Jeremiah - యిర్మియా 40 | View All

1. రాజదేహసంరక్షకులకధిపతియైన నెబూజరదాను యెరూషలేములోనుండియు యూదాలోనుండియు బబులోనునకు చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలోనుండి, సంకెళ్లచేత కట్టబడియున్న యిర్మీయాను తీసికొని రామాలో నుండి పంపివేయగా, యెహోవా యొద్దనుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు.

1. యిర్మీయా రామా నగరంలో విడుదలైన పిమ్మట యోహోవా వాక్కు అతనికి వినిపించింది. బబులోను రాజు ప్రత్యేక అంగరక్షక దళాధిపతియైన నెబూజరదాను యిర్మీయాను రామా నగరంలో ఉన్నట్లు కనుగొన్నాడు. యిర్మీయా గొలుసులతో బంధింపబడ్డాడు. యెరూషలేము నుండి యూదా నుండి తేబడిన బందీలందరితో పాటు యిర్మీయా కూడా ఉన్నాడు. ఆ ప్రజలంతా బంధీలుగా బబులోనుకు తీసికొని పోబడుతున్నారు.

2. రాజదేహసంరక్షకుల కధిపతి యిర్మీయాను అవతలికి తీసికొపోయి అతనితో ఈలాగు మాటలాడెను ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసెదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించెను గదా.

2. దళాధిపతి నెబూజరదాను యిర్మీయాను చూచినప్పుడు అతనితో మాట్లాడి ఇలా అన్నాడు: “యిర్మీయా, నీ దేవుడైన యెహోవా ఈ విపత్తు ఈ ప్రదేశానికి వస్తుందని చెప్పియున్నాడు.

3. తాను చెప్పిన ప్రకారము యెహోవా దాని రప్పించి చేయించెను, మీరు యెహోవాకు విరోధముగా పాపముచేసి ఆయన మాటలు వినక పోతిరి గనుక మీకీగతి పట్టినది.

3. యెహోవా ఏమి చేస్తానని చెప్పియున్నాడో అంతా జరిగేలా చేశాడు. మీ యూదా ప్రజలంతా యెహోవాపట్ల పాపం చేశారు. కావున మీకు ఈ ఆపద సంభవించింది. మీ ప్రజలు దేవునికి విధేయులుగా లేరు.

4. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను, నాతోకూడ బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచినయెడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడెదను; అయితే బబులోనునకు నాతోకూడ వచ్చుట మంచిదికాదని నీకు తోచినయెడల రావద్దు, దేశమంతట నీకేమియు అడ్డములేదు, ఎక్కడికి వెళ్లుట నీ దృష్టికి అను కూలమో, యెక్కడికి వెళ్లుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్లుము.

4. కాని యిర్మీయా, నిన్ను నేనిప్పుడు విడుదల చేస్తాను. నీ మణికట్టుల నుండి సంకెళ్లను తీసివేస్తున్నాను. నీవు రాదలచుకొంటే నాతో బబలోనుకు రా. వస్తే నీ యోగక్షేమాల విషయంలో నేను తగిన శ్రద్ధ తీసికొంటాను. నీకు నాతో రావటానికి ఇష్టం లేకపోతే రావద్దు. చూడు; దేశమంతా నీకు బాహాటంగా తెరచబడి ఉంది. నీ ఇష్టము వచ్చిన చోటికి వెళ్లు.

5. ఇంకను అతడు తిరిగి వెళ్లక తడవు చేయగా రాజదేహసంరక్షకుల కధిపతి అతనితో ఈలాగు చెప్పెను బబులోను రాజు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను యూదాపట్టణములమీద నియమించి యున్నాడు, అతని యొద్దకు వెళ్లుము; అతని యొద్ద నివసించి ప్రజలమధ్యను కాపురముండుము, లేదా యెక్కడికి వెళ్లుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్లుము. మరియు రాజదేహసంరక్షకుల కధిపతి అతనికి బత్తెమును బహుమానము ఇచ్చి అతని సాగనంపగా

5. లేక షాఫాను పుత్రుడైన ఆహీకాము కుమారుడు గెదల్యావద్దకు తిరిగి వెళ్లు . యూదా పట్టణాల పరిపాలనా నిర్వహణకై బబులోను రాజు గెదల్యాను పాలకునిగా ఎంపిక చేశాడు. నీవు వెళ్లి గెదల్యాతో కలిసి ప్రజల మధ్య నివసించు. లేదా నీ ఇష్టమొచ్చిన మరెక్కడికైనా సరే వెళ్లు.” పిమ్మట నెబూజరదాను యిర్మీయాకు కొంత ఆహారాన్ని, ఒక కానుకను ఇచ్చి అతనిని పంపివేశాడు.

6. యిర్మీయా మిస్పాలోనుండు అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు వెళ్లి అతనితో కూడ దేశములో మిగిలిన ప్రజలమధ్య కాపురముండెను.

6. కావున యిర్మీయా మిస్పా వద్ద వున్న అహీకాము కుమారుడైన గెదల్యా వద్దకు వెళ్లాడు. యిర్మీయా గెదల్యాతో కలిసి యూదా రాజ్యంలో మిగిలి ఉన్న ప్రజల మధ్య నివసించాడు.

7. అయితే అచ్చటచ్చటనుండు సేనల యధిపతులందరును వారి పటాలపువారును, బబులోనురాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశముమీద అధికారిగా నియమించి, బబులోనునకు చెరగొని పోబడక నిలిచినవారిలో స్త్రీలను పురుషులను పిల్లలను, దేశములోని అతినీరసులైన దరిద్రులను అతనికి అప్పగించెనని వినిరి.

7. యెరూషలేము నాశనం చేయబడినప్పుడు యూదా రాజ్య సైన్యంలోని కొంతమంది, సైనికులు అధికారులు, తదితర మనుష్యులు బయట ప్రాంతంలో వుండిపోయారు. రాజ్యంలో మిగిలిన ప్రజలను పాలించటానికి అహీకాము కుమారుడైన గెదల్యాను బబులోను రాజు నియమించినట్లు ఆ సైనికులు విన్నారు. యూదా రాజ్యంలో మిగిలిన ప్రజలలో మిక్కిలి పేదవారు, బబులోనుకు బందీలుగా తీసికొనిపోవటానికి అనువుగాని స్త్రీ పురుషులు, పిల్లలు వున్నారు.

8. కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును కారేహ కుమారులైన యోహానాను యోనాతానులును తన్హుమెతు కుమారుడైన శెరాయాయును నెటోపాతీయుడైన ఏపయి కుమారులును మాయ కాతీయుడైనవాని కుమారుడగు యెజన్యాయును వారి పటాలపువారును మిస్పాలో నుండిన గెదల్యాయొద్దకు వచ్చిరి.

8. కావున ఆ సైనికులు మిస్పావద్ద గెదల్యాను కలవటానికి వచ్చారు. ఆ వచ్చిన సైనికులలో నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, కారేహ కుమారులైన యోహోనాను మరియు యోనాతాను, తన్హుమెతు కుమారుడైన శెరాయా, నెటోపాతీయుడైన ఏపయి యొక్క కుమారుడు, మాయకాతీయుని కుమారుడైన యెజన్యా, వారితో ఉన్న మనుష్యులు ఉన్నారు.

9. అప్పుడు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యా ప్రమాణముచేసి వారితోను వారి పటాలపువారితోను ఈలాగు చెప్పెను-మీరు కల్దీయులను సేవించుటకు భయపడకుడి, దేశములో కాపురముండి బబులోనురాజును సేవించినయెడల మీకు మేలు కలుగును.

9. షాఫాను మనుమడు, అహీకాము కుమారుడు అయిన గెదల్యా ఆ సైనికులకు, వారితో ఉన్న మనుష్యులకు భద్రత కల్పించటానికి ఒక ప్రమాణం చేశాడు. గెదల్యా ఇలా అన్నాడు: “సైనికులారా, కల్దీయులకు సేవ చేయటానికి మీరు భయపడకండి. రాజ్యంలో స్థిరపడి బబులోను రాజుకు సేవ చేయండి. మీరిది చేస్తే, మీకు అంతా సవ్యంగా జరిగిపోతుంది.

10. నేనైతేనో నాయొద్దకు వచ్చు కల్దీయుల యెదుట నిలుచుటకై మిస్పాలో కాపురముందును గాని మీరు ద్రాక్షారసమును వేసవికాల ఫలములను తైలమును సమకూర్చుకొని, మీ పాత్రలలో వాటిని పోసికొని మీరు స్వాధీనపరచుకొనిన పట్టణములలో కాపురముండుడి.

10. నేను కూడా మిస్పాలోనే నివసిస్తాను. కల్దీయులు ఇక్కడికి వచ్చినప్పుడు మీ తరపున నేను వారితో మాట్లాడతాను. మీరు ఆ పనిని నాకు వదలండి. వేసవి ద్రాక్షపంట నుండి రసం తీయాలి. నూనె కూడ తీయాలి. మీరు తయారు చేసినవన్నీ జాడీలలో నిలువ చేయండి. మీరు ఆక్రమించుకున్న పట్టణాలలో నివసించండి.”

11. మోయాబులో నేమి అమ్మోనీయుల మధ్యనేమి ఎదోములో నేమి యేయే ప్రదేశములలోనేమి యున్న యూదులందరు బబులోనురాజు యూదాలో జనశేషమును విడిచెననియు, షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను వారిమీద నియమించెననియు వినినప్పుడు

11. మోయాబు, అమ్మోను, ఎదోము, ఇంకను ఇతర దేశాలలో వున్న యూదా ప్రజలంతా బబులోను రాజు యూదా రాజ్యంలో కొంతమందిని వదిలి వెళ్లినట్లువిన్నారు. షాఫాను మనుమడు, అహీకాము కుమారుడు అయిన గెదల్యాను బబులోను రాజు వారిపై పాలకునిగా నియమించినట్లు కూడ విన్నారు.

12. అందరును తాము తోలివేయబడిన స్థలములన్నిటిని విడిచి మిస్పాకు గెదల్యాయొద్దకు వచ్చి బహు విస్తారము ద్రాక్షారసమును వేసవికాలపు పండ్లను సమకూర్చుకొనిరి.

12. ఆ యూదా ప్రజలు ఈ వార్త విన్న తరువాత యూదా రాజ్యానికి తిరిగి వచ్చారు. చిందరవందరగా వివిధ దేశాల్లో ఉన్న యూదా వారంతా మిస్పాకు తిరిగి వచ్చి గెదల్యాను ఆశ్రయించారు. తిరిగి వచ్చి, వారు చాల ద్రాక్షరసాన్ని తీసి, వేసవి పండ్లను సేకరించారు.

13. మరియకారేహ కుమారుడైన యోహానానును, అచ్చటచ్చటనున్న సేనల యధిపతులందరును మిస్పా లోనున్న గెదల్యాయొద్దకు వచ్చి

13. బయట పల్లెల్లో ఉన్న కారేహ కుమారుడైన యోహానాను, ఇతర యూదా సైన్యాధికారులు గెదల్యా యొద్దకు వచ్చారు. గెదల్యా మిస్పా పట్టణంలో ఉన్నాడు.

14. నిన్ను చంపుటకు అమ్మోనీయుల రాజైన బయలీను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును పంపెనని నీకు తెలియదా అని చెప్పిరి. అయితే అహీకాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు.

14. యోహానాను, మరియు అతనితో ఉన్న అధికారులు గెదల్యాతో, “అమ్మోనీయుల రాజైన బయలీను నిన్ను చంపజూస్తున్నాడు. అది నీకు తెలుసా? నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును నిన్ను చంపటానికి పంపాడు” అని అన్నారు. కాని అహీకాము కుమారుడైన గెదల్యా వారు మాట నమ్మలేదు.

15. కారేహ కుమారుడగు యోహానాను మిస్పాలో గెదల్యాతో రహస్యముగా ఇట్లనెను నీ యొద్దకు కూడివచ్చిన యూదులందరు చెదరిపోవునట్లును, యూదా జనశేషము నశించు నట్లును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంపనేల?దయచేసి నన్ను వెళ్లనిమ్ము,ఎవనికి తెలియకుండ నేను వానిని చంపెదను.

15. పిమ్మట కారేహ కుమారుడైన యోహానాను మిస్పాలో గెదల్యాతో ఏకాంతంగా మాట్లాడాడు. గెదల్యాతో యోహానాను ఇలా అన్నాడు: “నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును నన్ను వెళ్లి చంపనిమ్ము. దానిని గురించి ఎవ్వరికీ తెలియకుండా నేను చేస్తాను. ఇష్మాయేలు నిన్ను చంపకుండా మేము చూస్తాము. అతడు నిన్ను చంపితే నిన్నాశ్రయించి వచ్చిన యూదా ప్రజలంతా మళ్లీ వివిధ దేశాలకు చెల్లాచెదరై పోతారు. అంటే మిగిలిన కొద్దిమంది యూదావారు కూడా నశించి పోతారన్నమాట.”

16. అందుకు అహీకాము కుమారుడైన గెదల్యా కారేహ కుమారుడైన యోహానానుతో ఇష్మాయేలునుగూర్చి నీవు అబద్ధమాడుచున్నావు, నీవాకార్యము చేయకూడదనెను.

16. కాని, అహీకాము కుమారుడైన గెదల్యా తన హితంగోరి చెప్పిన కారేహ కుమారుడైన యోహానానుతో, “ఇష్మాయేలును చంపవద్దు. నీవు ఇష్మాయేలును గురించి చెప్పుచున్న విషయాలు నిజం కావు” అని అన్నాడు.Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |