Kings I - 1 రాజులు 3 | View All

1. తరువాత సొలొమోను ఐగుప్తురాజైన ఫరో కుమార్తెను పెండ్లిచేసికొని అతనికి అల్లుడాయెను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టు ప్రాకార మును కట్టించుట ముగించిన తరువాత ఫరోకుమార్తెను దావీదు పురమునకు రప్పించెను.

1. సొలొమోను ఈజిప్టు రాజైన ఫరో కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అతనితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. సొలొమోను ఆమెను దావీదు నగరానికి తీసుకొనివచ్చాడు. ఆ సమయంలో సొలొమోను తన భవనాన్ని, దేవాలయాన్ని నిర్మింప చేస్తూనేవున్నాడు. సొలొమోను యెరూషలేము నగరం చుట్టూ ఒక గోడకూడా నిర్మిస్తున్నాడు.

2. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలములయందు మాత్రము బలులను అర్పించుచు వచ్చిరి.

2. దేవాలయం ఇంకా పూర్తి కాలేదు. అందువల్ల అప్పటి వరకు ప్రజలు తమ బలులను గుట్టలపై వున్న బలిపీఠాల వద్దనే అర్పిస్తూండేవారు.

3. తన తండ్రియైన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవాయందు ప్రేమయుంచెను గాని యున్నత స్థలములయందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచు నుండెను.

3. యెహోవాను ప్రేమించినట్లుగా సొలొమోను నిరూపించుకున్నాడు. తన తండ్రియగు దావీదు చెప్పిన విషయాలన్నీ నియమంగా పాటించాడు. కాని సొలొమోను ఒక్క విషయంలో మాత్రం తన తండ్రి చెప్పింది చేశాడు. అదేమనగా సొలొమోను గుట్టలపై బలులు అర్పించటం, ధూపం వేయటం, కొన సాగించటం.

4. గిబియోను ముఖ్యమైన ఉన్నతస్థలమై యుండెను గనుక బలుల నర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠముమీద వెయ్యి దహనబలులను అర్పించెను.

4. సొలొమోను రాజు బలులు అర్పించుటకు గిబియోనుకు వెళ్లాడు. అది బలి అర్పణచేసే ప్రదేశాలన్నిటిలో చాలా పేరు గాంచిన గుట్ట. సొలొమోను ఆ బలిపీఠం మీద ఒక వెయ్యి బలులు అర్పించాడు.

5. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొ మోనునకు ప్రత్యక్షమైనేను నీకు దేని నిచ్చుట నీకిష్టమోదాని నడుగుమని దేవుడు అతనితో సెలవియ్యగా

5. సొలొమోను గిబియోను వద్ద వున్నప్పుడు యెహోవా ఆయనకు స్వప్నంలో దర్శన మిచ్చాడు. “నీవేదైనా కోరుకో. నీ కోరిక నెరవేర్చుతాను”అని యెహోవా అన్నాడు.

6. సొలొమోను ఈలాగు మనవి చేసెనునీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్య మును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతనియెడల పరిపూర్ణ కటాక్షమగు పరచి, యీ దినముననున్నట్లుగా అతని సింహా సనముమీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతనియందుమహాకృపను చూపియున్నావు.

6. సొలొమోను ఇలా అన్నాడు:”నీ సేవకుడగు నా తండ్రి దావీదుకు నీవు మిక్కిలి దయ చూపావు. ఆయన నిన్ననుసరించాడు. ఆయన కూడా మంచివాడై, ధర్మంగా జీవించాడు. నీవాయన కుమారుని రాజ్యా సింహాసనానికి అర్హుణ్ణి చేసినప్పుడు, నీవు ఆయనకు అపూర్వమైన కరుణ చూపావు.

7. నా దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి యున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు;

7. నా ప్రభువైన దేవా! నా తండ్రి స్థానంలో రాజ్యపాలన చేసేలా నాకు అనుమతి ఇచ్చావు. కాని నేనింకా పనివానిలా వున్నాను. నేను నిర్వర్తించవలసిన పనులు నెరవేర్చటానికి తగిన వివేకం నాకు కొరతగా ఉంది.

8. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను; వారు విస్తరించియున్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాలదేశమును తనకీ చేయుటయు అసాధ్యము.

8. నీ సేవకుడనైన నేను నీచేత ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన ప్రజల మధ్య వున్నాను. వారి జనాభా పెద్దది. వారు లెక్క పెట్టలేనంత ఎక్కువగా వున్నారు. కావున పాలకుడైన వాడు వారి విషయంలో అనేకానేక నిర్ణయాలు తీసుకోవలసి వుంటుంది.

9. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయ చేయుము.

9. అందువల్ల ఈ ప్రజానీకంపై ధర్మపరిపాలన చేయగల న్యాయ నిర్ణయం చేయగల దక్షత, పరిజ్ఞానము నాకు దయచేయుమని నిన్ను వేడుకుంటున్నాను. ఈ జ్ఞానమువల్ల నేను మంచి చెడుల నిర్ణయం చేయగలుగుతాను. ఈ మహా పరిజ్ఞానములేకుండ, ఈ గొప్ప ప్రజానీకాన్ని పరిపాలించటం అసాధ్యమైన పని.”

10. సొలొమోను చేసిన యీ మనవి ప్రభువునకు అనుకూలమాయెను గనుక

10. సొలొమోను ఇది అడిగినందుకు యెహోవా చాలా సంతోషించాడు.

11. దేవుడు అతనికి ఈలాగు సెల విచ్చెనుదీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక, న్యాయములను గ్రహించు టకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి.

11. అతనితో దేవుడిలా అన్నాడు: “నీవు నీకు దీర్ఘాయుష్షు యిమ్మని అడుగలేదు. నీవు నీ కొరకై ధనదాన్యాదులిమ్మని అడుగలేదు. నీ శత్రునాశనం కూడ నీవు కోరుకోలేదు. మంచిచెడుల విచక్షణా జ్ఞానం, న్యాయనిర్ణయం చేయగల దక్షత నీవు అడిగావు.

12. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను; బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను; పూర్వికులలో నీవంటివాడు ఒకడును లేడు, ఇకమీదట నీవంటివాడొకడును ఉండడు.

12. కావున నీవడిగిన దానిని నీకు దయచేస్తాను. నీకు విజ్ఞానాన్ని, వివేకాన్ని ఇస్తాను. గతంలో నీవంటి వాడెవ్వడూ లేనట్లుగా నీకు జ్ఞానాన్ని కలుగజేస్తాను. భవిష్యత్తులో కూడ నీకు సాటి మరి ఎవ్వడూ వుండడు”

13. మరియు నీవు ఐశ్వర్య మును ఘనతను ఇమ్మని అడుగక పోయినను నేను వాటిని కూడ నీకిచ్చుచున్నాను; అందువలన నీ దినములన్నిటను రాజులలో నీవంటివాడొకడైనను నుండడు.

13. పైగా, నీకు పారితోషికంగా నీవు అడుగనవి కూడ నీకు ఇస్తున్నాను. నీ జీవితాంతం నీకు ధనధాన్యాలు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. నీయంతటి గొప్పవాడు ఈ ప్రపంచంలో మరో రాజు వుండడు.

14. మరియు నీ తండ్రియైన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన యెడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను అనెను.

14. నాకు విధేయుడవై వుండుమనీ, నా న్యాయమార్గాన్ని, నా ఆజ్ఞలను పాటించుమని నిన్ను నేనడుగుతున్నాను. నీ తండ్రి దావీదువలె నీవు కూడ నడుచుకో. నీవు ఆ విధంగా చేస్తే నీకు దీర్ఘాయుష్షు కూడ నేనిస్తాను.”

15. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలిసికొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధనగల మందసము ఎదుట నిలువబడి దహనబలులను సమాధానబలులను అర్పించి తన సేవకులందరికిని విందు చేయించెను.

15. సొలొమోను మేల్కొన్నాడు. దేవుడు అతనితో కలలో మాట్లాడినట్లు తెలుసుకొన్నాడు. సొలొమోను తరువాత యెరూషలేముకు వెళ్లి యెహోవా ఒడంబడిక పెట్టె ముందు నిల్చున్నాడు. సొలొమోను యెహోవాకు ఒక దహనబలి ఇచ్చాడు. అతనింకా సమాధాన బలులు కూడా దేవునికి చెల్లించాడు. తరువాత అతని పరిపాలనలో అతనికి చేదోడు వాదోడుగావున్న నాయకులకు, అధికారులందరికీ విందు ఇచ్చాడు.

16. తరువాత వేశ్యలైన యిద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి.

16. ఒక రోజు ఇద్దరు వేశ్యా స్త్రీలు సొలొమోను వద్దకు వచ్చారు. వారు రాజు ముందు నిలబడ్డారు.

17. వారిలో ఒకతె యిట్లు మనవి చేసెనునా యేలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీయును ఒక యింటిలో నివసించుచున్నాము; దానితో కూడ ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని.

17. ఆ ఇద్దరిలో ఒక స్త్రీ ఇలా అన్నది, “అయ్యా, ఈమె, నేను ఒకే ఇంట్లో నివసిస్తూ వుంటాము. మేమిద్దరం గర్భవతుల మైనాము. కాన్పు నెలలు వచ్చాయి. నేనొక బిడ్డను ప్రసవించాను. అప్పుడు ఈమె నా పక్కనేవుంది.

18. నేను కనిన మూడవ దినమున ఇదియు పిల్లను కనెను; మేమిద్దర మును కూడనున్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి యెవరును లేరు.

18. మూడు రోజుల తరువాత ఈమె కూడ ఒక బిడ్డను కన్నది. మా ఇద్దరితో పాటు ఇంటిలో మరెవ్వరూ లేరు. కేవలం మేమిద్దరమే వుంటున్నాము.

19. అయితే రాత్రియందు ఇది పడకలో తన పిల్లమీద పడగా అది చచ్చెను.

19. ఒక రోజు రాత్రి ఈ స్త్రీ తన బిడ్డతో నిద్రిస్తూండగా, ఆ బిడ్డ చనిపోయింది.

20. కాబట్టి మధ్య రాత్రి యిది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి, నా ప్రక్కలోనుండి నా బిడ్డను తీసికొని తన కౌగిటిలో పెట్టుకొని, చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను.

20. అప్పుడు ఆమె ఆ రాత్రి సమయంలో నేను నిద్రిస్తూండగా నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకొన్నది. నా బిడ్డను ఆమె తన పక్కలో వేసుకొన్నది. చనిపోయిన బిడ్డను నా పక్కమీద వుంచింది.

21. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ్య చూడగా అది చచ్చినదాయెను; తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలిసికొంటిని.

21. మరునాటి ఉదయం నేను లేచి నా బిడ్డకు పాలివ్వబోయాను. కాని బిడ్డ చనిపోయినట్లు గమనించాను. నేను బిడ్డకేసి తేరిపార చూడగా ఆ బిడ్డ నా బిడ్డ కాదని కనుగొన్నాను.”

22. అంతలో రెండవ స్త్రీ అది కాదు;బ్రదికియున్నది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమెకాదు, చచ్చినదే నీ బిడ్డ బ్రతికియున్నది నా బిడ్డ అనెను. ఈ ప్రకారముగా వారు రాజుసముఖమున మనవిచేయగా

22. కాని ఆ రెండవ స్త్రీ, “కాదు! బతికివున్న బిడ్డేనా బిడ్డ, చనిపోయిన బిడ్డే నీ బిడ్డ” అని అన్నది. అందుకు మొదటి స్త్రీ ఇలా అన్నది, “కాదు! నీవు పొరాపాటు పడుతున్నావు! చనిపోయిన బిడ్డే నీది. బతికివున్న బిడ్డ నాది!” ఇలా ఆ యిద్దరు స్త్రీలు రాజు ముందు వాదోపవాదాలు చేసుకొన్నారు.

23. రాజు బ్రదికియున్నది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని యొక తెయు, రెండవది ఆలాగు కాదు చచ్చినది నీ బిడ్డ బ్రదికియున్నది నా బిడ్డ అని చెప్పుచున్నది;

23. ఇదంతా విన్న సొలొమోను, “మీ ఇద్దరిలో ప్రతి ఒక్కరూ బతికివున్న బిడ్డ ‘నాదే’ అంటున్నారు. మీలో ప్రతి ఒక్కరు చనిపోయిన బిడ్డ ఎదుటి వ్యక్తిదని అంటున్నారు”అని అన్నాడు.

24. గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగా

24. అప్పుడు సొలొమోను రాజు తన సేవకుడిని పంపి ఒక కత్తి తెప్పించాడు.

25. రాజు రెండు భాగములుగా బ్రదికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరిసగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చెను.

25. సొలొమోను రాజు ఇలా అన్నాడు, “ఇప్పుడు మనం ఈ రకంగా చేద్దాం. బతికి వున్న బిడ్డను రెండు ముక్కలుగా నరికేద్దాం. ఆ ఇద్దరు స్త్రీలకు చెరియొక ముక్క ఇద్దాం!”

26. అంతట బ్రదికియున్న బిడ్డయొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై, రాజునొద్దనా యేలిన వాడా, బిడ్డను ఎంతమాత్రము చంపక దానికే యిప్పించుమని మనవిచేయగా, ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండ చెరిసగము చేయుమనెను.

26. ఇది విన్న ఆ రెండవ స్త్రీ, “ఈ పని చాలా బాగుంటుంది. బిడ్డను రెండు ముక్కలు చేయండి, అప్పుడు మా ఇద్దరిలో ఎవ్వరికీ ఆ బిడ్డ రాకుండా పోతుంది” అని అన్నది. కాని బిడ్డయొక్క నిజమైన తల్లియగు మొదటి స్త్రీ తన బిడ్డపట్ల నిండైన ప్రేమతో రాజుతో, “అయ్యా, దయచేసి బిడ్డను చంపవద్దు! బిడ్డను ఆమెకే ఇవ్వండి, “ అని అన్నది.

27. అందుకు రాజుబ్రదికియున్న బిడ్డను ఎంతమాత్రము చంపక మొదటిదాని కియ్యుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను.

27. సొలొమోను రాజు అప్పుడిలా అన్నాడు, “బిడ్డను చంపకండి! బిడ్డను మొదటి స్త్రీకి ఇవ్వండి, అసలైన తల్లి ఆమెయే!”

28. అంతట ఇశ్రాయేలీయులందరును రాజు తీర్చిన తీర్పునుగూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి.

28. ఇశ్రాయేలు ప్రజలు సొలొమోను రాజు తీర్పును విన్నారు. ఆయన చాలా తెలివైనవాడు కావున అతనిని ప్రజలు చాలా గౌరవించారు. న్యాయ నిర్ణయం చేయుటలో ఆయనకు దేవుడిచ్చిన వివేకం ఉన్నట్లు వారు గమనించారు.Shortcut Links
1 రాజులు - 1 Kings : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |