John - యోహాను సువార్త 20 | View All

1. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను.

అన్ని శుభవార్తల రచయితలు క్రీస్తు చనిపోయి సజీవంగా లేచిన ఘన సత్యాన్ని రాశారు. అయితే నలుగురూ ఒకే విధమైన మాటలు ఉపయోగించలేదు. అందరూ ఒకే వివరాలు రాయలేదు. ఒక శుభవార్తలో కనిపించే వ్యక్తులందరి గురించీ అందరు శుభవార్త రచయితలూ రాయలేదు. ఉదాహరణకు ఇక్కడ మగ్దలేనే మరియ సమాధి దగ్గరికి రావడం గురించి యోహాను రాశాడు. మత్తయి అయితే వేరొక మరియ ఆమెతో ఉందని రాశాడు. సలోమి కూడా వెంట వెళ్ళిందని మార్కు రాశాడు. లూకా కొందరు స్త్రీలు వచ్చారని రాస్తూ యోహన్న అనే ఆమె పేరు కూడా చెప్పాడు. వీటిలో ఏది నిజం? అన్నీ నిజమే. వారిలో ఒకామె సమాధి దగ్గరికి వచ్చిందని రాస్తే మరి ఇతరులెవరూ రాలేదని అర్థం కాదు.

2. గనుక ఆమె పరుగెత్తికొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యునియొద్దకును వచ్చిప్రభువును సమాధిలోనుండి యెత్తికొనిపోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగమని చెప్పెను.

“మాకు”– ఆమెతో వచ్చిన ఇతర స్త్రీలతో కలుపుకుని మాట్లాడుతున్నది. యేసుప్రభువు సజీవంగా లేస్తాడని వారు అర్థం చేసుకోలేదు. ఎవరో శత్రువులు ఆయన దేహాన్ని ఎత్తుకుపోయారు అనుకున్నారు. నిజానికి ఆయన శిష్యుల్లో ఎవరూ ఆయన మాటల్ని గానీ ఆయన పునర్జీవితం గురించి పాత ఒడంబడిక లేఖనాలను గానీ అర్థం చేసుకోలేదు.

3. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధియొద్దకు వచ్చిరి.

యేసు దేహాన్ని శిష్యులు ఎత్తుకు పోలేదని వారికి తెలుసు, కాబట్టి ఏమి జరిగిందో తెలుసుకోవాలని ఆత్రుతగా ఉన్నారు. ఇప్పుడు దీన్ని గురించిన యథార్థాన్ని తెలుసుకునేందుకు అందరు కూడా ఆసక్తి కలిగి ఉండాలి.

4. వారిద్దరును కూడి పరుగెత్తుచుండగా, ఆ శిష్యుడు పేతురుకంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధియొద్దకు వచ్చి

5. వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు.

6. అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి, సమాధిలో ప్రవేశించి,

యేసు దేహానికి యోసేపు, నీకొదేము ఆ బట్టలు చుట్టారు (యోహాను 19:40). ఎవరైనా ఆయన మృత దేహాన్ని దొంగిలించేందుకు వస్తే ఆ గుడ్డలన్నిటినీ ఓపిగ్గా విప్పరు. ఆయన తలకు చుట్టిన గుడ్డ మళ్ళీ చుట్టిపెట్టరు. అలాంటివారు హడావుడిగా అలానే గుడ్డలు చుట్టిన దేహాన్ని అదే విధంగా ఎత్తుకుపోయేవారు, లేదా ఆ గుడ్డలను గబగబా చింపేసి ఎక్కడ పడితే అక్కడ పారేసేవారు గదా. యోహాను దీన్ని చూచిన వెంటనే అర్థం చేసుకున్నాడు. యేసు సజీవంగా లేచిన సంగతి గురించిన నోట్ కోసం మత్తయి 28:6 చూడండి.

7. నారబట్టలు పడియుండుటయు, ఆయన తల రుమాలు నార బట్టలయొద్ద ఉండక వేరుగా ఒకటచోట చుట్టిపెట్టియుండుటయు చూచెను.

8. అప్పుడు మొదట సమాధియొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను.

9. ఆయన మృతులలోనుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి.
కీర్తనల గ్రంథము 16:10

10. అంతట ఆ శిష్యులు తిరిగి తమ వారియొద్దకు వెళ్లిపోయిరి.

11. అయితే మరియ సమాధి బయట నిలిచి యేడ్చు చుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా,

ఈమె మగ్దలేనే మరియ (వ 18). శిష్యుల వెనకే ఆమె మళ్ళీ సమాధి దగ్గరికి వచ్చింది. యేసుప్రభువు చనిపోయి సజీవంగా లేచిన తరువాత మొదటిసారిగా ఆయన్ను చూచినది ఆమె. ఆయన మొట్టమెదటిగా తన తల్లికి గానీ తన శిష్యుల్లో ఎవరికైనా గానీ కనిపించకుండా ఆమెకు కనిపించడం వింతగా అనిపిస్తుంది. తక్కువ తెలిసి, నమ్మకం బలహీనంగా ఉండి, ప్రేమ మాత్రం బలంగా ఉన్న ఆ స్త్రీ పై ఆయనకు జాలి కలిగింది.

12. తెల్లని వస్త్రములు ధరించిన యిద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్లవైపున ఒకడును కూర్చుండుట కనబడెను.

మొదట మరియతో వచ్చిన స్త్రీలు ఒకే దేవదూతను చూశారు. అతడు సమాధి బయట రాయిపై కూర్చుని ఉన్నాడు. (మత్తయి 28:1-7). మరియ చూచిన ఇద్దరు దేవదూతలు సమాధి లోపల ఉన్నారు. పేతురు, ఈ మరో శిష్యుడు లోపలికి వెళ్లినప్పుడు వారక్కడ లేరు. వారి ఆకారం బహుశా మనుషుల్లాగా ఉందేమో. దేవదూతల గురించి నోట్ ఆదికాండము 16:7 చూడండి.

13. వారు అమ్మా, యెందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమెనా ప్రభువును ఎవరో యెత్తికొని పోయిరి; ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను.

చనిపోయినవారిని తగిన విధంగా సమాధి చేయడం గురించి యూదులకు బాగా పట్టింపు. సమాధి దొంగలు వచ్చి యేసు దేహాన్ని ఎత్తుకుపోవడం ద్వారా ఆయన దేహానికి ఇవ్వవలసిన మర్యాదను భంగపరిచారని అనుకుని మరియ దుఃఖపడుతుంది.

14. ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.

యోహాను 21:4; మత్తయి 28:17; లూకా 24:16, లూకా 24:37. యేసు సజీవంగా లేచిన తరువాత ఆయన ఆకారం చనిపోకముందు ఆకారానికి కొంత భిన్నంగా ఉన్నట్టుంది. అందువల్ల మరియ వెంటనే ఆయన్ను గుర్తించలేదు. అంతేగాక తాను ఆయన్ను అలా చూస్తానని ఎంతమాత్రం ఊహించి ఉండదు. పైగా ఆమె తల వంచుకుని ఏడుస్తూ ఉండడంవల్ల ఆయన ముఖంకేసి చూడలేదేమో.

15. యేసు అమ్మా, యందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకు చున్నావు? అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా, నీవు ఆయనను మోసికొని పొయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను.

దీనికి జవాబు యేసుకు బాగా తెలుసు. యోహాను 6:5-6; యోహాను 11:34 పోల్చి చూడండి. ఈ ప్రశ్నలో సున్నితమైన మందలింపు ధ్వనించడం లేదా? లూకా 24:5 పోల్చి చూడండి. (దేవుడేమి చేస్తున్నాడో తెలియక కొన్ని సార్లు క్రీస్తు శిష్యులు ఆనందించవలసిన సందర్భాల్లో ఏడుస్తుంటారు). “తోటమాలి”– ఆ సమాధి ఒక తోటలో ఉంది (యోహాను 19:41). ఆ ప్రాంతాల్లో తోటమాలి ఉంటాడని మరియ అనుకొని ఉంటుంది.

16. యేసు ఆమెను చూచిమరియా అని పిలిచెను. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము.

ఆమె ఆయన్ను గుర్తుపట్టలేదు గానీ ఆయన స్వరం తెలుసు. పరిచయం లేని వ్యక్తి ఎవరూ తననలా పేరుతో పిలవరని కూడా ఆమెకు తెలుసు. ఆయనవైపు తిరిగి మరింత శ్రద్ధగా ఆయన వంక చూచినప్పుడు ఆయన్ను గుర్తు పట్టింది.

17. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.

“అంటిపెట్టుకొని ఉండబోకు”– బహుశా మరియ నేలపై పడి ఆయన పాదాలు పట్టుకొని ఉండవచ్చు. మత్తయి 28:9 పోల్చి చూడండి. యేసు ఇచ్చిన జవాబుకు అర్థం ఇదై ఉండవచ్చు – “నన్ను నీవు గట్టిగా పట్టుకోనక్కర్లేదు. నేను ఇంత త్వరలో ఎక్కడికీ వెళ్ళిపోను. నన్ను మళ్ళీ చూచే అవకాశం నీకు కలుగుతుంది”, లేదా “నన్ను ఈ లోకంలోనే ఉంచెయ్యాలని చూడవద్దు. మనుషుల విముక్తి కోసం దేవుడు చేసిన ఏర్పాటు పూర్తిగా నెరవేరాలంటే నేను పరలోకానికి వెళ్ళిపోవలసి ఉంది” అని ఆయన అర్థం కావచ్చు. “సోదరులు”– శారీరకంగా తన తమ్ముళ్ళ (యోహాను 2:12; యోహాను 7:3, యోహాను 7:5, యోహాను 7:10) గురించి కాదు గాని తన శిష్యులను ఉద్దేశించే ఈ మాట చెప్పాడని అనుకోవడంలో సందేహం లేదు. మత్తయి 12:47-50; హెబ్రీయులకు 2:10-12 పోల్చి చూడండి. “నా తండ్రి...మీ దేవుడు”– “మన తండ్రి, మన దేవుడు” అనలేదు యేసు. దేవుడు విశ్వాసులకు తండ్రి గానీ యేసుకు వేరే విధంగా తండ్రి. యేసు శాశ్వతుడైన దేవకుమారుడు (యోహాను 1:1, యోహాను 1:14, యోహాను 1:18). విశ్వాసులు దుర్బలులైన మానవమాత్రులే. వారు నూతన జన్మద్వారా, దేవుని కృపవల్ల మాత్రమే దేవుని సంతానం అయ్యారు (యోహాను 1:12-13). “వెళ్ళిపోతున్నాను”– యోహాను 14:28; మార్కు 16:14; లూకా 24:51; అపో. కార్యములు 1:9-11.

18. మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను.

యేసు సజీవంగా లేవడం గురించి ఇతరులకు తెలియపరచిన మొదటి సాక్షి మగ్దలేనే మరియ.

19. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసి కొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను.

“భయం కారణంగా”– అంతకుముందే యేసును శత్రువులు సిలువ వేయడం వారు చూశారు. యేసుప్రభువు సంగతి ఏమౌతున్నదో వారికి తెలియదు. ఇది వారిలోని భయాన్ని తొలగించివేసి గొప్ప దైర్యాన్నిచ్చే సంఘటన, అంటే వారిలో పవిత్రాత్మ నిండడం అన్నది ఇంకా జరగలేదు. “యేసు వచ్చి”– చనిపోయి లేచిన క్రీస్తు దేహం మూసి తాళం వేసి ఉన్న తలుపుల గుండా కూడా పోగలదు. ఆ దేహం అంతకుముందున్న దేహమే (వ 20,27), కానీ చాలా మార్పు చెందిన దేహం. ఇష్టం వచ్చినట్టుగా ప్రత్యక్షం అయ్యాడు, మాయం అయ్యాడు (లూకా 24:31, లూకా 24:36-37).1 కోరింథీయులకు 15:42-44; ఫిలిప్పీయులకు 3:21 చూడండి. “శాంతి”– ఆయన ఈ లోకానికి రావడంలోని ఉద్దేశానికి అనుగుణమైన పదం (లూకా 2:13-14; లూకా 14:27).

20. ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి.

వ 27. తాను నిజంగా వారి యేసుప్రభువునేననీ సిలువ మరణం అనుభవించిన తన దేహంతోనే సజీవంగా లేచానని ఆయన వారికి రుజువు చేస్తున్నాడు. లూకా 24:36-43 పోల్చి చూడండి. వారాయన్ను చూచినప్పుడు వారికి కలిగిన ఆనందం ఆయన యోహాను 16:20-22 లో వారికి చెప్పిన మాటలకు నెరవేర్పు. ఆయన మరణంలో వారి ఆనందం, ఆశాభావమంతా మరణించింది (లూకా 24:21) ఆయన సజీవంగా లేవడంలో వాటికి ఊపిరి వచ్చింది. 1 పేతురు 1:3 పోల్చి చూడండి.

21. అప్పుడు యేసుమరల మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను.

“పంపుతున్నాను”– యోహాను 17:18; మత్తయి 28:18-20; మార్కు 16:15; లూకా 24:46-48 చూడండి. ఆయన తాను తండ్రికి ప్రతినిధిగా వచ్చినట్టే, తన శిష్యులను తనకు ప్రతినిధులుగా అధికారమిచ్చి పంపుతున్నాడు. ఆయన ప్రకటించిన శుభవార్తనే వారు తీసుకు వెళ్తారు. ఆయనలాగే వారు దేవుని ఆత్మతో వెళ్తారు (వ 22).

22. ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊది పరిశుద్ధాత్మమ పొందుడి.

ఒక సంకేతంగా ఉన్న ఈ పని వారికి జీవం, బలప్రభావాలు, పవిత్రాత్మ సన్నిధి వచ్చేది యేసునుంచే అని సూచిస్తున్నది. ఆయన వారిని పంపుతున్నాడు. వారు చేయవలసిన పనికి ఆత్మ సంబంధమైన సామర్థ్యతను వారికిస్తాడు. ఈ వచనాన్ని ఆదికాండము 2:7 తో పోల్చి చూస్తే బావుంటుంది. వీరు ఇక్కడ ఒక విధంగా పవిత్రాత్మను పొందారన్నట్టు అనిపిస్తున్నది. అంటే అంతకు ముందు వారితో పవిత్రాత్మ లేడని కాదు. పాత ఒడంబడిక కాలంలో సైతం దేవుని ఆత్మ సన్నిధిని గురించీ పని గురించీ విశ్వాసులకు కొంత తెలుసు (నిర్గమకాండము 31:3; న్యాయాధిపతులు 3:10; 1 సమూయేలు 10:6; 1 సమూయేలు 16:13; 2 సమూయేలు 23:2; కీర్తనల గ్రంథము 51:11; మొ।।). అయితే ఇప్పుడు యేసుప్రభువు ఒక కొత్త రీతిలో దేవుని ఆత్మను వారికిస్తున్నాడు. ఈ సమయంలో వారికి ప్రత్యేకమైన జ్ఞానాన్ని, లేఖనాల విషయంలో గ్రహింపును ఇచ్చాడని అనుకోవచ్చు (లూకా 24:45 పోల్చి చూడండి). ఆయన పవిత్రాత్మను వారిలో నివాసముండే సన్నిధిగా ఇచ్చాడని అనుకోవచ్చు (యోహాను 7:39; యోహాను 14:17). తన ప్రతినిధులుగా పరిచర్య చేసేందుకు వారికి అధికారాన్ని ఇస్తున్నాడన్నది స్పష్టమే. తరువాత ఆయన వారికి ఆత్మను మరింత ధారాళంగా ఇవ్వనున్నాడు (అపో. కార్యములు 1:4-5; అపో. కార్యములు 2:1-4).

23. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండ నిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను.

మత్తయి 16:19; మత్తయి 18:15-18 పోల్చి చూడండి. యేసుప్రభువు తన సంఘ స్థాపకులతో (అంటే మానవపరంగా), ప్రతినిధులతో మాట్లాడుతున్నాడు. అంటే భూమిపై ఉన్న ఆయన సంఘం (క్రీస్తు విశ్వాసులందరితో ఏర్పడిన సంఘం) దేవుని ఆత్మను పొంది ఎలాంటి మనుషులకు క్షమాపణ దొరుకుతుందో, ఎవరికి క్షమాపణ లేదో ప్రకటించగలుగుతుంది. పాపాలను క్షమించేదీ, క్షమించకపోయేదీ దేవుడే (మార్కు 2:7 నోట్. కీర్తనల గ్రంథము 103:3; కీర్తనల గ్రంథము 130:4 కూడా చూడండి). ఎలాంటివారిని క్షమించాలో ఎలాంటి వారిని క్షమించకూడదో నిర్ణయించేది కూడా దేవుడే. ఆయన దీన్ని ఇదివరకే నిర్ణయించాడు – లూకా 24:46-47; అపో. కార్యములు 10:43; అపో. కార్యములు 13:38-39; ఎఫెసీయులకు 1:7; 1 యోహాను 1:9. పశ్చాత్తాపపడి క్రీస్తులో నమ్మకం పెట్టుకునేవారినే దేవుడు క్షమిస్తాడు. క్షమాపణ ఆయన ఉచితంగా ఇచ్చేదే. ఈ సత్యాన్ని ప్రకటించడం క్రీస్తు సంఘం చెయ్యవలసిన పని. పాత ఒడంబడిక గ్రంథంలో ఇలాంటిదాని కోసం 2 సమూయేలు 12:13 చూడండి. పాత ఒడంబడిక ప్రవక్తలు ఫలానా విషయాలు చేస్తారని దేవుడు చెప్పినప్పుడు వారు వాటిని ప్రకటిస్తారని అర్థం. క్రీస్తు రాయబారులు చేసినది సరిగ్గా ఇదే. క్రీస్తు శుభవార్తను ప్రకటించడం ద్వారా నమ్మేవారందరికీ క్షమాపణ ద్వారాన్ని వారు తెరిచారు. నమ్మని వారందరికీ దాన్ని మూసివేశారు. పాపాలను క్షమించే దేవుని వైపుకు వ్యక్తులను మళ్ళించారు. మత్తయి 6:12; లూకా 11:4 లో మనం పాపక్షమాపణ కోసం ఎవర్ని అడగాలో యేసు నేర్పించాడు. క్రీస్తుసంఘం గానీ అందులోని సభ్యుడెవరైనా గానీ ఈ భూమిపై ఎవరితోనైనా ఇలా అనవచ్చు “నీవు యేసుప్రభువుపై నమ్మకం ఉంచితే నీ పాపాలన్నిటికీ క్షమాపణ ఉంది”. విశ్వాసులందరితో వారు ఇలా అనవచ్చు, “మీ పాపాలను మీరు ఒప్పుకుంటే ఆయన మిమ్మల్ని క్షమించి అన్యాయమంతటి నుంచీ మిమ్మల్ని శుద్ధి చేస్తాడు”. క్రీస్తు క్రైస్తవుల్లో నుంచి ఏ ప్రత్యేక గుంపునూ గురువులుగా, యాజులుగా నియమించలేదు, ఇలాంటి సత్యాన్ని కేవలం వారే ప్రకటించాలని ఎవరినీ ఎన్నుకోలేదు.

24. యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను

25. గనుక తక్కిన శిష్యులుమేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను.

అందుకే ఇతణ్ణి కొన్నిసార్లు “సందేహి అయిన తోమా” అంటారు. ఇతర శిష్యుల సాక్ష్యాన్ని అతడు నమ్మేందుకు సమ్మతించి ఉండవలసింది.

26. ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగును గాక అనెను.

వ 19.

27. తరువాత తోమాను చూచినీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.

బలహీనమైన నమ్మకం గలిగి సందేహించే శిష్యులపట్ల కూడా ప్రభువు ఎంత జాలి, ప్రేమ చూపిస్తున్నాడో చూడండి. ఆయన తోమాకు (వారందరికీ) సిలువ మరణం అనుభవించిన నిజమైన దేహాన్ని చూపించాడు. ఆ దేహం సిలువ వేయబడిందని దానిలో స్పష్టమైన గుర్తులు ఉన్నాయి. ఆయన సజీవంగా లేచాడని ఆ సాక్ష్యాధారాన్నీ ఆ రుజువునూ తోమా నమ్మాలని గట్టిగా చెప్పాడు. “అవిశ్వాసాన్ని విడిచిపెట్టి నమ్ము” అని ఈ రోజున కూడా మనందరికీ ఆయన చెప్తున్నాడు.

28. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను.

తన ప్రజల తప్పులను దేవుడు మేలుగా మారుస్తాడు. తోమా సందేహం మూలంగా క్రీస్తు తనను తాను వెల్లడి చేసుకొన్నందువల్ల తోమా ఈ విధంగా తన నమ్మకాన్ని ప్రకటించిన ఈ ఉత్తమమైన మాటలు మనకు లభించాయి. తోమా యూదుడు. పాత ఒడంబడిక గ్రంథాన్ని అభ్యసించాడు. యేసుప్రభువు ఉపదేశాలను మూడేళ్ళపాటు విన్నాడు. ఒకే ఒక దేవుడు ఉన్నాడనీ ఇతర దేవుళ్ళెవరైనా ఒక వ్యక్తికి ఉండడం అన్ని పాపాల్లోకీ అతి హీనమైనదనీ అతనికి బాగా తెలుసు (మత్తయి 4:10; నిర్గమకాండము 20:1-4; ద్వితీయోపదేశకాండము 6:4-5; యెషయా 43:11; యెషయా 44:6; యెషయా 45:5 చూడండి). అతడు యేసును “నా ప్రభూ, నా దేవా” అన్నప్పుడు యేసు పాత ఒడంబడిక గ్రంథంలో వెల్లడైన సత్యయేక దేవుడు యెహోవా అవతారమని తన దృఢ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడన్న మాట. యోహాను 1:1, యోహాను 1:14, యోహాను 1:18; యోహాను 5:17-18; యోహాను 8:24, యోహాను 8:58; యోహాను 10:30-33 చూడండి. లూకా 2:11; ఫిలిప్పీయులకు 2:6 నోట్స్‌లో ఇతర రిఫరెన్సులు చూడండి.

29. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను.

యేసుప్రభువు అతని మాటలకు అంగీకరించాడు. తాను ప్రభువనీ దేవుడనీ యేసుకు తెలిసి ఉండని పక్షంలో ఆయన ఇలా ఏమాత్రమూ అంగీకరించేవాడు కాదు. మానవమాత్రులు వారు మంచివారై న్యాయవంతులై ఉంటే ఇలా దేవునికే చెందవలసినవాటిని స్వీకరించరు (అపో. కార్యములు 14:13-15 పోల్చి చూడండి). “ధన్యులు”– తోమా నమ్మినట్టు, యేసు చనిపోయి సజీవంగా లేచాడనీ, ఆయనే ప్రభువు, నిజ దేవుడనీ, ఆయన మన దేవుడనీ నమ్మిన ప్రతి ఒక్కరికీ కూడా ఈ నాడు ఈ ధన్యత కలుగుతుంది (రోమీయులకు 10:9-10 పోల్చి చూడండి). ధన్యత గురించి ఆదికాండము 12:3; సంఖ్యాకాండము 6:23-27; కీర్తనల గ్రంథము 1:1-3; కీర్తనల గ్రంథము 119:1; మత్తయి 5:3-10 నోట్స్ చూడండి. దీనికి వ్యతిరేకం కూడా నిజమే. నమ్మనివారు ధన్యులని దేవుడు చెప్పడు. యోహాను 3:18, యోహాను 3:36; మార్కు 16:16 చూడండి.

30. మరియు అనేకమైన యితర సూచకక్రియలను యేసు తన శిష్యులయెదుట చేసెను; అవి యీ గ్రంథమందు వ్రాయబడియుండలేదు గాని

“అనేక”– యోహాను 21:25. వీటిలో కొన్ని ఇతర శుభవార్త పుస్తకాల్లో రాసి ఉన్నాయి. యేసు చేసిన సూచకమైన అద్భుతాల్లో కొన్నింటిని యోహాను ప్రత్యేకంగా ఒక ప్రత్యేక ఉద్దేశంతో ఏరి ఇందులో పొందుపరిచాడు. ఇలాంటి సూచనల గురించి నోట్ యోహాను 2:11.

31. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.

ఇక్కడ మూడు అతి ప్రధాన సత్యాలున్నాయి. మొదటిది, నమ్మడానికి చాలా అద్భుతమైనది ఇక్కడ కనిపిస్తున్నది – ఇస్రాయేల్ వారి అభిషిక్తుడుగా, లోకానికి ముక్తిప్రదాతగా దేవుడు అభిషేకించినది యేసునే; ఆయన దేవుని కుమారుడు, దేవుని స్వభావంలో భాగస్వామి (మత్తయి 1:1 మొదలైన చోట్ల నోట్స్ చూడండి). రెండోది దీన్ని నమ్మేందుకు చక్కని ఆధారాలు ఉన్నాయి – చనిపోయి సజీవంగా లేవడంతో సహా యేసు చేసిన సూచకమైన అద్భుతాలు. మూడోది దీన్ని నమ్మడం వల్ల కలిగే ఫలితాలు – జీవం, ఆయన పేర శాశ్వత జీవం (యోహాను 3:16, యోహాను 3:36; యోహాను 5:24; యోహాను 6:47). ఈ విధంగా యోహాను ఈ శుభవార్తలోని అతి ప్రాముఖ్యమైన కొన్ని సత్యాలను టూకీగా రాశాడు.Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |