Jeremiah - యిర్మియా 44 | View All

1. మిగ్దోలులోగాని తహపనేసులోగాని నొపులోగాని పత్రోసులోగాని ఐగుప్తుదేశవాసము చేయుచున్న యూదులనందరినిగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2. నేను యెరూషలేము మీదికిని యూదా పట్టణములన్నిటి మీదికిని రప్పించిన కీడంతయు మీరు చూచుచునే యున్నారు.

“మీరు చూశారు”– ప్రజలు లోకంలో తాము చూస్తున్నవాటినుండి పాఠాలు నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు (యిర్మియా 3:7, యిర్మియా 3:10; ద్వితీయోపదేశకాండము 3:21-22; యెహోషువ 23:3; లూకా 21:28).

3. మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్యదేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపము వేయుచు వచ్చుటవలన వాటి నివాసులు తాము చేసికొనిన దోషముచేత నాకు కోపము పుట్టించిరి గనుక నేడు నివాసులులేకుండ అవి పాడుపడి యున్నవి గదా.

యిర్మియా 1:16; యిర్మియా 11:17; యిర్మియా 19:4; యిర్మియా 32:32. వారిపై దేవుడు కోపించడానికి గల ముఖ్య కారణం విగ్రహారాధనే.

4. మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరిని మీయొద్దకు పంపుచు, నాకసహ్యమైన యీ హేయకార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచువచ్చితిని గాని

“నీచమైన పని”– విగ్రహపూజ (ద్వితీయోపదేశకాండము 7:25-26; ద్వితీయోపదేశకాండము 27:15; యెషయా 44:19). బైబిలులో వెల్లడి అయిన పవిత్రుడైన నిజ దేవుడు దీన్ని పూర్తిగా, తీవ్రంగా, శాశ్వతంగా అసహ్యించుకొంటాడు. దీన్ని అవలంబించవద్దని మరీ మరీ తన ప్రజలతో వాదిస్తున్నాడు.

5. వారు అలకింపక పోయిరి, అన్యదేవతలకు ధూపార్పణముచేయుట మానకపోయిరి, తమ దుర్మార్గతను విడువకపోయిరి చెవి యొగ్గకపోయిరి.

6. కావున నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరింపబడి, యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను రగులుకొనెను, గనుక నేడున్నట్లుగా అవి పాడై యెడారి ఆయెను.

7. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు అజ్ఞ ఇచ్చుచున్నాడు ఏమియు శేషములేకుండ స్త్రీ పురుషులును శిశువులును చంటి బిడ్డలును యూదా మధ్య నుండ కుండ నిర్మూలము చేయబడునట్లుగా మీరేల ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసికొనుచున్నారు?

ఏం జరిగిందో వారు కండ్లారా చూశారు. అయినా వారు గుణపాఠం నేర్చుకొని, పశ్చాత్తాపపడి దేవునివైపు తిరగరా? మానవ స్వభావంలోని చెడుతనం ఇంత సులభంగా వశం కాదు. రోమీయులకు 1:32 చూడండి.

8. మీకుమీరే సమూలనాశనము తెచ్చుకొనునట్లును, భూమి మీదనున్న జనములన్నిటిలో మీరు దూషణపాలై తిరస్కరింపబడునట్లును, మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్యదేవతలకు ధూపార్పణము చేయుదురు. మీరేల యీలాగున చేయుచు మీ చేతిక్రియలచేత నాకు కోపము పుట్టించుచున్నారు?

“ఈజిప్ట్”– దీన్నిబట్టి చూస్తే ఈ సందేశం యిర్మీయాకు వచ్చేనాటికే వారు కొంత కాలంగా ఈజిప్ట్‌లో ఉన్నారని, లేకపోతే వీరు కాకుండా యూదులు కొందరు అంతకు ముందు నుంచీ ఈజిప్ట్‌లో ఉంటూ అక్కడి దేవతలను కొలుస్తున్నారని అర్థమౌతున్నది – బైబిలు ప్రకారం విగ్రహపూజ దాన్ని అభ్యసించేవారికి నాశనం తెచ్చిపెడుతుంది (నిర్గమకాండము 22:20; ద్వితీయోపదేశకాండము 17:2-5; హోషేయ 13:2, హోషేయ 13:9; ప్రకటన గ్రంథం 21:8). ఈజిప్ట్‌లో ఉంటున్న యూదులకు తాను నాశనం ఎలా జరిగిస్తాడో ఆ వివరాలను దేవుడు 11-14 వచనాల్లో తెలియజేస్తున్నాడు. అంతకుముందు యూదా దేశానికి కూడా ఇదే హెచ్చరికను ఇచ్చాడు (యిర్మియా 42:17-18).

9. వారు యూదాదేశములోను యెరూషలేము వీధుల లోను జరిగించిన క్రియలను అనగా మీ పితరులు చేసిన చెడుతనమును యూదా రాజులు చేసిన చెడుతనమును వారి భార్యలు చేసిన చెడుతనమును, మీమట్టుకు మీరు చేసిన చెడుతనమును మీ భార్యలు చేసిన చెడుతనమును మరచి పోతిరా?

10. నేటివరకు వారు దీనమనస్సు ధరింపకున్నారు, భయము నొందకున్నారు, నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రము నైనను కట్టడలనైనను అనుసరింపకయే యున్నారు.

11. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీకు కీడు చేయునట్లు,

12. అనగా యూదావారినందరిని నిర్మూలము చేయునట్లు, నేను మీకు అభిముఖుడనగుదును; ఐగుప్తు దేశములో కాపురముందుమని అచ్చటికి వెళ్ల నిశ్చయించుకొను యూదాశేషులను నేను తోడుకొని పోవుదును, వారందరు ఐగుప్తు దేశములోనే నశించెదరు; అల్పులేమి ఘనులేమి వారందరు కూలుదురు, ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను నశింతురు, ఖడ్గముచేతనైనను క్షామము చేతనైనను వారు చత్తురు, శాపాస్పదమును భీతి పుట్టించు వారుగాను దూషణపాలుగాను తిరస్కారము నొందిన వారుగాను ఉందురు.

13. యెరూషలేము నివాసులను నేనే లాగు శిక్షించితినో ఆలాగే ఐగుప్తుదేశములో నివసించు వీరిని ఖడ్గముచేతగాని క్షామముచేతగాని తెగులుచేతగాని శిక్షించెదను.

14. కావున తాము మరలి వచ్చి యూదాదేశములో కాపురముండవలెనన్న మక్కువచేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్లు యూదా వారిలోని శేషము ఎవరును తప్పించుకొనరు, శేషమేమియు ఉండదు, పారి పోవువారు గాక మరి ఎవరును తిరిగిరారు.

15. అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపము వేయుదురని యెరిగియున్న పురుషులందరును, అక్కడ నిలిచియున్న స్త్రీలును,

తమకిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామనే తమ ఉద్దేశాన్ని మరిక ఏ సందేహానికీ తావులేకుండా స్పష్టంగా తెలియజేస్తున్నారు. వారి విగ్రహాలు వారికి చాలా ఇష్టం. దేవుడు గానీ మరెవరైనా గానీ ఏమన్నా సరే ఆ విగ్రహాలనే వారు అనుసరిస్తారు. ఇక్కడ మరొక సారి మానవ హృదయంలో రాజ్యమేలుతున్న దుర్మార్గత బయటపడుతున్నది. ప్రకటన గ్రంథం 9:20-21 పోల్చి చూడండి. ఈ యుగాంతంలో ప్రపంచమంతా శిక్షకు గురౌతూ విపత్తు పాలయ్యేందుకు సిద్ధమౌతూవుంటే మానవాళి మాత్రం తమకు ప్రియమైన విగ్రహాలను వదులుకోరు.

16. మహా సమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరును యిర్మీయాకు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చిరి యెహోవా నామమునుబట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేమంగీకరింపము,

17. మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చ బోవుచున్నాము; మేమును మా పితరులును మా రాజులును మా యధిపతులును యూదా పట్టణములలోను యెరూషలేము వీధుల లోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము; ఏలయనగా మేము ఆలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే యుంటిమి, యే కీడును మాకు కలుగలేదు.

విగ్రహపూజను వదలమని చెప్తూ అందుకు కారణాలు ఇస్తున్నారు. అంతటా మనుషులు చెప్పే కారణం ఇదే. వారి దేవత వారికి సిరిసంపదలను ప్రసాదిస్తూ, హాని కలగకుండా చూస్తూ ఉన్నదని వారి నమ్మకం. వారి పూజకు పునాది స్వార్థం. దేవుడు తన వాక్కులో చెప్పినది వారికి లెక్కలేదు. ఆ సంగతి గురించి సత్యం ఏమిటో సరైన ప్రవర్తన ఏమిటో అన్నది వారికి పట్టింపు లేదు. సజీవుడైన నిజ దేవుడు యెహోవా చేసిన మేళ్ళకోసం తమ దేవతను స్తుతించారు వాళ్ళు. అయితే వారిమీదికి చావునూ, నాశనాన్నీ తెచ్చిపెట్టేది ఆ దేవతను పూజించడం మానుకోవడం కాదు, దాన్ని పూజించడమే అని వారు ఏమాత్రం గ్రహించలేదు.

18. మేము ఆకాశరాణికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటినుండి సమస్తము మాకు తక్కువైనది, మేము ఖడ్గముచేతను క్షామముచేతను క్షీణించుచున్నాము.

19. మేము ఆకాశ రాణికి ధూపము వేయగాను, ఆమెకు పానార్పణములు అర్పింపగాను, మా పురుషుల సెలవులేకుండ ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా? ఆమెకు పానార్పణములు పోయుచున్నామా? అని వారు చెప్పగా

బైబిలుప్రకారం ఒక కుటుంబానికి నాయకుడు భర్త. అక్కడ జరిగే వాటికి బాధ్యత అతనిదే. తమ భార్యల విగ్రహారాధన గురించి వారికి తెలుసు గాని అందుకు వారేమీ చర్య తీసుకోలేదు.

20. యిర్మీయా ఆ స్త్రీ పురుషులందరితో, అనగా తనకు అట్లు ప్రత్యుత్తర మిచ్చిన ప్రజలందరితో ఇట్లనెను

కొద్దికాలం క్రితమే ఆ ప్రజకు జరిగినదాని సహాయంతో వారికి బుద్ధి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాడు యిర్మీయా. అయితే ప్రజలు తమ ఇష్టం వచ్చినట్టు జరిగించేందుకు నిశ్చయించుకొంటే, జరిగిన విషయాలు, బుద్ధికి అనుగుణమైన మాటలు ఎందుకు పనికొస్తాయి?

21. యూదాపట్టణముల లోను యెరూషలేము వీధులలోను మీరును మీ పితరులును మీ రాజులును మీ యధిపతులును దేశప్రజలును ధూపము వేసిన సంగతి యెహోవా జ్ఞాపకముచేసికొనలేదా? అదే గదా ఆయన మనస్సునకు వచ్చెను.

22. యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయకృత్యములను ఎంచి యికను సహింపలేకపోయెను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనము గాను ఆయన చేసెను.

23. యెహోవా మాట వినక, ఆయన ధర్మశాస్త్రమునుబట్టియు కట్టడలనుబట్టియు ఆయన తనకు సాక్ష్యార్థముగా ఇచ్చిన ఆజ్ఞనుబట్టియు నడువక, మీరు ధూపమువేయుచు యెహోవాకు విరోధముగా పాపము చేసితిరి గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను.

24. మరియయిర్మీయా ప్రజలనందరిని స్త్రీలనందరిని చూచి వారితో ఇట్లనెను ఐగుప్తులోనున్న సమస్తమైన యూదులారా, యెహోవా మాట వినుడి.

నీచమైన విగ్రహపూజతోనే వారు సరిపెట్టు కోలేదు. దాన్ని కొనసాగిస్తామని గంబీరమైన ప్రతిజ్ఞలు కూడా చేశారు.

25. ఇశ్రాయేలు దేవుడును, సైన్యములకధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఆకాశరాణికి ధూపము వేయుదు మనియు, ఆమెకు పానార్పణములు అర్పింతుమనియు, మేము మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను నిశ్చయముగా నెరవేర్చుదుమనియు మీరును మీ భార్యలును మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చుచున్నారే; నిజముగానే మీ మ్రొక్కుబళ్లను మీరు మ్రొక్కుదురు, నిజముగానే మీ మ్రొక్కులను మీరు నెరవేర్తురు.

26. కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా, యెహోవామాటవినుడియెహోవా సెలవిచ్చునదేమనగా ప్రభువగు యెహోవా అను నేను నా జీవముతోడు ప్రమాణము చేయుచు, ఐగుప్తులో నివసించు యూదు లలో ఎవరును ఇకమీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామముతోడు నేను ప్రమాణము చేయు చున్నాను.

దేవుని సత్యాన్ని నిరాకరించి విగ్రహాల వెంట పరుగులెత్తేవారు దేవుని పేర ఒట్టుపెట్టుకునేందుకు అనర్హులు.

27. మేలు చేయుటకు కాక కీడుచేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను; వారు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను క్షీణించిపోవుచు, ఐగుప్తుదేశములోనున్న యూదావారందరు శేషములేకుండ చత్తురు.

అప్పుడప్పుడు వ్యక్తులు, లేదా ప్రజా సమూహాలు, లేదా జనాలు, జాతులు వీటి ప్రవర్తనను చూచి వారికి మేలు కాదు కీడే చేస్తానని దేవుడు నిశ్చయించుకుంటాడని దీన్నిబట్టి నేర్చుకుందాం. మనుషులు అణుకువతో, భయంతో దేవుని కరుణ కోసం అడిగేలా చేసేందుకు ఈ ఒక్క సంగతి కారణమై ఉండాలి.

28. ఖడ్గము తప్పించుకొనువారు కొద్దిమందియై ఐగుప్తుదేశములో నుండి యూదాదేశమునకు తిరిగి వచ్చెదరు, అప్పడు ఐగుప్తుదేశములో కాపురముండుటకు వెళ్లిన యూదా వారిలో శేషము ఎవరి మాట నిలకడగా నుండునో, నాదో తమదో అది తెలిసికొందురు.

“నిలుస్తుందో”– నేటి ప్రపంచంలో ఒక వైపు బైబిలు ఉంది. అది దేవుని వాక్కు. మరోవైపు మనుషులు వ్రాసిన ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయి. వాటిలో వారి ఆలోచనలు, ఆశలు, భవిష్యత్తు గుర్తించి దేవుని వాక్కుకు వ్యతిరేకమైన ఊహాగానాలూ ఉన్నాయి. తన వాక్కును తు.చ. తప్పకుండా నెరవేర్చి (మత్తయి 5:18) ఎవరి మాటలు నిలుస్తాయో దేవుడు అందరికీ చూపిస్తాడు.

29. మీకు కీడు సంభవించు నట్లుగా నా మాటలు నిశ్చయముగా నిలుచునని మీకు తెలియబడుటకును, నేను ఈ స్థలమందు మిమ్మును శిక్షించు చున్నందుకును ఇది మీకు సూచనగా నుండును; ఇదే యెహోవా వాక్కు.

30. అతనికి శత్రువై అతని ప్రాణమును తీయ జూచుచుండిన నెబుకద్రెజరను బబులోను రాజుచేతికి నేను యూదారాజైన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తురాజైన ఫరోహొఫ్రను అతని శత్రువులై అతని ప్రాణమును తీయజూచువారి చేతికి అప్పగించెదను.

ఇది క్రీ.పూ. 570లో నెరవేరింది. హొఫ్ర అతని సింహాసనాన్ని ఆక్రమించాలని ఆశించినవారిచేత హతమయ్యాడు.Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |