Isaiah - యెషయా 43 | View All

1. అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.

ఇస్రాయేల్‌ప్రజలతో దేవునికున్న సంబంధాన్ని ఈ అధ్యాయం వివరిస్తున్నది. ఆయన వారి సృష్టికర్త (వ 1), వారి విమోచకుడు (వ 1,14), వారి రక్షకుడు (వ 3), రాజు (వ 15), సంరక్షకుడు (వ 2), వారిని ప్రేమించేవాడు (వ 4), వారికి వారి పూర్వ క్షేమస్థితిని మళ్ళీ కలిగించేవాడు (వ 5,6), క్షమించేవాడు (వ 25). ఇస్రాయేల్‌వారు తాము చేయవలసినది చేయలేదు (వ 22-24). అందువల్ల దేవుడు వారిని శిక్షించవలసి వచ్చింది (వ 28). అయితే దేవుడు తాను చెయ్యవలసినది చేస్తాడు (వ 25). దేవునితో ఈ సంబంధం విషయంలో ఇస్రాయేల్ వారి విధి ఏమిటంటే సాక్షులుగాను (వ 10,12), దేవుణ్ణి మహిమ పరచేవారుగాను (వ 21) ఉండాలి. ఇస్రాయేల్ దేవుణ్ణి తమ దేవుడుగా, రక్షకుడుగా నమ్మినవారికి ఈ అధ్యాయంలో మధురమైన సత్యం ఉంది. “సృజించిన”– ఒక ప్రత్యేకమైన ప్రయోజనం నిమిత్తం దేవుడు ఇస్రాయేల్ జాతిని ప్రత్యేకంగా సృష్టించాడు (వ 7, 21). “విడిపించాను”– కీర్తనల గ్రంథము 78:35 నోట్. “భయంతో ఉండబోకు”– యెషయా 41:10 నోట్.

2. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు

దేవుని ప్రజల విషయంలో ఇది కొన్నిసార్లు అక్షరాలా నిజమైంది (నిర్గమకాండము 14:21-22; యెహోషువ 3:14-17; దానియేలు 3:19-27). అయితే ఎక్కువ సార్లు ఆధ్యాత్మిక పరీక్షా సమయాల్లో, ఆధ్యాత్మికమైన ప్రమాదాలనుంచి తప్పించిన సందర్భాల్లో ఈ మాట నెరవేరింది (కీర్తనల గ్రంథము 66:10-12). దేవుడే గనుక మనతో ఉంటే ఏదీ మనకు హాని చెయ్యలేదు. సరిగా అర్థం చేసుకోలేక అలా హాని జరుగుతున్నదని మనము అనుకొంటాం.

3. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను నీప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి యున్నాను నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను.

ప్రేమ లోతుగా బలంగా ఉంటే ప్రేమించేవారికోసం ఏదైనా ఇచ్చేయ్యడానికి సిద్ధంగా ఉంటుంది. దేవుని ప్రేమ అలాంటిదే. ఈజిప్ట్‌నూ, తదితర దేశాలనూ ఇస్రాయేల్‌వారి కోసం ఇచ్చాడంటే ఇక్కడున్న భావమేమిటో స్పష్టంగా చెప్పలేదు. పారసీకులు ఇస్రాయేల్ పై చూపిన దయకు ప్రతిగా (ఎజ్రా 1:1-4) వారినీ ఈజిప్ట్ మొదలైన దేశాలను దేవుడు జయించనిచ్చాడనీ కొందరు వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు.

4. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించు చున్నాను.
ప్రకటన గ్రంథం 3:9

5. భయపడకుము, నేను నీకు తోడైయున్నాను తూర్పునుండి నీ సంతానమును తెప్పించెదను పడమటినుండి నిన్ను సమకూర్చి రప్పించెదను.
అపో. కార్యములు 18:9-10

“భయపడకు”– వ 1. శత్రువుల చేజిక్కడం, ప్రవాసం వెళ్ళిపోవడం ఖాయం (యెషయా 39:5-7). అయితే విడుదల, మరలి రావడం కూడా అంతే ఖాయం (యెషయా 11:11-12; యెషయా 27:12-13; యెషయా 49:22; యెషయా 56:8).

6. అప్పగింపుమని ఉత్తరదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను బిగబట్టవద్దని దక్షిణదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను దూరమునుండి నా కుమారులను భూదిగంతమునుండి నా కుమార్తెలను తెప్పించుము.
2 కోరింథీయులకు 6:18

7. నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే.

8. కన్నులుండి అంధులైనవారిని చెవులుండి బధిరులైన వారిని తీసికొని రండి

9. సర్వజనులారా, గుంపుకూడి రండి జనములు కూర్చబడవలెను వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగినవాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పుపొందునట్లు తమ సాక్షులను తేవలెను లేదా, విని సత్యమేయని యొప్పుకొనవలెను.

భూమి ఒక కోర్టు అయినట్టూ సత్యానికి విచారణ జరుగుతున్నట్టూ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యెషయా 41:1, యెషయా 41:21-23 పోల్చి చూడండి. వివాదంలో ఉన్న అంశం ఇది: భవిష్యత్తును గురించి ముందుగా తెలియజేయడం, సంభవాలను తన వశంలో ఉంచుకోవడం అనే రుజువులను చూపుతూ తానే నిజ దేవుణ్ణని నిరూపించినదెవరు? విగ్రహపూజ చేసే జాతులవారు వారి సాక్షులను తేవాలి (వ 9). దేవుని సాక్షులు ఆయన ప్రజలైన ఇస్రాయేల్‌వారు (వ 10,12). వారి మూలంగా తానే ఏకైక దేవుడు, తాను తప్ప వేరే దేవుడు లేడన్న సత్యం స్థాపించబడాలి. అలానే ఈ క్రొత్త ఒడంబడిక కాలంలో కూడా క్రీస్తు విశ్వాసులు ఆయనకు సాక్షులు (లూకా 24:48; అపో. కార్యములు 1:8; అపో. కార్యములు 2:32; అపో. కార్యములు 4:20; అపో. కార్యములు 5:32; అపో. కార్యములు 13:31).

10. మీరు తెలిసికొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు నుండడు.
యోహాను 13:19

యెషయా 44:6, యెషయా 44:8; యెషయా 45:5-6, యెషయా 45:18, యెషయా 45:21-22; యెషయా 46:9. ఇస్రాయేల్‌వారి దేవుడు యెహోవా ఏకైక నిజ దేవుడు కాబట్టి ఆయన్ను గాక ఇతర దేవుళ్ళను పూజించేవారు దేవుణ్ణి పూజించడం లేదన్నమాట (యెషయా 42:8). ఇతర దేవుళ్ళనుండి రక్షణ కలుగుతుందని ఎదురు చూచేవారికి మిగిలేది నిరాశే. ఎందుకంటే నిజమైన రక్షణ యెహోవాయే (అపో. కార్యములు 4:12 పోల్చి చూడండి).

11. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.

12. ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే; యే అన్యదేవతయు మీలో నుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు; ఇదే యెహోవా వాక్కు.

“మీ మధ్య”– ఇస్రాయేల్‌వారి అతి హేయమైన పాపం, నిజ దేవుని విషయంలో వారి సాక్ష్యాన్ని చెరిపివేసిన పాపం విగ్రహారాధనే (ద్వితీయోపదేశకాండము 32:15-17).

13. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలోనుండి విడిపించగలవాడెవడును లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు?
హెబ్రీయులకు 13:8

14. ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ నిమిత్తము నేను బబులోను పంపితిని నేను వారినందరిని పారిపోవునట్లు చేసెదను వారికి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీయులను పడవేసెదను.

“మీకోసం”– 3,4 వచనాల్లోని సత్యానికి మరొక ఉదాహరణ. దేవుని ప్రజలను బందీలుగా తీసుకుపోయిన బబులోనువారు తామే తమ శత్రువులను చూచి పారిపోతారు. ఈ విధంగా దేవుడు తన ప్రజలను బబులోను చెరనుండి విడిపించాడు.

15. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును.

16. సముద్రములో త్రోవ కలుగజేయువాడును వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును

17. రథమును గుఱ్ఱమును సేనను శూరులను నడిపించువాడు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. వారందరు ఏకముగా పండుకొని లేవకయుందురు వారు లయమై జనుపనారవలె ఆరిపోయిరి.

18. మునుపటివాటిని జ్ఞాపకము చేసికొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి.
2 కోరింథీయులకు 5:17

తన బలప్రభావాలు గతంలోని సంభవాలకే పరిమితం కాలేదని దేవుడంటున్నాడు. ఆయన తన ప్రజల పక్షంగా చర్య తీసుకోవడం మానేసినట్టు, అందుకు అశక్తుడైనట్టు ప్రజలు అస్తమానమూ గతం గురించే తలపోయవలసిన అవసరం లేదు. ఫిలిప్పీయులకు 3:13-14 పోల్చి చూడండి.

19. ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను.
ప్రకటన గ్రంథం 21:5

20. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్ళు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులును అడవి కుక్కలును నిప్పుకోళ్లును నన్ను ఘనపరచును
1 పేతురు 2:9

21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్త్రోత్రమును ప్రచురము చేయుదురు.
1 పేతురు 2:9

10వ వచనంలో లాగానే దేవుడు ఇస్రాయేల్‌ను ఒక జాతిగా సృష్టించడంలో ఒక కారణం తెలియజేస్తున్నాడు. ఇస్రాయేల్‌ప్రజ ఈ ఉద్దేశాన్ని అత్యంత సమర్థవంతంగా సాధించిన కాలంలో (దావీదు పాలన సమయంలో లాగా) కీర్తనల గ్రంథం ఉనికిలోకి వచ్చింది. ఈ యుగంలో దేవుని స్తుతిని చాటడం సంఘానికున్న ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి (1 పేతురు 2:9). ఇస్రాయేల్ జాతీ, క్రీస్తు సంఘమూ ఈ రెండూ దేవుని మహిమకోసం ఏర్పడినవే.

22. యాకోబూ, నీవు నాకు మొఱ్ఱపెట్టుటలేదు ఇశ్రాయేలూ, నన్నుగూర్చి నీవు విసికితివి గదా.

మొత్తంమీద ఇస్రాయేల్ ప్రజ దేవునికి సాక్షులుగానూ ఆయనను ప్రస్తుతించేవారుగానూ కూడా విఫలులయ్యారు. ప్రార్థించవలసిన రీతిలో వారు ప్రార్థించలేదు. వారిది పైపై ఆరాధనే. దేవునిపట్ల వారే విధమైన ప్రేమ చూపించలేదు. దేవుడు తమను పిలవడం అనే అద్భుతాన్నీ ఘనతనూ వారు గ్రహించినట్టు లేదు. వారి చరిత్రలో నైవేద్యాలు వేటినీ ఆయనకు తీసుకురాలేదు. ఒకవేళ తెచ్చినా నాసిరకం వాటిని అయోగ్యమైన రీతిలో తెచ్చి అర్పించారు (యెషయా 1:11-17; యెషయా 29:13; ఆమోసు 5:25-26; మలాకీ 1:6-13).

23. దహనబలులుగా గొఱ్ఱమేకల పిల్లలను నాయొద్దకు తేలేదు నీ బలులచేత నన్ను ఘనపరచలేదు నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు ధూపము వేయవలెనని నేను నిన్ను విసికింపలేదు.

24. నా నిమిత్తము సువాసనగల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు నీ బలి పశువుల క్రొవ్వుచేత నన్ను తృప్తిపరచలేదు సరే గదా. నీ పాపములచేత నీవు నన్ను విసికించితివి నీ దోషములచేత నన్ను ఆయాసపెట్టితివి.

“మోపావు...ఆయాస పెట్టావు”– ఇస్రాయేల్‌వారి పాపాలు (మన పాపాలు కూడా) దేవునికి ఎంత భారంగా ఆయాసకరంగా ఉన్నాయి! (యిర్మియా 44:22). యెషయా 53:5; ఆదికాండము 6:5-6; ఎఫెసీయులకు 4:30; యోహాను 1:29 పోల్చి చూడండి. మనిషి చేసే పాపాలు అతనికి ఆనందం కలిగించవచ్చు. కానీ అవి దేవునికి మాత్రం బాధను, దుఃఖాన్ని కలిగిస్తాయి.

25. నేను నేనే నా చిత్తానుసారముగా నీ యతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను.
మార్కు 2:7, లూకా 5:21

“నేనే”– దేవుని ప్రేమ, ఆయన మహిమ తన ప్రజలైన ఇస్రాయేల్‌తో ముడిపడి ఉన్నాయి. వారి పాపాల మూలంగా వారు శాశ్వతంగా నాశనం కావడం దేవుని ఉద్దేశం కాదు. ఆయన అలా జరగనియ్యడు. 21 వచనాన్ని వారు పూర్తిగా నెరవేర్చే కాలం ముందుంది. “తుడిచివేసే”– యెషయా 40:2; యెషయా 44:22.

26. నాకు జ్ఞాపకము చేయుము మనము కూడి వాదింతము నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లు నీ వ్యాజ్యెమును వివరించుము.

9-12 వచనాల్లో ఈ లోకం దానిలోని జాతులన్నిటి పాలిట ఒక కోర్టు ఉన్నట్టు చూశాం. ఇక్కడ ఇస్రాయేల్‌ను ఆ కోర్టులోకి పిలుస్తున్నారు. సాక్షిగా కాదు, ముద్దాయిగా. యెషయా 1:18 పోల్చి చూడండి. “జ్ఞాపకం”– యిర్మియా 31:34; హెబ్రీయులకు 10:17.

27. నీ మూలపితరుడు పాపముచేసినవాడే, నీ మధ్యవర్తులు నామీద తిరుగుబాటు చేసినవారే.

మానవజాతికి ఆదిపురుషుడూ (ఆదాము), ఇస్రాయేల్ జాతి మూలపురుషుడూ (అబ్రాహాము) ఇద్దరూ పాపులే. ఆదాము – ఆదికాండము 3:6; రోమీయులకు 5:12; అబ్రాహాము – ఆదికాండము 12:10-19; ఆదికాండము 20:1-6, ఆదికాండము 20:9. రోమీయులకు 3:9, రోమీయులకు 3:23 కూడా చూడండి. “మధ్యవర్తులు”– అంటే ప్రజల నాయకులు అన్నమాట.

28. కావున నేను ప్రతిష్ఠితులగు నీ ప్రధానులను అపవిత్ర పరచితిని యాకోబును శపించితిని ఇశ్రాయేలును దూషణ పాలు చేసితిని.

25వ వచనంలోని సత్యం ఇస్రాయేల్‌ను దాని పాపాలకు ఫలితంగా శిక్షించాలన్న దేవుని నిర్ణయాన్ని మార్చలేదు. క్షమాపణకు అర్థం దోషులైనవారు తమ పాపాలవల్ల వచ్చే ఫలితాలు వేటినీ ఎదుర్కోరని కాదు. సంఖ్యాకాండము 14:20-23 నోట్.Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |