Isaiah - యెషయా 19 | View All

1. ఐగుప్తునుగూర్చిన దేవోక్తి యెహోవా వేగముగల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తీయుల గుండె కరగుచున్నది
ప్రకటన గ్రంథం 1:7

1. చూడండి! వేగంగా పోయే మేఘం మీద యెహోవా వస్తున్నాడు. యెహోవా ఈజిప్టులో ప్రవేశిస్తాడు, అప్పుడు ఈజిప్టు అబద్ధ దేవుళ్లంతా భయంతో వణికిపోతారు. ఈజిప్టు ధైర్యంగలది కానీ ఆ ధైర్యం వేడి మైనంలా కరగిపోతుంది.

2. నేను ఐగుప్తీయులమీదికి ఐగుప్తీయులను రేపెదను సహోదరులమీదికి సహోదరులు పొరుగువారిమీదికి పొరుగువారు లేచుదురు పట్టణముతో పట్టణము యుద్ధము చేయును రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును
మత్తయి 24:7, మార్కు 13:8, లూకా 21:10

2. దేవుడు చెబుతున్నాడు: “ఈజిప్టు ప్రజలు వారికి వారే విరోధంగా పోరాడుకొనేట్టు నేను చేస్తాను. మనుష్యులు వారి సోదరులతో పోరాడుతారు. పొరుగువారు పొరుగువారికి విరోధం అవుతారు. పట్టణాలు పట్టణాలకు విరోధం అవుతాయి. రాష్ట్రాలు రాష్ట్రాలకు విరోధం అవుతాయి.

3. ఐగుప్తీయులయొక్క శౌర్యము నశించును వారి ఆలోచనశక్తిని నేను మాన్పివేసెదను కావున వారు విగ్రహములయొద్దకును గొణుగువారి యొద్దకును కర్ణపిశాచిగలవారియొద్దకును సోదెగాండ్రయొద్దకును విచారింప వెళ్లుదురు.

3. ఈజిప్టు ప్రజలు గందరగోళ పడిపోతారు. వారు చేయాల్సింది ఏమిటి అని ప్రజలు వారి అబద్ధ దేవుళ్లను, జ్ఞానులను అడుగుతారు. ప్రజలు వారి మాంత్రికులను, భూత వైద్యులను అడుగుతారు. కానీ వారి సలహా నిష్ప్రయోజనం.

4. నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించె దను బలాత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

4. సర్వశక్తిమంతుడైన యెహోవా, ప్రభువు చెబుతున్నాడు, “నేను (దేవుణ్ణి) ఈజిప్టును కఠినమైన యజమానికి అప్పగిస్తాను. శక్తిగల ఒక రాజు ప్రజలను పాలిస్తాడు.

5. సముద్రజలములు ఇంకిపోవును నదియును ఎండి పొడినేల యగును

5. నైలునది ఎండిపోతుంది.

6. ఏటి పాయలును కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి యెండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును.

6. నదులన్నీ చెడ్డకంపు కొడ్తాయి. ఈజిప్టులో కాలువలు ఎండిపోయి, నీరు ఉండకుండా పోతుంది. నీటి మొక్కలు అన్నీ కుళ్లిపోతాయి.

7. నైలునదీప్రాంతమున దాని తీరముననున్న బీడులును దానియొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడక పోవును.

7. నదీ తీరాల్లోని మొక్కలన్నీ ఎండిపోయి, కొట్టుకొని పోతాయి. నది మహా విశాలంగా ఉన్న చోటగూడా మొక్కలు చస్తాయి.

8. జాలరులును దుఃఖించెదరు నైలునదిలో గాలములు వేయువారందరు ప్రలాపించెదరు జలములమీద వలలు వేయువారు కృశించిపోవుదురు

8. “నైలునదిలో చేపలుపట్టే జాలరులు అందరూ దుఃఖపడి ఏడుస్తారు. వారు తమ ఆహారంకోసం నైలు నదిమీద ఆధారపడతారు. కానీ అది ఎండిపోతుంది.

9. దువ్వెనతో దువ్వబడు జనుపనారపని చేయువారును తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు. రాజ్య స్తంభములు పడగొట్టబడును

9. బట్టలు తయారు చేసే వాళ్లంతా చాలా దుఃఖపడతారు. పీచువస్త్రాలు తయారు చేయటానికి ప్రజలకు పీచు కావాలి. కానీ నది ఎండిపోయి ఈ పీచు మొక్కలు పెరగవు.

10. కూలిపని చేయువారందరు మనోవ్యాధి పొందుదురు.

10. నీళ్లు నిల్వ చేసేందుకు ఆనకట్టలు కట్టే వారికి పని ఉండదు గనుక దుఃఖంగా ఉంటారు.

11. ఫరోయొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయను అధిపతులు కేవలము అవివేకులైరి. ఆలోచనశక్తి పశుప్రాయమాయెను నేను జ్ఞాని కుమారుడను పూర్వపురాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు?

11. “సోయను పట్టణ నాయకులు తెలివి తక్కువ వాళ్లు. ఫరోయొక్క ‘తెలివిగల నాయకులు’ తప్పుసలహాలు ఇస్తారు. వారు తెలివిగల వాళ్లని ఆ నాయకులు అంటారు. వారు పూర్వపు రాజుల కుటుంబాలకు చెందినవాళ్లం అంటారు. కానీ వారు, వాళ్లు అనుకొన్నంత తెలివిగలవాళ్లు కారు.”

12. నీ జ్ఞానులు ఏమైరి? సైన్యములకధిపతియగు యెహోవా ఐగుప్తునుగూర్చి నిర్ణయించినదానిని వారు గ్రహించి నీతో చెప్పవలెను గదా?
1 కోరింథీయులకు 1:20

12. ఈజిప్టూ, నీ జ్ఞానులు ఎక్కడ? సర్వశక్తిమంతుడైన యెహోవా ఈజిప్టు కోసం వేసిన పథకం ఏమిటో ఆ జ్ఞానులు తెలుసుకోవాలి. ఏం జరుగ బోతుందో అది నీకు చెప్పాల్సినవాళ్లు వారే.

13. సోయను అధిపతులు అవివేకులైరి నోపు అధిపతులు మోసపోయిరి. ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పునట్లు చేసిరి

13. సోయను నాయకులు వెర్రివాళ్లుగా చేయబడ్డారు. నోపు నాయకులు దొంగ సంగతులు నమ్మేసారు. అందుచేత నాయకులు ఈజిప్టును తప్పుత్రోవను నడిపించారు.

14. యెహోవా ఐగుప్తుమీద మూర్ఖతగల ఆత్మను కుమ్మరించి యున్నాడు మత్తుడు తన వాంతిలో తూలిపడునట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలచేసి యున్నారు

14. ఆ నాయకులను యెహోవా గందరగోళపర్చాడు. వాళ్లు తిరుగులాడుచూ, ఈజిప్టును తప్పుదారిలో నడిపిస్తారు. ఆ నాయకులు చేసేది అంతా తప్పే. వాళ్లు త్రాగి రోగంతో వీధిలో దొర్లాడే వాళ్లలా ఉన్నారు.

15. తలయైనను తోకయైనను కొమ్మయైనను రెల్లయినను ఐగుప్తులో పని సాగింపువారెవరును లేరు

15. ఆ నాయకులు చేయగలిగింది ఏమీ లేదు. (ఈ నాయకులే “తలలు, తోకలు.” వారే, “మొక్కల కొమ్ములు, కాండాలు.”)

16. ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీలవంటివారగుదురు. సైన్యములకధిపతియగు యెహోవా వారిపైన తన చెయ్యి ఆడించును ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వణకి భయపడుదురు.

16. ఆ కాలంలో ఈజిప్టు వాళ్లు బెదరిపోయిన ఆడవాళ్లలా ఉంటారు. సర్వశక్తిమంతుడైన యెహోవాకు వారు భయపడతారు. ప్రజలను శిక్షించటానికి యెహోవా తన చేయి పైకి ఎత్తుతాడు, వారు భయపడతారు.

17. యూదాదేశము ఐగుప్తునకు భయంకరమగును తమకువిరోధముగా సైన్యములకధిపతియగు యెహోవా ఉద్దేశించినదానినిబట్టి ఒకడు ప్రస్తాపించినయెడల ఐగుప్తీయులు వణకుదురు.

17. యూదా దేశం, ఈజిప్టు ప్రజలందరికి భయం పుట్టించే దేశం అవుతుంది. ఈజిప్టులో ఎవరైనా సరే యూదా పేరు వింటే భయపడతారు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈజిప్టులో భయంకర సంగతులు జరగాలని పథకం వేసాడు గనుక ఇవి జరుగుతాయి.

18. ఆ దినమున కనానుభాషతో మాటలాడుచు యెహోవా వారమని ప్రమాణముచేయు అయిదు పట్టణములు ఐగుప్తుదేశములో ఉండును, వాటిలో ఒకటి నాశనపురము.

18. ఆ కాలంలో ప్రజలు కనాను భాష (యూదుల బాష) మాట్లాడే పట్టణాలు ఈజిప్టులో అయిదు ఉంటాయి. ఈ పట్టణాల్లో ఒక దానికి “నాశన పట్టణం “ అని పేరు పెట్టబడుతుంది. సర్వశక్తిమంతుడైన యెహోవాను వెంబడిస్తాం అని ప్రజలు ప్రమాణం చేస్తారు.

19. ఆ దినమున ఐగుప్తుదేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన యొక స్తంభమును ఉండును.

19. ఆ కాలంలో ఈజిప్టు కేంద్రంలో యెహోవాకు ఒక బలిపీఠం ఉంటుంది. యెహోవాకు సన్మాన సూచకంగా ఈజిప్టు సరిహద్దులో ఒక స్తంభం ఉంటుంది.

20. అది ఐగుప్తుదేశములో సైన్యములకధిపతియగు యెహో వాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులనుగూర్చి వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక రక్షకుని పంపును అతడు వారిని విమోచించును.

20. సర్వశక్తిమంతుడైన యెహోవా శక్తివంతమైన పనులు చేస్తాడు అని చూపించేందుకు ఇది ఒక సంకేతం. యెహోవా దగ్గర్నుండి సహాయం కావాలని ప్రజలు మొర పెట్టినప్పుడల్లా, యెహోవా సహాయం పంపిస్తాడు. ప్రజలను రక్షించి, కాపాడుటకు ఒక వ్యక్తిని యెహోవా పంపిస్తాడు. ఆ ప్రజలకు అక్రమమైన వాటిని జరిగించే మనుష్యుల బారినుండి ఆ వ్యక్తి వారిని విమోచిస్తాడు.

21. ఐగుప్తీయులు తెలిసికొనునట్లు యెహోవా తన్ను వెల్లడిపరచుకొనును ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలిసి కొందురు వారు బలి నైవేద్యముల నర్పించి ఆయనను సేవించెదరు యెహోవాకు మ్రొక్కుకొనెదరు తాము చేసికొనిన మ్రొక్కుబడులను చెల్లించెదరు.

21. ఆ సమయంలో ఈజిప్టులోని ప్రజలు యెహోవాను వాస్తవంగా తెలుసుకొంటారు. ఈజిప్టు ప్రజలు దేవుణ్ణి ప్రేమిస్తారు. ప్రజలు దేవుణ్ణి సేవిస్తారు, అనేక బలులు అర్పిస్తారు. వారు యెహోవాకు ప్రమాణాలు చేస్తారు. వారు ఆ ప్రమాణాలను నిలబెట్టుకొంటారు.

22. యెహోవా వారిని కొట్టును స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన నంగీకరించి వారిని స్వస్థపరచును.

22. ఈజిప్టు ప్రజలను యెహోవా శిక్షిస్తాడు. మరియు అప్పుడు ఆయన వారిని స్వస్థపరుస్తాడు. (క్షమిస్తాడు) వారు యెహోవా దగ్గరకు తిరిగి వస్తారు. యెహోవా వారి ప్రార్థనలు వింటాడు, వారిని స్వస్థపరుస్తాడు. (క్షమిస్తాడు).

23. ఆ దినమున ఐగుప్తునుండి అష్షూరుకు రాజమార్గ మేర్పడును అష్షూరీయులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచు పోవుచునుందురు ఐగుప్తీయులును అష్షూరీయులును యెహోవాను సేవించెదరు.

23. ఆ కాలంలో ఈజిప్టు నుండి అష్షూరుకు రాజమార్గం ఉంటుంది. అప్పుడు ప్రజలు అష్షూరు నుండి ఈజిప్టు వెళ్తారు, ఈజిప్టు నుండి ప్రజలు అష్షూరు వెళ్తారు. ఈజిప్టు అష్షూరుతో కలిసి పనిచేస్తుంది.

24. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతోకూడ ఇశ్రాయేలు మూడవ జనమై భూమిమీద ఆశీర్వాద కారణముగ నుండును.

24. ఆ కాలంలో ఇశ్రాయేలు, అష్షూరు, ఈజిప్టు కలిసి దేశాన్ని తమ ఆధీనంలో ఉంచుకొంటారు. ఇది దేశానికి ఆశీర్వాదం.

25. సైన్యములకధిపతియగు యెహోవా నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా,మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును.

25. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ దేశాలను ఆశీర్వదిస్తాడు. “ఈజిప్టూ, మీరే నా ప్రజలు అష్షూరూ, నిన్ను నేను సృష్టించాను. ఇశ్రాయేలూ, నీవు నా స్వంతం. మీరంతా ఆశీర్వదించబడిన వాళ్లు” అని ఆయన అంటాడు.Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |