Jeremiah - యిర్మియా 23 | View All

1. యెహోవా వాక్కు ఇదే నా మందలో చేరిన గొఱ్ఱెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ.
యోహాను 10:8

1. “యూదా కాపరులకు (నాయకులకు) చాలా చెడ్డదిగా ఉంటుంది. వారు నా గొర్రెలను (ఇశ్రాయేలీయులను) చెదరు గొట్టుతున్నారు. నా పచ్చిక బయలు నుండి గొర్రెలను పొమ్మని నలుదిశలా తోలి వేస్తున్నారు.” ఇది యెహోవా నుంచి వచ్చిన వాక్కు.

2. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులనుగూర్చి యీలాగున సెలవిచ్చుచున్నాడు మీరు నా గొఱ్ఱెలనుగూర్చి విచారణచేయక, నేను మేపుచున్న గొఱ్ఱెలను చెదరగొట్టి పారదోలితిరి; ఇదిగో మీ దుష్‌క్రియలనుబట్టి మిమ్మును శిక్షింపబోవుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.
యోహాను 10:8

2. ఆ కాపరులు (నాయకులు) నా ప్రజలకు బాధ్యులు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆ కాపరులకు ఈ విషయాలు చెపుతున్నాడు: “ఓ కాపరులారా (నాయకులు), మీరు నా గొర్రెల మందను నలుదిశలా పారిపోయేలా చేశారు. వారు పోవటానికి మీరు ఒత్తిడి తెచ్చారు. మీరు వారిని గురించి శ్రద్ధ వహించలేదు. కాని నేను మీతో వ్యవహరిస్తాను. మీరు చేసిన చెడుకార్యాలకు నేను మిమ్మల్ని శిక్షిస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.

3. మరియు నేను వాటిని తోలి వేసిన దేశములన్నిటిలోనుండి నా గొఱ్ఱెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను; అవి అభివృద్ధిపొంది విస్తరించును.

3. “నేను నా గొర్రెల మందను (ప్రజలను) ఇతర దేశాలకు పంపాను. పోయిన నా మందలను (ప్రజలను) నేను చేరదీస్తాను. వాటిని పచ్చిక బయలుకు (దేశానికి) మరల చేర్చుతాను. నా మందలు (ప్రజలు) వాటి పచ్చిక బీటికి (దేశానికి) తిరిగి చేరుకోగానే వాటికి సంతానోత్పత్తి జరిగి, అభివృద్ధి చెందుతాయి.

4. నేను వాటి మీద కాపరులను నియమించెదను; ఇకమీదట అవి భయపడకుండను బెదరి పోకుండను వాటిలో ఒకటైనను తప్పిపోకుండను వీరు నా గొఱ్ఱెలను మేపెదరు; ఇదే యెహోవా వాక్కు.

4. నా గొర్రెల మందపై నేను కొత్త కాపరులను (నాయకులను) నియమిస్తాను. ఆ కాపరులు నా మంద విషయమై శ్రద్ధ వహిస్తారు. నా మంద బెదరిపోయేలా గాని, జడిసి పోయేలా గాని చేయబడదు. నా మందలో ఒక్క గొర్రె కూడా తప్పిపోదు.” ఇదే యెహోవా వాక్కు.

5. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.
యోహాను 7:42, 1 కోరింథీయులకు 1:30

5. “నేనొక నీతి యుక్తమైన అంకురాన్ని మొలిపింప జేసే సమయం వస్తూవుంది,” ఇదే యెహోవా వాక్కు. అతడు మంచి తెలివి తేటలతో పరిపాలించగల రాజు. దేశానికి ఏది యోగ్యమైనదో, ఏది మంచిదో అతడది చేస్తాడు.

6. అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు.
యోహాను 7:42

6. శుద్ధమైన మంచి బీజోత్పత్తి సమయమందు యూదా ప్రజలు రక్షింపబడతారు. ఇశ్రాయేలు సురక్షితంగా నివసిస్తుంది. “యెహోవా మనకు న్యాయం “ అని అతనికి పేరుగా ఉంటుంది.

7. కాబట్టి రాబోవు దినములలో జనులు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి రప్పించిన యెహోవా జీవము తోడని యిక ప్రమాణముచేయక

7. కావున సమయం ఆసన్నమవుతూ ఉంది ఇదే యెహోవా వాక్కు, “అప్పుడు ప్రజలు ఎంత మాత్రం యెహోవా పేరుమీద పాతవిధంగా ప్రమాణం చేయరు. ‘నిత్యుడగు యెహోవా తోడు’ అనేది ‘ఈజిప్టు దేశం నుండి ఇశ్రాయేలును విడిపించి తీసికొని వచ్చిన యెహోవా తోడు’ అనేవి పాత ప్రమాణాలు.

8. ఉత్తర దేశములో నుండియు, నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండియు వారిని రప్పించిన యెహోవానగు నాతోడని ప్రమాణము చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు; మరియు వారు తమ దేశములో నివసింతురు.

8. కాని ఇశ్రాయేలు ప్రజలు కొత్త విధంగా ప్రమాణం చేస్తారు. ‘నిత్యుడగు యెహోవా తోడు. ‘ యెహోవా తన ప్రజలను ఉత్తర రాజ్యం నుండి విముక్తి చేసి తీసుకొని వచ్చాడు. ఆయన వారిని పంపిన రాజ్యాలన్నిటి నుండి ప్రజలను తిరిగి తీసికొని వచ్చాడు” అని ప్రజలు చెప్పుకుంటారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారి స్వదేశంలో నివసిస్తారు.”

9. ప్రవక్తలను గూర్చినది. యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది, నా యెముకలన్నియు కదలు చున్నవి, నేను మత్తిల్లినవానివలెను ద్రాక్షారసవశుడైన బలాఢ్యునివలెను ఉన్నాను.

9. ప్రవక్తలకు పవిత్రమైన మాటలు: నేను విచారంగా ఉన్నాను. నా హృదయం పగిలింది. నా ఎముకలు వణుకుతున్నాయి. నేను (యిర్మీయా) ఒక తాగుబోతు వ్యక్తిలా ఉన్నాను. యెహోవాను బట్టి, ఆయన పవిత్ర వాక్కును బట్టి నేనిలా వున్నాను.

10. దేశము వ్యభిచారులతో నిండియున్నది, జనుల నడవడి చెడ్డదాయెను, వారి శౌర్యము అన్యాయమున కుపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది; అడవిబీళ్లు ఎండిపోయెను.

10. యూదా రాజ్యం వ్యభిచరించే వారితో నిండిపోయింది. వారనేక విధాలుగా అనిశ్వాసులై ఉన్నారు. యెహోవా రాజ్యాన్ని శపించాడు. అందుచే అది బీడై పోయింది. పచ్చిక బయళ్లలో మొక్కలు ఎండి చచ్చిపోతున్నాయి. పొలాలన్నీ ఎడారుల్లా మారినాయి. ప్రవక్తలంతా దుష్టులయ్యారు. ప్రవక్తలు వారి శక్తియుక్తుల్ని తప్పుడు విధంగా వినియోగిస్తున్నారు.

11. ప్రవక్తలేమి యాజకులేమి అందరును అపవిత్రులు; నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను; ఇదే యెహోవా వాక్కు.

11. “ప్రవక్తలు, యాజకులు కూడా దుష్టులయ్యారు. వారు నా ఆలయంలోనే దుష్టకార్యాలు చేయటం నేను చూశాను.” ఇదే యెహోవా వాక్కు.

12. వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను గనుక గాఢాంధకారములో నడుచువానికి జారుడు నేలవలె వారి మార్గముండును; దానిలో వారు తరుమబడి పడిపోయెదరు; ఇదే యెహోవా వాక్కు.

12. “కావున నా సందేశం ఇక మీదట వారికివ్వను. వారి జీవితం బలవంతంగా అంధకారంలో నడిచి నట్లుంటుంది. ప్రవక్తలకు, యాజకులకు మార్గం అతి నునుపై జారిపడేలా ఉంటుంది. గాఢాంధకారంలో ప్రవక్తలు, యాజకులు జారిపడతారు. వారి మీదికి విపత్తును తీసుకొని వస్తాను. ఆ సమయంలో ఆ ప్రవక్తలను, యాజకులను శిక్షిస్తాను.” ఇదే యెహోవా వాక్కు.

13. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని; వారు బయలు పేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి.

13. “సమరయ ప్రవక్తలు చెడు చేయటం నేను చూశాను. బూటకపు దేవత బయలు పేరిట వారు భవిష్య విషయాలు చెప్పటం నేను చూశాను. ఆ ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలను యెహోవాకు దూరం చేశారు.

14. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు అసత్య వర్తనులు, ఎవడును తన దుర్మార్గతనుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు, వారందరు నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొఱ్ఱావలెనైరి.

14. యూదా ప్రవక్తలు యెరూషలేములో ఘోరమైన పనులు చేయటం నేను చూశాను. ఈ ప్రవక్తలు వ్యభిచార దోషానికి పాల్పడ్డారు. వారు అబద్ధాలను వింటారు. వారు తప్పుడు బోధనలను అనుసరించారు. వారు దుర్మార్గులను, చెడు కార్యాలు చేయటానికి ప్రోత్సహించారు. అందువల్ల ప్రజలు పాపం చేయటం మానలేదు. వారు సొదొమ నగరంవలె ఉన్నారు. యెరూషలేము ప్రజలు నా దృష్టిలో గొమొర్రా నగరంవలె ఉన్నారు!”

15. కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలనుగూర్చి సెలవిచ్చునదేమనగా యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతట వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదునీళ్లును నేను వారి కిచ్చుచున్నాను.

15. అందువల్ల సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ ప్రవక్తల విషయంలో ఇలా చెపుతున్నాడు. “ఆ ప్రవక్తలను నేను శిక్షిస్తాను. ఆ శిక్ష విషముతిన్నట్లు, చేదు నీరు తాగినట్లు ఉంటుంది. ఆ ప్రవక్తలు ఆధ్యాత్మిక పరమైన ఒక రుగ్మతను ప్రబలింప చేశారు. ఆ రోగం దేశ వ్యాప్తంగా చెలరేగింది, కావున ఆ ప్రవక్తలను నేను శిక్షిస్తాను. ఆ రోగం యెరూషలేములోని ప్రవక్తల నుండే సంక్రమించింది.”

16. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీకు ప్రచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు.

16. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు: “ఆ ప్రవక్తలు మీకు చెప్పే విషయాలను మీరు లక్ష్యపెట్టవద్దు. వారు మిమ్మల్ని మోసపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రవక్తలు దర్శనాలను గురించి మాట్లాడతారు. కాని వారా దర్శనాలను నానుండి పొందలేదు. వారి దర్శనాలన్నీ వారి కల్పనాలే.

17. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు; ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు, యెహోవా ఆజ్ఞనుబట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమునుబట్టి పలుకుదురు.

17. కొంత మంది ప్రజలు యెహోవా యొక్క నిజమైన సందేశాలను సైతం అసహ్యించుకుంటారు. అందువల్ల ప్రవక్తలు ఆ ప్రజలకు రకరకాల విషయాలు చెపుతారు. ‘మీకు శాంతి సమకూరుతుంది’ అని వారంటారు. కొంత మంది ప్రజలు బహు మొండివారు. వారు చేయదలచుకున్నదేదో అదే చేస్తారు. కావున వారికి ఆ ప్రవక్తలు, ‘మీకు ఏ కీడూ రాదు!’ అని చెపుతారు.

18. యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించునట్లు దాని లక్ష్యము చేసినవాడెవడు?
రోమీయులకు 11:34

18. కాని ఈ ప్రవక్తలలో ఏ ఒక్కడూ పరలోక సభలో నిలవలేదు. వారిలో ఏ ఒక్కడూ యెహోవాను గాని, యెహోవా వాక్కును గాని దర్శించలేదు. వారిలో ఏ ఒక్కడూ యెహోవా సందేశం పట్ల శ్రద్ధ వహించలేదు.

19. ఇదిగో యెహోవాయొక్క మహోగ్రతయను పెనుగాలి బయలువెళ్లుచున్నది; అది భీకరమైన పెనుగాలి అది దుష్టుల తలమీదికి పెళ్లున దిగును.

19. ఇప్పుడు యెహోవా నుండి శిక్ష తుఫానులావస్తుంది! యెహోవా కోపం ఉగ్రమైన గాలి వానలా ఉంటుంది! ఆ దుష్టుల తలలు చితికి పోయేలా అది వారి మీదికి విరుచుకు పడుతుంది.

20. తన కార్యమును సఫలపరచువరకును తన హృదయా లోచనలను నెరవేర్చువరకును యెహోవా కోపము చల్లారదు; అంత్యదినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు.

20. యెహోవా చేయదలచుకున్నదంతా చేసేవరకు ఆయన కోపం చల్లారదు. అంత్యదినాల్లో దీనిని మీరు సరిగా అర్థం చేసికుంటారు.

21. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చెదరు, నేను వారితో మాటలాడకుండినను వారు ప్రకటించెదరు.

21. ఆ ప్రవక్తలను నేను పంపియుండలేదు. కాని వారికి వారే తమ వర్తమానాలను చాటటానికి పరుగున పోయారు. నేను వారితో మాట్లాడలేదు. కాని వారు నా పేరుతో ప్రవచించారు.

22. వారు నా సభలో చేరిన వారైన యెడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియ జేతురు, దుష్‌క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచి పెట్టునట్లు వారిని త్రిప్పియుందురు; ఇదే యెహోవా వాక్కు.

22. వారు నా సర్వ సభలో నిలిచి ఉండినట్లయితే వారు నా సందేశాలను యూదా ప్రజలకు చెప్పి ఉండేవారు. ప్రజలు చెడు మార్గాలు తొక్కకుండా ఆపేవారు. వారు దుష్ట కార్యాలు చేయకుండా ఆపేవారు.”

23. నేను సమీపముననుండు దేవుడను మాత్ర మేనా? దూరముననుండు దేవుడనుకానా?
అపో. కార్యములు 17:27

23. “ఇక్కడ ఈ స్థలములో నేను దేవుడను. నేను దూర ప్రాంతంలో కూడా దేవుడను. ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం “ నేను దూరంలో లేను!

24. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైన కలడా? నేను భూమ్యాకాశములయందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు.

24. ఒక వ్యక్తి నాకు నకపడకుండా రహస్య స్థావరంలో దాగటానికి ప్రయత్నించవచ్చు. కాని వానిని చూడటం నాకు తేలిక ఎందువల్లనంటే నేను స్వర్గంలోను, భూమి మీద సర్వత్రా వ్యాపించి వున్నాను!”

25. కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను.

25. “నా పేరు మీద అబద్ధాలు బోధించే ప్రవక్తలున్నారు. ‘నాకు స్వప్న దర్శనమయింది. నాకు స్వప్న దర్శనమయింది,’ అని వారంటారు. వారు అలా చెప్పటం నేను విన్నాను.

26. ఇక నెప్పటివరకు ఈలాగున జరుగుచుండును? తమ హృదయకాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీని నాలోచింపరా?

26. ఎంత కాలం ఇది కొన సాగుతుంది? ఆ ప్రవక్తలు అబద్ధాలనే ఆలో చిస్తారు. వారు ఆలోచించిన అబద్ధాలనే ప్రజలకు భోదిస్తారు.

27. బయలును పూజింపవలెనని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరు తమ పొరుగువారితో చెప్పు కలలచేత నా జనులు నా నామమును మరచునట్లు చేయవలెనని యోచించుచున్నారా?

27. యూదా ప్రజలు నా పేరు మర్చి పోయేలా చేయటానికి ఆ ప్రవక్తలు ప్రయత్నిస్తున్నారు. వారొకరి కొకరు ఈ దొంగ కలల గురించి చెప్పుకొనటం ద్వారా ఇది సాధించాలని చూస్తున్నారు. తమ పూర్వీకులు నన్ను మర్చిపోయిన రీతిగా, ఇప్పుడు నా ప్రజలు నన్ను మర్చిపోయేలా చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు. వారి పూర్వీకులు నన్ను మర్చిపోయి, బూటకపు దేవత బయలును ఆరాధించారు.

28. కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను; నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమునుబట్టి నా మాట చెప్పవలెను; ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు.

28. ఎండుగడ్డి, గోధుమలు ఒక్కటి గావు! అదే రీతిగా, ఆ ప్రవక్తల కలలు నా సందేశాలు కానేరవు. ఎవరైనా తన కలలను గూర్చి చెప్పుకోదలిస్తే చెప్పవివ్వండి. కాని నా వర్తమానం విన్నవాడు మాత్రం దానిని యదార్థంగా చెప్పాలి.

29. నా మాట అగ్నివంటిదికాదా? బండను బద్దలుచేయు సుత్తెవంటిది కాదా?

29. నా సందేశం అగ్నిలావుంటుంది” ఇదే యెహవా వాక్కు “అది ఒక బండను పగులకొట్టే సమ్మెటలా ఉంటుంది.

30. కాబట్టి తమ జతవానియొద్దనుండి నా మాటలను దొంగి లించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు.

30. “కావున ఆ దొంగ ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.”ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం “ఈ ప్రవక్తలు ఒకరి నుండి ఒకరు నా మాటలు దొంగిలించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు .

31. స్వేచ్ఛగా నాలుకల నాడించుకొనుచు దేవో క్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు.

31. నేను ఈ దొంగ ప్రవక్తలకు వ్యతిరేకిని.” ఇదే యెహోవా వాక్కు. వారు కల్పించిన మాటలనే వారు ఉపయోగిస్తూ, అది నా సందేశమన్నట్లు నటిస్తారు.

32. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు, అబద్ధములచేతను, మాయాప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించువారికి నేను విరో ధినై యున్నాను; ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు; ఇదే యెహోవా వాక్కు.

32. అసత్య దర్శనాలను బోధించే ఈ ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.” ఇదే యెహోవా వాక్కు. “వారి అబద్ధాల ద్వారా అసత్య ప్రచారాల ద్వారా వారు నా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. ప్రజలకు బోధించే నిమిత్తం ఆ ప్రవక్తలను నేను పంపియుండలేదు! నా తరఫున ఏమి చేయటానికీ నేను వారికి ఆజ్ఞ ఇవ్వలేదు! యూదా ప్రజలకు వారేరకంగా సహాయపడలేరు.” ఇదే యెహోవా వాక్కు

33. మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్నడుగునప్పుడు నీవు వారితో ఇట్లనుముమీరే ఆయనకు భారము; మిమ్మును ఎత్తి పారవేతును; ఇదే యెహోవా వాక్కు. మరియ

33. “యూదా ప్రజలు గాని, ఒక ప్రవక్త గాని, లేక ఒక యాజకుడు గాని నిన్ను పిలిచి, ‘యిర్మీయా, యెహోవా ఏమి ప్రకటిస్తున్నాడు?’ అని అడుగవచ్చు. అప్పుడు వారికి సమాధానంగా,’ యెహోవాకు మీరే భారంగా ఉన్నారు! ఈ పెద్ద భారాన్ని కిందికి విసరి వేస్తాను. ఇదే యెహోవా వాక్కు,’ అని నీవు చెప్పు.

34. ప్రవక్తయే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని యెహోవా భారమను మాట ఎత్తువాడెవడైనను, వానిని వాని యింటివారిని నేను దండించెదను.

34. “ఒక ప్రవక్తే గాని, యాజకుడే గాని, లేక ప్రజలలో ఎవ్వరే గాని, ‘ఇది యెహోవా నుండి వచ్చిన ప్రకటన ...’ అని చెప్పితే, అది అబద్ధం. అటువంటి వ్యక్తిని, వాని కుటుంబాన్నంతటినీ నేను శిక్షిస్తాను.

35. అయితే యెహోవా ప్రత్యుత్తరమేది? యెహోవా యేమని చెప్పుచున్నాడు? అని మీరు మీ పొరుగువారితోను సహోదరులతోను ప్రశంసించవలెను.

35. మీరొకరికొకరు ఇలా చెప్పుకోండి, ‘యెహోవా ఏమి సమాధానమిచ్చాడు? లేక ‘యెహోవా ఏమి చెప్పాడు?’

36. యెహోవా భారమను మాట మీరిక మీదట జ్ఞాపకము చేసికొనవద్దు; జీవముగల మన దేవుని మాటలను, సైన్యముల కధిపతియు దేవుడునగు యెహోవా మాటలను, మీరు అపార్థముచేసితిరి; కాగా ఎవనిమాట వానికే భారమగును.

36. అంతేగాని మరెన్నడు, ‘యెహోవా ప్రకటన (పెద్ద భారం)’ అనే పదాన్ని తిరిగి మరలా వాడరు. ఎందువల్లనంటే యెహోవా సందేశం ఎన్నడూ, ఎవరికీ భారం కాకూడదు. కాని మీరు మన దేవుని మాటలు మార్చివేశారు! ఆయన నిత్యుడైన సర్వశక్తిమంతుడగు యెహోవా!’

37. యెహోవా నీకేమని ప్రత్యుత్తర మిచ్చుచున్నాడనియు, యెహోవా యేమి చెప్పుచున్నాడనియు మీరు ప్రవక్తను అడుగవలెను గాని యెహోవా భారమను మాట మీరెత్తిన యెడల

37. “మీరు దేవుని సందేశం తెలుసుకొనదలిస్తే ఒక ప్రవక్తను, ‘యెహోవా నీకేమి సమాధానం చెప్పాడు” అని గాని; ‘యెహోవా ఏమి చెప్పినాడు? అని గాని అడగండి.

38. అందునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు యెహోవా భారమను మాట యెత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు యెహోవా భారమను మాట యెత్తుచునే యున్నారు.

38. కాని, ‘యెహోవా ప్రకటన (పెద్ద భారం) ఏమిటి? అని అడగవద్దు. మీరామాటలు వాడితే, అప్పుడు యెహోవా మీకు ఈ మాటలు చెప్పుతాడు: ‘మీరు నా సందేశాన్ని యెహోవా ప్రకటన (పెద్ద భారం) అని చెప్పకుండా ఉండవలసింది. ఆ మాటలు వాడవద్దని నేను మీకు చెప్పియున్నాను.

39. కాగా నేను మిమ్మును ఎత్తివేయుచున్నాను, మీకును మీ పితరులకును నేనిచ్చిన పట్టణమును నా సన్నిధినుండి పారవేయుచున్నాను.

39. కాని నా సందేశాన్ని పెద్ద భారమని పిలిచారు. కావున మిమ్మల్ని పెద్ద భారంలా ఎత్తి నా నుండి విసరి పారవేస్తాను. యెరూషలేము నగరాన్ని మీ పూర్వీకులకు నేను ఇచ్చియున్నాను. కాని మిమ్మల్ని, మీ నగరాన్నీ నా నుండి దూరంగా పార వేస్తాను.

40. ఎన్నడును మరువబడని నిత్యాపవాదమును నిత్యావమానమును మీమీదికి రప్పించెదను.

40. పైగా మీకు శాశ్వతంగా తలవంపులు కలిగేలా చేస్తాను. మీ సిగ్గును మీరెన్నడూ మరువలేరు.”Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |