“యెహోవా దినం”– ఈ మాటలు యోవేలు గ్రంథంలో మరి నాలుగు సార్లు కనిపిస్తాయి (యోవేలు 2:1, యోవేలు 2:11, యోవేలు 2:31; యోవేలు 3:14). అన్ని చోట్లా ఈ మాటలకు ఉన్న అర్థం ఒకటి కాదు అనుకోవడానికి సరైన కారణాలు కనిపించవు. యోవేలు గతంలో జరిగిన దాన్ని గురించి మాట్లాడుతూ హఠాత్తుగా భవిష్యత్తులో రాబోయే మరింత గొప్ప సంఘటనను చూస్తున్నాడు. గతంలో జరిగినది రాబోయే దానికి ఒక చిన్న సాదృశ్యం మాత్రమే. “యెహోవా దినం” అనే మాట బైబిలులో ఇతర పుస్తకాల్లో కూడా కనిపిస్తుంది – యెషయా 13:6, యెషయా 13:9; యెహెఙ్కేలు 13:5; యెహెఙ్కేలు 30:3; ఆమోసు 5:18, ఆమోసు 5:20; ఓబద్యా 1:15; జెఫన్యా 1:7, జెఫన్యా 1:14; మలాకీ 4:5. క్రొత్త ఒడంబడికలో రాబోయే ఆ కాలానికి “ప్రభు దినం” అనే పేరు ఇవ్వబడింది. 1 థెస్సలొనీకయులకు 5:2; 2 థెస్సలొనీకయులకు 2:2; 2 పేతురు 3:10 చూడండి. యెహోవా దినం అంటే ఈ యుగాంతంలో క్రీస్తు ఈ లోకానికి తిరిగి వచ్చే సమయంలో జరిగే సంభవాలను గురించినది.
“ఆసన్నమైంది”– పైన ఇచ్చిన రిఫరెన్సుల్లో చాలా చోట్ల యెహోవా దినం దగ్గర పడిందన్న మాట ఉంది. ఆ దినం ఇప్పటికీ ఇంకా రానప్పుడు ప్రవక్తలు తమ కాలంలోనే అది అంత సమీపంగా ఉందని ఎలా చెప్పగలిగారు? దీనికి వేరు వేరు వివరణలు ఇయ్యవచ్చు. “ఆసన్నమైంది” అంటే “త్వరలో రాబోతూ ఉంది” అని అర్థం కాకపోవచ్చు. సిద్ధంగా ఉంది, కాలం పరిపక్వమైనట్టు దేవుడు భావించగానే వచ్చేందుకు సిద్ధంగా ఉంది అని అర్థం కావచ్చు. రోమీయులకు 13:11-12; ప్రకటన గ్రంథం 1:3 నోట్స్ చూడండి. లేక దేవుడు తన స్వంత విధానంలో ఆ సమయం గురించి ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడని చెప్పవచ్చు (2 పేతురు 3:8-9 పోల్చి చూడండి – ఆయన తన సేవకుల ద్వారా మాట్లాడాక జరిగిపోయిన సమయం ఆయన దృష్టిలో మూడు రోజుల్లాగా ఉంది). లేక మరో విధంగా చెప్పాలంటే యోవేలుకు (ఇతర ప్రవక్తలు కూడా) ఈ యుగాంతంలో జరిగే సంభవాల గురించిన దర్శనం వచ్చింది. వారు యుగాంతంలో ఉన్నట్టున్నారు. ఆ దృష్టితో చూస్తే యెహోవా దినం దగ్గర పడింది (హబక్కూకు 2:3 పోల్చి చూడండి).
“నాశనంగా”– యెహోవా దినం గురించి మరిన్ని వర్ణనలు యెషయా 2:10-21; యెషయా 24:1-13; ప్రకటన 15—16 అధ్యాయాలు చూడండి.