John - యోహాను సువార్త 20 | View All

1. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను.

1. ఆ రోజు ఆదివారం. ‘మగ్దలేనే’కు చెందిన మరియ చీకటి ఉండగా లేచి ఆ సమాధి దగ్గరకు వెళ్ళింది. దాని ద్వారానికి ఉన్న రాయి తీసి వేయబడి ఉండటం గమనించింది.

2. గనుక ఆమె పరుగెత్తికొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యునియొద్దకును వచ్చిప్రభువును సమాధిలోనుండి యెత్తికొనిపోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగమని చెప్పెను.

2. అందువల్ల ఆమె సీమోను పేతురు దగ్గరకు, ‘యేసు ప్రేమించిన యింకొక శిష్యుని’ దగ్గరకు పరుగెత్తుకొంటూ వెళ్ళి, వాళ్ళతో, ‘ఎవరో ప్రభువును సమాధి నుండి తీసుకు వెళ్ళారు. ఎక్కడ ఉంచారో తెలియదు’ అని అన్నది.

3. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధియొద్దకు వచ్చిరి.

3. పేతురు, ‘ఆ యింకొక శిష్యుడు’ సమాధి చూడటానికి బయలుదేరి వెళ్ళారు.

4. వారిద్దరును కూడి పరుగెత్తుచుండగా, ఆ శిష్యుడు పేతురుకంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధియొద్దకు వచ్చి

4. వాళ్ళు కలిసి పరుగెత్తుకుంటూ వెళ్లారు కాని, ‘ఆ యింకొక శిష్యుడు’ పేతురు కన్నా ముందు పరుగెత్తి సమాధిని మొదట చేరుకున్నాడు.

5. వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు.

5. అతడు తొంగి లోపల చూసాడు. అక్కడ పడివున్న నారబట్టలు అతనికి కనిపించాయి. కాని అతడు లోపలికి వెళ్ళలేదు.

6. అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి, సమాధిలో ప్రవేశించి,

6. అతని వెనుక వస్తున్న పేతురు వచ్చి సమాధిలోకి వెళ్ళాడు. అక్కడ పడి ఉన్న బట్టల్ని చూసాడు.

7. నారబట్టలు పడియుండుటయు, ఆయన తల రుమాలు నార బట్టలయొద్ద ఉండక వేరుగా ఒకటచోట చుట్టిపెట్టియుండుటయు చూచెను.

7. వాటినే కాక యేసు తల చుట్టూ చుట్టబడిన వస్త్రాన్ని కూడా చూసాడు. మడత పెట్టబడిన తల వస్త్రం నారబట్టలతో కాక వేరుగా ఉంచబడి ఉంది.

8. అప్పుడు మొదట సమాధియొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను.

8. సమాధి దగ్గరకు ముందు వెళ్ళిన శిష్యుడు కూడా తర్వాత లోపలికి వెళ్ళాడు. ఆ దృశ్యం చూసి విశ్వసించాడు.

9. ఆయన మృతులలోనుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి.
కీర్తనల గ్రంథము 16:10

9. ‘యేసు బ్రతికి వస్తాడని’ లేఖనాల్లో వ్రాయబడిన విషయం వాళ్ళకు యింకా అర్థంకాలేదు.

10. అంతట ఆ శిష్యులు తిరిగి తమ వారియొద్దకు వెళ్లిపోయిరి.

10. ఆ తర్వాత శిష్యులు తమ తమ యిండ్లకు వెళ్ళిపొయ్యారు.

11. అయితే మరియ సమాధి బయట నిలిచి యేడ్చు చుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా,

11. కాని, మరియ సమాధి బయట దుఃఖిస్తూ నిలుచొని ఉంది. ఆమె దుఃఖం ఆగలేదు. సమాధిలోకి తొంగి చూసింది.

12. తెల్లని వస్త్రములు ధరించిన యిద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్లవైపున ఒకడును కూర్చుండుట కనబడెను.

12. తెల్లటి దుస్తుల్లో ఉన్న యిద్దరు దేవదూతలు అక్కడ కూర్చొని ఉండటం ఆమె గమనించింది. యేసు దేహాన్ని ఉంచిన చోట ఒక దేవదూత తల వైపు, మరొక దేవదూత కాళ్ళ వైపు కూర్చొని ఉన్నారు.

13. వారు అమ్మా, యెందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమెనా ప్రభువును ఎవరో యెత్తికొని పోయిరి; ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను.

13. వాళ్ళామెను, “ఎందుకు దఃఖిస్తున్నావమ్మా?” అని అడిగారు. ఆమె”వాళ్ళు నా ప్రభువును తీసుకు వెళ్ళారు. ఆయన్ని ఎక్కడ ఉంచారో నాకు తెలియదు” అని అన్నది.

14. ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.

14. అలా అన్నాక వెనక్కు తిరిగింది. అక్కడ యేసు నిలుచొని ఉండటం చూసింది. కాని ఆయనే ‘యేసు’ అని ఆమె గుర్తించలేదు.

15. యేసు అమ్మా, యందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకు చున్నావు? అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా, నీవు ఆయనను మోసికొని పొయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను.

15. ఆయన, “ఎందుకు విలపిస్తున్నావమ్మా! ఎవరి కోసం చూస్తున్నావు?” అని అడిగాడు. అతడొక తోటమాలి అనుకొని, “అయ్యా మీరాయన్ని ఎత్తుకుపోయి ఉంటే ఎక్కడ ఉంచారో చెప్పండి. నేను వెళ్ళి తెచ్చుకుంటాను” అని అంది.

16. యేసు ఆమెను చూచిమరియా అని పిలిచెను. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము.

16. యేసు ఆమెను ‘మరియా’ అని పిలిచాడు. ఆమె ఆయన వైపు చూసి హీబ్రూ భాషలో ‘రబ్బూనీ!’ అని అన్నది. రబ్బూనీ అంటే బోధకుడు అని అర్థం.

17. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.

17. యేసు, “నేనింకా తండ్రి దగ్గరకు వెళ్ళలేదు కనుక నన్ను తాకవద్దు. నా సోదరుల దగ్గరకు వెళ్ళి నాకు, మీకు తండ్రి, దేవుడు అయినటువండి వాని దగ్గరకు వెళ్తున్నాని చెప్పు” అని అన్నాడు.

18. మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను.

18. మగ్దలేనే మరియ శిష్యుల దగ్గరకు వెళ్ళింది. తాను ప్రభువును చూసిన వార్త, ప్రభువు తనకు చెప్పిన సందేశము, వాళ్ళతో చెప్పింది.

19. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసి కొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను.

19. ఆ ఆదివారం సాయంకాలం శిష్యులందరు ఒకే చోట సమావేశమయి ఉన్నారు. యేసు వచ్చి వాళ్ళ మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగు గాక!” అని అన్నాడు.

20. ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి.

20. ఇలా అన్నాక ఆయన తన చేతుల్ని, ప్రక్క భాగాన్ని చూపించాడు. ప్రభువును చూసాక శిష్యులకు చాలా ఆనందం కలిగింది.

21. అప్పుడు యేసుమరల మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను.

21. యేసు మళ్ళీ, “మీకు శాంతి కులుగు గాక! తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను” అని అన్నాడు.

22. ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊది పరిశుద్ధాత్మమ పొందుడి.

22. ఇలా అన్నాక, “పవిత్రాత్మను పొందండి!” అని వాళ్ళపై ఊదాడు.

23. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండ నిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను.

23. ఆ తర్వాత, “మీరు ఎవరి పాపాలు క్షమిస్తే వారి పాపాలు క్షమింప బడతాయి. మీరు ఎవరి పాపాలు క్షమింతకపోతే వారి పాపాలు క్షమించబడవు” అని వాళ్ళతో అన్నాడు.

24. యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను

24. యేసు వచ్చినప్పుడు పండ్రెండుగురిలో ఒకడైన తోమా శిష్యుల్తోలేడు. ఇతణ్ణి ‘దిదుమ’ అని పిలిచే వాళ్ళు.

25. గనుక తక్కిన శిష్యులుమేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను.

25. మిగత శిష్యులు తోమాతో ‘మేము ప్రభువును చుసాము’ అని అన్నారు. కాని తోమా, “నేను స్వయంగా ఆయన చేతులకున్న మేకుల గాయాల్ని చూసి, వాటిని చేతుల్తో తాకి, ఆయన ప్రక్క డొక్కపై నా చేతుల్ని ఉంచాక ఆయన్ని నమ్ముతాను” అని అన్నాడు.

26. ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగును గాక అనెను.

26. ఒక వారం రోజుల తర్వాత యేసు శిష్యులు ఒక యింట్లో ఉన్నారు. తోమా కూడా వాళ్ళతో ఉన్నాడు. తలుపులు మూసి వేసి ఉన్నా యేసు లోపలికి వచ్చి వాళ్ళ మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగుగాక!” అని అన్నాడు.

27. తరువాత తోమాను చూచినీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.

27. యేసు తోమాతో, “నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. నా ప్రక్క భాగంపై నీ చేతుల్ని ఉంచు! ఇక అనుమానించకు” అని అన్నాడు.

28. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను.

28. తోమా ఆయనతో, “దేవా! నా ప్రభూ!” అని అన్నాడు.

29. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను.

29. అప్పుడు యేసు అతనితో, “నన్ను చూసావు కనుక నమ్మావు. నన్ను చూడకున్నా విశ్వసించే వాళ్ళు ధన్యులు” అని అన్నాడు.

30. మరియు అనేకమైన యితర సూచకక్రియలను యేసు తన శిష్యులయెదుట చేసెను; అవి యీ గ్రంథమందు వ్రాయబడియుండలేదు గాని

30. నేను ఈ గ్రంథంలో వ్రాసినవే కాక, యేసు ఇంకా అనేకమైన మహాత్కార్యాలు చేసాడు. వాటన్నిటినీ శిష్యులు చూసారు.

31. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.

31. యేసు ‘క్రీస్తు’ అని, ‘దేవుని కుమారుడని’ ఆయన్ని విశ్వసించిన వాళ్ళకు ఆయన పేరిట అనంత జీవితం లభిస్తుందని మీరు నమ్మాలనే ఉద్దేశ్యంతో యివి వ్రాయబడ్డాయి.



Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |