1:1-2 పేతురు తనను తాను సీమోను పేతురుగా పిలుచుకుంటున్నాడు. ఈ పేరు సాధారణంగా అతనిగూర్చి అంత తరచుగా ఉపయోగించబడ లేదు (కేవలం అపొ.కా.15:14లో తప్ప). దీని ఉచ్చారణ హెబ్రీ జాతికి సంబంధించిందిగా ఉండడం వలన అది అతని ఉత్తరానికి ప్రామాణికతను కలిగించింది. అంతేకాక, తన పేరులోని రెండవ భాగం కంటే, తన అసలు పేరునే ఉపయోగించడం పేతురుకు స్వాభావికంగా అలవాటు. తనను యేసు క్రీస్తు అపొస్తలుడుగా క్రీస్తు ఆధిపత్యానికి లోబడిన దాసుడుగా అతడు తనను తాను గుర్తించుకుంటున్నాడు. అపొస్తలుడంటే క్రీస్తు ద్వారా దైవికంగా నియమించబడి ఆదిమ సంఘంలో ఆయనకు ఒక అధికార ప్రతినిధిగా నున్నవాడు. ఒక నిర్దిష్టమైన గుంపు ప్రజలు తన మనస్సులో ఉన్నప్పటికీ, తన పత్రిక ఫలానా వారికి అని గాని, లేక ఫలానా ప్రాంతానికి చెందిన వారికి అని గాని పేతురు ప్రత్యేకంగా చెప్పలేదు గానీ మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి అని మాత్రమే అతడు ప్రస్తావించాడు.
పేతురు పాఠకులకు, అపొస్తలులకు ఉన్న సమాన ఆధిక్యతలకు కారణం మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతి. యేసునందున్న నీతిని బట్టి విశ్వాసులందరూ సమానమైన స్థాయి, ఆశీర్వాదాలను పంచుకుంటారు. యేసును. “దేవుడు, రక్షకుడు" అనే రెండు పేర్లతో పేతురు వర్ణించాడు. వేరేచోట యేసు దేవుడని పిలవబడ్డాడు (యోహాను 1:1,18; 20:28; రోమా 9:5; తీతు 2:13; హెబ్రీ 1:7-8). కాబట్టి అదేమంత ఆశ్చర్యం కాదు. యేసును "దేవుడు" అని వర్ణించడంలో అతని భావం యేసే తండ్రి, కుమారుడు కూడా అని కాదు, ఏవిధంగాను ఇది త్రిత్వానికి నిరాకరణ కాదు. కృప అంటే రక్షణ కోసం క్రీస్తులో విశ్వాసముంచిన అనరులైనవారి యెడల దేవుడు చూపే దయ. సమాధానము అంటే క్రీస్తుతో సరైన సంబంధంలో ఉండడం వల్ల ఒకడు అనుభవించే ఆశీర్వాదాలు, క్షేమమును గూర్చిన అనుభూతి.
1:3-4 ఒక వ్యక్తి కృపను, సమాధానమును కేవలం క్రీస్తును ఎరగడం ద్వారా మాత్రమే అనుభవించగలడని తన పాఠకులకు జ్ఞాపకం చేయడానికి, దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవజ్ఞానమును పేతురు నొక్కి చెప్పాడు. తరువాత క్రీస్తును ఎరగడం ద్వారా వారికున్న అనేక వనరులను పేతురు తన పాఠకులకు జ్ఞాపకం చేశాడు. జీవమునకును, భక్తికిని కావలసినవన్నీ ఆయన విశ్వాసులకు అనుగ్రహిస్తాడు. “జీవము" అంటే నిత్యజీవము, “భక్తి” అంటే భయభక్తులతో కూడిన జీవితం. మొదటిది (జీవం) లేకుండా రెండవది (భక్తి) పొందలేము. విశ్వాసులకున్న దైవికపిలుపే భక్తిగలిగి జీవించమని పేతురు చేసిన విన్నపానికి ఒక పునాది. దేవుడు రక్షించిన వారిని క్రీస్తు తనవద్దకు పిలుస్తాడు. ఈ పిలుపు తన స్వంత మహిమ గుణాతిశయములనుబట్టియే వచ్చింది. క్రీస్తు “మహిమ", “గుణాతిశయము” కలిసి, క్రీస్తు నైతికశ్రేష్టతను సూచిస్తున్నట్లు కనిపిస్తాయి. వీటినిబట్టి, అంటే క్రీస్తు మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. ఈ అత్యధికమైన వాగ్దానాల్లో దేవస్వభావములో పాలుపొందడం ఒకటి. విశ్వాసులు దేవుళ్ళుగా అవుతారని గానీ, లేక వారు అన్ని విధాలుగా దేవుని దైవిక స్వభావాన్ని పంచుకుంటారని గానీ పేతురు భావం కాదు. వారు దేవుని నైతికశ్రేష్టతలో పాలు పొంది, ఒకనాడు పరిపూర్ణులౌతారనేదే పేతురు భావం. దేవస్వభావంలో పాలిభాగస్తులు కావడం అనేది దురాశ ఫలితంగా లోకములో ఏర్పడిన భ్రష్టత్వమును తప్పించుకున్న తర్వాతనే సాధ్యమవుతుంది. దేవునికి విరోధమై, ఆయనకు వేరైన ఈ దుష్టలోక వ్యవస్థ తిరుగుబాటు నుండి తప్పించుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గాన్ని యేసుక్రీస్తు ఇవ్వగోరుతున్నాడు.
1:5-7 క్రీస్తులో దేవుడు ఉదారంగా అనుగ్రహించిన వాటిని - బట్టి, దేవుని ప్రేమకు వారి తొలి సమ్మతిని తెలిపే విశ్వాసము అనే పునాది పైన సద్గుణము, జ్ఞానము, ఆశనిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ అనే క్రైస్తవ గుణగణాలను అలవర్చుకొమ్మని పేతురు తన పాఠకులను
ప్రోత్సహించాడు. కొన్నిసార్లు “విశ్వాసపు నిచ్చెన” అని పిలవబడే ఈ కృపలు, దైవిక స్వభావాన్ని పంచుకోవడం వల్ల కలిగే ఫలితాలు. ఒక్కొక్క గుణము దానిముందున్న దానినుండి జనించినట్లనిపిస్తుంది.
1:8-9 ప్రయోజనకరమైన, ఫలభరితమైన క్రైస్తవులు వ, 5-7లో చెప్పిన లక్షణాలను సమృద్ధిగా కలిగి వుంటారు. మరోవైపు, అవి లేనివాడు గ్రుడ్డివాడును, దూరదృష్టి లేనివాడును అవుతాడు. ఎందుకంటే వారు తమ పూర్వపాపములు శుద్ధి అయ్యాయనే సంగతిని మరచిపోయారు. దేవుడు వారిని ఎలాంటి నేపథ్యం నుండి రక్షించాడో వారు కావాలనే మర్చిపోతారు. “పూర్వ పాపములు" అంటే క్రీస్తులో విశ్వాసాన్ని ప్రకటించక ముందు చేసిన పాపాలను సూచిస్తున్నాయి.
1:10-11 దేవుని కృపను బట్టి, వరములను బట్టి, క్రీస్తును గూర్చిన అనుభవజ్ఞానమును (వ.2-9) బట్టి, రక్షణ కొరకైన వారి పిలుపును ఏర్పాటును నిశ్చయం - చేసుకోవడానికి జాగ్రత్తపడుమని పేతురు తన పాఠకులకు ఆజ్ఞాపించాడు. తమ భక్తి జీవితం ద్వారానే (వ.5-7) అది వారికి సాధ్యమవుతుంది. దీనిని రెండు ఫలితాలు వెంబడిస్తాయి: (1) వారు ఎప్పుడును తొట్రిల్లరు, (2) మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నిత్యరాజ్యములోనికి వారికి సమృద్ధి ప్రవేశం దొరుకుతుంది.
1:12-13. నిత్యరాజ్యము లోనికి ప్రవేశం ఉందనే నిరీక్షణ ఆధారంగా, వారు నేర్చుకున్న సత్యాలలో వారు వేరుపారి స్థిరంగా ఉన్నారని తాను ఒప్పింపబడినప్పటికీ, వాటిని పక్కన పెట్టేస్తారేమోనని, వాటిని వారికి ఎల్లప్పుడు జ్ఞాపకము చేయడానికి పేతురు నిశ్చయించుకున్నాడు. వారు స్థిరమైన క్రైస్వులైనప్పటికీ, వారి జీవితవిధానాలలో వారికి అవసరమైనవి ఇంకా చాలా ఉన్నాయి. జీవితానికి తాత్కాలిక నివాసస్థలమైన ఈ గుడారము అనే మానవ శరీరంలో తాను జీవించినంత కాలం తన పాఠకులకు జ్ఞాపకం చేసి వారిని రేపుతూ ఉండడానికి పేతురు నిశ్చయం చేసుకున్నాడు.
1:14-15 తన మరణం సమీపంగా ఉందని అపొస్తలునికి తెలుసు, గనుక తన బోధలను నిత్యము జ్ఞాపకము చేసికొనునట్లు జాగ్రత్తచేయడానికి అతడు కృతనిశ్చయుడయ్యాడు. నిత్యము " జ్ఞాపకము" చేసి అనడం ఒక లిఖితపూర్వకమైన సాక్ష్యంలా అనిపిస్తున్నది. పేతురు బహుశా మార్కు సువార్తనుండి పేర్కొంటూ ఉండవచ్చు. రెండవ శతాబ్దపు ఆరంభంలో పాపియాస్, మార్కును "పేతురు అనువాదకుడు” అని పిలిచాడు (యూసేబియస్ రాతలతో పోల్చండి), అంటే మార్కు సువార్త ప్రత్యక్ష సాక్షిగా పేతురు ఇచ్చిన సమాచారాన్ని ఆధారం చేసుకొని రాయబడింది అని తెలుస్తున్నది.
1:16-18 పేతురు మాటలు చమత్కారముగా కల్పించిన కథలపై ఆధారపడినవి కావు. తాను యేసు రూపాంతరం పొందడం కళ్ళారా చూశానని అతడు నొక్కి చెప్పాడు (మత్తయి 17:1-7; మార్కు 9:2-9; లూకా 9:28-36).
1:19-21 అపొస్తలిక సాక్ష్యాన్ని ప్రవచనాత్మ లేఖనాలు స్థిరపరచాయని పేతురు వక్కాణిస్తున్నాడు. అతడు చెప్పేదాని సారం ఏమిటంటే “మీరు నన్ను నమ్మకపోతే, లేఖనాల దగ్గరకు వెళ్ళండి”. ప్రవచనాత్మక లేఖనాలు చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. అనే అలంకారంతో చెప్పడం ఈ చీకటిలోకంలో అవి కాంతిరేఖలా పనిచేస్తూ, పాపపు మురికిని, అపవిత్రతను బహిర్గతపరచి, వాటినుండి విడుదల పొందడాన్ని సాధ్యం చేస్తున్నాయని అర్థం. విశ్వాసులు లేఖనాల దీపకాంతిలో తెల్లవారి వేకువచుక్క.. ఉదయించు వరకు జీవిస్తారు. ఇది క్రీస్తు రెండవ రాకడను సూచిస్తున్నట్లు కనిపిస్తుంది. మీ హృదయములలో అనే మాటలు బహుశా విశ్వాసులు ప్రభువు రాకడకు స్పష్టమైన గుర్తులను చూసేవరకు వారి హృదయాలలో కనిపించే ప్రకాశవంతమైన నిరీక్షణను సూచిస్తుండవచ్చు. లేఖనాలు దేవుని నుండి వచ్చినవి కాబట్టి అవి నమ్మదగినవని పేతురు తన వివరణ కొనసాగించాడు. మనుష్యులు పరిశుద్దాత్మ వలన ప్రేరేపించబడినవారై పా.ని. ప్రవచన వాక్కులను రాశారు.