ఈ వచనాలు 31 వ కీర్తన ఆరంభ వచనాలను పోలి ఉన్నాయి. బైబిల్లోని దేవుడూ విశ్వాన్ని చేసినవాడూ అయిన యెహోవాపై రచయిత నమ్మకం ఉంచాడు. అతని విజయాలు అతనికి దక్కిన దీవెనలు అతని ఆశాభావం అన్నీ ఈ విషయంపైనే ఆధారపడి ఉన్నాయి. ఆయనపై నమ్మకం ఉంచుకొన్నవారి పక్షంగా దేవుని బలప్రభావాలు, నీతిన్యాయాలు పని చేస్తూ ఉంటాయి. దేవుడు తన పిల్లలకు తాను చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవడం న్యాయం. అందువల్ల ఆయన తప్పకుండా అలా చేస్తాడు.
ఈ కీర్తన రాసిన సమయం సందర్భం ఇదమిద్ధంగా మనకు తెలియదు. దీని రచయిత దావీదు అనుకొనేందుకు ఆస్కారం ఉంది. రచయిత వృద్ధాప్యంలో ఉన్నాడు (9,18 వ). విషమ పరీక్షలతో, అగచాట్లతో గడిచిన తన జీవితాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకొంటూ (వ 20) దేవుని విశ్వసనీయతనూ బలప్రభావాలనూ ముఖ్యంగా నీతిన్యాయాలనూ తలచుకుని స్తుతులర్పిస్తున్నాడు. దేవుని న్యాయం ప్రసక్తి ఇక్కడ 5 సార్లు కనిపిస్తున్నది – 2,15,16,19,24 వ. కాబట్టి ఇది ఈ కీర్తన ముఖ్యాంశాలలో ఒకటిగా మనం భావించవచ్చు.