యోబుకు తన విపత్తులు, దుఃఖం, దేహబాధలు దేవుడే గురిపెట్టి అతని మీదికి వదిలిన విషపు బాణాలలాగా ఉన్నాయి. ఆ బాణాలు గాయపడిన అతని దేహానికి, కల్లోలమైన అతని మనస్సుకూ ఇంకా గుచ్చుకునే ఉన్నాయి. తాను దేవునితో సఖ్యంగా ఉంటున్నానని, దేవుడు తనను దయ చూస్తున్నాడనీ ఇప్పటివరకు అనుకున్నాడు యోబు. ఇప్పుడు హఠాత్తుగా అకారణంగా దేవుడు తనపై యుద్ధం జరిగించినట్టుగా ఉంది. ఇక్కడ గానీ మరెక్కడైనా గానీ యోబు, లేక అతని స్నేహితుల మాటల్లో ఈ ఇక్కట్లను యోబు మీదికి పంపినది సైతాను అన్న ఆలోచన చూచాయగానైనా కనిపించదు. వారి మాటల్లో దేవుడే యోబును శిక్షిస్తున్నాడని అతడూ, అతని మిత్రులూ నమ్మారు. ఉన్న తేడా ఒక్కటే. యోబు స్నేహితులేమో యోబు చేసిన కొన్ని పాపాల కారణంగా అతనికా విపత్తులు వచ్చాయని నమ్ముతున్నారు. యోబేమో సరైన కారణమేదీ లేకుండానే తాను శిక్ష అనుభవిస్తున్నానని నమ్ముతున్నాడు. మనుషులు అప్పుడప్పుడు తమకేదైనా విపత్తు వాటిల్లితే, దేవుడే తమకు విరోధి అయ్యాడని పొరపాటుగా భావించి తమ దుఃఖాన్ని ఎక్కువ చేసుకుంటారు. సైతాను వారికి వ్యతిరేకంగా చెలరేగినప్పుడు అది దేవుని కోపంగా భావిస్తారు. దేవుడు యోబును ఎంతగానో ప్రేమించాడు. అతణ్ణి అధికంగా దయ చూశాడు. అధికంగా దీవించబోతున్నాడు. అయితే ఇదంతా యోబుకు తెలియదు.