6. అయితే వారు నా విధులను తృణీకరించి, నా కట్టడల ననుసరింపక దుర్మార్గత ననుసరించుచు, నా విధులను కట్టడలను త్రోసి వేసి తమ చుట్టునున్న అన్యజనుల కంటెను దేశస్థులకంటెను మరి యధికముగా దుర్మార్గులైరి
జెరుసలం ఎలా ఉండాలని దేవుడు ఆశించాడో ఆ విషయంలో అది పూర్తిగా విఫలమయింది. ఇతర జాతులకంటే జెరుసలంపై దేవుని సత్యం, వెలుగు ఎక్కువగా ప్రసరించింది గనుకా, అది ఆ సత్యం, వెలుగులనుండి తొలిగిపోయింది గనుకా ఇతర జాతులకంటే దాని చెడుతనం అధికం అయింది. దానికి దేవుడు అధికంగా ఇచ్చాడు కాబట్టి అధికంగానే దానినుండి ఆశించాడు. మత్తయి 11:20-24; లూకా 12:48 పోల్చి చూడండి. అందువల్ల దేవుడా నగరాన్ని ప్రపంచమంతటికీ ఒక గుణపాఠం తెలిపే ఉదాహరణగా చేస్తాడు. వ 8 లోని భయంకరమైన కఠిన వాక్కులను చూడండి – “నీ మీద నాకు విరుద్ధ భావం కలిగింది.” దేవుడే మనకు విరోధి అయితే మన పక్షాన ఉండేదెవరు?