోళ్ళు మూయించడానికీ (రోమీయులకు 3:19-20), అందరికీ క్రీస్తు రక్షకుడుగా, ముక్తిదాతగా అవసరమని తెలియజేయడానికీ (గలతియులకు 3:24-25) ఉపయోగిస్తాడు. దేవుడు ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని ఉపయోగిస్తాడో క్రీస్తు సేవకులు కూడా అలాగే ఉపయోగించడం నేర్చుకోవాలి. “మంచిది”– రోమీయులకు 7:12.

9. ధర్మశాస్త్రము ధర్మవిరోధులకును అవిధేయులకును భక్తి హీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూష కులకును పితృహంతకులకును మాతృహంతకులకును నర హంతకులకును వ్యభిచారులకును పురుషసంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును,

“న్యాయవంతులు”– దేవుని చిత్తానికి అనుగుణంగా బ్రతికే క్రీస్తు విశ్వాసుల గురించి రాస్తున్నాడు పౌలు. వారిని పాపాల గురించి ఒప్పించడానికీ వారిని అదుపులో ఉంచడానికీ ధర్మశాస్త్రంతో పనిలేదు. దేవుడు కోరిన విధంగా ధర్మశాస్త్ర నీతిన్యాయాలు వారిలో నెరవేరాలని వారు కోరుకుంటారు (రోమీయులకు 8:4). చెడ్డ మనుషుల సంగతి దీనికి పూర్తిగా వ్యతిరేకం.

10. హితబోధకు విరోధియైనవాడు మరి ఎవడైనను ఉండిన యెడల, అట్టివానికిని నియమింపబడెనుగాని,

11. నీతిమంతునికి నియమింపబడలేదని యెవడైనను ఎరిగి, ధర్మానుకూలముగా దానిని ఉపయోగించినయెడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదుము.

“దేవుని”– 1 తిమోతికి 6:15. దేవునిలో అపరిమితంగా ఆనందం, శాంతి, పవిత్రత ఉన్నాయి. ఇవి మనుషులు క్రీస్తులో అనుభవించాలని ఆయన ఉద్దేశం. “దివ్యుడైన దేవుని శుభవార్త”– 2 కోరింథీయులకు 4:4 తో పోల్చండి. శుభవార్త గురించి మార్కు 1:1; రోమీయులకు 1:16; 1 కోరింథీయులకు 15:1-8 నోట్స్ చూడండి. “సరైన సిద్ధాంతాలు”– వ 3. సరైన సిద్ధాంతాల గురించి పౌలు ఏమంటున్నాడో గమనించండి. సరైన ఉపదేశం క్రీస్తు శుభవార్తకు అనుగుణంగా ఉంటుంది. తప్పుడు బోధ దానికి వ్యతిరేకంగా ఉంటుంది. “నాకు”– 1 కోరింథీయులకు 9:17; గలతియులకు 2:7.

12. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు,

దివ్య శుభవార్త తన విషయంలో ఏ విధంగా పని చేసిందో వివరిస్తూ దేవుని ద్వారా వచ్చిన శుభవార్త కోసం దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మహిమ ఆరోపిస్తూ ఉన్నాడు పౌలు. శుభవార్త రక్షణ, పాపవిముక్తి కలిగించే దేవుని ప్రభావం అని తన స్వంత జీవితం ద్వారా తెలుసుకున్నాడు (రోమీయులకు 1:16). తనకు అనుభవం లేని సత్యాన్ని ప్రకటించడానికి పౌలు ప్రయత్నించలేదు (కొందరు చేస్తున్నట్టుగా). “నమ్మకమైనవాడుగా”– అంటే క్రీస్తు తన దూరదృష్టి ద్వారా పౌలు తనకు నమ్మకమైనవాడుగా ఉంటాడని గ్రహించి అతణ్ణి రాయబారిగా నియమించాడు. క్రీస్తు సేవలో ఉన్నవాళ్ళు నమ్మకంగా ఉండాలని పవిత్ర గ్రంథం మరీ మరీ నొక్కి చెపుతున్నది (మత్తయి 24:45; మత్తయి 25:21; లూకా 16:10-12; 1 కోరింథీయులకు 4:2). ప్రతి విధమైన అపనమ్మకం, అవిధేయత క్రీస్తుకు అపకీర్తిని కలిగిస్తుంది.

13. నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని.

“దేవదూషకుణ్ణి”– యేసు క్రీస్తు దేవుని కుమారుడనీ రక్షకుడనీ ఒప్పుకోకుండా తిరస్కరించాడు. ఇది దేవదూషణ. “కరుణ”– పౌలుకు, మానవ మాత్రులందరికీ కలగవలసినది ఇదే (లూకా 18:13; రోమీయులకు 3:9, రోమీయులకు 3:19; తీతుకు 3:3-5). దీన్ని దేవుడు సంతోషంగా ఇస్తాడు (రోమీయులకు 11:32; ఎఫెసీయులకు 2:4; మీకా 7:8). “తెలియక, అవిశ్వాసంలో”– అపో. కార్యములు 26:9; అపో. కార్యములు 23:1 చూడండి. క్రీస్తు ప్రజలను హింసించడం ద్వారా తాను మంచి పని చేస్తున్నానని అనుకున్నాడు పౌలు (యోహాను 16:2 తో పోల్చండి). దేవుడు తనకిచ్చిన వెలుగును బుద్ధిపూర్వకంగా తిరస్కరించలేదు. సత్యమని తాను అనుకొన్నదాన్ని నమ్మడానికి ఇష్టపూర్వకంగా నిరాకరించలేదు. కానీ మనుషులు తెలిసి మనస్ఫూర్తిగా క్రీస్తునూ ఆయన శుభవార్తనూ తిరస్కరిస్తే (చాలమంది చేస్తున్నారు గదా) వారికి కరుణ అందుబాటులో లేకుండా చాలా దూరమై పోవచ్చు (మత్తయి 12:23-24; హెబ్రీయులకు 2:2-3; హెబ్రీయులకు 6:4-8; హెబ్రీయులకు 10:26-31; హెబ్రీయులకు 12:25-29; సామెతలు 1:22-23 పోల్చి చూడండి).

14. మరియు మన ప్రభువుయొక్క కృపయు, క్రీస్తు యేసునందున్న విశ్వా సమును ప్రేమయు, అత్యధికముగా విస్తరించెను.

“కృప”– యోహాను 1:14, యోహాను 1:16; రోమీయులకు 1:7; 2 కోరింథీయులకు 8:9; మొ।।. “సమృద్ధిగా”– రోమీయులకు 5:20-21. విశ్వాసం, ప్రేమ క్రీస్తులో ఉన్నాయి. క్రీస్తు కృప మనుషులకు వీటిని ఇస్తుంది. క్రీస్తుతో మనం ఏకం అయినప్పుడే ఆయన శుభవార్తను నిజంగా పూర్తిగా నమ్మగలం, దేవుణ్ణి ప్రేమించగలం. ఇదంతా క్రీస్తు ఉచితంగా ఇచ్చినదే (ఫిలిప్పీయులకు 1:29; ఎఫెసీయులకు 2:8; గలతియులకు 5:22; రోమీయులకు 5:5).

15. పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను.

“పాపులను విముక్తిచేయడానికీ”– వారిని నశింప జేయడానికి కాదు – మత్తయి 1:21; మత్తయి 9:13; లూకా 19:10; యోహాను 6:51; రోమీయులకు 5:8. మనమందరమూ పాపులమే (రోమీయులకు 3:9, రోమీయులకు 3:19, రోమీయులకు 3:23). యేసు క్రీస్తు లోకానికి రాకుండా ఉంటే ఎవరికీ ఎప్పటికీ రక్షణ, పాపవిముక్తి అంటూ ఉండేది కాదు (అపో. కార్యములు 4:12). “ఈ మాట నమ్మతగినది”– 1 తిమోతికి 3:1; 1 తిమోతికి 4:9; 2 తిమోతికి 2:11; తీతుకు 3:8. “ప్రముఖ పాపిని”– ఎఫెసు 3:8. మానవ చరిత్ర అంతటిలోను బ్రతికిన గొప్పవాళ్ళులో, పవిత్రులలో పౌలు ఒకడు. అయితే ఇక్కడ తన గురించి తాను అనుకున్నది ఏమిటో తెలియజేస్తున్నాడు. “గతంలో ఒకప్పుడు నేను ప్రముఖ పాపిని” అనకుండా, ప్రస్తుత సంగతిగురించి మాట్లాడుతున్నట్టు “ప్రముఖ పాపిని” అంటున్నాడు. దీని అర్థం పౌలు పాపకూపంలో ఉంటూ అందరికంటే ఎక్కువ దోషాలు చేస్తున్నాడని కాదు. కానీ స్వభావసిద్ధంగా వచ్చిన భ్రష్ట స్వభావం తనలో ఇంకా ఉందని విశదపరుస్తున్నాడు (గలతియులకు 5:16-17; రోమీయులకు 7:18, రోమీయులకు 7:25). అతణ్ణి రక్షించి అంతం వరకు కాపాడగలిగేది దేవుని అపార కృప మాత్రమే అని అతనికి తెలుసు. మరి మన గురించి మనం ఏమనుకుంటున్నాం? ఈ ప్రశ్నకు మనం ఇచ్చే సమాధానం చాలా ముఖ్యమైన విషయం (లూకా 18:9-14 పోల్చి చూడండి).

16. అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింప బోవువారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధానపాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని.

ప్రముఖ పాపి అయిన పౌలును కరుణించి రక్షించడం ద్వారా క్రీస్తు ఎలాంటి పాపినైనా రక్షించగలడని నిరూపించు కున్నాడు. తాను క్రీస్తు కృపను పొందలేనంత పాపిని అని ఎవరూ అనుకోకూడదు. “ఓర్పు”– 2 పేతురు 3:9, 2 పేతురు 3:15. పాపులపట్ల, బలహీనులపట్ల, మూర్ఖులపట్ల దేవుడు తన ఓర్పునూ సహనాన్నీ చూపించకపోతే ఎవరికీ రక్షణ, పాపవిముక్తి కలిగేవి కావు. “శాశ్వత జీవం”– యోహాను 3:15-16. క్రీస్తు మీద విశ్వాసముంచితేనే ఈ శాశ్వత జీవం కలుగుతుంది (యోహాను 1:12-13; యోహాను 3:36). “ఆదర్శం”– దేవుడు మనుషులను ఎలా రక్షిస్తాడు అనేదానికి పౌలు మంచి ఉదాహరణ. ఇదంతా కేవలం దేవుని కృప, కరుణలకు ఎంతమాత్రం తగనివారిని దేవుడు కరుణించడం. మనకు రక్షణ, పాపవిముక్తి కలగాలంటే గొప్ప వెలుగును చూడనవసరం లేదు. పౌలుకు కలిగిన ప్రత్యేక అనుభవాలు కలగనవసరం లేదు. గానీ పౌలు పొందినట్టుగా కృప, కరుణ పొందడం అవసరమే.

17. సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృ శ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్‌.

“రాజు”– కీర్తనల గ్రంథము 10:16; కీర్తనల గ్రంథము 24:10; కీర్తనల గ్రంథము 45:1; కీర్తనల గ్రంథము 47:2; ప్రకటన గ్రంథం 19:16. “మృతి చెందని”– 1 తిమోతికి 6:16; రోమీయులకు 1:23. “అగోచరుడు”– యోహాను 1:18. “ఆయన ఒక్కడే”– ద్వితీయోపదేశకాండము 6:4; యెషయా 42:8; యెషయా 43:11; యెషయా 44:6, యెషయా 44:24; యెషయా 45:18; 1 కోరింథీయులకు 8:5-6. మనుషులను పాపాలనుంచి రక్షించే ఘనత, మహిమ అంతా ఏకైక నిజ దేవునికే ఉంటుంది. అదంతా ఆయనకే కలగాలని పౌలు కోరిక. ఎఫెసీయులకు 1:6, ఎఫెసీయులకు 1:12, ఎఫెసీయులకు 1:14; ఎఫెసీయులకు 2:19 పోల్చి చూడండి.

18. నా కుమారుడువైన తిమోతీ, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగినవాడవై, నిన్నుగూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటినిబట్టి యీ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను.

“దేవుని మూలంగా పలకడం”– రోమీయులకు 12:6; 1 కోరింథీయులకు 12:28; 1 కోరింథీయులకు 14:3. దేవుడు తిమోతిని తన సేవకోసం పిలిచినప్పుడు పౌలుచేత (లేక వేరొక ప్రవక్తచేత) ఆ పిలుపు గురించి మాట్లాడించాడు. అపో. కార్యములు 13:1-2 పోల్చి చూడండి. “మంచి పోరాటం సాగించు”– 1 తిమోతికి 6:12; 2 తిమోతికి 4:7; ఎఫెసీయులకు 6:11.

19. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, విశ్వాసవిషయమై ఓడ బద్దలై పోయినవారివలె చెడియున్నారు.

వ 5. విశ్వాసానికీ మంచి అంతర్వాణికీ ఉన్న సంబంధాన్ని గమనించండి. మంచి అంతర్వాణి కావాలంటే ఒకే ఒక మార్గం మన అంతర్వాణి వద్దు అన్నదానిని చేయకుండా ఉండడమే. “పగిలిన ఓడలయ్యారు”– ఇలాంటివారికి క్రీస్తులో విశ్వాసం ఎప్పుడైనా ఉందా? అది అసంభవం. నిజమైన విశ్వాసులు విశ్వాసం విషయంలో పగిలిన ఓడలు కావడం జరగదు – హెబ్రీయులకు 10:39; లూకా 22:31-32; యోహాను 10:27. కానీ తాము క్రైస్తవులమని చెప్పుకునేవారు విశ్వాస సంబంధమైన ఉపదేశాల విషయంలో, పగిలిన ఓడలై తప్పుడు బోధలకు లొంగిపోవచ్చు.

20. వారిలో హుమెనైయును అలెక్సంద్రును ఉన్నారు; వీరు దూషింపకుండ శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని.

కొందరు వ్యక్తుల బోధలనుంచి, క్రియలనుంచి సంఘాన్ని కాపాడడానికి వారి పేర్లను బయట పెట్టడానికి వెనుకాడలేదు పౌలు. 2 తిమోతికి 2:17. 1 తిమోతికి 4:14-15 కూడా చూడండి. “దేవదూషణ”– మత్తయి 9:3. “సైతానుకు అప్పగించాను”– 1 కోరింథీయులకు 5:4-5 పోల్చి చూడండి. సైతాను గురించి 1 దినవృత్తాంతములు 21:1; మత్తయి 4:1-10; యోహాను 8:44 నోట్స్ చూడండి.Shortcut Links
1 తిమోతికి - 1 Timothy : 1 | 2 | 3 | 4 | 5 | 6 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |